Sunday, 30 November 2014

వెన్నెల కుసుమం - 27 (ఎన్నడూ ముగియని ప్రణయ లేఖ)


ప్రపంచంలో ఎందరో ఎన్నో విధాలుగా ప్రవచించిన ముద్దును మనం ఎవరూ ఊహించనంత గాఢంగా ఎవరూ తలవని కొత్త పద్దతిలో పెట్టుకోవాలి ప్రియా. అందుకు నీ అధరాల ఆదరువు నాకు కావాలి ప్రియా... 

రెండు మనసుల భాష ప్రేమ అయితే నాలుగు అధరాల లయ ముద్దు. ముద్దులోని అనుభూతి చవి చూసేది పెదవులు మాత్రమే అనుకుంటే అది పొరపాటే కదూ... మన తొలి ముద్దుతో శరీరంలోని అణువణువూ పులకరించిపోతూ ప్రతి కణమూ ఉత్తేజితమవుతూ ఉండే క్షణాలు కళ్ళముందు కదలాడుతుంటేనే మనసెంతగా తుళ్ళి పడుతుందో చూడు. 

ప్రేమానుభూతుల అస్వాదనకి సింహద్వారమే కదూ ముద్దు. గులాబీ రేకుల్లా వణికే నీ అధరాల స్పర్శ సుతి మెత్తగా నను తాకు వేళ కోసం నా పెదవులు పడే విరహ వేదన రాస్తే అదో విరహ కావ్యమే అవుతుందేమో.

ముద్దు పెట్టుకోవటంలో ఎవ్వరూ కనిపెట్టని ఒక కొత్త పద్ధతిని మనమే రిజిస్టర్ చేయించుకుని కాపీ రైట్స్ ఎవరికీ ఇవ్వకుండా మనం మరణించిన తరువాత వీలునామాగా ఆ ముద్దుని భావి తరపు ప్రేమికులకు కానుకగా ఇద్దామా ప్రియా... నవ్వొస్తుంది కదూ ముద్దు పై కాపీ రైట్స్ అంటే...  

గుండె పగిలిపోతుందేమో అంత అలజడిని నాలో పోత పోసేస్తున్నాయిరా సన్నగా వణుకుతూ సుమంలా విచ్చుకుంటున్న నీ పెదాలు..

జాబిల్లి వేసే వెన్నెల ధూపాన్ని అఘ్రాణిస్తూ స్వప్న గీతికల్ని స్వర రహితంగా ఆలపిస్తూ.... లేలేత తమలపాకులకి గులాబీ చూర్ణం అద్దినట్లు ఉన్న నీ అధర కాగితాలపై నా పెదవి ముద్రల మధురాక్షరాలతో రాసే అమృత లేఖ మన తొలి ముద్దు. 

ఇరు హృదయాల్లో కొత్త తలపులకి ఇంకా ఖాళీ లేదేమో అన్నంతగా నిండి పోయిన వేళ వలపు భాషగా మారిన సరసాక్షరమే మన ముద్దు...

మన ఇద్దరి మనసుల ప్రేమలో నుండి పుట్టిన నాలుగు పెదవుల సంకీర్తనం ముద్దు. మరి ఆ నాలుగు పెదవుల ఏక తాళపు శబ్దం లేని చప్పుడుతో హెచ్చే గుండె వేగపు కొలతలు ఏ 'స్టెతస్కోప్' కి అందవు కదూ...

చిలిపి పెదవుల సమాగమంలో ముని పన్ను కొంటె అల్లరి చేస్తూ చిరు గాటు పెడితే వస్తున్న తీపి బాధతో మనసు మత్తులో తేలిపోతుంది.

మన ఇద్దరి ఆత్మల సంయోగంలో పునీతమైన రెండు హృదయాల తపనలో నుండి బయలు దేరి నాలుగు పెదవులు ఒక్కటిగా అనుభూతిస్తూ నరనరాల్లో జాలువారుతున్న రస స్పందన ఎంత మత్తుగా ఉందో కదా గోల్డీ. 

తెలిమంచు తెరలలో నులి వెచ్చగా హత్తుకున్న అందాల హరివిల్లే నీ పెదవి వంపుగా నన్ను తాకినప్పుడు నీ చెక్కిలి దాల్చిన అరుణిమ కాంతులు చెప్పే ఊసులే తెలుపుతున్నాయి అనుభూతులు అంబరం దాటిన సంబరాన్ని.

సంధ్య వేసుకున్న చీకటి పైటని ఉష తొలకరించు వేళ రవికాంతుడు తొలగిస్తున్నప్పుడు పొడచిన ఆనందపు తొలిముద్దు కనుల కాటుకని మించిన తిమిరాన్ని కురుస్తున్న నడి ఝాముని దాటేసినా అలుపురాదే. ఓటమంటూ లేని గెలుపు సమరం కదరా ఇది...

నిజంగా ముద్దులాంటి ఓ చక్కని అనుభూతిని మనకందిస్తున్నందుకు మనం పెదవులకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే కదూ...

ముద్దు ముద్దుగా నీ నుండి ముద్దును దొంగిలించింది ఓ చక్కని అనుభూతి కోసం మాత్రమే కాదు. నీకు నా ప్రేమలోని రసానుభూతిని చూపించాలని. నిజంగా ముద్దనేది ప్రేమికులకి దొరికిన ఒక అపురూప వరం రా... 

ఎప్పుడూ ఎంత వెదకినా కనపడకుండా జారిపోయే ఆనందం.... పెదవుల మడతల్లో దాగి ఉన్నట్లుగా ఎంతలా తుళ్ళి పడుతుందో చూడు?

తడి ఆరని ఎర్రెర్రని అధరాల కలయికలో 
వద్దు వద్దు అన్న సరిహద్దులన్నీచెరిగి పోతూ 
తనువులే తన్మయత్వంలో త్రుళ్ళి పడుతూ 
కొలతలకందని కోరికల గట్టు తెగుతూ 
అణచుకున్న మర్మాల గుట్టు రట్టువుతూ 
చెక్కిలి చాటున పూస్తున్న సిగ్గులన్నీ రాలిపడుతూ
అధరాల ఆలింగనపు తొలి క్షణంలో 
పెదవంచున ఒలికే మధుభాష్పం 
నాలుకని తాకిన మరుక్షణం 
గుండె సడి చేసే ఆనందనర్తనానికి 
ఊపిరులద్దిన వెచ్చని కావ్యం మన ఈ ముద్దు.

అలక పాన్పుని అలరించిన సత్యభామకి శ్రీ కృష్ణుడు ఇచ్చింది 'పారిజాతం' అనే ప్రేమ పుష్పం. కానీ నాకడనున్న అతి విలువైన ప్రేమ కానుకని నేను ఇప్పటికే నీకు అర్పించాను. అదేమిటనుకున్నావ్ నీలో చేరిన నా మనసు. నిన్నే ప్రాణంగా చేసుకున్న నా మనసుకన్నా విలువైనది ఏమీ లేదు. నీలో ఒదిగిన నా మనసు చెప్పే ఊసులు వింటే చాలదూ మన ప్రేమ అమరకావ్యమవ్వటానికి...

నీ
... రేష్

2 comments:

లేఖ మొత్తం ముద్దు గురించే రాసినా కూడా ప్రేమ తప్ప వేరేదీ కనబడలేదు. చాలా సంతోషంగా అనిపించింది. ఇంతకీ కొత్త పద్దతి ఏదైనా దొరికిందా పేటెంట్ తీసుకోడానికి? 😉

చాలా బాగుంది సర్..

Post a Comment