Sunday, 29 November 2015

మొదలౌదామా మళ్ళీ .. తడిగీతల్ని చెరిపేస్తూ

హాయ్ రా…

ఖాళీ దొరికినప్పుడల్లా నీతో మాట్లాడాలనిపిస్తుంది. నిజానికి అది అబద్ధం. ఖాళీ చేసుకుని మరీ నీతో మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ మాట్లాడటానికి  నువ్వు దొరకవు కదా.  అందుకే నిన్ను ఆలోచిస్తూ , నన్ను గమనించుకుంటూ ఒక కొత్త చదువు మొదలు పెట్టేశా...

చదువేమిటంటావా…?  

ఒకటి చెప్పు... మనసుతో నన్ను ఎప్పుడైనా చదివావా? పోనీ నిన్ను ఎప్పుడైనా చదువుకున్నావా? నిజానికి మనం మొదలు పెట్టని  సిలబస్ మనలోనే ఎంత ఉందో చూడు. మనల్ని మనం చదువుకోవటం అంటే ఏదో ఏకాంతపు  ఆలోచనలగా  కాదురా…ఎడతగని  అన్వేషణగా సాగాలి.   ఆలోచనల మధ్య అగాధాలు తడుముతూ ఉంటాయ్. ఆలోచనకూ ఆలోచనకూ మధ్య అనంతమైన ఆ అగాధాల్లోకి  జారిపోతుంటే,  అసలంటూ ఎన్నిసార్లు మళ్ళీ మొదలు పెట్టాలిరా జీవితాన్ని? మొదలు పెట్టినప్పుడల్లా పసి రెక్కలు కొన్ని కట్టుకుని... తడి గీతలు కొన్ని చెరుపుకుని… ఆ కాసేపూ మాత్రం ఎంత బాగుంటుందో...  

అనుమతి తీసుకోకుండా ఎన్నెన్నో ఆలోచనలు వాటికై అవి వచ్చేస్తూంటే  ఆనకట్ట కట్టటానికి సేకరించాల్సిందేమిటో కూడా నాకు తెలియరావటం లేదే. నడకని బట్టి, సమయాన్ని బట్టి కదలాడే నీడలు నిలువెల్లా పక్క మీద వాలిపోయాక ఏమైపోతాయిరా? అప్పుడే నాక్కొంచం నీడ కావాలని అనిపిస్తూ ఉంటుంది. నాదైన నీడ నీ రూపమేసుకుని నాలో కరిగిపోతున్న సవ్వడిని ప్రతి చీకటిలో నాలోకి అనువదించుకుంటూనే ఉంటాను. బహుశా నా శూన్యాన్ని చిధ్రం చేసే మౌన మంత్రదండం అదేనేమో.  

మనిషిగా నేను అబద్ధం అయిన చోట నేను నడిచే నడకలన్నీ ప్రకృతికి భారం అన్న నిజం నాకసలు తెలియనే తెలియదు. నిర్జీవం అంటే జీవం లేకపోవటమే అని ఇప్పటివరకూ  తెలిసిన నాకు పరిపూర్ణంగా శూన్యం ఆక్రమించుకోవటమూ నిర్జీవమే అని కొత్తగా తెలుస్తుంది.  

అసలెందుకురా మనసు భారమైనప్పుడే  అక్షరాలు అలవోకగా అసిధారావ్రతం చేస్తాయి? వాటి అసిధారావ్రతం ఏమో కానీ నాకెప్పుడూ  అర్ధం కాదు అవి సేద తీర్చుతున్నాయా… తడి పెంచుతున్నాయా? అనాధనేమో అనుకుందామనుకుంటే, కాదని రుజువు చేస్తూ నా నిండా పరచుకున్న నువ్వు. ఒక్కడినే ఉన్నప్పుడు కూడా మనసంతా కదలాడుతూ ఒకరుండటం ఎంత మాత్రమూ అనాధత్వం కాదు కదూ. ఇంటినిండా సందడి పరుచుకున్నపుడు కూడా ఒక ఊరట కోసం ఒకానొక  తపన మనల్ని నిలబడనీయకుండా నిలదీస్తుంది చూడూ… అప్పుడు ఆలోచించాలనుకుంటా అనాధత్వం గురించి. 

శూన్యం తడిమిన ప్రతి మారూ , మౌనం గుచ్చుకున్న ప్రతిసారీ  నొప్పి తెలియాలంటే మనసులో కాస్తంత సున్నితత్వం మిగిలుండాలేమో. కానీ అన్ని సున్నితత్వాలు నిశ్శబ్దంగా నిష్క్రమించేసాక తానొక  అనాధ అయ్యిందన్న  నిజం మనసుకి తట్టడానికీ అవకాశం లేదు కదూ. 

