మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Friday, 27 May 2016

నటనంఏడవాలని ఉందనగానే ఏడవమన్నావ్
నవ్వాలని ఉందంటే నవ్వుకోమన్నావ్
ఏదనిపిస్తే అదే చెయ్యమన్నావ్
గమనాలన్నీ స్వయం సంవేదనలతో పాటుగా సాగాలన్నావ్
అక్కడే ఆనందం దొరుకుతుంది అన్నావ్

లోకాల నిషిద్ధతలని దాటి ఈ ఉవాచలేమిటంటూ
నవ్వుకున్నానప్పుడు పిచ్చిగా... వెర్రిగా...
ఒక అమూల్యాన్ని అసహజమని నెట్టివేస్తూ

ఇప్పుడు
నాలో చిన్నగా మొదలైన అలికిడి ఒకటి
నాకు నేనేమిటో తెలియనితనపు సడిచేస్తూ
రెండు నేనులుగా చీలుపోతున్న
ప్రతి సందర్భాన్నీ ఎత్తి చూపుతూ
నేనొక నటనాలయంగా మారిపోయిన
చప్పుడుని విప్పి చెప్తుంది

అయినా,
ఇక ఈ క్షణక్షణపు నటనలెంత భారమో తెలిసి ఏమి ప్రయోజనం
ఎందుకంటే, మరి ఇప్పుడీ రంగస్థలం
నన్ను కిందకి దిగనివ్వటం లేదు
నటన మొదలెట్టాక స్వంత వ్యక్తిత్వం కూడదంటూ

Monday, 16 May 2016

హేమంత స్పర్శ - 17రేయ్ ఆత్మైషీ, 

ఏమి చేస్తున్నావురా…? ఏమయ్యిందోయ్… సాంధ్యవర్ణం కాటుకద్దుకుని రెండుగంటలు దాటినా నీ పలుకింకా విన రాలేదేం… సరేలే...  నువ్వు పలుకరించే లోగా మన  ఉదయంలోకి  వెళ్లి వస్తానేం...

‘చాలా వేడిగా ఉంది రా ఇక్కడ’ అని నువ్వన్నప్పుడల్లా నీ చుట్టూ  చలువ గదిలా పరచుకునే విద్య నాకు వచ్చి  ఉంటే ఎంత బాగుండో కదా అనిపించటం లో పెద్ద విశేషం ఏమీ లేదు నీ చుట్టూ చలచల్లగా విస్తరించి పోవాలనే  మెత్తని స్వార్ధం తప్ప. 

‘ఏం చేస్తున్నావ్ రా’ అని నువ్వు అడిగేడప్పుడు తెలియదూ నే ఖాళీగా ఉన్న ప్రతి క్షణమూ మన క్షణాలని పట్టుకుని తిరుగుతూ ఉంటానని ! నీకు తెలుసు… అయినా అలా అడగటం నీకిష్టం… నిన్నలా  వినడం నాకిష్టం.  

‘నువ్వలా ఉంటే నాకు బెంగగా ఉంటుందిరా’ అంటావ్… మరి బెంగ ఉండేది నీకొక్కదానికేనారా? నాకు ఉండదాా… నాకు ప్రాణమైన మనిషి తనని తాను నిర్లక్ష్యం చేసుకుంటుంటే మరి నాకెలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించు. ఇకపై ఎవరి మీద అలకతోనో నిన్ను నువ్వు బాధ పెట్టుకోవటం ఎప్పుడూ చెయ్యవు కదూ.  ఇలా అడిగితే ‘సరేరా' అంటావ్. మళ్ళీ నీ ధోరణి నీదే. 

అయినా ఏం పిల్లవో ఏమో… ఊర్లు పట్టుకుని తిరుగుతున్నప్పుడు ఆరోగ్యం ఎలా చూసుకోవాలో నీకు తెలియదూ…అయిపోయిందేదో అయిపోయింది ఇప్పుడు చెప్తున్నా గుర్తుంచుకో.  అది నీ ఆరోగ్యం కాదోయ్. నాది… అవును అది అచ్చంగా నాది. మరి దాన్ని ఎలా చూసుకోవాలో  నాకన్నా  నీకే బాగా తెలుసు కదా…!

అదిగో అలగకలా… అల్లిబిల్లి అలకల్లో నీ బుంగమూతి ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటే మళ్ళీ మళ్ళీ నిన్ను ఉడికించాలనిపిస్తుంది. అప్పుడేమో ‘నేనేడుస్తా’ అంటావ్. నాకసలు నచ్చని పదం రా అది. అదే నేను ఎప్పుడైనా ఒక  పెద్ద అలక పాన్పు చూసుకుని ఎక్కేద్దాం అనుకుంటానా… ఒక్క చిన్ని నవ్వుతో దాన్ని ఆచూకి మాయం చేసేస్తావ్. అలాంటప్పుడు నువ్వు మాయావివి కాక మరేమిటి?  ఉడుక్కోకలా. ప్రాణం పోసుకున్న బంగారానివిరా  నువ్వు ! 

ఎప్పటికప్పుడు  నిన్నొక వచనంగా రాసుకున్నాక, కాసేపలా నిన్ను చదువుకోవటం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ఏదో ‘రాసుకున్నాక’ అంటున్నాను కానీ నిజానికి నువ్వెప్పుడూ ముగియని వాక్యానివి… అక్షరం వెనుక అక్షరం… పదం జతగా పదం సంగతులు చెప్పుకుంటూ ఒక వాక్యంగా నిన్ను కొనసాగించటం తప్ప ముగింపుని మదిలోకి చేరనియ్యను. 

కాసేపలా ప్రపంచాన్ని వెలివేసుకున్నప్పుడు, నిన్ను రాసిన ప్రతి వాక్యమూ వాస్తవమై నన్ను ముప్పిరిగొన్నప్పుడు ప్రతి పదం చివరా నువ్వే వేళాడుతూ నీరెండ మెరుపువై నన్ను నీకు కట్టేసుకుంటావ్ చూడూ… అంతకన్నా ఇంకేం కావాలి రా జీవితం లో?

మొన్న  రాత్రి నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎంత వాన పడిందో… అప్పుడు  కుండపోతగా బయటే కురిసేస్తూ కూడా …ఒక్క చినుకూ నన్ను పలకరించలేదు… పైగా  నా వంట్లోని ఉన్న నీటినీ చెమటగా తను తాగేస్తూ ఎంత చిరాకు పెట్టేసిందో తెలుసా…! ఇదిగో ఇప్పుడేమో ఇలా నీకు ఉత్తరం రాస్తుంటే… కిటికీలోనుండి కొన్ని చిలిపి చినుకులు తడి గంటలు కొడుతూ దొంగచాటుగా నన్ను తడిపేస్తున్నాయ్… అది  నా మీద ఇష్టం కాదు సుమా …  నా అక్షరాల నిండా పరచుకుంటున్న నిన్ను తడమటానికి. చూడు మరి !  చినుకులకీ నువ్వంటే ఎంత మోహమో…

పాత చరణాలే  రాసుకుంటున్న  కొత్తపాటలో  ఆనందాన్ని ఆలపించటం అంటే శూన్యాన్ని మరింత దగ్గరగా హత్తుకుంటున్న భావన వస్తుంది తప్ప అరుదైన  ఆహ్లాదం పలకరించదు.  నువ్వూ  ఒప్పుకుంటావ్ కదూ.  మరి ఎప్పటికప్పుడు కొత్తగా నిన్ను శ్వాసించడం నాకూ… నాకు ఊపిరింతగా మారడం… ఒక ఆహ్లాదాన్ని  మన ఉచ్ఛ్వాసనిశ్వాసల సరాగంలో ఓలలాడించడం ఎంతటి మధురమో...

