Thursday, 5 March 2015

హేమంత స్పర్శ - 10

రేయ్…

అవ్యక్తం కాని ఈ  అనుభూతుల్ని అక్షరీకరించాలని అక్షరాలు ఎంత తపన పడినా మనసు ఇంకా ఆ  అనుభూతుల్లోనే తారాడుతూ  కాగితం మీద ఒదగనంటుంది. మనసు అనుభూతించే ఆనందంలో అణుమాత్రమైనా అక్షరాలకి అద్దగలిగితే వాటి తపనా తీరుతుందేమో కదూ…

నీ రాకతో పారిపోతూ తిమిరం చూసిన చూపు చెప్పిందిరా… నా జీవితంలోకి నువ్వేసిన అడుగులు ఎంత వెలుగుని నింపుకుని వచ్చాయో అని. ఇంతకీ దాని చూపుకి అర్ధం తెలుసా? ఇన్నాళ్ళ  మన స్నేహన్ని శాశ్వతంగా  హత్య చేస్తున్నావు కదా అని. ఒక్కొక్క బాధనీ తరిమేస్తూ వచ్చి నా మది వాకిట్లో విరబూసిన  వెన్నెల కుసుమానివి నీవు.

దీప్త నీలాలైన నీ కళ్ళల్లో నుండి వస్తున్న కాంతి సుగంధాలలో తనివితీరా ఓలలాడాలని ఆరాటపడుతున్న నా మనసులోకి ఒక్క సారి చూడరా…  వత్సరాలుగా కప్పుకున్న పరదాలని పక్కకి నెట్టి మరీ గంతులేస్తుంది. నాకు నువ్వు దొరికినట్లుగా అందరకీ సరైన  తోడు  దొరికితే వాళ్ళతో నవ్వుతూ నరకానికి రహదారి వేసుకుంటూ వెళ్లిపోవచ్చు కదూ…  

నీ సమక్షపు స్వర్గం ఉన్నంత సేపూ ఎన్నెన్ని నరకాలూ నన్నేం చెయ్య గలవు చెప్పు?

వెన్నెల రాపిడిలో నన్ను నీకు కోల్పోవటం చూసి చందమామకి కన్ను కుట్టేలోపు ఆ  వెన్నెల మొత్తాన్నీ మన మనసులోకి జుర్రేసుకుందాం రా…  నీ చెక్కిలి పై నా ముద్దుల చెలమ చూసిన ఆకసపు మోము చూడు ఎంత ఎర్రబడి పోయిందో?

అసలు నువ్వేంటిరా… ఏమవుతావురా నాకు?  ఎంత తరచి  తరచి  తలచినా అర్ధం కావటం లేదు. ఎక్కడ లేని ఆకతాయితనమూ నీ దగ్గరే  వస్తుంది… ఎందుకంటావూ…? నువ్వొట్టి ప్రేమవి మాత్రమే కాదు రా … నన్ను ఆత్మీయంగా  అల్లేసుకున్న ప్రాణ బంధానివి
నిన్నటి వరకూ  వరమనిపించిన నా ఒంటరితనాన్ని సమాధి చేసి... నీ అల్లరి పలుకుల చినుకులతో నా మనసుకు సాంత్వన నేర్పి నన్ను సరికొత్తగా లోకానికి పరిచయం చేసావ్… కాదు కాదు లోకాన్ని  సరి కొత్తగా నాకు పరిచయం చేసావ్.

నిన్నటి కలలన్నిటిలో  కంటకాలుగా నన్ను గుచ్చుతున్న లోకమే కనిపించేదిరా. కానీ నువ్వొచ్చి చెప్పే వరకూ లోకమంటే నేను కూడా అనే ఆలోచనలోకి ఎప్పుడూ ప్రయాణం చెయ్యలేదురా. లోకం కంటకం అనుకుంటే  నేనూ కంటకాన్నే కదా అన్న ఒక్క  ఆలోచన  మొత్తంగా నా ఆలోచనా దృక్పధాన్నే మార్చేసిందిరా. అలా మారాకే తెలిసింది నేను నవ్వితే లోకం ఎంత చక్కగా నవ్వుతుందో…

నిశీధి నీడగా కరిగిపోతున్న నన్ను మెరుపు తారగా మార్చేసావ్. నిన్నటి నా మౌనాలన్నిటికీ మాటలద్దుతూ కొత్త కొత్త భాష్యాలు నువ్వు చెప్తుంటే నా మౌనం వెనక ఇంత అంతరార్ధం ఉందా అని నేనే ఆశ్చర్యచకితుడిని అయ్యాను తెలుసా?

అనుభూతించాల్సింది తొలకరి చినుకులనీ… మట్టి వాసననే కాదు ఆ  మట్టి వాసన వేసే బతుకుల తడిని కూడా  అని జీవితాన్ని మరో కోణంలో నువ్వు పరిచయించిన తరువాతే జీవితం మళ్ళీ మొదలయ్యింది అనిపించింది.  ఆ తరువాతే తెలిసింది జీవితమొక జలపాతమని అది అలా అలా సాగుతూ ఎన్నో చెలమలని తనలో పొదుపుకుంటుందని అయినా ముందుకే సాగిపోతుందని.

నన్ను నేను  చదువుకుంటూ జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాక గానీ అర్ధం  కాలేదు పుస్తకాల్లో చదివిన చదువులన్నీ బతకటానికే పనికి వస్తాయి గానీ మనసుని చదువుకోవటం అంటే  ఆనందాన్ని  కోసుకోవటమే అని.

అసలు నా జీవితం నా మీద ఉసిగొల్పిన తిరుగుబాటువి రా నువ్వు.  నీ రాక ముందు /  నీ రాక తరువాత... అసలు పొంతన లేని జీవనం. బతుకు వేరు జీవితం వేరు అని తెలిసి వచ్చిన పరిచయం నువ్వు . నలుపు తెలుపుగా ఒదిగిపోయిన బతుకున నువ్వు నాకిచ్చిన రంగు రంగుల పలకరింపు ఈ జీవితం. నీ గురించి నా మనసంతా  వ్యక్తీకరించేసినా అణువంత కూడా  చెప్పినట్లు ఉండదు.

దేనికదే ఆఖరి వాక్యంగా ముగిద్దామని అనుకుంటున్నా అక్షరాల అక్షయకలం  వదలటం లేదురా…

రాసినదంతా అనంతమే… అంతా నీ సొంతమే…

నాతో సహా

నీ


నేను

2 comments:

Post a Comment