Tuesday, 20 January 2015

గురివింద గింజ

ఏయ్… సమాజమా…

‘ఓటమికి ఋణపడ్డా… ఆత్మీయులెవరో తెలిపిందని..!’ అంటూ… నాలుగే నాలుగు పదాలు రాస్తే… అందులో నిజంగా ఎవరికీ తెలియని విషయం ఏమీ లేదు… కానీ అందరి స్పందనా ఒకే లా ఉంది.  

నా మాటలుగా రాసుకున్న పదాల్లో ఎవరికి వారు వారిని చూసుకుంటున్నారు అంటే అర్ధం కావటం  లేదూ...  ప్రతి ఒక్కరి విషయంలో నీ తీరు ఒక్కటేనని… తరతమ భేదాలూ నీకు లేవని…

అంటే ప్రతివారికీ… వారికి  ఓటమి ఎదురైనప్పుడు…అప్పటి వరకూ ఆత్మీయులనుకున్న వారు ముఖం చాటేశారు అనే కదా…  

మరి అక్కడ ముఖం చాటేసింది ఎవరంటావ్… నాకు వాడు… వాడికి నేను… అంతే కదా మరి... వాడూ నేనూ కలిస్తేనే కదా  నువ్వు (సమాజం)గా మారేది.  

మేమున్నాం చూశావూ ( విడి విడిగా ఉన్నప్పుడు మమ్మల్ని మనుషులంటారులే)...  మా జీవితాల్లో  జరిగే  ప్రతి విషయంలో నిన్నే తలచుకుంటాం… నీ స్పందన గురించే మా ఆరాటం.  మా భయం… బలహీనత అన్నీ నీవే…  

నువ్వేమనుకుంటావనే శంక ఒక్కటి చాలు మా జీవితాలని చిన్నాభిన్నం చేసుకోవటానికి…! మేము దేవుణ్ణి నమ్మినా దెయ్యాన్ని నమ్మినా నిన్ను చూసి భయపడే… మా ఇంట్లో పిల్లల పెంపకం నుండి… మేమేసుకునే బట్టల వరకూ  నువ్వు విధించావు అన్న పరిధులకి లోబడే… తిన్నా తినక పోయినా నీకు దర్జాగా కనిపించటానికి  అప్పు చెయ్యాలి… అది తీర్చలేని రోజున ఇంటి దూలానికి వేళ్ళాడాలి… ఇదీ మనుష్యులుగా మేము నీకిస్తున్న శవతర్పణం.

ఏదో పరువంట దాని రంగు రుచి ఎలా ఉంటాయో తెలియదు కానీ అది పోతే నువ్వు తల ఎత్తనియ్యవంట… నీ ముందు తల ఎత్తుకోవటం  కోసం  కన్నబిడ్డలనే హతమార్చే కసాయిలుగా మారే తల్లి దండ్రులున్నారు.  ఇంతా  చేస్తే  అసలు నీకో రూపం లేదు… రంగూ రుచీ అంతకన్నా లేవు.

నిజంగా నువ్వు అంత చెడ్డదానివా… నువ్వు చెడ్డ దానివి అనుకుంటే నేనూ… వాడూ… ఇంకోడూ... అందరూ చెడు అనే కదా మరి అర్ధం.  మరెందుకు ఎవరికీ వాళ్ళం మంచి వాళ్ళగా ఉంటున్నప్పుడు (అలా అనుకుంటున్నాంలెద్దూ…) నువ్వు మాత్రమే చెడ్డదానివి ఎలా అయ్యావ్?  నీకు తెలిస్తే కాస్తంత చెప్పవూ…!

అందరూ బాగున్నారు నేను తప్ప…
అందరూ గెలుస్తున్నారు నేను తప్ప…
అందరూ సుఖపడి పోతున్నారు నేను తప్ప...

ఎప్పుడో ఒక్కసారైనా ఇలాంటి మాటలనుకోని మనిషెవరైనా  ఈ భూమ్మీద  ఉన్నాడని నేననుకోను.

కానీ ఆ అందరూ ఎవరు… అంటే సమాధానం ఏముంటుంది…? వాడికి  నేనే అందరిలో వాడిని… నాకు  వాడు అందరిలో ఒకడు… ఒకరికి ఒకరం అందరూ అయినప్పుడు మరి ఎవరు బాగున్నట్లు? ఎవరు గెలుస్తున్నట్లు? ఎవరు సుఖంగా ఉన్నట్లు?

ఈ ప్రకృతి అందరికీ సమాన అవకాశాలే ఇచ్చింది.  మేధ పెంచుకున్న  మేము మాత్రం  మా దాకా వచ్చిందే సమస్య అనుకుంటూ పక్క వాడి విషయంలో మాత్రం దూర దూరంగా సుదూరంగా జరిగిపోతూ… వీలైతే  మన వరకూ రాకుండా నాలుగు చిక్కు ముడులు ఎలా వెయ్యాలా అనుకుంటామేమో కానీ తన కష్టానికి స్పందించం.

మరి మాకు కష్టం వచ్చినప్పుడు వాడూ అదే చేస్తాడు ఎందుకంటే  వాడు మాకు… మా ప్రవర్తనకీ...  నిలువుటద్దం కనుక…

గెలుపు ఎవడబ్బ సొత్తూ కాదు… అస్తమానూ అంటిపెట్టుకుని ఉండటానికి… జీవితంలో ఏదో ఒక దశలో ఒక్క ఓటమైనా  పరామర్శించని మనిషంటూ ఎవ్వడున్నాడని…?

అలాంటప్పుడు వస్తుంది కోపం నీ మీద… ఎందుకంటే  మా  పరిస్థితికి  కారణం నీలోనే  వెదుక్కుంటాము కనుక… (అసలు మాలో లోపాలు ఉంటాయా ఏంటి… మేము చాలా గొప్పోళ్ళం కదా మరి)

సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయంటాం… ఆ సమాజానికి మేమేదో బయట నిలబడి ఉన్నట్లు.

గురివింద గింజలమే... నాకు తను... తనకు నేను...  ఇదే ఈ నాటి లోకం...!

ప్రతి మనిషీ తాను  కష్టంలో ఉన్నప్పుడు ఒక ఆలంబన కోసం ఎంత ఎదురు చూస్తాడో… పక్కవాడు కష్టంలో ఉన్నప్పుడు తానున్నాను అంటూ వెన్ను తడితే... మనిషి మనిషిలో మానవత్వం గురించి ఇంతటి నిరాశా వాదం పెరిగి పోతుందా?

తామెంత  ఉన్నతంగా ఉంటే సమాజమంత ఉన్నతంగా ఉంటుంది అని ఎవరికీ వారు అనుకోవాల్సిందేగానీ...  నేను మారను,  కానీ ఈ  సమాజం మాత్రం స్వచ్ఛమవ్వాలి…. నా  ఓటమిలో ధైర్యమివ్వాలి… నా  గెలుపులో వెన్నుతట్టాలి  అని అనుకుంటే ఇంకెన్ని యుగాలకైనా ఈ లోకమింతే అనుకుంటున్నా…

మరి నువ్వేమంటావ్…?

నీలోని…

ఒకడు


(ప్రపంచమొక అద్దం… నీ ప్రవర్తననే అది నీకు చూపిస్తుంది… సుతి మెత్తగా కాదు సుమా… భళ్ళున  నువ్వు బద్దలయ్యేలా…)


1 comments:

వాడూ నేనూ కలిస్తేనే కదా నువ్వు సమాజంగా మారేది. awesome,

Post a Comment