మనమై పోయిన ఆ రెండు ఆత్మైక్యాల లయ విన్యాసాలలో నువ్వూ… నేను… ఎవరమెక్కడో… ఎవరికెవరమో… నువ్వెవరో… నేనెవరో…అన్నీ మటుమాయం… అవన్నీ మిథ్య… ఇప్పుడున్నదంతా ‘మనం’.  నిన్ను నువ్వు, నన్ను నేను నిలుపుకుంటూ అచ్చంగా ఒకటైన ‘మనం’ 

బంగారూ… చివరగా ఒక్కటిరా… 

నా కళ్ళలోకి తిన్నగా ఒక్కసారి చూడు… 

‘అక్కడ పెనవేసుకుని ఉన్న తడి పొడి క్షణాలన్నీ నీ కోసం అలా కాపు కాసే ఉంటాయి… ఆ రెప్పల కలయిక శాశ్వతమయ్యేదాకా…’ 

ఇట్లు

నీ

ఆత్మైషి

Sunday, 15 May 2016

ప్రజఒక కులంగానో, ఒక మతంగానో, ఒక ప్రాంతంగానో తప్ప ఒక సమాజంగా మనమెప్పుడు ప్రవర్తించాం? చరిత్ర శిధిలాల్లో శోధించినా సమాధానం దొరకని సమస్య ఇది. సమాజం బాధ్యత ప్రభుత్వాలకి అంటగట్టేసి అసహానాల్ని మనసులో కట్టేసుకున్న మేధావులం మనం.

మన ఇంటి ఎదుట పందిళ్ళకి గుంజలు పాతటానికి కొత్త రోడ్డుమీద గోతులు తీసి రోడ్లు వెయ్యరని ప్రభుత్వాన్ని దుయ్యబట్టే మహాత్ములం. ఇంటిపక్కన ఖాళీస్థలాన్ని చెత్తకుప్పని చేసేసి మురుగు ఎక్కువయ్యిందని ప్రభుత్వాన్ని తిట్టుకునే మేధావులం. పొద్దున్న లేచిన దగ్గరినుండీ తప్పులన్నీ మనం చేసేస్తూ నెపాల్ని పరాయిల మీద వేసేస్తూ ఆవేశాలు తెచ్చేసుకునే

మనకి మన కులం ముఖ్యం
మతం ముఖ్యం
ప్రాంతం ముఖ్యం
మనకి మనం ముఖ్యం
సమాజం ఎప్పుడూ ముఖ్యం కాదు

ఇప్పుడు మనిషికి మనిషే సరిహద్దు

మనమెప్పుడూ చూడని మనవాళ్ళు విలువలంటూ చెప్పిన ప్రతిదీ ముఖ్యమే అనుకుంటాం కానీ కాలాన్ని బట్టి మార్చుకోవాల్సినవేవీ అన్న వివేచన మాత్రం తెచ్చుకోం. ఇలాంటి వాటిల్లో స్వంత ఆలోచనలు అంటూ ఎదగనివ్వం.

అసలు కులాన్ని బట్టో, మతాన్ని బట్టో , వృత్తిని బట్టో ఒక మనిషిని అంచనా వేసే కుహనా మేధావులు పెరిగిపోతున్న లోకంలో సామాన్యుల దారీ అదే అయినప్పుడు ప్రజ.. ప్రభుత...ప్రగతి... అన్నీ చిత్తభ్రమలే.

అధికారానికి ప్రజల మీద మమకారం ఎప్పుడూ ఉండదు. దానికి కులం, మతం, ప్రాంతం... దేన్నైనా సరే ఎప్పటికప్పుడు ఎలా అయినా దానికి అనుకూలంగా మార్చుకోగలదు. లేదంటే వాటికి అనుకూలంగా మారగలదు. మరి ప్రజ అలా మారగలదా? యుగాలుగా ఎవరెవరో పోతపోసిన భావజాలాల నడుమ కొట్టుకులాడటమే తనకు వచ్చిన విద్య. ప్రజలదంతా భావజాలాల బానిసత్వమే.

ఎవరికి వారు తమల్ని ప్రభావితం చేస్తున్న భావజాలాన్ని ఆత్మావలోకం చేసుకుని, దాని లోని మంచిని మాత్రమే స్వీకరించి చెడుని దునుమాడితే బానిసత్వాలూ, వ్యక్తిస్వామ్యాలూ... మానవత్వాలుగా మారి ఒక మెరుగైన సమాజంగా మనగలగడం గొప్ప విషయమేమీ కాదు కదా?

ఓ రోజు - ఒక బంధపు నడకతెలవారక ముందే తలుపుదగ్గర నిల్చుని
సుప్రభాత గీతం పాడిందామె
నిద్రాభంగమైందని కోపించాడతను

మధ్యాహ్నం వచ్చి కుశలమడిగిందామే
కార్యనిమగ్నుడై కాబోలు
చిరాకు పడి పొమ్మన్నాడు

చిరుదీపంతో వచ్చిందా సాయంత్రం
ఆతని గది ఖాళీగా వెక్కిరించిందామెని
బహుశా ఇది తన స్నేహితుల సమయమనుకుంటా

ఇప్పుడు అర్ధరాత్రి
పడకగదిలో ఎర్రెర్రని దీపం
అచ్చు ఆతని మోహంలా
ఇంకెంతసేపు… త్వరగా రమ్మని
ఆమెని పిలుస్తున్నాడతను
వచ్చి… యంత్రమయ్యిందామె

ఇంకెప్పుడూ తెలుసుకోలేడతను
ఆమెలో తను పలుచబడుతూ
శూన్యం మరింత చిక్కబడుతుందని


Thursday, 12 May 2016

మంత్రలిపి


రెప్పలపై పొడి గుర్తులుగా మిగిలిపోయిన
కొన్ని కలలని మననం చేసుకుంటూ
మరులపు జాడని విడిచాడో
అసలు మోయడమే మరచాడో మరి
ఎంత గాటు పెట్టినా
వర్షించని మేఘుణ్ణి చూస్తూ
నీలమద్దుకున్న నడకల తోడుగా
అలసిన శబ్దాలు కరిగిపోయిన తడిలో
పాత్రౌచిత్యాల విలువలని వల్లెవేస్తూ
గడచిపోయిన కథలు సడి చేస్తుంటే
ప్రకృతిని వెచ్చగా కప్పుకుంటూ
ఒక మౌనం శబ్దం చేస్తుంది

మెచ్చని పాతదనాలు
నచ్చని కొత్తదనాల నడుమ
ఎవరొదిలేసిన ఖాళీలోనో
అణువణువునా నేనై అర్రులు చాస్తున్నప్పుడల్లా
నీటిపువ్వులుగా విచ్చుకున్న సంగీతంలో
లోకమంతా నువ్వైన చప్పుడే వింటే
క్లిష్టమైన సమయాలు ఇష్టమవుతూ
ఆకాశమే ఒక నేస్తమనిపిస్తుంది

కొండకొనల సరిహద్దుల్లో ‘మన’ వ్యాకరణం నేర్చుకుంటూ
నీకూ నాకూ మధ్య ఓ సంపూర్ణ వచనమైన
ఈ ఒక్క ప్రయాణమూ చాలు
ఒక మంత్రలిపి రాస్తున్న నిశ్శబ్దం తోడుగా…!

