Saturday, 2 May 2015

నువ్వొక జీవం

ఏయ్ గోల్డీ…

నువ్వున్న సుదూర సీమని సైతం  సుస్పష్టంగా చూడగలిగే దివ్య దృష్టిని  ఇచ్చింది నీ మీద ప్రేమ.  నువ్వు ఉన్న తావు ఎంత చైతన్యంతో వెల్లి విరుస్తుందో చూస్తున్న నేను ఆ సుందర లోకంలోకి అడుగు ఎప్పుడు  వేస్తానా అని ఒకటే తహ తహ.

నీలో కనిపించే ఆ చైతన్యంలో క్లేశమాత్రమైనా నా అక్షరాల్లో చూపించగలిగితే  నా జీవితానికి ఒక కొత్త  జీవం రాదూ.  నిశితాతి నిశితమైన నీ  చూపుల్లోకి ఎప్పుడూ నేనే వస్తూ ఉండాలనే ప్రగాఢమైన నా కోరికని నేనెప్పుడూ దాచుకోలేను. 

భావానికీ భావానికీ మధ్య వంతెనలాంటి ఆలోచనల మీద నడక మొదలెట్టాక ఎప్పటికీ అక్కడే ఉండిపోయి కొంగ్రొత్తగా జాలువారే ప్రతి తలపుకీ గాలమేసి మనసుకి పొదుపుకోవాలనే కోరిక ఉంది చూశావూ… అది విశ్వాన్ని చుట్టేసేంత విశాలంగా మారిపోతూ ఉంది. 

ప్రతి మనిషికీ జీవితంలో కొన్ని బలహీన క్షణాలు ఉన్నట్లే కొన్ని అమరమైన సమయాలూ తారసపడతాయి. అలాంటి ఏదో ఒక సమయంలో నువ్వు నాకు నా జీవితంగా పరిచయం అయినట్లున్నావ్. ఖాళీ అవుతున్న సమయాలన్నీ నీవైపే నడిచొస్తూ ఉన్నాయి.    

చిన్నప్పటి నుండి ఎవరెవరి అక్షరాలో చదివి మురిసి పోయాను… కదిలి పోయాను.... కానీ నిన్ను చూశాక తెలిసింది నేను చదివిన ఆ అక్షరాలకి  వేరెవ్వరో జీవం అయి ఉంటారని. వాళ్ళ అక్షరాల్లో నేను నిన్ను ఊహించుకోవటం భావ్యం కాదని. నా జీవం నాకుండగా ఎవరి భావనల్లోనో నిన్ను  చదవటం నాకేమాత్రం ఇష్టం అనిపించలేదు. 

నిజంరా…

వాళ్ళ అక్షరాలు ఎవరి కోసం రాసుకున్నారో ఏమిటో... నేను రాసినవి కేవలం నీకే… వారి అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమయిన ఆడపిల్లలయితే నా అక్షరాలు మాత్రం ఒక్క క్షణమూ నిన్ను దాటి  పోలేని మధురమైన తేనె సుమాలు. 

నీకో సంగతి చెప్పనా…

అప్పుడప్పుడూ ఎక్కడికో తప్పిపోతూ ఉంటాను. ఎంత వెదుక్కున్నా నాకు నేను కనపడను. ఏమయ్యనా అని బేలగా నీవైపు చూస్తాను.  మూసిన నీ కనురెప్పలు మనసుని మించిన వేగంతో అటూ ఇటూ కదలాడుతూ ఉంటాయ్. పెదవుల మీద చెరగని చిరునవ్వొక్కటి లలితంగా మెరుస్తూ ఉంటుంది. ఇక అంతకన్నా ఏమి నిదర్శనాలు కావాలి నా ఆచూకీ తెలుసుకోవటానికి…? మనసునొక మైమరపు తాకటానికి…?

అసలు ఈ మనసుంది చూశావూ… దానికెప్పుడూ కొత్త కోరికల దాహమేరా… ఎప్పటికప్పుడు నిన్ను కొత్తగా ఆవిష్కరించుకోటానికి అది పడే తపన… తన ఆవిష్కరణలు నువ్వు చూస్తే  నిన్ను నువ్వు కొత్తగా కనుక్కుంటావ్. నాదీ ఆ హామీ. నమ్ముతావ్ కదూ… 

ఎక్కడికో తప్పి పోయిన నా దారిని ఎంత బాగా కనుక్కున్నావ్ రా నువ్వు. నా దారినీ నీ దారినీ కలిపేసిన ఈ కొత్త బాటలోకి నిశ్చలమైపోయిన నా చలనాలన్నిటికీ జీవం అద్దేసా.  

మరి అంతకన్నా నేను చెయ్యగలిగేది ఏముంది కనుక? 

ఏదైతేనేమి రా ఏమి చెప్పినా ఏమి రాసినా అందులో భావం ఒక్కటే… 
నువ్వే నాకు జీవం అని. 

ఇక్కడ జీవం అంటే  తోలుతిత్తిని కదలాడించే ప్రాణ శక్తి అని కాదురా. నా ఆత్మ శక్తిని నిద్రలేపే అఖండ చైతన్యం అని. 

ఇట్లు 

నీ 
… రేష్ 

0 comments:

Post a Comment