Sunday, 12 July 2015

రహస్య కాసారం

ఏయ్ మనసూ…

కాసేపేవన్నా ముచ్చట్లు చెప్పవోయ్. అరక్షణంలో అన్ని లోకాలు చుట్టి వచ్చేస్తావ్ గానీ నీ సాటి మనసు లిపి చదవటమే రాని నిరక్షరాస్యత కదా నీది.  

అంతెందుకోయ్ లోపల ఉండి కోతల రాయుడులా కోతలెన్నో కోస్తుంటావ్ గానీ బహిరంగాన్ని మాత్రం లోకం బాటలోనే నడిపించేస్తూ ఉంటావ్… ఎంత మాయలాడివో నువ్వు…

అవునూ… క్షణంలో అనంతాన్ని అద్దేసుకుని మోతమోసుకుంటూ తిరుగుతూ ఉంటావ్ కదా… ఏనాడూ బడలిక రాదా నీకు? ఎప్పటికప్పుడు కొంగ్రొత్త భావరహదారుల్లో పరుగిడుతూ ఏ జాడల కోసం వెదుకుతూ  ఉంటావ్? 

ఏమిటేమిటో మాయలు చెయ్యాలని చూస్తుంటావ్… నీకు మాత్రమే  మాయలు వస్తే సరి పోతుందా… నువ్వు వసించే దేహానికీ వచ్చి ఉండాలి కదా… మీ ఇద్దరి మధ్యా సమన్వయం కుదరకుంటే తన్నులన్నీ తనువుకి నువ్వు మాత్రం ఎక్కడ ఉంటావో తెలియని చోట బహు భద్రం. భలే కిలాడీలే నువ్వు.   నువ్వు  మొరాయించినప్పుడల్లా మనిషి అస్తిత్వం మారి పిచ్చోడుగా గుర్తింపు వచ్చేలా చేసేస్తావ్… ఇంతటి కర్కోటకత్వం దాగుందా నీలో అనిపించేలా…

అసలెక్కడోయ్ నీ తావు. నిన్ను ఆవరించుకున్న దేహానికీ తెలియని రహస్యమే కదోయ్ నువ్వు... అసలెప్పుడైనా విశ్రాంతి తీసుకుంటావా నువ్వు… అలసిన దేహం నిద్ర పోతున్న వేళ నువ్వు మాత్రం స్వప్న సంచారివవుతావ్. నువ్వు తిరిగొచ్చే లోకాలని కొద్ది కొద్దిగా కలలుగా  కళ్ళకి పరిచయిస్తావ్ చూడూ అప్పుడు మాత్రం నువ్వంటే భలే ఇష్టం పుట్టుకొస్తుంది తెలుసా ?

భౌతికమైన పంజరాలకి… బంధాలకీ  అతీతమై తనువులొక పరిలో ఉంటే నువ్వింకో పరమై ఉంటావ్. ఏ లక్ష్మణ గీతల సరిహద్దు లెక్కలూ నీకడ్డురావు కదూ...

గుండెకో గొంతుక నువ్వు మంద్రంగా స్వరిస్తూ
కంటికో ఆర్ద్రత నువ్వు  తడి తడిగా కదలాడుతూ 
నడకకో ఇంధనం నువ్వు గమ్యాన్ని నిర్దేశిస్తూ
మనిషికో  వేదం నువ్వు  మాయగా తనని కమ్మేస్తూ

జీవితపు ప్రతి మలుపులో మనిషితో ఎన్నెన్ని మజిలీలు చేయిస్తూ ఉంటావో... ఎన్ని రణతంత్రాలు రచిస్తూ ఉంటావో అన్ని ఆహ్లాదాలనీ అద్దుతూ ఉంటావ్. ఎంత వైవిధ్యమీ గమనం. ఎన్నెన్ని తలపులని ప్రవహిస్తూ ఉంటావో ఎప్పటికప్పుడు కొత్తగా నన్ను సేద తీర్చాలని తపన పడుతూ… 

నువ్వో రహస్య కాసారం... 

అంతులేని ఆలోచనలనీ, అనుభూతులనీ  ఏ లోతుల్లో దాచి ఉంచుతావోగానీ అనుకున్నప్పుడల్లా వాటిని తీరానికి విసిరేస్తూ ఉంటావ్. నీ అంత వేగంగా స్పందించే శక్తి  దేహానికీ ఉండి ఉంటే మనిషికీ తనకీ  తేడా ఉండదనుకున్నాడేమో దేవుడు… నిన్నొకలా... దేహాన్ని మరోలా…  ఎంత కోరుకున్నా  ఎప్పుడోగానీ  సమన్వయం సాధించలేనంత చిత్రంగా భలే  మలిచాడులే... 

ఏకాంతం నీకెంతటి నేస్తమో నాకు తెలుసోయ్… ఏకాంతం అంటే నీదైన విశ్వం కదూ… ఎన్ని ఊహా ప్రపంచాలు నీ ముందు సాగిల పడిఉంటాయో ఆ కొద్ది క్షణాలలో... తలచుకుంటుంటే నాకెంతటి అసూయో. శూన్యమొకటి ఆవరించిన క్షణాన నువ్వు గ్రహణం పట్టినట్లుగా మాయమై పోతావు. ఏ కృష్ణ బిలంలోకి జారి పడిపోతావో ఆ సమయాలలో...  

ఏయ్… ఒక్క సారి నీ రూపు చూడాలని ఉందోయ్… ఆగాగు…భయపడకు... రూపం  లేని నిన్ను నువ్వెలా చూపించుకోవాలని కంగారు పడకు… నీ ఉన్నతత్వం మొత్తం పోతపోసి మలచిన  మనిషిగా కనిపించినా చాలులే నిన్ను చూసినంతగా సంబరపడతా… 

అలా కన్పిస్తావు కదూ… 

అలాంటి మనిషిని నాకు వరమిస్తావు కదూ… నేను తన పరమైపోతా…!


మనిషి 1 comments:

మీ భావాలు బహు సున్నితం.

Post a Comment