Tuesday, 10 May 2016

ఈ కొన్నివలసపోతున్న శిశిరం
అల్లుకుంటున్న వాసంతం
కనురెప్పలు దాచిన చిత్రం
మాట నిద్రించిన సమయం
మౌనం పురివిప్పిన విన్యాసం
తెల్లకాగితమైన ప్రేమలేఖనం
చెప్పాల్సినవన్నీ అర్ధమైన నిశ్శబ్దం
నీలపు రేయిని దాటిన మానసం
నవ్వుని నిర్వచిస్తున్న పసితనం
దేహాల మీద ప్రవహిస్తున్న కాలం
ఎప్పటికప్పుడు కొత్తగా కురిసే మేఘం
కోరికని బయటేస్తూ రాలుతున్న నక్షత్రం
తోడై నడిచే పాదం
సమస్తమై విస్తరించిన నేస్తం
చాలివి... ఆర్ణవమవుతుంది ఆనందం
జీవమద్దుకుంటుంది జీవితం

పొడిచే పొద్దు - ఇది మన గురించేగుండెని తడి చేసే బాధలగాథలు సాహిత్యానికి వన్నె తెస్తాయేమో కానీ పరిష్కారాలని చూపించే అవకాశం చాలా తక్కువేమో అనిపిస్తుంది. ఒక బాధలోని గాఢతని మనకి చెపుతూనే దానికి తనదైన ఒక పరిష్కారాన్ని సూచించటం చదువరిలో ఒక ఆశావాద దృక్పథాన్ని పెంచుతుంది కదూ.

‘మనలోకి మనల్ని ఈడ్చుకొచ్చే అనుభవమొకటి ముందు భయపెడుతుందేమో కానీ, ఎక్కడికో అతిధిగా పయనం కట్టిన మెరుపుని మాత్రం మన మనసులోనే శాశ్వతంగా తాపడం చేస్తుంది.’

అనసూయ కన్నెగంటి గారు వివిధ పత్రికల్లో రాసిన కథానికల సంకలనంగా వచ్చిన ‘పొడిచే పొద్దు’ ని చదువుతుంటే నాకనిపించిన భావమిదే.

సమాజంలో మన చుట్టూ ఉన్న సామాన్యుల జీవితాల్లోని నిత్య వ్యధల పరిచయమే కాదు… ప్రతి సమస్యకూ వ్యధలని త్యజించే ఒక పరిష్కార మార్గం చూపిన విధానం, మనిషి మనిషిని చదివాల్సిన కొత్త కొత్త కోణాలని మనముందు పరిచినట్లుగా అనిపిస్తుంది.

ఈ సంకలనంలో 13 కథలు. దేనికదే ప్రత్యేకంగా ఉన్నాయి.

పొడిచే పొద్దు అనే పేరున్న ఈ పుస్తకంలో మొదటి కథ అదే పేరుతో మనల్ని పలకరిస్తుంది. ఒక బాల బడుగు జీవి రక్త సంబంధమైన అక్క ఆరోగ్యం కోసం తన ప్రస్థానం కొనసాగించిన తీరు… ఎవరో మూసేసిన దారి ఒక్కటే కాదు నడవటానికి… సంకల్పం ఉంటే కొత్త దారి…అదీ తన కోసమే వేసినట్లున్న దారి దొరుకుతుంది అన్న ఆశావాద దృక్పథం తో ఇచ్చిన ముగింపు ఒక కొత్త ధైర్యాన్ని ఇస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఒక మధ్యతరగతి, మరో బడుగు వర్గపు స్త్రీల వృత్తి జీవితాలపోలికతో ‘నిర్ణయం’ అన్న కథ. అంతరాల్లో తేడాలే కానీ బతుకుల్లో కాదు అన్నట్లున్న తమ తమ జీవితాలపై తమ భర్తల అదుపాజ్ఞల కంచెని దాటటమే ఈ ఇతివృత్తం.

కర్తవ్యం అన్న కథ కూడా భార్యాభర్తల ఇతివృత్తమే. తన సహజ సేవా స్వభావానికి అడుగడుగునా అడ్డుతగులుతున్న పురుషాధిక్యతని ఒక్క తిరస్కార లేఖతో దునుమాడటం… అలాంటి స్వభావం ఉన్న వారికి ఒక కనువిప్పు.

సమాజంలో ఉన్న లంచగొండితనం ప్రధాన అంశంగా, చివరి వరకూ ఉత్కంఠ కలిగించే కథనంతో సాగిన ఈ కథలో కొసమెరుపు పౌరులుగా మనమేం చెయ్యవచ్చు అన్న ఆలోచన కలిగిస్తుంది.

కష్టంలో మనిషికి మనిషి సాయం ఇతివృత్తంగా రాయబడ్డ ‘శీతాంశుముఖి' అన్న కథ తరిగిపోతున్న మనవ సంబంధాల ఆవశ్యకతని గుర్తు చేస్తుంది.

ఇక బంధం అన్న కథ… ఇంటింటా ప్రతి అమ్మా చదవాల్సిన కథ. ఈ కథలో పసి వయసులో పొడ చూపుతున్న అల్లరి మనస్తత్వాన్ని, ఎంత సున్నితంగా పారద్రోలాలో చెప్పటంలో రచయిత్రిగా కన్నా ఒక మానసిక శాస్త్రవేత్తగా కనిపించారు.

భిక్షాటన నేపధ్యపు ‘చిక్కుముడి’, రైతుబజార్లో పల్లె మనిషి నేపధ్యపు ‘నిజాయితీ’ రైతుకీ పశువుకీ ఉండాల్సిన అనుబంధాల నేపధ్యపు ‘అనుబంధం' చక్కని తెలుగు కుటుంబపు రక్తబంధాల ఆప్యాయతల నేపధ్యంలో ‘కనిపించేదేవుడు' ఎదుటి వాళ్ళ కష్టాన్ని మనకి ఇష్టం వచ్చినట్లు వాడుకోకూడదంటూ సరదాగా సాగే కథనంతో సాగిన ‘ఎదుటి వాళ్ళ గురించి కూడా కొంచెం…’ తోటి అనాధ కోరిక కోసం తీర్చటం కోసం తన చిరకాల ఆశయాన్ని పక్కన బెట్టిన విశాలమైన పాత్ర చిత్రణతో ‘కనుచూపు మేరలో ‘ కల్తీ మద్యపు ఇతి వృత్తంతో ‘కలతలన్నీ కరిగేవేళలో’

ఇలా ప్రతి కథా దేనికదే విలక్షణ ఇతివృత్తంతో మన తోటి సమాజాన్ని మనకి కొత్తగా పరిచయం చేస్తుంది. రోజూ చూసే వ్యక్తుల వెనక ఉండే గాధలు మనకి కళ్ళకి కట్టినట్లుగా పరిచయం అవ్వటం వల్ల ఇకపై మనం వ్యక్తి జీవితాలని విభిన్న కోణాలలో అర్ధం చేసుకునేలా సాగాయి ఆయా కథనాలు.

ఇలా రాయాలంటే ఎన్ని జీవితాలని దగ్గరగా పరిశీలించాలో… అదీ కళ్ళతో మాత్రమే కాదు మనసుతో. వాస్తవిక సమాజాన్ని ఇంత సరళంగా చెప్పగలగటం రచయిత్రికి కథ నడపటంలో ఉన్న పట్టుని చూపుతుంది.

