Thursday, 11 August 2016

వనవాసి: స్వచ్ఛ మనసుకి సహవాసి

ఒక పుస్తకాన్ని చదవటానికి అందులోని కథే ప్రధానం అనుకున్న వాళ్ళు ఇది ఒక్క సారి చదివి చూడండి. మీ అభిప్రాయం మారవచ్చు. కాకపోతే మీలో కాస్తంతైనా ప్రకృతి అంశ మిళితమై ఉండాలి.  అవును ఇది నిజంగా నిజమే. కథంటూ లేని ఒక పుస్తకాన్ని తనివితీరా చదువుతాను అని నేనెప్పుడూ అనుకోలేదు.

అదే 1938లో  బెంగాలీలో ‘అరణ్యక’ పేరుతో భిభూతి భూషన్ వంద్యోపాధ్యాయ గారిచే రాయబడి, 1961లో  తెలుగులో సూరంపూడి సీతారాం గారిచే  ‘వన వాసి’ పేరుతో అనువదింప బడిన  నవల.   

ఇందులో కథగా చెప్పుకోవటానికి పెద్దగా ఏమీ లేదు. తన  స్నేహితుడికి సంబంధించిన ఒకానొక జమీలో ఉన్న అడవి భూములని పరిష్కరించి వాటికి కౌలుదారులని ఏర్పాటు చేసే ఉద్యోగ నిమిత్తం సత్య చరణ్ అనే బెంగాలీ యువకుడు ఆరేళ్ళ పాటు బీహార్ లోని పూర్ణియా, గయా జిల్లాలలో కుశీనదీ తీరాన ఉన్న అరణ్య ప్రాంతాలలో మమేకమై అక్కడ జన జీవితాలలో ఆత్మీయంగా అల్లుకుపోవటమూ… చివరకు అడవిని మాయం చేసి, దానికి కారణం తానయ్యానని బాధపడటమే దీనిలోని ప్రధాన ఇతివృత్తం.  

ఇందులోని సత్య చరణ్ అచ్చం మనలాంటి వాడే… పట్టణంలో ఉద్యోగం ఉపాధ్యాయునిగా ఉద్యోగం కోల్పోయి బతకటానికి ఏదో ఒక దారి దొరికింది కదా అని  అసంతృప్తితోనే అడవిని చేరుకొని మొదట అడివి లోని ఏకాంతాన్ని తట్టుకోలేక ఎప్పుడు వెళ్లి పట్నంలో పడదామా అనుకుని, కొద్ది రోజులల్లోనే అడవినే తన ఆత్మగా చేసుకున్న వ్యక్తి. బహుశా అడవిని ఆత్మగా చేసుకోవటమన్నది అది ఆతని గొప్పతనము కాదేమో. కాస్తంత స్పందన ఉన్న ఏ మనిషినైనా అడివి అలా ఆవహించేస్తుందేమో అనిపించక మానదు ఈ పుస్తకం చివరికంటా చదివితే.

అడవి ప్రస్థానంలో మనకెదురయ్యే మనిషి బతుకులని చూస్తే, ఏదో ఒక బతుకు దగ్గర మన కళ్ళు చెమ్మగిల్లక మానవు.  ఎందుకంటే వీరి బతుకులో కథల్లోనో, సినిమాల్లోనో మనకెదురయ్యే నాటకీయ కష్టాలూ గ్లిజరిన్ కన్నీళ్ళూ ఉండవు. అవును… నిజమే, దుర్భర జీవనాన్ని అనుభవిస్తూ కూడా ఎక్కడా కన్నీరు చిందించని మనుషులే ఈ పుస్తకంలో అడుగడుగునా. వాళ్ళు కళ్ళు తడి చేసుకోకపోవచ్చు మన మనసు మాత్రం తడి చేస్తారు. తమ అమాయకత్వంతో… బతుకు పోరాటంతో...  

