Wednesday, 11 February 2015

మనసు మాగాణిలో సిరివై....

ఏరా...

ఎందుకురా ఇలా అల్లుకుపోయావ్?  అప్పుడెప్పుడో పాతరేసిన కలలన్నిటినీవాస్తవంలోకి అనువదించేస్తున్నావ్. ఎప్పుడూ అనుకోలేదురా... ఆరారు ఋతువులుశిశిరాలుగా కురుస్తున్న జీవితానికి వసంతపు స్పర్శ మీటుతుందని. అసాధ్యాన్నిసుసాధ్యం చేస్తూ ప్రకృతివై నువ్వు నాలోకి నడిచొచ్చేసావ్. 

నాలోకి అలా వెళ్ళిపోయావ్ కదా... ఒక్కనిజం చెప్పు...? నా మనసు మీద ముసుగుఏదైనా కప్పి ఉందా...? భూమి పుట్టినప్పుడు పచ్చదనాన్ని పూసుకున్న ప్రకృతి ఉన్నంత నగ్నంగాలేదూ...! నీ కోసమే రా ఇన్నాళ్లుగా అది అలా ఉండి పోయింది.     

నిరాకారమైన ఆలోచనల్లో జీవితాన్ని ఆవాహన చేసుకున్నప్పుడల్లా నా మనసు తలుపు తడుతూ నన్ను వెదుక్కుంటూవచ్చిన నీకు నేనిచ్చే అతి చిన్న బహుమతి ఏ ఆడంబరాలూ లేని నా మనసు.

రోజూ పొద్దు పొద్దున్నే నీ నవ్వుల్లోతడవటం కన్నా జీవితంలో ఇంకేదీ ఎక్కువ కాదురా... నిజంగా నీ నవ్వులతో నా మనసు తడిమొత్తం మాయం చేసేస్తావ్ రా... సూర్య కిరణం నన్ను తట్టకముందే నువ్వు నన్ను మాటలతోతాగేస్తూ మనసుతో  స్పర్శిస్తావు  చూడూ... పాపం అప్పుడు ఆ కిరణుడి బిక్కమొహం చూడాలి... కాసేపు  జాలి వేస్తుంది. అయితేనేమి...  లోకానికి తనువెలుగవ్వొచ్చు కానీ నాకు కాదుగా...

కలలు కనటం మానేసిన కళ్ళకి... కలలిచ్చేఆనందాన్ని మించిన సంతసాన్ని వాస్తవంగా పోతపోసావ్... మరి ఇన్నాళ్ళుగా  నన్నుఆవరించుకున్న వేదాంతాన్ని ఎటు తరిమేసావురా? 

కన్నీరే మాధ్యమంగా  చదువుతున్నజీవితానికి నవ్వుల మాధ్యమాన్ని పరిచయించెయ్యటమే కాకుండా  కంటితడి సాక్ష్యాలనిసమూలంగా ఆవిరి చేసేసి నవ జీవన కాంతిని హరివిల్లుగా  నా చుట్టూ పరిచేసి నువ్వుచేసిన మధుర జాలం ఉంది చూశావూ... జన్మ జన్మాలకీ నిన్ను నాతో ముడి వేసెయ్యమనిప్రార్ధన చేసేలా చేస్తుంది.   

ఎన్ని క్షణాల దూరమో దాటొచ్చిన కలయిక కదా మనది... మనం దాటొచ్చిన ఆ  క్షణాలన్నిటి ఊపిరి కూడా మనల్ని ఏకం చెయ్యాలన్నఒకే ధ్యాసలో ఉండే ఉంటాయిరా ఇన్ని నాళ్ళూ.  అందుకే ఈ సారి మన ఏకాత్మతో పాటుగా వందింతల దూరం ప్రయాణంచేసే వరమిద్దాంలే వాటికి... సరేనా...?

అసలు ఒకే లాంటి ఇష్టాలు ఉన్న ఇద్దరినీ కలపటంలోదేవుడెండుకింత ఆలస్యం చేసాడో కదా... లాభం లేదు ఈ సారి కలిసినప్పుడు పోట్లాడాలి...నువ్వు కూడా తోడుంటావు గా... (నాకంటే నువ్వే ఎక్కువపోట్లాడతావ్ అని నాకు తెలుసులే... వ్వె వ్వె వ్వె... :p )  

అలసటగా కాసేపలా కళ్ళు ముసుకుంటానా... కమ్మగా నవ్వుతూ కలలనికళ్ళకి అలికేసి వెళతావ్... ఆ మత్తులో నుండి బయటకి రాక మునుపే మాటగా చెవి చేరతావ్...ఎంతోటి బెంగనీ బంగాళాఖాతంలోకి విసిరెయ్యవచ్చు నువ్వు సడి చేస్తున్నంత సేపూ...

నా మనసు మాగాణిలో సిరివై పండిన మహిమాన్విత ప్రేమకుసుమానివి నీవు.

రేయ్... నాకు పెద్ద కోరికలేమీ లేవురా నువ్వెప్పుడూవర్తమానమై నా పెదవుల్లో నవ్వాలని తప్ప.

నీ
నేను


0 comments:

Post a Comment