Saturday, 19 December 2015

కాసిని నవ్వుల కోసమే


ఏరా…

ఎందుకురా ఎప్పటికప్పుడు అంత కల్లోల పడిపోతూ ఉంటావ్? ఏవోవో విశ్లేషణ చేసుకుంటూ జీవితాన్ని మరింత సంక్లిష్టం చేసుకుంటూ…! ఎందుకిలా? తిండీ నిద్రా మానేస్తే సమస్యలు తీరిపోతాయి అనుకుంటే లోకంలో ఆకలి ఏమై పోవాలి? వేదనల వడిలో కాలాన్ని కొనసాగించటమే నిత్యకృత్యంగా మార్చుకోవటం ఎంత వరకూ సమంజసం?    వత్సరంలో ఆరు ఋతువులు ఎంత సహజమో జీవితంలో అన్ని పార్శ్వాలూ సహజాతి సహజం.

తరచి చూడు…  బయట ఎంత లోకముందో… లోపల అంతకు మించి ఉంటుంది. ఇది నీకు తెలియని సంగతి కాదు అనుకో… మనలో చాలా మందికి పుస్తకాలు చదవటం చాలా ఇష్టం రా. అందులో మనసుకు పట్టేసేవీ కొన్ని ఉంటాయ్… కానీ మనసుకు పట్టినవన్నీ ఆచరించటానికి ఆసక్తి పుట్టదు. ఎందుకంటే మన ఆసక్తి అనేది  విషయాలని మనసులోకి డంప్ చెయ్యటం వరకే. దాన్ని దాటి ముందుకు వెళ్ళటానికి మనకి సమయమూ అనుకూలించదూ… సమాజమూ సహకరించదు.  సమాజాన్ని దాటి ముందుకు నడవటం మనకెప్పుడూ భయమే.

కనీసం సమాజాన్ని పక్కన పెట్టి లోపలి నడిచి చూస్తే… మనకి మనమే కొత్తగా… కొత్తగా ఒక అపరిచితం అప్పుడే పరిచితం అయినట్లుగా… అసలు మనం ఎలా ఉండగలమో  అలా లేము. ఏమి చెయ్యగలమో అదీ చెయ్యం. ఎందుకంటే మనమంతా సమాజపు అచ్చులలో పోతపోయబడ్డ మూస పాత్రలం.

ప్రపంచం  కొత్తగా అర్ధం అవుతుంటే ఏమిటో అనుకున్నా,  లోపలి లోకాన్ని చూడటం మొదలు పెట్టాకే ఈ మార్పుఅని తెలుస్తుంది.  నిజమేరా  అదో కొత్త లోకం, మనమేంటో మనకి అర్ధమయ్యే లోకం. అంతరంగాన అనంత ప్రస్థానం మొదలెట్టిన వాడికి ఒక్కొక్క చీకటి తెరా వీడి పోతూ తిమిరం మొత్తాన్ని ఖాళీచేస్తూ  ఉన్నప్పుడు తెలియ వస్తుంది నిజమైన ఆనందం ఎక్కడ ఉందో.

బయటి మనుషుల కోసం మనం వేసుకున్న ముసుగు నెమ్మదిగా  అంతరంగాన్ని మసక బారుస్తుంటే ఆనందం  ఒక భ్రమలా తోచటంలో వింతేమీ లేదు కదూ.  మనల్ని మనం తెలుసుకోలేని చోట ఆనందంలో  శాశ్వతత్వం ఆశించటం ఎంతటి అవివేకం?  

తడబడే అడుగులైతేనేం, నడకంటూ మొదలెడితే ఎక్కడెక్కడి కాంతి రేణువులూ ఆకర్షితమై లోనున్న అంధకారాన్ని వికర్షిస్తూ మది చుట్టూ ఓ కాంతి వలయాన్ని పోతపొయ్యటం మన గ్రహింపుకి రాకపోతేనేం, ఒక స్వచ్ఛత తొలకరించటం మొదలయ్యింది కదా.  లోలోని స్వరాల చుట్టూ అల్లుకు పోయిన చీకటి కదలికలు నెమ్మదిగా నిష్క్రమించే సవ్వడి చిరు గేయమై స్వరిస్తుంటే మనసుకెంత   తాదాత్మ్యతో కదా…

మనం మొదటినుండీ ఆశపడేది,  గమ్యంగా పెట్టుకున్నదీ ఆనందాన్నే కదా… మరి జీవితంలో ఏ మజిలీలో దాన్ని అందుకుంటున్నామో  చెప్పగలమా? కష్టం కదూ… ఎప్పటికప్పుడు తాత్కాలికంగా మనసుకు కలిగే ఊరటనే ఆనందం అనుకునేటంత అల్ప సంతోషులుగా జీవనవిధానం కొనసాగించేసుకుంటున్న ప్రాణయంత్రాలం.