బతకటానికి ఏ పచ్చి మినప్పిండో, అడవిలో దొరికే ఏ దుంపలో చాలు అని భావించే బడుగులే కనిపిస్తుంటారు. వీళ్ళ ఆహారమంతా అడవి తోటకూరలో ఉప్పునంజుకుని తినడమో, చీనా గడ్డి గింజలని ఉడకేసుకుని తినటమో. వరి అన్నం దొరకటం అంటే అదో పెద్ద పండుగ. ప్రాణాంతకమైన కలరాతో ముసలి భర్త చావు బతుకుల్లో ఉన్నప్పుడు, ఎవరో ఇచ్చిన ఈగలు ముసిరి కుళ్ళిన చద్ది అన్నం పారవెయ్యటానికి మనసొప్పని 17 ఏళ్ల భార్యని చూస్తే, వరి అన్నం వాళ్ళకెంత ప్రియమైన వస్తువో తెలుస్తుంది. రెండు అన్నం మెతుకుల కోసం మైళ్ళకి మైళ్ళు నడిచి అడివిలోని కచేరికి వచ్చే  కొండ పల్లెల జనం... అడవి చుట్టు పక్కలా ఉన్న   గ్రామాల్లో వరి అన్నం తినగలిగే కుటుంబాలు కేవలం రెండే. ఊహించగలమా ఇలాంటి జీవితాలని?  జస్ట్ అలా టేస్ట్ చేసి బాగోలేదంటూ పక్కకి నెట్టేసి మరో ఐటమ్ కి వెళ్లి ఆహారాన్ని వృధా చేసే వారు కలలోనైనా ఇలాంటి జీవితాల్ని ఊహించగలరా?  వణికించే చలిలో జొన్న రొట్ట కప్పుకుని పడుకునే జీవితాల గురించి ఎప్పుడైనా విన్నామా? అవును… ప్రపంచంలో ఇలాంటివెన్నో  ఉంటాయ్. ఇలాంటి పుస్తకాల వలన కొన్ని కొన్ని జీవితాలు కొద్ది కొద్దిగా మనకి పరిచయమవుతాయ్.

విత్తం పట్ల నిరాసక్తీ, పెద్ద నష్టాల పట్ల కూడా నిర్లక్ష్యమూ ఉంటాయని అనుకోగలమా మనం? వడ్డీతో పాటు అసలు పోయినా నవ్వుతూ  ఋణపత్రాలు చించేసే దౌతాల్ సాహూ లాంటి మనిషి (వేదాంతి?) నాగరిక సమాజంలో ఉంటే, మనుషుల మీద నమ్మకం ఇంకాసిని రోజులు ఉంటుంది  కదా అనిపిస్తుంది.   

నిర్జన ప్రదేశం లో ఒంటరిగా సాగు చేసుకుంటూ భక్తి లో మునిగిపోయే రాజూ పాండే ప్రతిఫలాపేక్ష పెద్దగా లేకుండానే తనకి వచ్చిన మూలికా వైద్యంతో కలరా లాంటి రోగాలని పారద్రోలటంలో మనిషితనమే కొట్టవచ్చినట్లు కనపడుతుంది. అంతే కాదు ఇదే రాజూ పాండే చేత ఈ పుస్తకంలో రచయితే చెప్పించినట్లు ‘ధనలోభం, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఉన్న చోట గాలి విషపూరితమై పోతుంది.’ ఎంతటి చక్కని సత్యం.  

అడవిలోని కచేరీలో సిపాయీగా పని చేస్తూ కూడా ఆరణాల ఒక ఇత్తడి గిన్నె కొనటమే తీరరాని కోరిక అయిన మునేశ్వర్ మనిషి జీవితంలోని ఎన్ని లోతుల్ని తడుముతాడో.  నిజం… కోరిక అనే దానికి ఒక స్థాయీ బేధం అంటూ ఏమీ ఉండదు కదా అనిపించక మానదు. మన పిల్లలు మారాం చేస్తే  వాళ్ళని గారాబం చెయ్యటానికి మనం పెట్టే ఖర్చుతో కొన్ని బతుకుల స్థాయిని పోల్చుకోకుండా ఉండటం చాలా కష్టం.

ముసలి భర్త నక్ ఛేధీ పడుచు (రెండవ) భార్య మంచీ… పట్నం సరుకుల మోజులో చిన్న చిన్న వస్తువులకి పెద్ద వెలకట్టి చవకగా వచ్చాయని మురిసిపోయే అమాయకత్వం చూసి మనకి జాలి కలగకపోతే ఒట్టు… అటుపై కలకత్తాపై మోజుతోనో మరో కారణంతోనో అమాయకంగా  మోసపోవటం… చివరికి తన ఆచూకీ తెలియక పోవటం చాలా ఘోరమనిపిస్తుంది. ఎంత ఘోరమంటే ఈ పుస్తకపు ముగింపు వాక్యంలో ఆమెనే  తలచుకునే విషాదమంత.

