Monday, 25 August 2014

మీడియా వారికి...

మీడియా వారికి...
ఎంత గొప్ప వాళ్ళయ్యా మీరు... సమాజాన్ని మీ వార్తలతో ఎంత ప్రభావితం చేస్తారో కదా...
ప్రతి వార్తలో సెన్సేషన్ కోసం చూసే మీకు... మీరు రాసే రాతల్లో చూపించే వార్తా కథనాల ద్వారా సమాజానికి మీరు చేసి హాని అర్థం కాదో.. అర్థం అయినా మీ మీ సంస్థలకి వచ్చే పేరు ప్రఖ్యాతులే ముఖ్యం అనుకుంటారో సామాన్యులమైన మాకు తెలియదు కానీ మీరు అనాలోచితంగా చేసే పనుల వల్ల సమాజం లో పెరిగే నేరాల గురించి మాత్రం మీరు పట్టించుకోరు... పెరిగిన నేరాలు కూడా మీకు ముఖ్య వార్తలు అయిపోతాయి... మీ మీ సంస్థలకి మేటి ఆదాయ మార్గాలు అవుతాయ్...
లేకపోతే ఏమిటి మాస్టారూ... ఏదైనా హత్య జరిగితే... పోలీస్ వారు నేరస్తులని పట్టుకుని ఆ నేరం ఎలా జరిగిందో మీకు చెపితే చాలు... మీరు వాటినే హైలెట్ చేస్తూ ఆ నేరం జరిగిన తీరుని కళ్ళకి కట్టినట్లు పత్రికల్లో రాస్తూ... అనేక రకాల క్రైమ్ ప్రోగ్రాంల ద్వారా టీవీ లలో చూపిస్తుంటే కొంచెం నేరప్రవృత్తి కల వారు ఏమి చేస్తారు... కొత్తగా నేరాలు ఎలా చెయ్యవచ్చో నేర్చుకోవటం తప్ప?
గత రెండు రోజులుగా చూడండి... స్నేక్ గ్యాంగ్ చేసిన అకృత్యాలు... ఎంత మందిని చెరచారు... పాముని అడ్డం పెట్టుకుని ఆడవాళ్ళని ఎలా భయపెట్టారో అసలేమీ తెలియని వాళ్లకి కూడా పూసగుచ్చినట్లు చెపితే.... ఇలా కూడా చెయ్యొచ్చు కదా అని మరి కొందరు నేరస్తులు ఇలాంటి అకృత్యాలు మొదలు పెడితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు?
నేరం ఎలా జరిగిందో పోలీస్ రికార్డ్స్ లో ఉంటే చాలు... వాటిని ఎలా అణచాలో ఆ డిపార్టుమెంటు చూసుకుంటే బాగుంటుంది. నేరం ఎలా జరిగింది అనేది పూస గుచ్చి చెప్పటం కన్నా అసలు నేర ప్రవృత్తి పెరగకుండా... ఆత్మరక్షణ మార్గాలు మీ మీ పత్రికల/ ఛానెల్స్ ద్వారా ప్రచారం చేస్తే కొద్దో గొప్పో సమాజానికి సేవ చేసిన వాళ్లవుతారు...
మారండి సర్... ఇకనైనా మారండి...
పాఠకుడు / వీక్షకుడు

0 comments:

Post a Comment