వంటికి పెరిగే  వసతుల్ని చూసి మురిసిపోతున్నాం కానీ, మనసు ఆరోగ్యం  కోసం మనమేం చెయ్యాలో వదిలేసి శతాబ్దాలు దాటిపోయింది.  నన్నడిగితే మనిషి మనిషిలో ఒక మాయలేడి జాడలు ఉంటే బాగుండనిపిస్తుంది. దానికోసం పరుగులెత్తే మైకంలో విలువైన దాన్ని ఒకటి కోల్పోతే… ఆ కోల్పోయిన దానికోసం మొదలు పెట్టే తీవ్రమైన అన్వేషణలో మనకి మనం దొరకటం, మనల్ని మనం వెలికి తెచ్చుకోవటం ఎంత మాత్రమూ అసాధ్యం కాదు. 

ఒక్క సారి నేనెవరన్న ప్రశ్న మొదలయ్యాక ఎవరోయ్ మనల్ని ఆపగలిగేది. మన మంచి చెడులు మన విచక్షణగా సాగటం  మొదలయ్యేది ఆ తరువాతే కదా. నీకో నిజం చెప్పనా నిన్ను అర్ధం చేసుకునే పరంపరలో నన్ను నేను తెలుసుకోగలుగుతున్నాను. అలా తెలుసుకోవటం మొదలు పెట్టాకేరా తెలిసింది ప్రకృతి లోపలా బయటా మనకోసం ఎన్నో పాఠాల్ని సిద్ధం చేసే ఉందని. ప్రాణం ఉన్న జీవి అవ్వనీ, ప్రాణం లేని పదార్ధమవ్వనీ కాదేదీ జీవన సూత్రమొక్కటి నేర్పడానికి అనర్హమని. 

ప్రపంచాన్ని చదువుతున్నంత సేపూ నేను తప్ప అందరూ బాగున్నారనే భావం నన్నెప్పుడూ నిలబడనీయలేదు. కంటి మీదకి రెప్పని వాల్చుకోవటానికీ విశ్వ ప్రయత్నమే చెయ్యాల్సి వచ్చేది. నిజంరా ఎక్కడికక్కడ కంచెలు కట్టుకున్న మనుషుల మధ్యలో, స్వార్ధం లెక్కల తకరారులో అన్నీ పరుగు పందాలే?  కాకపోతే  ఓడిన వాడికీ గెలిచినవాడికీ దక్కేది ఎప్పుడూ ఒక్కటే… మరో  పందెం… ఇంకో పందెం... అంతం లేనిది మాత్రం  పరుగుకే.

మొదలు పెట్టాక ఆపటం తెలియక పోతే జీవితం ఎప్పటికీ సంతృప్తి నివ్వదు కదూ… ఇప్పుడు నాకో సంతృప్తి కావాలి. అది నాదైన నా జీవితంలో దొరకాలి.  మరి నువ్వెప్పుడూ  నా సంతృప్తివే… ఇప్పుడు నీతో పాటు నాకు నేను కూడా సంతృప్తిగా మారిపోయాను. 

అయినా ఏమిటోరా ఈ మధ్య ఏది రాద్దాం అని మొదలు పెట్టినా  మనసుకేసే లాగేస్తుంది. ఎందుకంటావ్? ఏవైనా లౌకిక సూత్రాల మర్మం ఉందంటావా? కోల్పోయిన దాన్ని తిరిగిపొందాలన్న ఆకాంక్ష మొగ్గ తొడిగిందంటావా… నా పిచ్చి గానీ నీకు తెలిసినా నువ్వు చెప్తావా ఏం… ‘వాడి తిప్పలు వాడిని పడనివ్వు… కాస్త జీవితంలో నిలబడాలిగా’ అనేసుకుంటూ ఉంటావ్ కదూ… 

చివరగా ఒక్కటైతే చెప్పగలనురా… 

ఇకపై నన్ను తాకేది  కష్టమైనా సుఖమైనా, వేదనైనా వేడుకైనా …అది  ఎలాంటిదైనా సరే ఒకేలా  అనుభూతించ గలను ఎందుకంటే నా అంతరాలలో అనుభూతుల మధ్య ఉన్న కంచెలన్నిటినీ తొలగించుకున్న మనసుని నా  జీవితం లోకి అనువదించేసుకున్నాను కనుక. 

నీ

నేను 
0 comments:

Post a Comment