Wednesday, 7 January 2015

అంటుగట్టిన మనఃస్పర్శ

ప్రియమైన నీకు,

ఇంత కాలానికా లేఖ అని కోపమా.... 

నీ ముఖానికి కోపం అసలు బాగోదమ్మడూ… దరహాసాలన్నిటినీ దండగుచ్చి  నీ  పెదాల మీద  చిలకరించినట్లే ఉంటావ్ నువ్వు… అలా ఉంటేనే  నువ్వు అందంగా ఉంటావ్…

ఏయ్… పక్కకి చూడక్కర్లేదు అక్కడ ములగ చెట్టు లేదులే… నేను నిన్ను ఎక్కిస్తున్నాను అనుకోవటానికి. నీకు తెలియదూ నేను ఎప్పుడూ నిజాలే చెపుతానని.  

ఏదో  ఒక ఉత్తరం రాయటం ఎంత సేపురా? కానీ ఏదో ఒకటో రాసేసి నేను పోస్ట్ డబ్బాలో పడేసి అందుకున్న నువ్వు ఓ క్షణంలో దాన్ని చదివేసి  ఇంటి వసారాలో కట్టిన ఉత్తరాల తీగకు దాన్ని గుచ్చేసి…. ఉహూ తలచుకుంటుంటే నాకు మన ఇద్దరి మనసులని కలపి అక్కడ గుచ్చేసినంత బాధగా ఉందిరా… నీ గురించి ఒక్క వాక్యం రాసినా  చిత్తుకాగితం సైతం అమూల్యమవుతుంది నాకు. పరమ పద సోపానపటంలో ఎప్పుడూ నిచ్చెనలెక్కితే  వచ్చేంత  ఆనందం  నా చేతిరాతతో నీ పేరు రాస్తున్నప్పుడు  వస్తుంది… ఆ ఆనందాన్ని కొంచెం చదివి చూడవూ… దాని నిడివి కొలిచి చెప్పవూ… తెలిసింది కదూ  నీతో  నా  ఆనందం నీ మనసంత లోతని.

క్షణంలో  వెలిసిపోయే అక్షరాలు ఎన్ని రాసి ఏమి ప్రయోజనం… రాసిన కాగితం చెదపట్టినా… అక్షరం మదిని చేరి తలచినంతనే అలవోకగా అనుభూతిగా  మరల మరలా హృదిని మీటేలా రాయాలి….

మాటమీద మౌనాన్ని కప్పెట్టి  నిశ్శబ్దాల తపస్సు  చేసే నాకు  ఏ శబ్దమైనా  నువ్వే… నిశ్శబ్దపు సడిలో నీ శబ్దాన్ని వింటూ అలౌకిక స్థితిలోకి నేను చేసే ప్రయాణాన్ని అక్షరీకరించటం నీ ఊహలు నాలో వర్షిస్తున్నంత  సులువు కాదు కదా… 

నా  లేఖ అంచున అంటిన తడి ఏమిటో  తెలుసా… 

ఏయ్… పిచ్చీ… అది కన్నీటి తడి  కాదురా… నీ  కళ్ళల్లో  నదులు  పారటానికి…. ఆ తడి ‘నిన్నటి మన క్షణాల జ్ఞాపకాల  స్పర్శ…. మన  రేపటి  ఆశల  తాకిడి… వర్తమానమై కురిసిన ఆనందం …! ‘

నిన్నటి హేమంతపు ఉదయాలల్లో మొదలైన మన ఊసులు  సాయంత్రాలలో నీ జతలో  వెచ్చని అడుగులుగా మారి రాత్రులన్నీ నాలో  వేస్తున్న కలల  ముద్రలని  నీకు చేరవేసే  నీ మది మంజూషంలోని  స్మృతుల  ఖజానాలో  చేర్చి  మరల మరల నీ మధుర శ్వాసలలో ఊపిరి తీసుకోవాలని నా చిరు ఆశ....! 

