Monday, 1 June 2015

ఆ కొన్ని...

అద్దాలన్నీ కొత్తముఖాలని 
పరిచయించటం మొదలు పెట్టేసాక 
పాతముఖాల ఆచూకి కోసం
చరిత్ర శకలాలని శోధించే వారికి 
చెక్కిళ్ళపై పారే చీకటి కాలువలే 
కొంగ్రొత్త మార్గాలవుతుంటే 
ఏ పగటిని చూసినా 
నల్లటి రాత్రుళ్ళనే వర్షించుకునేవారే 
ఎక్కువైన లోకంలో 
మెరుపుల్లో మునకలేసే 
ముఖాలు కొన్ని కావాలి 
వెలుగు అడుగిడే కాస్త చోటుకోసం 

నవనాగరికత కాలుష్యంలో
నిలకడలేని ఆశల అలికిళ్ళతో   
తమ అస్తిత్వం అదృశ్యమై 
తామసకోరికలే సదృశ్యమై 
మనసులు చిట్లిపోయిన 
మనుషులకి మాట్లువేసే 
మానవత్వపు లేపనమై 
మాటలు కొన్ని రాలాలి 
పేరాశలన్నీ శిశిరాలై 
చరిత పుటల్లో ఒదగడానికి  
జీవితాలు వసంతించటం 
మళ్ళీ మొదలవ్వడానికి

కళ్ళఅంచులలో తారాడుతున్న 
కలలన్నిటినీ కావలించుకోవటమే కాదు 
నెత్తురు ఉరకెత్తిన దేహాల పరిశ్రమతో  
తడి ముత్యాలుగా వీస్తున్న స్వేద పరిమళంతో 
వాస్తవంగా మలచుకోవటం మొదలు పెట్టాలి 
విజయ పతాకపై జీవితం రెపరెపలాడటానికి 2 comments:

మానవత్వపు లేపనమై
మాటలు కొన్ని రాలాలి
పేరాశలన్నీ శిశిరాలై
చరిత పుటల్లో ఒదగడానికి ...నిజమే

Post a Comment