ఇదే నక్ ఛేధీ మొదటి భార్య తులసి కూతురు సురతియాని ఎలుగ్గొడ్డులంటే మీకు భయంలేదా అన్నప్పుడు  ‘భయపడితే మాకెల్లా బాబూ' అంటుంటే జీవితమన్నది వయసుతో సంబంధం లేకుండానే ఎన్ని పోరాటాలు నేర్పుతుందో కదా అనిపిస్తుంది.

మినప్పిండి మూటగట్టుకుని మైళ్ళకి మైళ్లు నడిచి అడవిలో భుక్తి కోసం బడి ఏర్పాటు చేసి పెట్టమని మటుక్ నాథ్ పండిత్, సత్య చరణ్ ని అమాయకంగా విసిగించటంలో  మనకీ కాస్తంత నవ్వు రావటం కద్దు. పిల్లలెవరూ చేరకుండానే పాఠాలు చెప్పటం మొదలు పెట్టిన ఆ పండితునికి సంవత్సరాలు గడిచే సరికి, విద్యార్ధులతో పాటుగా  గాదె నిండా ధాన్యం పోగుబడటం కాలం చేసే మాయాజాలం కాక ఇంకేమిటి అనిపిస్తుంది.  

అరవై ఏళ్ల దశరథ్ పసి బాలుని మాదిరిగా వెన్నదొంగ కృష్ణుడిగా చేసే నాట్యం బతుకు నడుపుకోవటానికి మనిషి పడే పాకులాటని మన కళ్ళ ముందు నిలుపుతుంది.   

సంతాల్ వంశ వారసుడు... రాజ్యం మిగలని రాజు 'రాజా దోబరూపన్నా వీరవర్దీ'… ఆయన మునిమనవరాలు రాజకన్య భానుమతి… అతిధికి చేసే మర్యాదలోనూ రాజసం పోగొట్టుకోని వైనం. ఆయన పూర్వీకుల ప్రాచీన సమాధులని చూస్తే ఈజిప్ట్ లోని ‘వాలీ అఫ్ ది కింగ్స్’ గుర్తుకు రావటం మనల్ని ఆదిమ కాలంలోకి ఒక్క క్షణమైనా లాక్కెళ్ళటం తథ్యం.  ఇదే భానుమతి మీద సత్యచరణ్ మనసు పడి ఆమెని తన భార్యగా ఊహించుకోవడంలో సుతి మెత్తని ప్రేమ రూపం కనిపించడం మనకి వింతేమీ అనిపించదు.

అడవి దున్నలని రక్షించే వన్య మహిష దేవత టాండ్ బారో, ఒకానొక ప్రదేశంలో  గుడిసెలో పడుకున్న వాళ్ళకి తెల్ల కుక్కలా, ఆడమనిషిలా ఒక్కొక్కళ్ళకీ ఒక్కోలా కనిపించే చిత్ర విచిత్రమైన మర్మాలతో నిండిన కథలు బహుశా అడవి గాలుల్లోనే ఊపిరిపోసుకుంటాయేమో.

‘ఉసిరి కాయలు ఎక్కువ తింటే ముసలి తనం ఒక్కసారే వచ్చెయ్యదు, యవ్వనం చాలా కాలం నిలుపుకోవచ్చు’  అనే వృద్ధ సన్యాసి ఇప్పుడు కనబడితే భలే ఉంటుంది అనిపించటం సహజం కదూ. ఎందుకంటే మనకి యవ్వనం మీద మక్కువ ఎక్కువ కదా మరి.

నిజానికి ఈ పుస్తకం లో అచ్చమైన వనవాసి సత్య చరణ్ కాదు… యుగళ ప్రసాద్. అరణ్యాల మీద ప్రేమతో కుటుంబాన్ని వదిలేసి వేరే పనేమీ లేకుండా  ఒక అడవిలో లేని పూల జాతులనీ... తీగలని... మరొక  అడవి నుండి తెచ్చి అడవి అందాన్ని మరింత శోభాయమానంగా మార్చటం ఎంత గొప్పతనం. అంత కన్నా గొప్ప ప్రకృతి ప్రేమికుడెవ్వడని?

