Saturday, 7 May 2016

మౌనం! ఓ మధువచనం


ఓ మౌనమా…

ఒక మరపు... మరో ఆటకి దారితియ్యాలనుకున్న ఆసక్తి లేనప్పుడూ
నావైన కొన్ని భరోసాలు అతలాకుతలమవ్వటం  చూసినప్పుడూ 
ఆత్మీయంగా నన్ను హత్తుకు పోతున్న నువ్వు ఇక నా జట్టు. 

ప్రతి నిత్యం నా పర్యాయపదానివై నువ్వు  కొనసాగుతూ అనుక్షణం నాలో శబ్దించే అంతరంగపు సంఘర్షణలన్నిటినీ అవలోకిస్తూ నన్నో నిశ్చల నిశ్శబ్దసాగరంగా గుర్తించావు. ఎక్కడికక్కడ నా గుండెని రీసైక్లింగ్ చేసుకుందామనుకున్నా,  తడీ... పొడీ...తనాలేమి లేనిది ఏ కొనసాగింపుకీ అర్హత పొందదని ఎప్పటికప్పుడు కొత్తగా మరో మారు తెలుస్తూనే ఉంది. 

ఈ నిశ్శబ్దం ఉంది చూశావూ… ఇది పలు శబ్దాలు చేస్తుంది. తనకున్న పలు వ్యాపకాలలో ఇప్పుడు నన్నో వ్యాపకం చేసుకుంది.  ఎంత  ఆనందంగా  ఉందో తెలుసా? ఇంతకూ నీకూ నిశ్శబ్దానికీ తేడా ఏమిటి? నువ్వో యోగ సాధనమేమో కదూ. ఏమో ఏమిటీ! నాకలానే  అనిపిస్తుంది. నిన్ను చేధించటం బహుకష్టం… మనసుతో ముడి పడతావు కాబట్టి. బహుశా నిశ్శబ్దానికి అది కుదరదేమో. ఎవరైనా తనని చేధించవచ్చనుకుంటా… భౌతికత్వంతో ముడిపడి ఉంటుంది కాబట్టి. ఏదో తోచింది చెప్తున్నాను కానీ… నిజంగా  నిశ్శబ్దానికీ  నీకూ తేడా  తెలుసుకోవాలని ఉంది. 

మనసొక నిశ్శబ్దమైదానమైనప్పుడు నువ్వొక జ్ఞానలోచనమై మనుషుల్ని పరికించటం... వారి దేహ భాషని అనువదించటం… ఇదంతా చూస్తుంటే నిజంగా నువ్వొక లిఖిత భాషవైతే నిన్నుఅనువదించడానికి యుగాల కొలమానమూ సరిపోదేమో కదూ. 

కంటి చివర ఒంటరితనపు ధార కురుస్తున్నప్పుడా?
ఘడియ ఘడియకూ గుండె సడి విషాదాన్ని శబ్దిస్తున్నప్పుడా?  
గజిబిజి ఊహల అలికిడితో  మనసుకి ఏకాంతపు దప్పికైనప్పుడా? 
ఎప్పుడు? అసలు నువ్వెప్పుడు పరిచయమయ్యావ్ మనుష్యులకీ… వారి మనసులకీ? 

నిశ్శబ్దంలోనుండి మౌనంలోకి నడవటం… మౌనం నుండి మనసుని చదవటం… కొత్తగా నాలో ఏదో అలికిడి తెలియటం… ఇప్పుడిలా నిత్యం నీతో ఊసులాడుతుంటే గానీ అర్ధం కాలేదు ఇన్నాళ్ళూ నాకు నేను పరిచయమే అవ్వలేదని.  ఇక నన్ను వదిలి వెళ్ళవు కదూ.

‘మౌనం సాన పట్టిన మాట… నిశ్శబ్దం తరువాత ప్రణవం…’ ఎంత విలువని దాచుకుంటాయో తెలిసాక ఆ విలువని సొంతం చేసుకోవటం నా అనుక్షణపు గమ్యమవటంలో వింతేమీ లేదు కదా. 

అందుకే… 

ఏయ్…  మౌనమా ! నువ్వొక లిపివై  నన్నొక అక్షరంగా రాయవూ… నీ లిపిలో అక్షరం వెనుక అక్షరంగా ఒదిగిపోతూ లోకాన్ని వీక్షించటం… ఓహ్… తలచుకుంటే 

ఎప్పటికప్పుడు నిన్ను మరింత దగ్గర చేసుకుంటుంటే… నాకు దూరంగా జరిగిపోతున్న మనుషుల గుస గుసల సడి…  ఇంకా  ఎన్నాళ్ళంటావ్…? 

ప్రతి మనసు సడి నిన్ను అద్దుకునే క్షణం ఒకటి వస్తుందని ఇప్పుడు తెలియదు… తెలిసే సరికి కళ్ళల్లో జలపాతాలు మొదలవుతాయ్. ఎందుకంటే ఇష్టంగా నిన్ను వరిస్తే నువ్వో వరం… బలవంతంగా నిన్ను రుద్దితే నువ్వో పెనుభారం. ఎందుకీ ద్వైదీభావం. 

‘మాటల దగ్గరితనం మనుషుల వరకే, మౌనం మెచ్చిందా ఆత్మైక్యాలకి తొలి బీజం పడ్డట్లే కదా?’ అనుకునే మనసుల పరిచయం ఎప్పుడూ మధురమే. నువ్వు నువ్వుగా చదివిన మనసొకటి చాలు నన్ను నన్నుగా తనకి అర్పించడానికి.

మాటలు నిద్దరోయినప్పుడు  వచ్చే మౌనానివై  కాదు… పెదవిపై అలికిడి చేసే పైపై పలుకులని  నిద్రపుచ్చే మౌనానివై మనుషుల్ని అల్లుకుపో… మనసులపై నిండిపో…?

ఏమంటావ్…

ఒకటైతే నిజం...

నువ్వు... నా  గుండె గరికనద్దుకుని సడిచేస్తున్న నులి వెచ్చని హేమంతానివి...!

నీ

స్నేహిత్...


0 comments:

Post a Comment