Friday, 4 July 2014

వెన్నెల కుసుమం - 10

నా హృదయ వనం లో విరబూసిన గులాబీ... 
అవును నువ్వు గులాబీవే...
అందమైన గులాబీ వెనకే ముల్లు ఉంటుందని తెలియని మరచిన నేను దాని కోసం ప్రయత్నించినప్పుడు నా చేతిలో దిగిన ముల్లులాంటి అడ్డు... నిన్ను వరించిన నాకు ఉందని తెలుసుకోలేక నీ కోసం నీ ప్రేమ కోసం తపించాను. రోజా వెనుక ముల్లు ఉండవచ్చు కానీ తన సోయగం మాత్రం ఎంత అద్భుతం... నీ మనసు కూడా అంతకన్నా అద్భుతమే కదూ...
ప్రియ సఖీ...
చెరగని నీ చిరునవ్వున విరిసిన అందం నా మనసుని దోచిన మకరందం.... వికసించే నీ అధారాల మెరపులు కలిగించెను నా మదిలో వలపు రాగాలు.
నీ అమృత హస్తాల స్పర్శ నా ఈ చిన్ని గుండెలో రేపెను ఎన్నడూ లేని అలజడి. నా సన్నిధిన నువ్వుంటే నా ఎదలో మొదలయ్యే సన్నాయి మేళాలు యుగాలు గడుస్తున్న్నా ఆగవేమో...
మారే ప్రతీ క్షణం నిన్నే జపిస్తూ... నా లోని ప్రతి అణువూ నిన్నే స్మరిస్తూ నాలో ప్రవహించే ప్రతి రక్త బిందువూ నిన్నే తలస్తూ ప్రేమ మత్తులో తమను తాము మరచి నీకోసమే తపించేలా చేస్తున్నాయి నా హృదయాన్ని.
ప్రియతమా... అందాల హృదయమా...
నీ మోమున చిరునవ్వు విరిసినప్పుడు నింగిలోని తారకలన్నీ నిన్ను అసూయగా చూస్తున్నాయి... నీ చెక్కిలి చిరు సిగ్గుతో కందినప్పుడు ఆ గులాబీలు నిన్ను చూసి వెలవెలబోతున్నాయి

నీ అందాన్ని ఆరాధించే హృదయం నాది
నీ నయనం విరిసిన నవ్వులు నావి
నీ చెక్కిలి మీటిన కాంతులు నావి
నీ అధరం పలికిన పలుకులు నావి
ఇన్ని ‘నావి’ లు ఉన్నా నువ్వెక్కడో... నీ ఉనికెక్కడో... ఏ రెక్కలతో ఎగసి రాను నీ చెంతకు? ఎక్కడ ఉందో నువ్వున్న నా ఊహా లోకం.
నీ ఊహలే ఊపిరిగా నను కమ్ముకుంటుంటే మదిలో ఏవో కొత్త రాగాలు, అవి ఏ మురళీ వినిపించని నవ్య రాగాలు. నీ శ్వాసలే రాగాలై నను చుట్టేస్తున్నాయ్ కదూ...
అణుమాత్రం చోటు లేకుండా నీ రూపునే నాలో నింపేశాక కూడా ఇంకా నీ కోసమే...
నీ కొత్త నవ్వుల కోసం
నీ కొత్త మాటల కోసం 
నీ కొత్త ఊహల కోసం
నీ కొత్త తలపుల కోసం
నన్ను నేను అక్షయ పాత్రగా మార్చుకుని వేచి చూస్తున్నా.
అనుకోకుండా నువ్వు ఎదురుగ వస్తే నా మాట మౌనం అయిపోదూ... నీ సన్నిధిన నా మది మూగదై పోదూ... అటుపై నీ మాటే మంత్రమై నను కమ్ముకు పోదూ...
నీ మాటల్లో సెలయేళ్ళు గలగలమంటుంటే వన విహారానికి వచ్చిన దుష్యంతుడు శకుంతలకి దాసోహం అయినట్లుగా నీ మాటల్లోకి ఇంకిపోతానేమో...
నువ్వు ఎదురుగా ఉన్నంత సేపు అనిమిషుడి గా మారి పోతాను. అందులో సందేహమే లేదు. రెప్పపాటు క్షణమైనా కనురెప్ప కదిలిస్తే తమని నీ వీక్షణకి దూరం చేశానని ఆ క్షణాలే నా మీద కత్తి కడతాయేమోనని భయం. నీ రూపం ఎదురుగా ఉన్నంత సేపూ మైకమే మరో ఆలోచనే దరి చేరనివ్వకుండా... మరో దృశ్యమే కంట బడనీకుండా...
ఆకాశంలో అల్లనల్లన కదులుతున్న మేఘాలు నీ అందం చూసి చందమామ నడిగి వెండి వెన్నెలని కలుపుకుని తుషార బిందువులని నీ మేనిపై కురిపించి నిన్ను వెన్నల రాణిగా తీర్చి దిద్దేనేమో.
నీవు తప్ప వేరే కోరిక ఉంటుందని కూడా మర్చిపోయింది నా మనసు.
ఎందరెందరి కళ్ళతోనో నిన్ను చూశాను. ఏ కంటితో చూసినా నీవో అందాల అప్సరసలానే కనిపించావు. ఎవరి కల్లో ఎందుకని నా కళ్ళ తోనే నిన్ను చూశాను. చాలా ఆశ్చర్యం. నా కళ్ళకి అప్సర కనిపించలేదు... నా మనసే అక్కడ కనిపించింది. ఎంతటి ప్రేయసివైనా నా మనసుని దొంగిలించేసి దాన్ని నీలోనే దాచుకోవటం భావ్యమా ప్రియా...!