పిల్లల ఆకలి తీర్చటం కోసం ఎంగిలి ఆకుల కోసం ఎదురు చూస్తూ, రాలి పడిన అడివి రేగులకోసం తన్నులు తిన్న కుంత, మరుగున పడిపోబోతున్న ఒక నాట్యకళ కోసం దేశాలు తిరిగి దానిని నేర్చుకున్న నిజమైన నాట్య పిపాసి ధాతురియా లాంటి మంచి మనుషులే కాదు అక్కడి పేద జనాన్ని తమ అర్థ అంగ బలాలతో అదుపులో ఉంచుకునే రాసవిహారీసింగ్, ఛటూ సింగ్ లాంటి దుర్మార్గులూ ఉన్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరి బతుకులు… ఎన్నెన్ని పాఠాలు… పుస్తకంలోని నిడివి కొలమానం గా చూస్తే వీరిలో ఎవరి కథా కూడా ఒకటి రెండు పేజీలని మించదు కానీ, గుండె లోతుల్ని తడమటంలో మాత్రం అనంతపు ఆర్ద్రతని పరిచయించటం ఈ రచనలోని గొప్పతనమనుకోవచ్చు.

ఇదే పుస్తకంలో ఒకచోట సత్య చరణ్ ఆలోచనల్లో ‘ఒక్కొక్క జాతి సభ్యతలో నిగూడంగా ఏవో బీజాంకురాలు ఉంటాయి. ఎంత కాలం గడుస్తుందో అంత  సారవంతమవుతాయి. ఒక్కొక్క జాతి వేలాది సంవత్సరాలు గడిచినా అదే స్థితిలో స్థాణువుగా ఉండిపోతుంది.’  అని అనిపించటం జీవన పరిణామాల వైవిధ్యాన్ని తెలుపుతుంది. బహుశా ఆ సారవంతమైన బీజాంకురాలే నేటి రోజున నాగరికమై ప్రకృతిని,  స్థాణువుగా ఉండిపోయిన సాటి జాతిని నిస్సారం చేస్తున్నట్లు అనిపిస్తుంది.

ఈ మనుషుల బతుకులన్నీ సత్య చరణ్ కి ఉద్యోగ ప్రస్థానంలో ఎదురైన కొన్ని జీవితాలు మాత్రమే. నిజానికి ఈ పుస్తకపు కథానాయకుడు / నాయిక అని ఎవరినైనా చెప్పాల్సి వస్తే అది అడివే. నిజం.. మహాలిఖాపర్వత సానువుల్లో కుశానదీ తీరంలో పరివ్యాప్తమైన  ఆజమాబాద్, లవటూలియా, మోహన్ పుర, సరస్వతీ కుండీ & ఫూల్కియా లాంటి మహారణ్యాలే ఈ పుస్తకంలో ప్రధాన పాత్రదారులు.

ఈ అరణ్యాల పూర్వ నాగరికత స్మరణతో పాఠకుల్ని కూడా కొన్ని యుగాల వెనుకకి తీసుకుని వెళతాడు రచయిత.

దూధలి, గోల్ గోలీ, భండీర, సప్తవర్ణి, రక్తపలాశ, స్పైడర్ లిల్లీ వంటి అడవి పుష్పాల సుగంధాలు…వాటి అద్భుతమైన శోభ...  మన మనసు పుటల్లోకి లీనమవ్వటం ఒక ఆత్మానుభూతి. అడవిలో కాసే వెన్నెలలో దూధలి పుష్పాల అందాలు వాటి మధుర వాసనలు మనల్ని వెంటాడటమే కాదు, అదే వెన్నెలలో లోకం నుండి విముక్తి భావం కూడా కనిపించడం ఓ జీవన వైరుధ్యం.  

వెన్నెలందం తెలియాలంటే కాననంలోనేనన్న సంగతి ఆ పుస్తకం పొడుగూతా మనని తడుముతూనే ఉంటుంది.  వేసవి మధ్యాహ్నమయితే రుద్ర భైరవ స్వరూపం… శీతాకాలపు చలి దృశ్యం… కొండా కోనల్ని ఏకం చేసే జడివాన పలకరింపు… మూడు కాలాల్లో అడవి దృశ్యం అవగతమవ్వటం  సాధ్యమవ్వాలంటే అడవిలోకి వెళ్ళనవసరం లేదు. వనవాసి చదివితే చాలు.

మనిషి ఊహకి అందనంత నిస్తబ్ధత వెన్నెల నాటి అరణ్యపు దృశ్యం… దేవతలకీ జలాకాడాలనిపించే అడవి మడుగుల శోభ. చదివే కొద్దీ మనలోకే అడివి ఇంకిపోతున్న మైమరపు...

అడవి… అది మాట్లాడేది ఒకటే భాష… ప్రకృతి భాష. అడవి ఒక్క సారి పూనిందంటే మనం  స్వేఛ్చా దీక్ష పట్టినట్లే.