ఒక నవలని ఆపకుండా చదవటం అన్నది మామూలు విషయమే కానీ, కథా సంకలనాన్ని అలా చదవటం కష్టం ఏమో అనుకున్న నాలాంటి మామూలు చదువరితో ఏకబిగిన చదివించిన ‘కథా శిల్పమూ… వస్తు వైవిధ్యమూ’ నిండిన ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన విధానంలో ఏవైనా లోపాలుంటే అవన్నీ నావి మాత్రమే.

Saturday, 7 May 2016

మౌనం! ఓ మధువచనం


ఓ మౌనమా…

ఒక మరపు... మరో ఆటకి దారితియ్యాలనుకున్న ఆసక్తి లేనప్పుడూ
నావైన కొన్ని భరోసాలు అతలాకుతలమవ్వటం  చూసినప్పుడూ 
ఆత్మీయంగా నన్ను హత్తుకు పోతున్న నువ్వు ఇక నా జట్టు. 

ప్రతి నిత్యం నా పర్యాయపదానివై నువ్వు  కొనసాగుతూ అనుక్షణం నాలో శబ్దించే అంతరంగపు సంఘర్షణలన్నిటినీ అవలోకిస్తూ నన్నో నిశ్చల నిశ్శబ్దసాగరంగా గుర్తించావు. ఎక్కడికక్కడ నా గుండెని రీసైక్లింగ్ చేసుకుందామనుకున్నా,  తడీ... పొడీ...తనాలేమి లేనిది ఏ కొనసాగింపుకీ అర్హత పొందదని ఎప్పటికప్పుడు కొత్తగా మరో మారు తెలుస్తూనే ఉంది. 

ఈ నిశ్శబ్దం ఉంది చూశావూ… ఇది పలు శబ్దాలు చేస్తుంది. తనకున్న పలు వ్యాపకాలలో ఇప్పుడు నన్నో వ్యాపకం చేసుకుంది.  ఎంత  ఆనందంగా  ఉందో తెలుసా? ఇంతకూ నీకూ నిశ్శబ్దానికీ తేడా ఏమిటి? నువ్వో యోగ సాధనమేమో కదూ. ఏమో ఏమిటీ! నాకలానే  అనిపిస్తుంది. నిన్ను చేధించటం బహుకష్టం… మనసుతో ముడి పడతావు కాబట్టి. బహుశా నిశ్శబ్దానికి అది కుదరదేమో. ఎవరైనా తనని చేధించవచ్చనుకుంటా… భౌతికత్వంతో ముడిపడి ఉంటుంది కాబట్టి. ఏదో తోచింది చెప్తున్నాను కానీ… నిజంగా  నిశ్శబ్దానికీ  నీకూ తేడా  తెలుసుకోవాలని ఉంది. 

మనసొక నిశ్శబ్దమైదానమైనప్పుడు నువ్వొక జ్ఞానలోచనమై మనుషుల్ని పరికించటం... వారి దేహ భాషని అనువదించటం… ఇదంతా చూస్తుంటే నిజంగా నువ్వొక లిఖిత భాషవైతే నిన్నుఅనువదించడానికి యుగాల కొలమానమూ సరిపోదేమో కదూ. 

కంటి చివర ఒంటరితనపు ధార కురుస్తున్నప్పుడా?
ఘడియ ఘడియకూ గుండె సడి విషాదాన్ని శబ్దిస్తున్నప్పుడా?  
గజిబిజి ఊహల అలికిడితో  మనసుకి ఏకాంతపు దప్పికైనప్పుడా? 
ఎప్పుడు? అసలు నువ్వెప్పుడు పరిచయమయ్యావ్ మనుష్యులకీ… వారి మనసులకీ? 

నిశ్శబ్దంలోనుండి మౌనంలోకి నడవటం… మౌనం నుండి మనసుని చదవటం… కొత్తగా నాలో ఏదో అలికిడి తెలియటం… ఇప్పుడిలా నిత్యం నీతో ఊసులాడుతుంటే గానీ అర్ధం కాలేదు ఇన్నాళ్ళూ నాకు నేను పరిచయమే అవ్వలేదని.  ఇక నన్ను వదిలి వెళ్ళవు కదూ.

‘మౌనం సాన పట్టిన మాట… నిశ్శబ్దం తరువాత ప్రణవం…’ ఎంత విలువని దాచుకుంటాయో తెలిసాక ఆ విలువని సొంతం చేసుకోవటం నా అనుక్షణపు గమ్యమవటంలో వింతేమీ లేదు కదా. 

అందుకే… 

ఏయ్…  మౌనమా ! నువ్వొక లిపివై  నన్నొక అక్షరంగా రాయవూ… నీ లిపిలో అక్షరం వెనుక అక్షరంగా ఒదిగిపోతూ లోకాన్ని వీక్షించటం… ఓహ్… తలచుకుంటే 

ఎప్పటికప్పుడు నిన్ను మరింత దగ్గర చేసుకుంటుంటే… నాకు దూరంగా జరిగిపోతున్న మనుషుల గుస గుసల సడి…  ఇంకా  ఎన్నాళ్ళంటావ్…? 

ప్రతి మనసు సడి నిన్ను అద్దుకునే క్షణం ఒకటి వస్తుందని ఇప్పుడు తెలియదు… తెలిసే సరికి కళ్ళల్లో జలపాతాలు మొదలవుతాయ్. ఎందుకంటే ఇష్టంగా నిన్ను వరిస్తే నువ్వో వరం… బలవంతంగా నిన్ను రుద్దితే నువ్వో పెనుభారం. ఎందుకీ ద్వైదీభావం. 

‘మాటల దగ్గరితనం మనుషుల వరకే, మౌనం మెచ్చిందా ఆత్మైక్యాలకి తొలి బీజం పడ్డట్లే కదా?’ అనుకునే మనసుల పరిచయం ఎప్పుడూ మధురమే. నువ్వు నువ్వుగా చదివిన మనసొకటి చాలు నన్ను నన్నుగా తనకి అర్పించడానికి.

మాటలు నిద్దరోయినప్పుడు  వచ్చే మౌనానివై  కాదు… పెదవిపై అలికిడి చేసే పైపై పలుకులని  నిద్రపుచ్చే మౌనానివై మనుషుల్ని అల్లుకుపో… మనసులపై నిండిపో…?

ఏమంటావ్…

ఒకటైతే నిజం...

నువ్వు... నా  గుండె గరికనద్దుకుని సడిచేస్తున్న నులి వెచ్చని హేమంతానివి...!

నీ

స్నేహిత్...


Friday, 6 May 2016

తనుపాలముంతలో పండుతున్న
వెన్న కంకుల రాశిలా
ధవళ గంధమద్దుకుని
దిగంతాటన చేస్తున్న గాంధర్వమై
నువ్వు పెంచేది నా కలల బరువునే
కానీ...

