Saturday, 10 September 2016

అభయముద్రపొగబారి మసకేసిన అస్తిత్వాన్ని
సంస్కరించజాలని బద్ధకపు సమయాల సడిలో
నేటి ఉనికి
చరిత్ర గర్భంలో శైథిల్యమవుతుందే గానీ
ఏ రాతి పుటల శాసనమవ్వదు

నీ సమయాలన్నిటినీ
ఎవరి బందీఖానాలో ఖైదు చేసుకున్నప్పుడు
పంజరమొకటి పరిపూర్ణమై
కరడు గట్టిన శూన్యం స్వేచ్ఛగా
మనసు నిండా విషాద లేఖనమవుతుంది

విషాదమే నిషాదమైన సమయంలో
ఏకాంతపు తర్కమే నికషమై
దుఃఖమాలిన్యాలన్నిటినీ అశ్రువులుగా
తర్పణం వదులుతున్న చోట
మరింత కొత్తగా మొదలవ్వటమంటే
నీకు నువ్వు శతపత్రాల కలువపు సౌందర్యమవ్వటమే

పురాణ పురుషులెవ్వరూ రక్షకి రాని తరుణాన
ఇతిహాస కథలేవీ వాస్తవమవ్వని జీవన గమనాన
నీకు నువ్వే అభయముద్రవన్న నిజంలోకి
నడవటమే నీ జీవన వికాస సూత్రం

0 comments:

Post a Comment