ప్రతీ సాయంత్రం నిన్నో కొత్త ఊహతో పలకరిద్దామని అనిపిస్తూ ఉంటుంది. ఏ ఊహతో నిన్ను పలకరిద్దామని అనుకున్నా దానికన్నా మరో అందమైన ఊహ నా తలపుల్లో దోబూచులాడుతూ ఉంటే ఇక నా ఊహల ఊసులేమి చెప్పను నీకు?
ఓ వెన్నెల కన్యా... జాబిలి మీద జతగా విహరిస్తూ మృదు మధుర సంగీతాన్ని పలికిస్తూ ప్రేమ రాగాలని పలికిస్తూ చందమామ వడిలో ప్రణయ వనాన్ని సృష్టిద్దామా.

అందమైన వెన్నెల రాత్రిలో చందమామతో తారలు సరాగాలాడుతున్న సమయాన జాబిల్లి నుండి ఓ వెన్నెల కిరణం నీ మేనిపై పరావర్తనం చెందినప్పుడు మెరసిన నీ విద్యుల్లతా రూపం వెండి శిల్పంలా నా మదిలో తిష్ట వేసుకుని ఎడతెగని మధుర భావ ప్రపంచానికి నన్ను తోడ్కొని పోతున్నది.

వెన్నెల దీపమై నువ్వు నాలో కొచ్చాక ఆఖరి శ్వాసల్లో ఊగిసలాడుతున్న నా ఊపిరికి ప్రాణం పోసాను. శూన్య లోకంలోకి జారుకుంటున్న నా అంతరాత్మకి జీవం అయ్యావు. ఆరిపోతున్న ఓ మందహాసానికి నిత్యవాసంతాన్నే ఇచ్చావు.

ఓ బ్రహ్మ మానస పుత్రికా... బ్రహ్మ సరస్వతీ దేవితో సరససల్లపాలాడుతూ... రతీదేవి తనూ లావణ్యాన్ని, లక్ష్మీ దేవి పసిడిఛాయని, పార్వతీ దేవి ఆత్మ స్తైర్యాన్ని, సరస్వతీ దేవి జ్ఞానాన్ని రంగరించి నాలుగు యుగాల నిద్రను మరచి ఓ మెరపు తీగకు ప్రాణం పోసి భూలోకానికి పంపటానికి చాలా బాధ పడుతూ నీ లావణ్యాన్ని క్షణ క్షణమూ కంటికి రెప్పలా కాపాడుతూ నీ అందం యుగ యుగాలకీ కావ్యంలా నిలిచి పోవాలని నీ తోడుగా నన్ను పంపి నీ నీడగానే కనుమరుగవ్వమన్నాడు.

ఓ అభినవ అభిసారికా...