బాగా నడిచినంత సేపు  చాలా  తేలికగా  కనిపిస్తుందీ కాలం.  గతి తప్పిన ఒక్క అడుగు చాలు కదా  కాలం  తన  మహిమ చూపి ఎద బాటని  ఎడబాటుగా మార్చటానికి…! కాదంటావా... చెప్పు మరి…  లేకపోతే ఏమిటి మరి  పక్క పక్కన కూర్చుని శంఖులాంటి నీ మెడ మీద వెచ్చని ఊపిరిలడ్డుతూ చెవిలో ఎన్నో గుసగుసలాడాల్సిన  నేను  ఇక్కడ… నువ్వు అక్కడెక్కడో… అక్షరాలలోనే అనుభూతులన్నీ చవి చూసుకుంటూ....!

ఒక్కటి మాత్రం నిజంరా… కాలం ఎంత గొప్పదైనా కావొచ్చు కానీ నీ మీద నా ప్రేమని ఏ నాటికి తుంచలేదు… దేహాలనైతే వియోగించగలడేమో కానీ మనసుల సంయోగాన్ని ఏ కాల పురుషుడు మాత్రం కాల రాయగలడు…?  కాలంతో మరుపు సహజమే అన్న నానుడి అందరికీ అన్ని సార్లూ  వర్తించదు కదూ … కొందరి విషయంలో కాలంతో  కొన్ని స్మృతులు మరింత గాఢంగా మనసుని పెనవేసుకుపోతూ గడచిన ప్రతి క్షణాన్ని అమరం చేస్తాయి. 

భౌతికంగా ఒక్క చోటున లేమని తప్ప నిజంగా మనకేమి లోటురా… ఖాళీగా ఉన్న ప్రతి క్షణమూ  ఒకరి మనసుతో  ఒకరం  భాషించుకుంటూ… ఖాళీ చేసుకుని మరీ కొన్ని క్షణాలకి మన ఊసులద్దుతూ.... మరి మన జీవితం మధురం కాదా చెప్పు…! 

జీవితాన్ని చదివేశాం … బతుకుని దోసిట్లో నీరు పోసి తాగినంత సులువుగా గడిపేస్తున్నాం అని చెప్పే వారి కళ్ళల్లోకి  ఒక్క సారి సూటిగా చూడు… మాటల్లో ఎక్కడా కనపడని నిస్తేజత అంతా అవే మోస్తూ కనపడతాయ్… ఎందుకంటే… వాటికి అబద్ధం ఆడటం రాదు పాపం… అయినా పరాయివాళ్ళకేం వంద చెప్తారు… నాలుగు గోడల మధ్యే ఉన్నా నాలుగు యుగాల దూరంతో బతికే వారే వారంతా…

అద్దం ఎదురుగా నిలబడి నీ కళ్ళని ఒక్కసారి చూసుకో… ఎంత తేజంతో  వెలిగిపోతున్నాయో  కదా… అది చాలదూ మనజీవితాలని చెప్పటానికి… 

మనమిద్దరం  పరాయి ప్రదేశాలలో ఉంటున్నామేమో కానీ మనసైన మన అనుభూతులెన్నడూ  పరాయీకరణ చెందవు రా… 

ఒక్కటి చెప్పనా... ఇక్కడున్నప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీ కూడా నాకు నీ ఊసులని స్పర్శించేలా  చేస్తుంది… తాను చెట్టుగా ఉన్నప్పుడు వసంతం చూసిన సంతోషం తనకి నీ గురించి నాకు చెప్పేటప్పుడు...అద్భుతం కదూ...  

నువ్వు  తాకిన ప్రతి  వస్తువూ నీ స్పర్శని  నా మనసుకు అంటుగట్టేసాయి… ఇప్పుడీ ఉత్తరంలోని అక్షరాల ద్వారా నేను నీలోకి కురిసినంత మత్తుగా…!  

ఉత్తరం ముగిసే సరికి ఇదిగో నీ నవ్వు కురుస్తున్న చప్పుడు నా హృదిని తాకుతూ… :) 

నీ

నేను 

0 comments:

Post a Comment