Tuesday, 12 May 2015

జీవన 'ఓం'కారం

హాయ్ హనీ…

ఎందుకో గానీ ఈ రోజు నువ్వు నాకు మైకంగా మారిపోయావ్… నిన్ను నేను ఎంతగా  వెదుక్కుంటూ ఉన్నానో   తెలుసా నీకు…  గాఢ సుషుప్తిగా నను కమ్మేసిన మైకమొకటి  నిన్ను అల్లుకునే  క్షణాలకై పడే ఆరాటం నీకు తెలుస్తుందా…

అక్కడెక్కడో సుదూరంగా ఉన్ననీ దగ్గరగా వచ్చి  నీ మెడవంపుపై వెచ్చని శాసనాన్ని లిఖించాలని నా ఉచ్చ్వాస నిశ్వాసల తమకం  కాంతి వేగాన్ని మించిన వేగంతో చలిస్తూ నిన్ను హత్తుకాగానే ఇక్కడ నాలో అంతులేని పరవశం.  

పరవశం ఎందుకో తెలుసా…?  నీ ఊపిరి భారాన్ని మోసుకువచ్చిన తలపు గమనం నన్ను గమ్యంగా చేసుకుందిగా మరి.

ఎప్పుడూ సంద్రపు ఉప్పెనల వార్తలు వినటమే కానీ అంతకు మించిన ఉప్పెన నా తనువులో నినాదం చేస్తుందని కనటం మాత్రం ఇదే తొలిసారి.  ఎక్కడెక్కడి శీతలమూ మన మధ్యలోకి రాగానే ఉజ్వల జ్వలనమై జ్వలిస్తూ మెరుపుల విరులుగా వికసిస్తున్న దృశ్యం మనసుని నులి వెచ్చగా కమ్ముకుంది.

నిశ్శబ్దాన్ని విశ్రాంతిస్తూ మట్టి గాజుల చిరు సవ్వడితో శబ్దాన్ని కొత్తగా రవళిస్తున్న వ్యక్తావ్యక్త  స్వప్నహిందోళం  జనింప చేస్తున్న కోర్కెల  ఆరాటాన్ని వెన్నెల పత్రాలపై ఆవాహన చేసుకున్న ఆ క్షణం  మధూళికన్నా మధురాతి మధురంగా మత్తిల్లజేస్తుంది.  

విరహపు వీవెనల ధాటికి కలవరపడుతూ  తుళ్ళిపడుతున్న యవ్వనం దేహపు దప్పికని మనసుల సంగమంతో ఉపశమించుకుంటూ ఉంటే , మదిలో  అక్కడక్కడా మిగిలిన ఏ కాస్త తమస్సునో మొత్తంగా  ఆవిరి చేస్తూ  గిలిగింతల లాలసత్వంలో హంసగీతిగా ధ్వనిస్తున్న అపురూప దివ్యత్వానివి నీవు.  

నీరదాలన్నీ కరిగి మధు తుషారాలైన జంట తనువుల మంచుగీతంలో ఏక స్వరంగా గొంతు  కలిపేద్దాం

ప్రథమ చరుని కదిలించిన మన్మధ విరులై నీ చూపుల తమకం నన్ను అల్లుకునే వేళ  నువ్వూ... నేనూ... కరుగుతూ… మరుగుతూ... ప్రకృతిలో ప్రణవ నాదంలా లీనమైపోదాం వచ్చెయ్యవూ....

నా పదాలకి అలావాటైన భావ రహదారి ఎప్పుడూ నీ కడకే నన్ను చేరుస్తుంది. ఈ రహదారిపై  ప్రయాణం ఎప్పుడూ అలసట అన్నది తెలియనివ్వదు. ఇందులో చిత్రం ఏముందిలే… అలవోకగా, అలవాటుగా, అనాలోచితంగా… ఎలా అయినా సరే నా తలపుల నిండా నువ్వే నిండి ఉండగా కొత్తగా నా దారి ఎలా మళ్ళుతుందని?

లక్షలుగా జనిస్తున్న నా  ఈ భావపరంపరలో నీ కల్హారాల్లాంటి కన్నుల అల్లరిలో చిక్కుబడిపోయిన నా గుండె ఉపరితలంపై నీ ప్రేమ చేస్తున్న తుషారస్నానం ఎంత చల్లగా ఉందో… నువ్వూ అనుభూతించి చూడు మరి.

నాలో నేను అల్లుకుంటున్న యుద్ధాలన్నీ నీ కోసమే… సున్నితమైన  ప్రతి యాతనలో నువ్వు వచ్చి  నన్ను పెనవేసుకుంటుంటే అంతకంటే గొప్ప ఓదార్పు ఏముంటుందని?   

అసలంటూ  నా కోరికల గమ్యం నీ దేహం కాదురా… నీ దేహాంతర్గతంలో తాపడమైన మనసులో   ప్రతి స్మృతిలోనూ నేనే జడివానగా కురవాలనే తపనేలే నాది..  ఆప్యాయంగా పలికే  నీ పలుకు ఒక్కటి చాలదూ నిరాకారుడినై నీకు నేను నీరాజనాలు పట్టడానికి.  

ఈ లేఖని త్వరపడి చదివేయ్యకలా…

పదాల పోగులని నేతగా అల్లి భావాల వర్ణాలని సొగసుగా అద్ది  నా మనసంతా జరీగా అల్లిన  ఈ  లేఖావస్త్రం  నువ్వు  మదికి హత్తుకుంటే నాకు ఎంతటి పరవశమో మాటలు రావటంలేదు.

ఇంతకూ ఇది ప్రణయ లేఖనో… నా మది ప్రణవ నాదమో నీకంటే వేరే ఎవరికి తెలుస్తుంది?

ఇట్లు,

నీ

నేను0 comments:

Post a Comment