నా ‘తను’ ఉంది చూశావూ
సీతాకోకచిలుక రెక్కల సడిలా వచ్చి
నా ప్రతి శూన్యాన్ని దొంగిలించేస్తూ
మనసంతా సంపూర్ణమై పోతుంది
కళ్ళ చివర మెరుపుగా తను శ్వాసిస్తూ
అనంత ఏకాంతానికి మమ్మల్ని అర్పిస్తూ

అవ్యక్తంనా కలల సరిహద్దుని దాటినప్పుడల్లా
నీ శ్వాసలు గిలిగింత పెడుతుంటే
గ్రీష్మాన్ని దాటేసింది కనుదోయి
నీ నడకల్లోని వసంతాన్ని తానద్దుకుంటూ

రెప్పల కుడ్యాలపై సజీవ చిత్రాలుగా
కాంతి నీడలు పరచుకుంటుంటే
నీ వర్ణమద్దుకుంటుంది నా మది
కంటి వెనక కురిసే నిశ్శబ్దంలో

అవ్యక్తపు అనుభూతివై నువ్వు
నాలో నన్ను అదృశ్యం చేసేస్తుంటే
ఏయ్… స్నేహితా వీగిపోతున్నా నాలో
ఇక మనలో నన్ను లీనం చేస్తూ…!

