Wednesday, 7 September 2016

ఎక్కడ దిగి పోవాలిఎక్కడ దిగి పోవాలో తెలిసుండాలి
గౌరవపు వీడ్కోలు కావాలంటే
పయనంపై మోహంతో
గమ్యపు కొలత తప్పిందా
కాలమే ఎక్కడో తోసేస్తుంది

సగం రాయబడిన క్షణాలంటూ
ఏమీ లేని సమయాన
సంసిద్ధంగా ఉండాలి అనుక్షణం
కాలం మరో సారి
నిన్ను పలుచన చెయ్యకుండా

నిన్ను నువ్వు రద్దు చేసుకోవటం
నేర్చుకోనంత వరకూ
ఈ పరిమిత గాలి గోళంలో
ఎవరికీ అనుభవమవ్వని మిథ్యాదృశ్యానివై
గిరికీలు కొడుతూనే ఉంటావ్

హేతువుకందని అస్తిత్వాల వెదుకులాటలో
ఆశలకందిన కలలతో  భ్రమల పెనుగులాటలో
ప్రతి నువ్వూ ప్రతి నేనూ
ఒక అవాస్తవికతగా ఘనీభవించటం
చరిత్ర లిఖించని చైతన్య స్వరూపమే

నువ్వొక నిరాపేక్షగా రూపాంతరమైన వేళ
నిర్వ్యాపకపు సమయాలన్నిటికీ
నువ్వే చిరునామా అవ్వటముంది చూశావూ…
బంధాల బంధనాలన్నిటినీ

తెంచుకున్న స్వేఛ్చాతత్వమది

0 comments:

Post a Comment