Friday, 15 August 2014

ఒకనాడో అల్లూరి

భారత మాతా..

ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవమట... నిజంగానే స్వాతంత్ర్యం వచ్చిందా? నేను అనుకునేది స్వాతంత్ర్యం వచ్చింది భారత భూభాగానికే కానీ భరతజాతికి వచ్చిందంటావా?

ఎక్కడ వచ్చిందమ్మా స్వాతంత్ర్యం. ఇష్టం వచ్చిన రాజకీయ నిర్ణయాలతో ఏ సరిహద్దు దేశంతోనూ సరిలేని సంబంధాలు. నిన్ను కాపాడుకోవటానికి జవానుల బలిదానాలు. దేశ సమగ్రత కన్నా తమ రాజకీయ భవితే పునాదిగా నీ రాజకీయ పుత్రులాడే వికృత క్రీడలో మాకెక్కడిదీ స్వాతంత్ర్యం? రాజకీయ ప్రయోజనాలలో రత్నాల్లాంటి వారూ క్రీనీడలవుతూ జాతిని అపహాస్యం చేస్తుంటే ఎక్కడిదమ్మా స్వతంత్ర్యం?

67 వత్సరాలు గడచినా ఆకలిని జయించలేక పోయాం జీవధాత్రిగా పేరొందిన ఈ గడ్డపై... మనిషి కనీసావరాలైన కూడు గూడు గుడ్డ కలలో కూడా దరికి రానట్లుగా దూరం జరిగిపోతున్నాయ్.

స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఇది ఎందరి త్యాగధనుల త్యాగ ఫలమో... కానీ దీనిని ఒక రోజు సెలవు దినం గా భావించే యువత తమలోని యువ శక్తిని పనికిమాలిన విషయాలపై నిర్వీర్యం చేసుకుంటుంది.

ఇక మన దేశ మహిళలకి ఉన్న రక్షణ ఎంత బాగో రోజురోజుకీ వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలే చేపుతున్నాయ్. ఆ గాంధి గారికి మనవాళ్ళ మీద నమ్మకం ఎక్కువ అయ్యి ఏదో ఒక రోజు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నిర్భయం గా తిరుగుతుందని కలగన్నాడు. కానీ పట్టపగలు స్వంత ఇంట్లోనే స్వతంత్రంగా బతకలేని పరిస్థితులు తన జాతికి వస్తాయని ఊహించలేక పోయాడు. 

వైద్య రంగంలో ఎంత పురోగతి అంటే నిర్భయకి మంచి చికిత్సకోసం మరో దేశం తరలించే అంత... ఇక విద్యారంగం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది... ఇంజనీరింగ్ చదువుల్లోనూ వల్లె వేసే విధానాలేగా మరి... ఈ రెండు రంగాలు డబ్బు సంపాదనకి సులువైన మార్గాలయ్యాయి కానీ మామూలు మనిషిని పీల్చి పిప్పి చేస్తున్నాయ్.

వ్యవసాయాధారిత దేశం లో వ్యవసాయమే చెయ్యలేని పరిస్తితులు... ఒక వేళ రైతు బిడ్డ తన రక్తాన్ని స్వేదం గా మార్చి సేద్యం చేసినా తాను పండించిన పంటకి తాను ఖరీదు కట్టుకోలేని అతి గొప్పస్వాతంత్ర్యం మనది.

పారిశ్రామిక రంగం సరే సరి. ప్రభుత్వ పరిశ్రమలెన్నో మూతబడి... ఉన్న కొన్నీ కుంటుకుంటూ నడుస్తూ... ఇక చిన్న పరిశ్రమల శ్రమని గుర్తిద్దామా అంటే ఈ పూట కరెంట్ ఉంటుందో తెలియక ఉత్పత్తులు తగ్గిపోయి... నేడా రేపా అన్నట్లు ఉంది. మౌలిక వసతులూ సరిగాలేని దేశంలో ప్రజల ప్రాణాలకి భద్రత ఎక్కడ?

కుల పంజరాల్లో కొందరు, మత పంజరాల్లో కొందరు, వర్గ పంజరాల్లో కొందరు, వర్ణ పంజరాల్లో కొందరు, డబ్బు పంజరాల్లో కొందరు, అధికార పంజరాల్లో కొందరు, కీర్తి పంజరాల్లో కొందరు... ఇలా ఎటు చూస్తే అటు పంజరంలోని బతుకులేగా నవీన భారతావనిలో? ఇంకెక్కడి స్వాతంత్ర్యం? 

ఇది చూడు తల్లీ ప్రస్తుత నీ పరిస్థితిపై నా వేదన ఓ పాట రూపం లో...
పల్లవి:
ఒకనాడో అల్లూరి మరునాడో భగత్ సింగు
తరం మారి సుభాష్ చంద్ర బోస్
 
ఒక్కొక్క వీరుడు నేలకొరిగిపోతుంటే
 
భారతమాత గుండె పగిలి ఏడ్చింది
 
ప్రియపుత్రులే తనను వీడిపోతుంటే
 
జాతిమాత కన్నీరు కార్చింది ||ఒకనాడో||

చరణం:
ఆ కన్నీటి తడి ఆరమునుపే
 
ఆ కన్నీటి తడి ఆరమునుపే
 
తన తనువుని ముక్కలుగా చీల్చివేస్తే
 
ఆ మాత హృదయవేదన విన్నదెవ్వరు?
జాతిమాత కన్నీరు తుడిచిందెవ్వరు?
తన ప్రియ పుత్రిక కాశ్మీరం
 
కలలపంట పంజాబు రక్తసిక్తమై పోతుంటే
 
కాపాడే ధీరులెవరని కాలంలోకి చూస్తుంది
 
కాశ్మీరం సీమ నుండి కన్యాకుమారి వరకూ
 
కులం పేరిట కుత్తుకలు తెగుతుంటే
 
మతం పేరిట మారణహోమం నిత్యాగ్నిలా వెలుగుతుంటే
 
మన జాతిమాత గుండెకోత వినేదెవ్వరు? ||ఒకనాడో||

చరణం:
తెల్లదొరల తందనాలు తెల్లవారి పోయినా
నల్లదొరల ఘాతుకాలు నలుచెరగుల నర్తిస్తూ
 
భరతమాత గుండెలను చీల్చివేయ చూస్తున్నాయ్
 
మహనీయులే నడయాడిన పుణ్యభూమి
 
మానినికే మానరక్షణలేని పాపభూమిగా
 
అతివల పాలిట మహాస్మశానమే అవ్వగా
 
వీధి వీధికో వీరంగం
 
సందు సందుకో సంకులసమరం
 
మామూలైన మన మాతృభూమిలో
 
జాతిమాత హృదయవేదన వినేదెవ్వరు?
మన పుణ్యమాత కన్నీరు తుడిచేదెవ్వరు? ||ఒకనాడో||

ఇవీ ఆ తెల్ల దొరలూ వదిలి వెళ్ళిన భారత గడ్డ మీద నల్లదొరలు పండిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు... 

అయినా ఏదో ఆశ... అద్భుతాలు ఏవైనా జరిగి నిజమైన స్వాతంత్ర్యం రాకపోతుందా అని...

భారతీయుడు

1 comments:

Abba entha ardrathatho rasaro

Post a Comment