Friday, 24 April 2015

హేమంత స్పర్శ - 13

రేయ్...

ఎప్పటికప్పుడు బాల్యం రోజులు వస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా... ఆ పసితనాన్ని అప్పుడు ఉన్నంత స్వచ్ఛంగా మనలో భాగంగానే వెంట పెట్టుకుని వస్తున్న సంగతి ఎప్పుడైనా గమనించావా? 

చిన్నప్పుడు మొత్తంగా అద్దుకున్న పసితనం  ఇప్పుడు మాత్రం కళ్ళకి మాత్రమే పరిమితమయ్యింది. మనసూ దేహమూ ఎన్నెన్ని భేషజాలు పోనీ... కళ్ళు మాత్రం ఎప్పుడూ నిజమే చెబుతూ ఉంటాయ్.  

అందుకేనోయ్… కంటి భాష నేర్చుకో… నీకు రాసే నా ప్రతి అక్షరం ఎంత నిజాన్ని చుట్టుకుని వస్తుందో నీకు నువ్వుగా అంచనా వేసుకోవటానికి. 

వత్సరాలుగా గుండెల్లో పేర్చుకున్న ప్రేమైక భావనని స్వచ్ఛతని ఏ మాత్రం కోల్పోని ఆ కళ్ళతో అనుభూతిస్తే...  చెప్పటం  ఎందుకు నువ్వే తెలుసుకో...

ఒక్కోసారి నాకేం అనిపిస్తుందో చెప్పనా… ప్రేమని పొందటం ఎవరికైనా  గొప్పగా అనిపిస్తుంది కానీ అనుక్షణం ప్రేమైక భావనలో తడిసి ముద్దవుతాం చూడూ... ఆ ప్రతీ క్షణంలో మనసాడే భావసంచలనాల క్రీడలో ఆనందాన్ని దోచుకోవటం తెలిసిన వారికి విశ్వ ప్రేమే పాదాక్రాంతమవ్వదా అని…!

ఏదో అనుకుంటాం కానీ అన్ని స్పందనలని స్వేచ్ఛగా బయటకి వదలలేం కదరా..  కొన్ని కొన్నిటిని మది మంజూషంలో దాచుకుని కావాలనుకున్నప్పుడల్లా ఏకాంతానికి తాపడం చేస్తుంటే సంతోషాన్ని అమరం చేసుకుంటున్న సడే ఎద నిండుగా…

పిల్లగాలి పలకరిస్తుంటే తన్మయంగా తలలూపే తరువుల సడినీ
గుడి గోపురం పై నుండి తటాలున మెరిసే మెరుపునీ
ఆకాశం మట్టిపై అక్షరాలుగా రాస్తున్న చినుకులనీ 
వసంతమద్దుకున్న కొమ్మనీ 
వెన్నెల కడుగుతున్న రేయినీ
ఆస్వాదించటానికి సమయం లేదంటే… బహుశా వారికి కాలంతో పరిచయం లేనట్లే… వాళ్ళ  బతుకులో వాళ్ళు లేనట్లే. 

మనం ఎప్పుడూ అలా కాదుగా…

తొలకరిగా రవళించిన చినుకులద్దుకున్న మట్టితునకల జావళి పాదాలకి ఎర్రెర్రని పారాణి పూస్తుంటే… భూమాతే ముస్తాబు చేసిందన్న ఆనందంలోకి నెమ్మదిగా ఒలికే వారికీ… ఛండాలపు బురద అంటిందని ముఖం గంటుపెట్టుకుని వడివడిగా పరుగెత్తే వారికీ తేడా లేదూ… ప్రతి అనుభవం వెనుకా ఉండే విభిన్న ఆలోచనా ధోరణే కదా  అది.   

ఒకేలా ఆలోచించే మనసులు జతగా మారి చేసే జీవిత ప్రయాణానికీ అసలు పొంతన కుదరని  అభిరుచులు ఉన్నవారు చేసే జీవిత ప్రయాణానికీ  అనుభూతుల పందెం పెడితే  ఎవరు గెలుస్తారంటావ్?  

సమాధానం దొరికింది కదూ… 

మరి నువ్వూ  నేనూ గెలుపు గుర్రాలమే కదా… కానీ ఎందుకోరా ప్రపంచంలో ఎక్కువ శాతం పొంతన లేని మనుషుల అలికిడే ఎక్కువ.  బహుశా అందుకేనేమో ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లో… ఏదో కావాలనుకుంటున్నట్లో గందరగోళంగా ఉంటుందీ ప్రపంచం అసలు మనఃశాంతి లేకుండా…

ఒకే  దృశ్యాన్ని  వివిధాలుగా చీల్చుకుంటున్న మనుషుల మనసులను బట్టే కదా ఆనందపు సాంద్రత నిర్ణయింపబడేది. మరి అనేకమైన ఆలోచనలనీ ఒకే తీరుగా మార్చుకుని జీవితం కొనసాగిస్తే ఊపిరి ఉన్నంత కాలం మనం విజేతలమేగా…

నీ

నేను 


0 comments:

Post a Comment