Monday, 3 October 2016

నీలాంటి వాడినేఏయ్…

నిన్నేమనాలో… నీలాంటి నన్నేమనాలో తెలియని అయోమయమిది. నాగరికం నేర్చుకున్న మేథావులం కదా మరి. మనకంటికాననివన్నీ చులకనే. మనిషికి మనిషే వెటకారమైన వ్యవస్థలో ఇంకా మనిషిగానే పిలవబడుతున్నామంటే మనలని నిలదీసే జీవమింకా లేదు కాబట్టే.

ఎవరెలా ఉండాలో మనమే చెప్పేస్తాం. ఇలా నడిస్తే తప్పు ఇలా మాట్లాడితే తప్పు ఇలా రాస్తే తప్పు. ఇలా కాదు నువ్వు అలా రాయాలి. ఇలా నటించాలి. ఇలా డాన్స్ చెయ్యాలి… ఇలా ఇలా ఇలా… ఈ ఇలాలన్నీ ఇళాతలంలో మనకి నచ్చిన ఇలాలే.

ఎదుటి మనిషి బతుకంతా మనకు నచ్చిన నియమాలలో బందీ అయితేనే మనకి ఆనందం.
మనకి నచ్చని భాషా... యాసా … అన్నీ అవకరాలే అనిపించటం… మనిషిలో శారీరక లోపాలూ న మన నవ్వుకోళ్ళకి సాధనాలవ్వటం విచారకరం. మనిషి మనిషిలో పెరిగిపోతున్న వెకిలితనానికి పరాకాష్ట.

మనకు నచ్చని ప్రతిదీ మనకి నవ్వుకునే విషయమవ్వటమే విషాదం. మనకి నచ్చని ప్రతి వారిని ప్రతివాదిగా చూడటమే నేటి మనిషి నైజం. మనకి నచ్చని ప్రతి మనిషిని విదూషకుడిగా చూడటం.... ఏ సిద్ధాంతమైనా మనిషిని ఆవరించిన వాతావరణాన్ని బట్టే ప్రోది చేసుకుంటుందని తెలిసీ మనది కాని ప్రతి సిద్ధాంతాన్ని గేలిచెయ్యటం నవీన మేధావిత్వం. ప్రతి మాటలో సెన్సార్ షిప్ కి దొరికేవి ఏముందని రంధ్రాన్వేషణ చేసుకుంటూ అలవి మాలిన ఘర్షణ లోకి ఒదిగిపోవడమే నేటి జీవన విధానం.

నాగరికం పెరిగే కొలదీ మనిషి మనసు నేర్చుకున్నది అనాగరికం సాటి మనిషిని ఎలా చూడాలో తెలియని వెకిలి తనం. మన స్థాయిలో ఇమడని వాళ్ళంతా ఎర్రబస్సు దిగి వచ్చిన వాళ్ళో లేదా అడవి మనుషులో. కుక్కలకి పట్టు పరుపులేసే మనకి మనుషులే అంటరాని వాళ్ళు.

రోడ్డు మీద వెళుతున్నప్పుడు మన ముందు వెహికల్ ఆగిపోతే తన ఇబ్బంది గురించి ఆలోచించక చెవులు మోతెక్కేలా హారన్స్ మోతెక్కించే మనం మన వెహికల్ ఆగిపోయినప్పుడు మాత్రం మనుషుల్లో విలువలు మృగ్యమై పోయాయని వాపోతుంటాం.

మన పక్క కాంపౌండ్ ఖాళీగా ఉంటే మనింట్లో చెత్తని అక్కడ డంప్ చేసే మనం ఊళ్ళో చెత్తగురించి మునిసిపాలిటీని తిట్టుకుంటాం. మనం చేసే ప్రతిపనిలో మనకి మనం ఉన్నతులమే అయ్యాక ఎదురయ్యే ప్రతివాడూ ఒక లోపధారే...

అసలు మనం పుట్టటమే

ఫలానా కులంగానో
ఫలానా మతంగానో
ఫలానా జాతిగానో
ఫలానా ప్రాంతం గానో

ఇంకా ఎన్నో ఫలానా.. ఫలానా లని తగిలించుకుని పుడుతున్నాం… దాన్నే మన మనస్సులో ఇంకించుకుంటున్నామే కానీ… అసలు మనిషిగా పుట్టటం లేదన్న సంగతినే విస్మరించేసాం. దాని ఛాయలని గుర్తు పెట్టుకున్నా ఆర్కియాలజీ వాళ్ళు ఎక్కడ భద్రపరిచేస్తారేమో అన్న భయంలోకే వెళ్లి పోయినట్లున్నాం.

ప్రతి బంధానికి సంవత్సరంలో ఒక రోజుని కేటాయించుకున్న మనం మనిషి తనం కోసం మనిషి మనిషిగా బతకటం కోసం ఒక్కరోజునీ కేటాయించుకోలేకపోవడం లో ఉన్న అర్ధం ప్రపంచంలో మనిషి మైనారిటీ లో పడిపోయాడనేనేమో.

ఇట్లు...

ఓ నీలాంటి వాడు

0 comments:

Post a Comment