మనకి మనమే కిరణమాలులం. మన శోధనే మనకి ప్రభాతం. మనకి మనం తప్ప వేరే ప్రతీక లెందుకు. అంతరంగ శోధనలో మొదట దొరికే నిధి మనకి మనం. నిజం… మూల మూలలా నిబిడీకృతమైన చిన్న చిన్న  కాంతి బిందువులు అన్నీ ఒక్క చోటకి చేరుతూ ఒక కాంతి మండలాన్నే సృష్టించటం స్పష్టంగా గోచరిస్తుంది. అది చాలదూ చిన్ని గుండెని గువ్వలా స్పృశింటానికి?  

నిజంగా మనం మొదలవ్వాలే గానీ అదొక అద్భుత ప్రపంచమే కదా… అక్కడ మనమే అన్నీ…అక్కడ  అరవైనాలుగు కళలూ మన స్వంతమే. సంగీతమో, సాహిత్యమో, పోరాటమో, ఆరాటమో… ఏదైతేనేం అన్నీ మన సృష్టి. వాద ప్రతివాదాలు అన్నీమనకి మనమే… వీటన్నిటినీ దాటి స్వచ్ఛంగా బయటకి వచ్చేది  ఏదీ మనల్ని  నిరాశ పరచదు. బహుశా మనల్ని బహిరంగ వాదాలకీ పురికొల్పదేమో కూడా… ఎందుకంటే అప్పటికే మనం అలౌకికులం కాబట్టి.

అలౌకికత అంటూ ఒకటి మొదలయ్యాక మృత్యువూ మనకొక భృత్యుడే గానీ మరొకటి కాదు. మృతమూ అమృతమూ అల్పవిషయాలుగా తోచే తేలిక పాటి ప్రశాంతత అక్కడ గాక వేరెక్కడా సాధ్యం కాదేమోరా...అన్ని భారాలూ తేలిక అవ్వాలనుకోవటంకన్నా… అన్నీ భారాలనీ తేలిక చేసుకోవటం ఎంత సులువో కదూ… నమ్మవా ఏం? ఒక్కసారి మనసు మీద నమ్మకం ఉంచి చూడు.  ఎలాంటి భారాన్నైనా ఎంత తేలిక చెయ్యగలదో… దానికోసం నువ్వు చెయ్యవలసింది ఒక్కటే…  మరేం లేదు రా... దాన్ని నువ్వు పట్టించుకోవటమే. తరువాత చూడు అది చేసే అద్భుతాలని.

పరులకి సాయం చెయ్యాలంటే గొప్పగా కష్టపడాల్సిన పనేమీ లేదు. ఎవరికీ వారు వారిని  సంస్కరించుకుంటే చాలు. అదే మనిషికి మనిషి చేసే గొప్ప సాయం. ఆ సంస్కారంలో నుండే అన్ని మంచితనాలూ లోకానికి పరిచయం అవుతాయి.

మనకెన్ని నవ్వులు రానీ అవి కాసేపే, ఎన్ని బాధలు రానీ అవీ కాసేపే, కాలానికి ఎదురు నిలిచేవేలేవు. అందరూ అంటూ ఉంటారు కదా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే అని.. అదే నిజం. అన్ని దారులదీ ఒకటే  గమ్యం.  ఇదే సత్యాన్ని అన్ని చోట్లా అన్వయించి చూడు.

కాసిని నవ్వుల కోసమే, జీవితాన్ని పరుగులు తీయిస్తాము కానీ ఆ నవ్వులు ఎక్కడ దొరుకుతాయో ఎప్పటికీ తెలుసుకోలేం. ఎందుకంటే  పరిగెత్తే తాపత్రయంలో అసలు పరుగు ఎందుకు మొదలు పెట్టామో మర్చి పోయాం(పోతాం)  కనుక. నిజానికి ఆ కొన్ని స్వచ్ఛమైన నవ్వులకోసం ఎంతగా తపిస్తాం. ఎంత  ఆరాటపడతాం?  దేనికోసం మొదలయ్యామో అది మరపుకొచ్చేసాక  , ఆఖరు క్షణాలలో జాగృతి వచ్చి ఏమి ప్రయోజనం?  

ఆ కొన్ని నవ్వుల రహస్యం మనమేనని తెలుసుకునేది ఎప్పుడోయ్…మనలో తృష్ణ మొదలవ్వాలి...  అంతఃశోధనవైపుగా అది పరుగులు తీయించాలి. ఒకసారి  అది మొదలయ్యిందా ఇక మనకి మనమే  ఒక కొత్త ప్రపంచం. అటుపై బాహ్య ప్రపంచమూ ఆనందమయం...

తరచి చూస్తే  అన్ని శాశ్వతాలూ అశాశ్వతమే… అన్ని అశాశ్వతాలూ  శాశ్వతమే.

అదేమిటో కానీ ఇంతకన్నా మరో నిజం తలపుకు రావటం లేదేమిటో.

రా మరి… ప్రయాణం మొదలు పెడదాం

నీ,


స్నేహితుడు

0 comments:

Post a Comment