Thursday, 17 September 2009

మంత్రదండం బయటకి తీసి ఖజానాని నింపి వెయ్యవయ్యా....

తట్టా బుట్టా సర్దుకుని ఇక రాజకీయాలు చాలు శాసన సభ లో నాగం జనార్ధన రెడ్డి తో వేగలెక చస్తున్నాను అంటే నీ లాంటి మాటకారి మాయలోడు లేకపోతె ప్రతిపక్షాలతో వేగటం చాలా కష్టం అని నీకు క్రీడా ప్రాంగణం లాంటి శాసన మండలి లలో కి పంపారు మీ నేత వై.ఎస్. నక్క తోకను తొక్కితే అదృష్టం పట్టినట్లు, వై.ఎస్ పోయి నిన్ను అందలాన్ని ఎక్కేట్టు చేసారు. అది బాగానే ఉంది.

నిన్నటి వరకూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బెమ్మాండం అని వై.ఎస్సూ నువ్వూ తోడు దొంగల్లా ఒకే మాట వల్లే వేస్తుంటే నిజమే కామోసూ... రిసెషన్ టైం లో కూడా మన ఆంధ్ర ప్రజానీకానికి మీలాంటి అమాత్యులు దొరకటం మా పూర్వజన్మల పుణ్యమేమో అనుకున్నాం.

కానీ ఇదేన్దయ్యా.... ఒక్క సారిగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులన్నీ ఆపెయ్యటం. ఇది దేనికి సూచన?

మాటల మరాఠీ గాడివైన నువ్వు మాత్రం యధాప్రాకారం ఆర్ధిక క్రమశిక్షణ కోసం అలా చేస్తున్నాం అంటూ ఏదేదో చెపుతున్నావు. కానీ లోపాయి కారీ వార్తల ప్రకారం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బిల్లులు చెల్లిస్తే తరువాతి జమా ఖర్చుల కోసం ఓవర్ డ్రాఫ్ట్స్ కోసం పరుగులు పెట్టాలి అంటున్నారు.

అంతే కాక మీ మానిఫెస్టో లో చెప్పిన 9 గంటల ఉచిత విద్యుత్ & రేషన్ బియ్యం కోటా పెంపు వాయిదా అన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేషన్ కార్డుల ఏరివేత తరువాత కోటా గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నారట. మరి ఎన్నికల ముందు కూడా మీ జమానా నే కదా ఉంది. అప్పుడు తెలియలేదా బోగస్ రేషన్ కార్డుల సంగతి. ఏదో సంతర్పణ లాగా మరీ పంచిపెట్టారు కదా తెల్ల కార్డులు. అప్పుడవి మీ వోట్ల కార్డులన్న మాట.

ఇప్పుడు ఖజానా ఖాళీ అయ్యేసరికి మీకు బోగస్ కార్డు ల విషయం అర్జంటుగా ( మీ వై.ఎస్. గారు భువి పై తిరుగాడుతున్నప్పుడే) గుర్తుకు వచ్చింది. ఏమి మాయలయ్యా మీవి?.

దొంగలెక్కలతో (రాజకీయ నాయకులు కాబట్టి మీ దొంగ లెక్కలన్నీ అసెంబ్లీ లో సవాళ్ళతో సరి. అదే వ్యాపారవేత్త లైతే జైలు ఊచలు లెక్కపెట్టిస్తారు) తిమ్మిని బొమ్మిని చెయ్యటం ఇంకా ఎన్నాళ్ళు?

ఇకనైనా ఊసరవెల్లిలాగా రంగులు మార్చటం ఆపేసి జనాలని ఇంకా భ్రమ పెట్టకుండా వాస్తవం లోకి రండయ్యా రోశయ్యా...

13 బడ్జెట్ లు ప్రవేశ పెట్టిన ఆర్ధిక మంత్రవేత్తవి. నీ మంత్రదండం బయటకి తీసి ఖజానాని నింపి వెయ్యవయ్యా...

రోశయ్య గారిలోని 'రోషయ్య' ని బయటకు తెండి.

(నీతో మాట్లాడాల్సిన విషయాలు ఇంకాసిని ఉన్నాయి. అవి రేపు చెప్తాలే..)

మీ
స్నేహితుడు
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

1 comments:

బాబ్బాబు,

మీ స్నేహితుడు, మీ మాటప్రకారం మాయల మంత్రి రోషయ్యకి ఇంకా శానా విషయాలు చెప్పాలండయ్యా!
మంచి టపా అందించినందుకు నెనర్లు!

Post a Comment