Tuesday, 3 May 2016

స్వయంవరం


పాత టైర్లు… కంపుగొట్టే డ్రమ్ములతో నిండి ఉండాల్సిన గంగులు గాడి డెన్ కనిపించలేదు అక్కడ… హడావిడిగా తిరుగుతున్నమగ నర్సులు, చింకి పోయిన చాపల మీద కళ్ళూ నోరు తప్ప వళ్ళంతా కట్లు కట్టబడి వెల్లికిలా పడున్న ఆకారాలతో హాస్పిటల్ వాతావరణం కనపడుతుంది. ‘ఇదేమిటి వారం క్రితం సుబ్బరంగా విలన్ డెన్ లా వెలిగిపోయిన గంగులు గాడి స్థావరాన్ని హాస్పిటల్ వాళ్ళు ఎప్పుడు కొన్నారు? కొంటిరి పో... బెడ్ లు కూడా ఏర్పాటు చెయ్యకుండా చింకి చాపలమీద ఈ అంతరిక్ష ఆకారాల్ని పడుకోబెట్టటం ఏమిటి? అదియునూ సరియే అనుకుందాం… ఒక్క ఆడ నర్సు కూడా లేకుండా మగవాళ్ళని నర్సులుగా పెట్టుకోవటం ఏమిటి?. ఇంతకూ ఇప్పుడీ గంగులు గాడిని ఎక్కడ పట్టుకోవాలి’ వర ప్రసాద్ కి పిచ్చెక్కినట్లయింది. ఇంతలో ఒక మూలనుండి ‘షాజ్...షాజ్…’ అంటూ ఒక గొంతు పీలగా వినిపించింది. వరప్రసాద్ చుట్టూ చూశాడు కానీ ఆ పిలుపు ఏ ఆకారపు ఆక్రందనో అర్ధం కాలేదు. ఒక్కొక్క ఆకారాన్ని పరికించుకుంటూ ముందుకు కదులుతుంటే ఒక మూలగా కాస్త భారీగా ఉన్న ఆకారమొకటి తనకు చేతనైనంత వరకూ కాళ్ళూ చేతులు కదిలిస్తూ వర ప్రసాద్ చూపు తన మీద పడాలని ఆరాట పడుతూ కనిపించింది. వరప్రసాద్ తన దగ్గరకు వెళ్ళాడు. పిలుపు వచ్చింది తన దగ్గరి నుండా కాదా అన్నట్లుగా చూస్తుంటే, ఆ ఆకారం నుండి మళ్ళీ ‘షాజ్’ అన్న పిలుపు వినిపించింది. ‘గంగులు డెన్ ఎప్పుడు మార్చాడు? ఈ హాస్పిటల్ ఏమిటసలు? మీరంతా ఎవరు? ఈ కట్లు ఏమిటి? షాజ్… షాజ్ అని పిలుస్తున్నావ్? ఇంతకీ షాజ్ ఎవరు?’ ప్రశ్న మీద ప్రశ్న వేసేసి అలుపు తీసుకుందామన్నట్లుగా ఆగాడు. అబ్బా… ఛాన్స్ ఇచ్చావ్ పోరగా అనుకుని ఆ ఆకారం నోరు పెగల్చుకుంది ‘షాజ్…ణణ్ణు ఘుర్ఘా ఫట్టాల్డా.. ణేణూ.. ఘాంగ్రీల్’ అంటూ ఏదో చెప్పుకుపోతుంది. ఆ ఆకారం ఏమంటుందో ఒక్క ముక్కా అర్ధం కాని వరప్రసాద్ అటూ ఇటూ బిత్తర చూపులు చూశాడు. ఈయన గారి బిత్తర చూపులు పసిగట్టిన నడివయసు డాక్టర్ ఒకాయన అక్కడికి వచ్చాడు. ‘చెప్పండి సర్… నేను మీకు ఏ విధంగా సహాయ పడగలను’ అన్నాడు వరప్రసాద్ ముఖంలోకి తేరిపార చూస్తూ. ‘ఇప్పుడు నేనేమీ మీ సహాయం అడగలేదే’ ‘అడగలేదన్నది నిజమే కానీ… మీ బిత్తర చూపులు అవీ చూస్తుంటే మీకు నా సహాయం చాలా అవసరం అని అర్ధం అయ్యింది' ‘మీరన్నది నిజమే… ఇదిగో ఈ ఆకారం లో ఉన్న ప్రాణి ఏదో చెప్తుంది కానీ నాకు ఒక్క ముక్కా అర్ధం కావటం లేదు. మీకేమైనా అర్ధం అయితే చెప్తారా డాక్టర్ …’ ‘డాక్టర్... ఎముకల్రావ్…’ తన పేరు చెప్పాడా డాక్టర్. ‘ఓకే ఓకే … డాక్టర్ ఎముకల్రావ్ గారు. తను ఏమంటున్నాడో అడిగి చెప్పండి.’ డాక్టర్ ఆ ఆకారం వైపు తిరిగి ‘ నాకు చెప్పవోయ్ నువ్వేం చెప్తున్నావో ఇతనికి. నేను అనువాదం చేస్తాను’ అన్నాడు. ఆ ఆకారం చాలా కష్టపడి... ఆయాస పడి… ప్రపంచంలో ఎక్కడా వినబడని కొత్త భాషలో డాక్టర్ కి ఏదేదో చెప్పింది. అదలా చెప్తున్నంత సేపూ ఆ భాషా సౌందర్యానికి భయపడి వరప్రసాద్ చెవులు మూసుకున్నాడు కానీ డాక్టర్ మాత్రం చాలా నింపాదిగా విన్నాడు. ఆయనలా వింటుంటే వర ప్రసాద్ మాత్రం భయం భయంగా డాక్టర్ చెవుల వైపే చూస్తున్నాడు ఏ క్షణంలో అక్కడ రక్తప్రవాహం మొదలవుతుందా అని. కానీ అలాంటి ప్రమాదం ఏమీ లేకుండానే డాక్టర్ ఎముకల్రావ్ వరప్రసాద్ వైపు తిరిగి ఆ ఆకారం చెప్పిన మాటలని యధాతధంగా అనువదించాడు. ‘సార్… నన్ను గుర్తు పట్ట లేదా... నేనూ.. గంగుల్ని. మీరు చెప్పిన పని మీద నా గ్యాంగ్ తో ఓ లేబర్ బస్తీకి వెళ్ళాను. ఫలానా రోజున ఈ వాటర్ టాంకర్ మాకు కావాలి అని చెప్తూ ఉండగానే, మాట కూడా పూర్తవకుండా అక్కడ ఆడంగులంతా భద్రకాళీ అవతారాలెత్తి చేతుల్లో ఉన్న బిందెలతో… కాగులతో రణరంగంగా మార్చేసారు సారూ… పేరుకే రణరంగం అంటున్నాగానీ అంతా వన్ సైడెడ్ అయిపొయింది సార్. ఇంతకుముందు ఎప్పుడు ఆ బస్తీకి వెళ్ళినా మమ్మల్ని చూస్తేనే తలుపులకి గడెట్టుకుని గజ గజ వణికిపోయే ఆడంగులు… అసలు పట్టుమని పది మందికూడా ఉన్నారో లేరో సార్… అటువంటిది పాతికమంది వస్తాదుల్లాంటి నా మనుషులని ఎముకలలో సున్నం మిగలకుండా చితగ్గొట్టేసారు. ఇన్నాళ్ళ నుండి వేలమంది బొక్కలిరిచినా, వందలమంది పీకలు కోసినా ఇసుమంతయినా వంటి మీద గీత పడలేదు సార్ … ఇప్పుడు మా బాడీలు రబ్బరు బొమ్మల్లా అయిపోయాయి సార్… అతికించడానికి కూడా ఎముకలే దొరకటం లేదంటున్నాడు ఈ డాక్టర్. లేకపోతే ఒక్క వాటర్ టాంకర్ నీళ్ళ కోసం పది మంది ఆడవాళ్ళు పాతిక మంది రౌడీ వస్తాదుల్ని ఆకారాలు మిగలకుండా ఇంత వికారంగా కొట్టటమేంటీ… ఇదంతా నీ ప్లాన్ కదూ… నిజం చెప్పండి సార్... నువ్వు మా గ్యాంగ్ ని ఏరి వెయ్యటానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ వి కదూ… ప్రాణ సమానమైన వాటిని ఎవరైనా ఆక్రమించుకుంటుంటే ఒక్కో మనిషిలో ఎంత తెగువ ఉంటుందో ఎంత శక్తిని బయటకు తియ్యవచ్చో తెలిసి మరీ మాకు స్పాట్ బెట్టినట్లున్నావ్ సార్… ఇక నుండీ బుద్ధిగా ఉంటాం సార్... ఇంకెప్పుడూ రౌడీయిజం చెయ్యం సార్… ఈ ఒక్క సారికి మాఫ్ జేయండి సార్...’ అంతా విన్న వర ప్రసాద్ కి నవ నాడులూ స్తంభించిపోయాయి. ఓహో ఇది గంగులు గాడి డెన్ గానే ఉందన్న మాట. టెంపరరీ హాస్పిటల్ లా మారిపోయిందన్నమాట. ఇంత పెద్ద రౌడీ కూడా ఒక్క వాటర్ ట్యాంకర్ నీళ్ళు తీసుకుని రాలేకపోవటమే కాకుండా నన్ను పోలీస్ అనుకుని భయపడిపోయాడంటే… ఇక సిటీ లో ఏ రౌడీ వల్ల కూడా ఈ ప్లాన్ వర్కౌట్ అవదని అర్ధం అయ్యింది. ఇంకేదైనా ప్లాన్ చేసి గడువు రోజుకల్లా నీళ్ళు సంపాదించాలి అని మనసులో అనుకుంటూ… ‘డాక్టర్ ఎముకల్రావ్ గారూ… ఈ గంగులు చెప్పింది నాకు ఒక్క ముక్క అర్ధం కాలేదు.. మీకేమిటి ఇంత చక్కగా అర్ధం అయ్యింది.?’ అన్నాడు. ‘మరేమీ లేదు ఆఫీసర్… ఇలాంటి వాళ్ళని ట్రీట్ చేసీ చేసీ మాకు ఈ భాష పట్టుబడింది' వరప్రసాద్ నిజంగానే పోలీస్ అఫీసర్ అని మనసులో ఫిక్స్ అయిన డాక్టర్ ఎముకల్రావ్. ‘అది సరే గానీ డాక్టర్… నర్సులుగా అందరూ మగవాళ్ళే ఉన్నారేమిటి…?’ ‘ముందు లేడీ నర్సులే ఉన్నారు గాని, ఆడగొంతు వినబడినా, గాజుల చెయ్యి కంటబడినా ఈ వస్తాదులంతా బెంబేలెత్తి పోతుంటే వాళ్ళని పంపించేసి అందరినీ మగవాళ్లనే పెట్టాను ‘ చెప్పాడు ఎముకల్రావ్. ఇక అడగటానికి ఏమీ లేక వరప్రసాద్ బయటకి నడుస్తుంటే ‘ చూడండి ఆఫీసర్… ఈ సారి రౌడీలని ఏరేసే ఇలాంటి ప్రయోగం ఏ బస్తీలో చెయ్య బోతున్నారో చెప్తే, అక్కడ కూడా మా డోర్ డెలివరీ హాస్పిటల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం’ అని ఇంకేదో అంటున్నాడు డాక్టర్ ఎముకల్రావ్. ‘అమ్మో ఇక్కడే ఉంటే నిజంగానే నన్ను నేనే పోలీస్ ఆఫీసర్ ని అనుకునేలా ఉన్నాను’ అనుకుంటూ డాక్టర్ మాటలు వినపడనట్లుగా పరుగులాంటి నడకతో అక్కడి నుండి బయట పడి ఇంట్లో తేలాడు వరప్రసాద్. ప్లాన్ - A ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ప్లాన్ - B అమలు చెయ్యాలి. ఇంతకూ ఆ స్నేహిత్ గాడు ఏమి చేస్తున్నాడో ఏమిటో… పాండురంగం రిపోర్ట్ ఇంకా రాలేదు. ఆ డిటెక్టివ్ పాండురంగం గాడు ఎప్పుడూ ఇంతే. చివరి నిమిషం వరకూ టెన్షన్ పెట్టేస్తాడు. అంతలోనే పాండురంగం నుండి కాల్ వచ్చింది. స్నేహిత్ రోజూ ఆఫీస్ కి ఇంటికీ తిరగటం తప్ప, వేరే వ్యవహారాలేమీ జరపడం లేదని, ఫోన్ కాల్స్ కూడా అనుమానాస్పదంగా ఏమీ లేవని పాండు రంగం తన రిపోర్ట్ చదివి చెప్పాక అంతవరకూ నయమేలే అనుకుంటూ వరప్రసాద్ కాస్తంత కుదుట పడ్డాడు గతంలోకి జారుకుంటూ. *** ‘చూడండి ఫ్రెండ్స్ మీరిద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ ఒకే సారి ప్రపోజ్ చేసారు. ప్రత్యేకంగా నేనంటూ ఎవరినీ ప్రేమించలేదు కాబట్టి, ఒకళ్ళని యాక్సెప్ట్ చేస్తే రెండో వాళ్ళు ఫీల్ అవుతారు. నాకు అలా ఇష్టం లేదు. ఎవరో బయట వాళ్ళని చేసుకోవటం కన్నా, నన్ను ఇష్టపడ్డ మీలో ఒకరిని చేసుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఎవరిని అనేదే సమస్య. మీరిద్దరూ అన్ని విషయాల్లో సమ ఉజ్జీలే అనిపిస్తారు. అందుకే మీ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకునేందుకు మీ ఇద్దరి మధ్య ఒక చిన్న పరిక్ష పెడతాను. అందులో నెగ్గిన వాడినే పెళ్లి చేసుకుంటాను. ఇందుకు మీకు సమ్మతమేనా? ’ అని అడిగింది కవిత, ఒకే సారి వచ్చి తమ తమ ప్రేమని వెల్లడించిన వరప్రసాద్ & స్నేహిత్ లని. వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు గుర్రుగా చూసుకుంటూ అలాగే అన్నట్లుగా తల ఊపారు. వాళ్ళకి అంతకు మించిన ఆప్షన్ మాత్రం ఏముంది కనుక? ‘సరే అయితే... ఇద్దరూ ఒప్పుకున్నారు కాబట్టి నా పరీక్ష ఏమిటో చెబుతున్నాను. వచ్చే ఏడాది మే 4 వ తారీఖున కస్తూర్బా సేవాశ్రమానికి ఒక ఫుల్ వాటర్ టాంకర్ నీళ్ళు డొనేట్ చేస్తాను అని నేను మాట ఇచ్చాను. ఆ డొనేషన్ మీరు చెయ్యాలి. అలా చేసిన వాడిని నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను.’ ఆమె చెప్పింది వినగానే ఓస్ ఇంతేనా అన్నట్లుగా వరప్రసాద్ సంబరపడిపోయాడు. మళ్ళీ అంతలోనే ఒక అనుమానం వచ్చేసింది ‘ మరి ఇద్దరమూ నీళ్ళు డొనేట్ చేస్తే… ఎందుకంటే ఇద్దరమూ స్థితిమంతులమే. ఒక ట్యాంక్ నీళ్ళు ఇవ్వటం మాకు పెద్ద లెక్కలో పని కాదు.’ ‘ఓహ్.. అలా అంటావా, సరే ఐతే ఇప్పుడే టాస్ వేద్దాం. టాస్ ఎవరు గెలిస్తే వారికే వాటర్ డొనేషన్ కి మొదటి ఛాన్స్. ఇది ఇద్దరికీ ఇష్టమేనా' ఇద్దరూ కూడా ఇష్టమేనన్నట్లు తల ఊపారు. టాస్ వరప్రసాద్ గెలిచాడు. ఇక తన సంబరానికి అంతే లేదు. టాస్ గెలిచేసాను కవిత తనదైపోయినట్లే అనుకుంటూ కలలోనే వరల్డ్ టూర్ వేసుకుని కవితతో డ్యూయెట్ పాడేసుకున్నాడు. టాస్ ఓడిపోగానే స్నేహిత్ ముఖం చిన్నబోయింది. ఇప్పటికిప్పుడు చేసేదేమీ లేదనుకుంటూ ఇద్దరికీ బై చెప్పి ఇంటికి వెళ్లి పోయాడు. ‘కవితా… పరీక్ష అంటే ఏదో స్వయంవరంలా ఉంటుందని ఫీల్ అయ్యాను. టాస్ వెయ్యగానే విన్నర్ ఎవరో తేలిపోయేటంత చిన్న పరీక్ష పెడతావనుకోలేదు. ఎనీ వే… ఐ యాం లక్కీ గై.’ అని తెగ సంబరంగా అన్నాడు వరప్రసాద్. ‘సరేలే ప్రసాద్… చిన్నదో పెద్దదో పరీక్ష గడువు ఇంకా తొమ్మిది నెలలు ఉంది కదా. ఆ రోజున నేను చెప్పింది చెయ్యి చాలు’ అంది కవిత చిరునవ్వుతో. ‘అలాగే… అలాగే’ అని కవితకి వీడ్కోలు చెప్పి హుషారుగా కూనిరాగం తీసుకుంటూ ఇంటి ముఖం పట్టాడు వరప్రసాద్. ** చూస్తుండగానే ఆరు నెలలు గడచి పోయాయి. ఈ ఆరు నెలల్లో స్నేహిత్ తన ఇల్లు కొంచెం రీ మోడలింగ్ చేయించుకున్నాడు. వర ప్రసాద్ మాత్రం మే 4 ఎప్పుడు వస్తుందా అన్నట్లు ఎదురు చూస్తూ ఉన్నాడు. క్యాలెండరులో గడువు మూడు నెలల నుండి రెండు నెలల్లోకి వచ్చేసరికి ఊళ్ళో ఎక్కడ చూసిన వాటర్ ప్రాబ్లం మొదలయ్యిందని వార్తలు చదివి కొంచెం గాభరా పడ్డాడు. మొదటి సారిగా వర ప్రసాద్ లో కాస్త జంకు మొదలయ్యింది. అప్పటికప్పుడు డిటెక్టివ్ పాండురంగాన్ని కలసి స్నేహిత్ మూవ్ మెంట్స్ మీద నిఘా పెట్టాడు. వాటర్ కోసం తానేమైనా ప్రయత్నాలు చేస్తుంటే తనకి రిపోర్ట్ ఇవ్వమని. ఆ తరువాత వాటర్ టాంకర్ ని బుక్ చెయ్యటానికి ఊరంతా పిచ్చి కుక్కలా తిరిగాడు కానీ 6 నెలల వరకూ ఒక్క టాంకర్ వాటర్ కూడా ఇవ్వలేనంత అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయని తెలిసింది. ఇంట్లో బోర్ నుండి వచ్చే వాటర్ ని స్టోర్ చేద్దాం అనుకుంటే అది