ఎన్ని యుగాలు నీకై వేచి ఉండను?  ఎన్ని ఇతిహాసాలు ఎదురు చూడను? ఎప్పటికీ నిన్ను ఆరాధిస్తూ... నీ మీద కావ్యాలు రాస్తూ... ఉండి పోవాల్సిందేనా...

జతగా చేరి నీలో ఐక్యం అవ్వటానికి ఇంకెన్ని యుగాలు చూడాలి... నీ వియోగం లో క్షణమే ఒక యుగం లా అనిపిస్తుందే... యుగాలుగా...  యుగాలకి యుగాలు నన్ను ఎదురు చూడమంటూనే ఉంటుంటే, ఆ ఎదురు చూపుల్లో నా కళ్ళ నుండి కారే రుధిరాశృవులు నీ కంట బడకుండా ఉండటానికి సహస్ర విధాలా ప్రయత్నిస్తూ ఒక వేళ నీ కంట బడినా అవి రుధిరాశృవులు కాదు కుంకుమధారలు అనే చెప్తాను.
ఎందుకంటే నా కన్నీటికి కరిగి కాదు నువ్వు నా చెంతకు రావాల్సింది... నిన్ను తడిమే నా ప్రేమ స్పర్శ తడితో నా మనసుని అర్ధం చేసుకుని..!

ఏదేమైనా కానీ ఎన్ని యుగాలు గడచినా కానీ నీపై నా ప్రేమ వాడదు. తరాలు మారినా నా తలపుల నెచ్చెలివి నీవే...  ఎన్నాళ్ళు ఆడుకుంటాడో ఆ బ్రహ్మ నాతో.. అదీ చూస్తాను.

షాజహాన్ కట్టించిన తాజ్ మహల్ గొప్ప ప్రేమ చిహ్నమట... నా దృష్టిలో మాత్రం అది వేలాది కార్మికుల రక్తంతో తడిసిన ఓ సమాధి మాత్రమే. అదే నా హృదయాన్నే చూడు... నా మనసులో నీకై నే నిర్మిస్తున్న మనోమందిరం చూడు... కోట్ల ఊహలని ఊపిరి ఉలులతో చెక్కుతూ నే నిర్మిస్తున్న ప్రేమ మందిరం అది. ఒక్క సారి చూస్తే అదే నీ శాశ్వత స్థావరం చేసుకోవటానికి ఉవ్విళ్ళూరతావు.

నువ్వో అందాల హరివిల్లువి అని కదూ నీ శరీరాన్ని విల్లుగా చేసి మన్మధుడు నా మీదకి పూల బాణాలు ఎక్కుపెడుతున్నాడు. సప్తవర్ణాలు మిళితమైన నీ మేని కాంతి నా మనసులో ప్రేమ దీపానికి  కొత్త మెరుగులు దిద్దుతూ ఉంది. నీ మేనిపై వెన్నల రజనులా మెరస్తున్న స్వేద బిందువులు నువ్వు పడుతున్న కష్టాన్ని తెలుపుతున్నాయ్...

వీలు కుదిరితే నీ ప్రతి పనినీ నేనే చేసి నీకు ఎలాంటి శ్రమ లేకుండా చేద్దును కదా... చంద్రబింబం వంటి నీ ముఖారవిందం ఎంతతో ప్రశాంతతని కలగజేస్తుందో అది అనుభవిస్తున్న నాకే తెలుసు. వెన్నలని పాంచజన్యంలో రంగరించి చేసినట్లు ఉన్న నీ కంఠం ఎంత సుందరం గా ఉంది... ఆ కంఠం నుండి జాలు వారే ప్రతి పదమో అద్భుత గానంలా నన్ను దేవతాలోకాల్లో విహరింప చేసేలా ఉంది.

సమున్నత శిఖరాలు లోతే తెలియని లోయలూ ఇసుక తిన్నెలూ... ఏమిటబ్బా ప్రకృతికీ నీకూ తేడా? నువ్వే ప్రకృతి కదూ...
కుబుసం విడిచిన ఎలనాగిని అంత నాజూకుదనం నీలో...  ఇంద్ర సభలో నాట్యమాడే నాట్య మయూరులైన రంభ , ఊర్వశి, మేనక, తిలోత్తమల అందం నీ సాటి వస్తుందా...

