Thursday, 18 December 2014

ఏయ్… అంతరాత్మా…!

ఏయ్…

అంతరాత్మా…!

అందరూ నన్ను నన్నుగా చూపించే అద్దం నువ్వే  అంటూ  ఉంటారు?  నిజమే కాబోలు అనుకున్నా....

తరచి తరచి చూస్తుంటే అసలు నువ్వు నన్ను నన్నుగా  చూడగలుగుతున్నావా అన్న సందేహం వచ్చేస్తుంది…!

అసలు నాలోపల నువ్వు నిజంగా పనిచేస్తున్నవా? మసక బారి పోయి రేఖా మాత్రపు చిత్త భ్రమలనే నా నిజమైన భావాలుగా చూపిస్తున్నావా?

రెండోదే నిజం కదూ….

అందరికీ అర్థం అయ్యేలానే నన్ను చూపిస్తున్నావనుకుంటూ ఉంటాను. కానీ ఎవరికీ అర్ధంకాని శేష ప్రశ్నలా నన్ను మార్చేస్తున్నావని తెలుసుకున్నాను. నేను చేసే ప్రతి పనీలో నాకు సంతోషం ఉంటుంది అనిపించేలా చేస్తావ్. కానీ ఆ సంతోషాలేవీ మనసుని స్పర్శించవే? ఆ కాసేపటి ఆనందం నాలో చూడటం కోసం నన్ను మాయల్లోకి నెట్టేస్తున్నావా?

మదిలో శాశ్వతముద్రలేసే నిజమైన ఆనందాల వైపుగా నా ఆలోచనలు ఎందుకు మళ్ళించవూ?  తాత్కాలిక ఆనందాల మాయా ప్రపంచంలోకి నన్ను ఒంపేస్తూ నువ్వు బాపుకునేదేమిటి?

ఎంతగా చదువుదామని చూస్తానో నిన్ను… చదివినప్పుడల్లా భలే అర్ధం అయినట్లే ఉంటావ్… కానీ నువ్వో అర్ధం కానీ బ్రహ్మ పదార్ధానివని   మళ్ళీ తరువాత ఎప్పుడో తెలుసుకుంటూ ఉంటా…!

కానీ ఏమి లాభం  మళ్ళీ మళ్ళీ  నీతోనే  సంభాషిస్తా…!

అంతకన్నా ఏమి చెయ్యగలను మరి నా గురించి నువ్వే  అన్నీ చూసుకోగలవ్ అని అనుకుని ఏ స్నేహాన్ని వరించని  పుట్టుకనయ్యా…!  ఎవరి లోచనాలతో వారు నన్ను తెగ చదివేసుకుని కొత్త కొత్తగా అర్ధం చేసుకుంటుంటే  ఒక్క  మనిషిని ఇన్ని రకాలుగా అర్ధం  చేసుకోవచ్చు అన్న సంగతే బహు వింతగా అనిపిస్తుంది.  

ఇన్ని రకాల అర్ధాలు పుడుతున్నాయంటే నన్ను నేను సరిగ్గా ఆవిష్కరించుకునేలా  నువ్వు  చెయ్యలేదు అనే  కదా....

అసలు వారికి ఏమి అర్ధం అవుతుందో  తర్వాత సంగతి… నేనెంటో నాకే అర్ధం కానంత  మాయాజాలాన్ని  నా చుట్టూ పరిచేసావ్ కదా…

అప్పుడప్పుడూ నవ్విస్తావ్…  ఎందుకు నవ్వానో తరువాత నాకే అయోమయం…
ఇంకోసారి ఏడిపిస్తావ్… నువ్వుండీ నేను ఎందుకు ఏడవాలి అన్నది నాకెప్పుడూ  అంతు చిక్కని ప్రశ్నే…?
అవసరం లేనప్పుడు కోపం…! జనాలందరూ దూరం…
మోసమని తెలిసినా  జాలి…!  తరువాత జాలి చూపటానికి మిగలని హితులు...
సమస్య  పుడుతుందంటే  తలుపు తట్టే భయం… భీరువుగా నా మీద నాకే అసహ్యం...
అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నేనున్నాననే ధైర్యం.... అవసరపడనంత ధీరోదాత్తతతో ఎనలేని స్థైర్యం…   

ఎక్కడ ఏది అవసరమో అది మనసుకి తట్టనివ్వకుండా నువ్వాడే అంతరాంతపు మాయాటలో  నన్నో సమిధలా వాడుకుంటున్న నీ శక్తిని ఎంత తెగిడినా తక్కువే కదూ….

నాలో నీడగా ఒదిగిన నా తోడువనుకున్నా ఇన్నాళ్ళూ…  
మనసుని అతలాకుతలం చేసే చీడవని మనిషి ఆలోచనల్ని తుడిపేస్తున్న పీడవని తెలిసీ ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో కూరుకుపోయా… అంతగా నన్ను లోబరుచుకున్నావ్ మరి…

అంతరంగ ప్రక్షాళన జరిగితే చాలు కదా బహిరంగం బ్రహ్మాండం అవ్వటానికి?  

అందుకోసం ముందుగా ప్రక్షాళన చెయ్యల్సింది నిన్నే కదా… ఇంతగా మకిలి పట్టేసిన నిన్ను శుభ్రం  చెయ్యాలంటే  ఏమి చెయ్యాలో?

నిజమే… నువ్వు బాగు చెయ్యలేనంతగా  మకిలి పట్టేసావ్…

నువ్వు మసి బారిన అద్దానివి… నీకు ఏ చదువులూ రావు… మనసుకీ మనిషికీ అంతరాలు పెంచే కలహాలు తప్ప…!

నిన్ను సమాధి చేస్తే కానీ నన్ను నేనుగా లోకానికి పరిచయం చేసుకోలేనేమో....!

నా ప్రతి ఆర్ద్రతా తన స్థాయిలో తాను బయటకి రావాలంటే  అనుభూతులకి నువ్వేసిన కవచాలు  బద్దలు కొట్టాలి…

నీ ఆటలకి తోలుబొమ్మ అవుతూ…
పదుగురు మాటలకీ కేంద్రబిందువవుతూ…
అవమానాలలో తడచిపోతూ
పాపం బహిరంగమెప్పుడూ పిచ్చిదే...  

నా లోపలి  మనిషీ  బయటి మనిషీ ఒక్కటిగా మహోన్నత మానవీయతకు తావవ్వాలి…

అదే నా కోరిక… అందుకోసం  అపార్ధపు వలువలు కట్టుకున్న నిన్ను త్వరగా పాతరెయ్యబోతున్నా…

ఇక నుండి నేను నేనే...

ఇట్లు…

నేను

1 comments:

ఏయ్ ఓయ్ అంటే అంతరాత్మ అస్సలు వినదు కదండీ...కాస్త ప్రేమగా పిలవండి :-)

Post a Comment