ప్రకృతి సమ్మోహన రూపం మనుషుల చేత ఇల్లూ సంసారమూ అన్నీ త్యజింపజేస్తుంది. దేశద్రిమ్మరులని చేస్తుంది అని ఈ పుస్తకంలోనే రాయబడ్డ వాక్యం నిజమే కదా అనిపిస్తుంది.

అడవినే  ఆత్మగా పూని రాసినట్లుగా ఇలా చేయిపట్టి అడవిలోకి నడిపించే పుస్తకం మరొకటి చదవగలను అని నేననుకోను. అడవి మీద సాధికారత వచ్చేస్తుందేమో అనిపిస్తుంది ఈ పుస్తకం ఒక్క  సారి చదివితే.

కానీ చివరకు జరిగేదేమిటి?

అరణ్యంతో ప్రేమలోబడ్డ సత్యచరణ్ లాంటి వన్యప్రేమికుడే, ఉద్యోగానికి బద్ధుడై తమ ఎస్టేట్ కి సంబంధించిన 30000 బిఘాల (బిఘా అంటే సుమారు 40 సెంట్లు నేల) అరణ్యానికి కౌలుదారులని ఏర్పాటు చేసి అడవులు పంట భూములుగా మారటానికి కారణమవ్వటం. చివరకు ఇదే అసలైన సత్యం. మనుషులు ప్రవేశించగానే ఈ ప్రకృతి లోని మాయామోహిని అంతర్థానమై పోతుంది. సౌందర్యమంతా  లుప్తమై పోతుంది. ఎందుకంటే  మట్టి నుండి… మబ్బు నుండి దూరంగా జరిగిపోతున్నాడు మనిషి.  

లవటులియా చెట్ల కింద పారేయ బడ్డ  ఖాళీ పాల డబ్బాలూ జామ్ డబ్బాలు చూస్తే సాటి మనుషుల చేష్టల పట్ల  సత్య చరణ్ కే కాదు నాకూ మీకూ కూడా ఎబ్బెట్టుగానే ఉంటుంది.

పుస్తకమంతా చదివాక మనిషికి కావాల్సిందేమిటి ఉన్నతా? ఆనందమా?  అన్న అనుమానం మనకూ వచ్చిందంటే ఇప్పుడు అరకొరగా మిగిలున్న అడవుల  మీద కాస్తంత ఆశ నిలుపుకోవచ్చు

ఏ వస్తువు ఎంత దుర్లభ మవుతుందో మనిషికి అదంటే అంత అమూల్యమవుతుంది. ఇది కేవలం మనిషి కల్పించుకున్న కృత్రిమ మూల్యం. వస్తువుల యదార్థ అవసరాలు, అనవసరాలతో  దీనికి సంబంధం లేదు. మరి నానాటికీ ప్రపంచంలో పెరిగిపోతున్న క్షామాన్ని చూసాక అడివి ఎంతటి అమూల్యమో గ్రహింపుకి వస్తే సరిపోదు. యుగళ ప్రసాద్ లా ఎక్కడికక్కడ అడవుల్ని పెంచాలి.

చదవటం అంతా అయిపోయాక నాకనిపించిది ఒక్కటే చిన్నప్పటి నుండి నేను నడచిన ఈ  నేలంతా బహుశా ఒకనాటి మహారణ్యమే అయి ఉంటుంది కదా అని.

ఈ పుస్తకంలో సత్య చరణ్  అంతరంగం చెప్పినట్లు ‘కథ వినాలంటే అన్ని స్థలాలూ పనికి రావు. కథలు వినటంలో పరిసరాల ప్రభావం ఎంత వరకూ ఉంటుందో కథా ప్రీతిగలవారికే బోధపడుతుంది.’ అలాంటిదే ఈ పుస్తకం కూడా. ఏదో పుస్తకంలే చదివేద్దాం అనుకునేలా చదవటంలో ఏ అనుభూతీ పలకరించదు. కాస్తంతైనా ప్రకృతిని ఆవహించుకుని చదవటం మొదలు పెడితే పుస్తకం పూర్తయ్యే సరికి… మనమూ… అరణ్యమూ… కలగలపి అరణ్యాత్మగా మారిపోవచ్చు.

ఒక పుస్తకం గురించి రాయటం మరో పుస్తకమంత అయ్యేలా ఉందంటే బహుశా అది వనవాసి అయ్యి ఉంటుందేమో.( ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకం ఇప్పుడు అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది. వెల: 120 రూపాయిలు )


0 comments:

Post a Comment