Sunday, 9 November 2014

ఏయ్ మనిషీ....

ఏయ్ మనిషీ....
బాగున్నావా...?
నీకేం నువ్వెప్పుడూ బాగానే ఉన్నాను అని అనుకుంటావ్ లే.
బాగా బతికేస్తున్నాననుకుంటూ నువ్వు చేసే భ్రమల ప్రయాణపు తీరంలో ఆఖరి అలగా నువ్వు తాకటం ఎదురు చూడాలని ఉంది. నువ్వు ఈ గమ్యం చేరే క్షణాలలో నీ కళ్ళు పలికే నిస్తేజంతో మాట్లాడాలని ఉంది. అవి చెప్పే కథలు వినాలని ఉంది.
కురిసే జీవితాన్ని ఖాతరు చెయ్యక ఆశల వేదికగా నువ్వు నిర్మించుకున్న బతుకు భవంతి లక్కా గృహమని నీకు తెలిసే సరికి నీ వాళ్ళందరినీ విడిచి మరో లోకపు రహదారుల్లో నువ్వు ఒంటరి ప్రయాణం చేస్తుంటావ్. నీకు తెలియకుండానే నువ్వు చిదిమేసిన జీవుల జీవితాల లెక్కలు చూడటానికి చిత్రగుప్తుడు కొత్తచిట్టా మొదలెట్టాలేమో.
ముఖానికి అద్దం... మనస్సుకి అంతరాత్మ... సత్య పేటికలే కదా...! వాటిని చూసి మనిషి తన లోపాల్నిసరి దిద్దుకుంటాడులే అని నిశ్చింతగా నిద్రించే ఆ భగవంతుడికి ఏమి తెలుసు...? దేనికైనా మేకప్పులు వెయ్యటం నేర్చుకున్న నీ పనితనం గూర్చి. కావాలంటే క్షణానికో కొత్త భగవంతుడినే సృష్టించగలిగే సృష్టికర్తవు అయ్యావని ఆ కలలోనైనా తెలుస్తుందో లేదో పాపం.
నీ కోరికల దాహానికి తను వసించే ఈ నేల చాలటం లేదని గ్రహాంతర యానాలు మొదలు పెట్టిన నువ్వు ఎప్పుడో ఒకప్పుడు తన పాల సముద్రాన్ని సైతం బురద చెరువుగా కైలాసాన్ని కూడా బూడిద కొండగా మార్చగలిగినంత కాలుష్యం చెందావని జీవాన్ని మనిషీకరించిన ఆ దేవ దేవుడు ఎప్పటికైనా తెలుసుకుంటాడా...? తెలుసుకునే వరకూ తానైనా మిగిలి ఉంటాడా?
నీ నాగరికతకి భూమిని బలి చేసిన నువ్వు తన తదుపరి లక్ష్యంగా విశ్వాన్ని ఎంచుకుని తనతో పాటు ఇంకెవ్వరినీ ప్రశాంతంగా ఉంచలేని స్థితికి వచ్చేసావని అభివృద్ధి పేరుతో నువ్వు కూర్చున్న కొమ్మని నువ్వు నరుక్కుంటూ నీతో పాటుగా విశ్వంలో అన్ని ప్రాణులనీ శూన్యంలోకి తీసుకుని వెళ్ళేలా ఉన్నావనీ... ఆ భగవంతుడికి లిప్తపాటు క్షణం పాటైనా తెలిస్తే బాగుండు కదా... (అసలుంటూ ఉండి ఉంటే)
మీ నాగరికత లెక్కల్లో సమాధిలోకి జారి పోయిన జీవ జాలాల ఉసురు అనుకోని ఉత్పాతాలుగా మారి ఇప్పటికే మిమ్మల్ని వెన్నాడుతున్నా నిద్ర నటిస్తూ నిన్ను నువ్వు చేసుకుంటున్న మోసం యమపాశమై నిను చుట్టిన ఆ క్షణాల వేదికపై నీలో కనిపించే పశ్చాత్తాపం చూడ బోయే రోజు అతి త్వరలో వచ్చేలా ఉందని అనిపిస్తుంటేనే నాకు నీ మీద జాలి కలుగుతుంది.
ఏ స్వజాతిలోనూ లేని వర్గ వైషమ్యాల కోరల్లో అసూయా ద్వేషాల చెరల్లో చిక్కి సాటి మనుషుల మీద నువ్వు సాగించే యుద్ధంలో సమిధగా మారుతున్న విశ్వాన్ని తలచుకుంటుంటే అసలు మీ జాతి ఎందుకు పుట్టిందా అని నాకే అంతులేని చింతగా ఉంది.
నీ వాళ్ళందరినీ విడిచి ఒంటరి ప్రయాణం చేస్తుంటావ్ అని ఏదో అన్నాను కానీ... ఏదైనా వింత జరిగి అన్ని ప్రాణులూ... అన్ని జీవజాతులు అలానే ఉండి మీ మానవ జాతి ఒక్కటే అంతమొందితే కానీ నాకు నిశ్చింత కలిగేలా లేదు.
నీ సాటి మనిషిని నువ్వు చెవులతో చదువుతూ రంగుతో కొలుస్తూ నాగరికపు మేధావితనాల ముసుగులో సకల చరాచర జగత్తుపై నువ్వు సాగించే దమనకాండకి చింతిస్తూ లిప్తపాటు క్షణమైనా ఒక్క అశ్రువు కార్చి చూడు మార్పు మొదలవుతుంది... మొక్క పెరుగుతుంది... చెట్టు నిలుస్తుంది... మేఘం కురుస్తుంది... ప్రకృతి మురుస్తుంది...
నువ్వు మారితే నాకంటే సంతోషం ఎవరికీ ఉండదు...
మరి మారి చూపించవూ...
ఇట్లు...
నీ గమనం మొత్తానికి ససాక్ష్యంగా నిలిచిన
కాలం

- సురేష్ రావి 09.11.14


1 comments:

ముఖానికి అద్దం... మనస్సుకి అంతరాత్మ... సత్య పేటికలే కదా...!Superb
ఎందరు మారతారో చూడాలి.

Post a Comment