ముక్కుతూ మూలుగుతూ 5-6 బక్కెట్ల కన్నా ఎక్కువ నీళ్ళు ఇవ్వటం లేదు. అవేమో రోజూ వారీ అవసరాలకే సరిపోవటం లేదు. ఇలా లాభం లేదు దౌర్జన్యంగా అయినా సరే ఒక టాంకర్ నీళ్ళు సంపాదించాలి అనుకుని ఎవరెవరినో అడిగి గ్యాంగ్ స్టర్ గంగులు అడ్రెస్స్ పెట్టుకుని మే 4 ఉదయానికల్లా ఒక టాంకర్ వాటర్ కావాలని చెప్పి తనతో ఒక లక్ష రూపాయలకి బేరం కుదుర్చుకున్నాడు. ఫలితం చూస్తే ఇది. *** గతం లో నుండి బయటకి వచ్చి, నెక్స్ట్ ప్లాన్ ఏమిటా అని ఆలోచించాడు. ఇంతలో బుర్రలో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. అప్పటికప్పుడు ఊళ్ళో వాటర్ దొరకక ఖాళీగా ఉన్న ఒక పెద్ద వాటర్ టాంకర్ ని డ్రైవర్ మల్లేష్ తో సహా మాట్లాడుకుని, ఇప్పటికిప్పుడు బయలు దేరి హిమాలయాల్లోకి వెళ్లి ఏ గంగానది నుండో, లేదా బ్రహ్మపుత్ర నుండో ఎక్కడ నీళ్ళు దొరికితే అక్కడి నుండి తీసుకుని రమ్మని అతన్ని బయలు దేర తీసాడు. మల్లేష్ తో ఎప్పటికప్పుడు కాంటాక్ట్ లో ఉండి, తను వాటర్ దొరికాయ్ అని చెప్పగానే ఎట్టి పరిస్థితులలోనూ మే 4 పొద్దున్న కల్లా కస్తూర్బా సేవాశ్రమానికి వచ్చెయ్యాలి అని చెప్పి హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకున్నాడు. *** మే 4, 2016, కస్తూర్బా సేవాశ్రమం. కవిత, స్నేహిత్ & వరప్రసాద్ ఆశ్రమం గేట్ దగ్గర నిలబడి ఉన్నారు. ‘ప్రసాద్… ముందుగా నీదే కదా ఛాన్స్ ఏదీ వాటర్ టాంకర్? ‘ అని అడిగింది కవిత. ‘ఇంకో అయిదు నిమిషాల్లో వచ్చేస్తుంది కవితా…!’ అంతకు ముందే మల్లేష్ తో ఫోన్ లో మాట్లాడిన వరప్రసాద్ కవితతో చెప్పాడు. అంతలోనే వాటర్ టాంకర్ వస్తూ కనిపించింది. ‘అదిగో టాంకర్ వచ్చేసింది… కవితా ఇక నువ్వు నా దానివే' వరప్రసాద్ ముఖంలో వేయి మతాబుల కాంతులు, చేతల్లో గంతులొక్కటే తక్కువ. ఇంతలో మల్లేష్ డ్రైవింగ్ సీట్ లో నుండి కిందకి దూకి సరాసరి అమాంతంగా వరప్రసాద్ కాళ్ళ మీద పడి ‘ స్వామీ… నువ్వు దేవుడివి స్వామీ… నువ్వు దేవుడివి… గంగ తోనే నా బతుకు ముడి పడి ఉందని నా బతుకుని ఉద్ధరించడానికి సాక్షాత్తూ కైలాసం నుండి వచ్చిన గంగాధరుడివి స్వామీ…’ అని అన్నాడు. ఒక్క క్షణం పాటు తను విన్నదేమిటో అసలేం జరుగుతుందో తాను దేవుడవ్వడం ఏమిటో... ఏమీ అర్ధం కాలేదు వర ప్రసాద్ కి. అయినా తమాయించుకుని ‘అది సరే కానీ మల్లేష్... టాంకర్ లోపలి కి తీసుకుని వెళ్లి నీళ్ళని ఆశ్రమం లో ఇచ్చేసేయ్' అన్నాడు ‘నీళ్ళని లోపలి తీసుకుని వెళ్ళటానికి టాంకర్ ఎందుకు సాబ్, ఈ మరచెంబు చాలు. అయినా పవిత్ర గంగాజలం. మీకోసం అనే జాగ్రత్తగా దాచి తెస్తే ఆళ్ళకి ఇవ్వమంటారేంది స్వామీ ’ అంటూ తన చేతిలోని రాగి మరచెంబుని చూపించాడు. ‘మర చెంబేమిటి… నేను చెప్పేది… టాంకర్ లో నీళ్ళ గురించి' పెద్దగా అరిచేసాడు వరప్రసాద్ అసలు జరిగేదేమిటో మనసుకెక్కక. ‘టాంకర్ లో నీళ్ళు లేవు స్వామీ… మన రాష్ట్ర పొలిమేరల్లోకి రాకముందే మొత్తం అమ్మేసాను. వచ్చే దారిలో ఎక్కడ చూసినా నీళ్ళు లేవనుకుంటా. బిందె వెయ్యి రూపాయలన్నా ఎగబడి ఎగబడి కొన్నారు. ఇదిగో మీరిచ్చిన లక్ష రూపాయలకి ఇంకో లక్ష వేసి మీ డబ్బులు మీకిచ్చేస్తున్నా. నాకో నాలుగు లక్షలు మిగిలాయ్. ఈ 2-3 నెలలు ట్రిప్పులు కొట్టుకుంటే నా లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది స్వామీ… నువ్వు దేవుడివి స్వామీ… నీ ఋణం ఉంచుకోను. ప్రతి ట్రిప్పులో నీ ముడుపు నీకిచ్చేస్తా… మళ్ళీ వస్తా స్వామీ’ అంటూ ఆ మర చెంబుని వర ప్రసాద్ చేతికిచ్చి తన టాంకర్ తీసుకుని వెళ్ళిపోయాడు. అంతే వరప్రసాద్ నేలమీద పడి మూర్ఛిల్లినట్లయ్యాడు. స్నేహిత్ మరచెంబులోని నీళ్ళని వరప్రసాద్ ముఖం మీద జల్లి తనని లేపి కూర్చోబెట్టాడు. కాస్తంత తేరుకున్నాక, వరప్రసాద్ తన బెట్టు వీడకుండానే సరే నా వాళ్ళ కాలేదు ‘నీ నీళ్ళు ఎక్కడ? అని అడిగాడు ‘అదిగో ఆశ్రమంలో నీళ్ళు సప్లై చేసేసి బయటకు వస్తుంది కదా. అదే స్నేహిత్ తెచ్చిన వాటర్ టాంకర్. నువ్వు పడిపోయినప్పుడే అది లోనికి వెళ్ళింది.’ అంది కవిత పక్కనుండి. ‘ ఎన్ని ప్రయత్నాలు చేసినా నా వాళ్ళ కాలేదు, అసలు నీకు నీళ్ళు ఎలా దొరికాయి?’ దేభ్యం ముఖం పెట్టుకుని మరీ అడిగాడు వర ప్రసాద్ స్నేహిత్ ని ‘మరేం లేదు మిత్రమా… వాన నీళ్ళు వేస్ట్ అవ్వకుండా ప్రిజర్వ్ చేసుకునే సిస్టంతో మా ఇంటిని రీ మోడలింగ్ చేయించాను. అలాగే ఇంటి చుట్టూ ఇంకుడుగుంతలు తవ్వించాను. ఇప్పుడు మా ఇంటిలో పుష్కలంగా నీరు. అందుకే ఇంత నీటి ఎద్దడి లో కూడా ఇబ్బంది పడకుండా తీసుకుని రాగలిగాను’ వరప్రసాద్ నోట మాట లేదు. ఇంతలో కవిత అందుకుంది ‘ చూడు ప్రసాద్… ఆ రోజు ఇంత చిన్న పరీక్షా అన్నావ్… జీవితం మీద అవగాహన లేని వాడికి అతి చిన్న పరీక్ష అనుకున్నదే జీవితాన్నే మింగేసేంత పెద్ద సమస్య అవుతుంది. అందుకు ఇదే పెద్ద ఉదాహరణ. నీకు ముందు చూపు లేదు... ప్లానింగ్ లేదు… పైగా సమస్య తీవ్రమైనప్పుడు గంగులు లాంటి రౌడీలతో లాలూచి పడి వక్రమార్గం ఎన్నుకున్నావ్. ఇది సరైన దారి కాదు మిత్రమా. రోజు రోజుకీ నీటి సమస్య ఎంత తీవ్రమవుతుందో మనం ఎప్పటి నుండో చూస్తూనే ఉన్నాం. కానీ నువ్వు మాత్రం దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నావ్. చివరికి ఏమైంది? మనిషికి తమ వనరుల మీద అవగాహన ఉండాలి. ప్రకృతితో చెలిమి చేస్తూ తనని మాలిమి చేసుకోవాలి. అప్పుడే మన జీవితం మన చేతుల్లో ఉంటుంది. నాకు కావాల్సింది నన్ను ప్రేమించేవాడే కాదు… జీవితం మీద సంపూర్ణ అవగాహన ఉన్న వాడు కూడా. అది స్నేహిత్ లో ఉంది. నువ్వు మాత్రం ఇకనైనా మారు మిత్రమా..!’ అంటూ స్నేహిత్ చెయ్యి అందుకుని ఆశ్రమం లోపలికి నడచింది.