Saturday, 12 September 2015

సీతాకోక చిలుక

ఏయ్… చిలుకా…

ఏమిటీ కొత్త పిలుపూ అనుకోకు... ముందుగా నీకు చెప్పలేదుగా 

పిలుపులకి పలుకని మైకంలో నన్ను నెట్టేసాక నాలోని పలుకువే నువ్వయ్యాక నేనెలా పిలిస్తేనేం నువ్వెలా పిలిస్తేనేం?  

జత ఊపిర్లూ ఏకమయిన వేళ 
వెన్నెల చినుకులు గిలిగింతలు పెడుతుంటే 
దేహాల నర్తనల్లో  మల్లెల పొగరంతా కమిలిపోతుంటే 
లేలేత తమలపాకుల పక్క  చెదిరిపోతూ 
ఎగసి పడే శ్వాసలకి 
ప్రేమొక ఇంధనమై ప్రజ్వలించదూ…

మన నిశ్వాసలే ప్రకృతి పీల్చే ఏకాంతపు గాలిగా లోకాన్ని కలియతిరుగుతుంటే ఊపిరి తోటలన్నీ అలలు అలలుగా కాపుకొస్తున్నాయ్. హరిత పత్రాల చిలక నవ్వులలో రాలిపడ్డ వసంతపు మువ్వలని పెదవులపై పలికిస్తూ అయిదున్నరడుగుల మల్లెపువ్వువై నువ్వు నరాల నెగడుని పరిమళిస్తుంటే కలిగే ఆనందం కన్నా స్వాంత సరోజాలపై నువ్వు లిఖించే చెలిమి సుగంధమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. 

నిశబ్ద శబ్దంలో తెరలు తెరలుగా వినవస్తున్న అంతరంగశృతులని ఒకే రాగంగా పలికిస్తూ ప్రపంచానికి అంతు పట్టని ప్రహేళికలమవ్వనీ... మనది కాని లోకమంటూ కానరాని చోట చెలిమినే చిరునామా చేసుకుని విస్తరించేద్దాం. 

ఒకే తల్లిదనం...ఒకే  తండ్రితనం… లోకమంతా విస్తరిస్తే ప్రపంచమంతా ఒకే స్వార్ధమై అవిశ్రాంతపు ఆనందం మొదలైన చోట పరిమళించే కుసుమాలుగా శాశ్వతమైతే మనమున్నంత సేపూ కాలపు ప్రతి మెతుకు మీదా  మన పేరే రాసుంటుందని పందెం వేద్దాం… కాలాన్ని మనమే కట్టేసుకున్నాంగా మరి. 

నువ్వూ నేనూ...  జీవితం పొడుగూతా పయనమై సాగుతున్న దేవ సుమాలం కదూ… అనుమానం ఎందుకుట?  నిన్ను నేను... నన్ను నీవు ఆఘ్రాణించినప్పుడల్లా మనకి తెలియటం లేదూ… ఒకరికొకరం మైకం కమ్మే పరిమళాలమని… 

నిజంరా మనం ఎప్పటి కప్పుడు కొత్తగా అల్లుకుపోయే అతి దగ్గరితనాలం… జంట అనంతాలం…

పుట్టినప్పుడు నా  కళ్ళల్లో మొదలైన కాలం నీ సన్నిధిలో ఆదమరచి నిదరోతుందని నీకు తెలియని సంగతా ఏంటి? 

నా మదికందని నీ ఎదభావాలంటూ ఏమీ ఉండవు కానీ నువ్వు చెప్తుంటే అలలు అలలుగా కదలాడే నీ అధర థిల్లానా అలా అలా చూడాలనిపించదూ…

అప్పుడప్పుడూ మనసులు  మౌనవిస్తాయి చూడూ… అ క్షణంలో మన మధ్యన వెలసిన యవనిక, కొన్ని అపరిచితాల్ని పరిచయం చేస్తున్నప్పుడు భలే మురిసిపోయి ఉంటుందేమో మన మధ్య తన ఉనికి శాశ్వతమని. ఎంత పిచ్చిదో కదూ…? 

అసలు మనం మౌనవించేదే ఒకరిలో ఒకరం లయించటానికి అని దానికెప్పుడూ అర్ధం కాదు. ప్రతి నిశ్శబ్దంలో ప్రేమ పాతర ఒకటి పెక్కుటిల్లి మనల్ని మరింతగా తనలో మమేకం చేసుకుంటుంది. 

ఎక్కడెక్కడి సందిగ్ధాలూ జీవితాన్ని అయోమయం చేస్తున్న చోట మౌనాలు కొన్ని పేలాలి… మాటలు కొన్ని కలవాలి. 

గొంగళి పురుగై బతుకు ఈడ్చటం నేర్చుకుంటేనే జీవితం సీతాకోకచిలుకై లోకాన్ని పలకరిస్తుంది. 

ప్రతి కష్టాన్ని ఇష్టంగా మార్చగలిగే మహత్తరమంత్రమై ప్రేమ ఉన్నప్పుడు ఏ బతుకులోనూ చేజారిన స్వప్నాలుండవు

లోకంలో కన్నీటి చూర్ణాల తడి స్పర్శలుండవు

ఆపై లోకమంతా స్ఫూర్తివంతమైన రంగురంగుల సీతాకోక చిలుకలే…!   

నీ

గోరింక0 comments:

Post a Comment