ఆ నాట్య మయూరే నిన్ను చూసి నాట్యం నేర్చుకుని ఉంటుందేమో కదా... రాజహంస మాత్రం ఏమి తక్కువ నీ నడక చూసి నడక నీర్చుకుని ఎన్నెన్ని హొయలు పోతుందని !

సీతమ్మ వారినే మాయ చేసిన మాయలేడికున్న బంగారు వన్నె మేని కన్నా... పసిడి కలసిన గులాబీ సోయగాల నీ తనూ లావణ్యమే ఎంతో అద్భుతం కదూ.

ఓ బంగారు వన్నె చిన్న దానా నీ వళ్ళంతా బంగారు తాపడం చేసినట్లే మెరుస్తూ ఉంటుందిగా... నువ్వే పరసువేదిగా మారి నా శరీరాన్ని కూడా స్వర్ణ మయం చేయవూ..!! 

ఓ ప్రియా! రెప్పపాటు క్షణపు విరామంలో కూడా నీ వియోగాన్ని నే భరించలేను.

ఓ ప్రియా..

నీ తనువూ ఒక తంత్రిగా 
నా హృదయం ఒక స్వరమై 
నీ మనసే ఒక పల్లవిగా 
నా ప్రాణమొక చరణమై 
ఒక నూతన సంగీత సామ్రాజ్యాన్ని ప్రపంచానికి అందిద్దామా... 

'సరిగమపదని' సప్త స్వరాల సంగీత సామ్రాజ్యంలో 'ప్రేమ' పదనిసలే ఒక సంగీతమై ఒక కొత్త రాగాన్ని సృష్టిస్తున్నాయి. ప్రేమశక్తి ముందు 'రోహిణీకార్తె' ఎండలైనా పున్నమిరేయి  వెన్నెలలు కావా...! 

వేడి గాలుల వడదెబ్బ  అయినా మల్లెచెండుల చిరుదెబ్బే కదా.. 

నీలాంటి అందాల హరివిల్లు నా పక్కన ఉంటే ప్రతి క్షణమూ ఎవరో  ఒకరు నిన్ను తమ స్వంతం చేసుకోవటానికి వస్తూ ఉంటారేమో. నిన్ను స్వంతం  చేసుకోవాలంటే నా అడ్డు తొలిగించుకోవాలని తెలిసీ సాహసించే పిచ్చి వాళ్ళు. వాళ్లకి తెలియని నిజం ఏమిటంటే నువ్వు నా పక్కన ఉంటే నాలో కోటి ఐరావతాల బలం నాలో వస్తుందని.

అమర ప్రేమ చరిత్రలో లిఖితమైన పార్వతి, అనార్కలి, లైలా, జూలియట్, ముంతాజ్, భాగమతి...ఇంకా రాధ... నువ్వు వీళ్ళందరి అంశతో జన్మించిన ప్రేమ మూర్తివి అని నా భావన. ఇంతటి అందాల ప్రేమ మూర్తివైన నీ సాన్నిహిత్యాన్ని  నాలోని అణువణువూ క్షణక్షణమూ  కోరుకుంటూనే ఉంటుంది.

నా భావనలో...
నీవు ఒక మోనాలిసా చిత్రం లాంటిదానివి కాదు... కానే కాదు... అది జీవం ఉట్టిపడే చలనం లేని బొమ్మ మాత్రమే... నీవు మాత్రం నెమలికి నాట్యం నేర్పే నటరాజ వరపుత్రికవి.

కాళిదాసు కావ్య కన్నియవా... కాదు కాదు... కాళిదాసు వర్ణించిన శకుంతల కన్నా కోటిరెట్ల తనూ లావణ్యంతో అద్భుతమైన అందంతో ప్రకాశిస్తున్నావు.

'లలిత సౌభాగ్య లావణ్యరాశి సుందర సుకుమార తేజో విలాసి పసిడి కలసిన ఒంపు సొంపుల రూపసి మధుర మందార చెక్కిళ్ళ నా ప్రేయసి'

రవివర్మ చిత్రానివో
బాపు బొమ్మవో కాదు.
అద్భుతమైన నా ప్రేమ తీరానివి
అచ్చ తెలుగు భావానివి
నా గుండెల్లో గూడు కట్టుకున్న అందమైన అనుభవానివి నీవు...

0 comments:

Post a Comment