Sunday, 30 November 2014

ఏయ్ గోల్డీ...

ఏయ్ గోల్డీ...

ఎలా ఉన్నావ్ రా...? 

చాలా రోజులయ్యింది కదూ ఇలా  నిన్ను పలకరించి? 

అలిగావా...?

బుంగమూతి బాగుంది అన్నాను కదా అని ఎప్పుడూ అలానే ఉన్నావనుకో బుగ్గలు బూరెల్లా ఉబ్బిపోతాయేమో చూసుకో... :P 

అయినా ఎందుకురా బుజ్జీ ఈ అలక? 

బుజ్జగించనా...? 

ఒక్క సారి కళ్ళు మూసుకో... రెండు నిమిషాలు అలా ఉండిపో...

మూసిన రెప్పల తెరపై నువ్వు చూసేది బాగా గుర్తుంచుకో... అటు పక్క నుండి  మంద్రంగా వినబడే స్వరాన్ని విను... మధురంగా ఉంది కదూ... మనసుకి వినపడింది కదూ... 

ఇప్పుడు చెప్పు... నేను రాలేదూ... నేను కనిపించలేదూ... నేను వినిపించలేదూ...!   

నువ్వు నిజం దాయలేవని నాకు తెలుసురా... నువ్వు చెప్పక ముందే చిరునవ్వులు చిందిస్తున్ననీ  పెదవుల సవ్వడి చెప్పేస్తుంది... 

సజీవ చిత్రమై కనిపిస్తూ వినిపిస్తూ  నీ కనుపాపల్లో సందడి చేసింది నేనే అని... 

ఇక్కడ ఉన్న నాకు అక్కడెక్కడో ఉన్న నీ చిరునవ్వు ఎలా వినిపిస్తుంది అంటే... అదంతే...ఒకరిగా ఒకరం మనం రూపాంతరం చెందాక ఇక నువ్వెంటీ నేనేంటీ? 

అయినా ఏంట్రా నువ్వు...? నీ ప్రతి క్షణంలోకి  నేనుగా నడచి వస్తుంటే భౌతికంగా ఎదురుగా లేనని అలుగుతావా?  

అయినా నీకు తెలియనిది ఏముందిరా... మన భవిత కోసమే కదా ఆశల అలలుగా సుదీర తీరాలని తాకుతూ ఒకరినొకొకరం కను రెప్పల తెరల్లో శాశ్వత చిత్తరువులుగా పలకరించుకుంటున్నాం... 

ఖాళీగా ఉన్న ప్రతి క్షణం చెలి ఆలోచనలు రావటం చాలా మందికి అతి సహజం.. . కానీ మనం మాత్రం ఎక్కడెక్కడి క్షణాలని ఖాళీ చేసుకుని మరీ  ఒకరినొకరం అనుభూతిస్తుంటాం...నన్ను తాకే ప్రతి వేకువనీ నీకే పంపుతాను... ఎప్పుడూ నీతోనే ఉండమని... నిన్నుతాకే ప్రతి చీకటినీ తాగేస్తుంటాను... 

ఓయ్... ఓయ్... చీకటిని తాగేస్తాను అన్నాను అని అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా... నేను తాగేది తిమిరాన్నే... గరళాన్ని కాదుగా...! ఒక్క నిప్పురవ్వ వెలుగై రగిలి వచ్చినప్పుడు ఈ  చీకటి ఆవిరై పోతుందిలే... అయినా నువ్వుండగా ఈ చీకట్లు నన్నేం చేస్తాయిరా? నువ్వుచ్చిన  నా ధైర్యంలో అవి కరిగిపోతూ నా నవ్వులుగా చిగురించవూ...

ఎప్పుడూ నా నవ్వే చూడాలనుకునే నీకు... నిన్నెప్పుడూ చీకటి కమ్మ కూడదన్న స్వార్ధంలోనే నా నవ్వు విరబూస్తుందన్న నిజం తెలియదూ...

నేనిక్కడ భౌతికంగానే ఉన్నానురా... నువ్వు కోరుకున్న నా అసలైన సంపద నీతోనే ఉందిగా..! ఏమిటా అసలైన సంపద అంటావా..! నిజం చెప్పు నీకు  అర్ధం కాలేదూ...! ఏయ్ దొంగా... అంత అబద్ధం ఎందుకే...?  నాకున్న ఒకే ఒక ఆస్థి నా మనసు... అదెప్పుడూ  నీతోనే.... నీలోనే... కాదని అనగలవా? అనలేవు... నాకు తెలుసురా... 

అక్కడెక్కడో కళ్ళల్లో కలలు పోతపోసుకుని నువ్వు నన్ను స్వప్నిస్తుంటే... పగటికి రాత్రి ఊసులు అద్దెకిస్తూ... రాత్రినేమో నీ కలల వీధుల్లో నా తోడుగా ఉంచుకుంటూ నిద్రని ముడుపు కట్టేసా...! 

పాపం నిద్రాదేవత... ఎంత యత్నించినా రెప్పల అంచులనీ తాకలేని అశక్తతలో చిక్కి శల్యమై పోతుంది. 

నాకు తెలుసురా... ఇలా తెల్ల కాగితంపై రాసే  ప్రతి  అక్షరమై నేను పలకరించినా మదిని చేరని తృప్తి... ఒక్కసారి నిజంగా నీ ఎదురుగా నిలబడి నా కళ్ళతో నా మనసుని  నీలో చూసుకున్నప్పుడే నీకు కలుగుతుందని...

వెన్నెల కురిసే రేయిని చూసినప్పుడల్లా త్వరగా స్వంతం చేసుకోమంటూ నువ్వు  అధర భాండాగారంలో దాచిన ముద్దులే మురిపిస్తున్నాయ్... కాసేపు మత్తులో ఊగిపోవాలని ఉంది కొన్ని గుసగుసలని మూటగట్టి పంపవూ... కాసేపు మెరుపుల్లో మునిగిపోవాలని ఉంది కొన్ని నవ్వులని చేరవెయ్యవూ...

హమ్మయ్య... నవ్వేసావు కదూ.... నాకు వినపడిందిలే...

ఇంకెప్పుడూ అలగకురా... నీ అలక ఇక్కడ నాకు కంట్లో కలకలా గుచ్చుకుంటుంది...!

భౌతికంగా  ఎక్కడ ఉన్నా ప్రతి క్షణం నీ మనసులో ఆలోచననై పెనవేసుకుంటూనే ఉంటాను కదా... నాలో నువ్వు అంతే మరి...!

నీ
......

(ఖాళీ నువ్వే పూరించుకో...)

0 comments:

Post a Comment