Monday, 26 December 2016

ఎవరు నువ్వు?

ఏయ్…

ఎవరు నువ్వు?

నేనుగా  సాగిపోతున్న నా అహాన్ని  వెక్కిరిస్తూ ‘మనం’గా మారిపోదాం రమ్మంటూ అస్తిత్వపు లెక్కల్ని తిరగ రాసే సంకల్పానికి శ్రీకారం చుడుతూ… నిద్ర పోతున్న నిన్నటి స్వప్నాల్ని రాజహంసల రథంపై సున్నితంగా మోసుకొస్తూ… కలుపు మొక్కలా నాలో పెరిగిపోయిన చీకటి తత్వానికి కొత్త భాష్యం చెబుతూ… చిత్రమైన నా ఒంటరితనాన్ని బహు చిత్రంగా అంతిమప్రయాణం వైపు నడిపిస్తూ…

అసలెవరు నువ్వు?

ప్రణయమొకటి ఘటం పట్టుకుని రాసిన ఊపిరి ప్రణవానివా
కలం చివర గడ్డ గట్టిన ఆలోచనకి  మళ్ళీ  జీవం పోసిన అరుదైన అక్షరానివా
తనువులో ఇంకిపోయిన నీలాల దిగులు సెగల్ని తరుముతున్న చంద్ర రేఖవా
వాయుగుండమై  చలిస్తున్న శీతల సమీరాన్ని పట్టి తెచ్చి రగిలిపోతున్న గుండెపై పరచిన హేమంతానివా!

ఎవరు… ఎవరు… అసలెవరవు నువ్వు?  నీ అడుగుల ధ్వనిని నా పాద సవ్వడితో జత పరచటానికి నువ్వు పడే తహ తహ మధురాక్షర ముద్రితమై మూసుకున్న నా గుండె వాకిలి గుమ్మానికి  స్వాగతాతోరణం కట్టేలా చేసింది.

ఎవ్వరివైతేనేం…. నేనొక ఖాండవ వనమైన చోట నువ్వొక విరహ దహనమై నన్ను కాల్చేస్తున్న సడిలోనూ నా తమస్సు ఉనికిని ఆవిరి చేస్తున్న కాంతి ఉషస్సువైన స్పర్శే తెలుస్తుంది.  యుగాల తపస్సులు ప్రోది చేసుకున్న  యశస్సులన్నీ ఒక్కటిగా నన్ను పునఃనిర్వచనం చేస్తున్న సంగతివి నువ్వన్న నిజం గుండెని తడుతుంది.

బతుకంతా  ఆనందాన్ని స్వప్నించటంలోనే సరిపోతుంటే నన్ను నేనొక రంగస్థలం చేసుకుని ఆడుతున్న నటనల విముక్తివై,   ప్రణవాన్ని  ప్రణయంతో… మోదాన్ని మోహంతో… దాటవెయ్యడానికి నువ్వు పడే తపన ఉంది చూశావూ…అందులో... శతాబ్దాల  దాహాన్నీ ఒక్కసారిగా తీర్చేయ్యాలన్న ఆరాటమే కనిపిస్తుంది.

ఇప్పుడు… నా హృదయ ఆవరణ నిండా పరచుకున్న పసిడి మీగడ తరక ఒక్కటి నీ నవ్వుల తారకలని ఒడిసి పట్టడానికే తానక్కడ తిష్ట వేశానని స్వగతంలో చెప్పుకుంటుంటే తెలిసి వచ్చింది… కొన్ని నవ్వులు  నక్షత్రాలవుతాయని… మనసాకాశాన పర్ణశాలలై సేద తీరుస్తాయని.

మళ్ళీ మళ్ళీ తడుముతున్న స్మృతుల స్పర్శతో కను రెప్పల మధ్య కురిసీ కురిసీ గుండెలో గడ్డ కట్టిన కన్నీళ్ళని హత్తుకోవడానికి సెలయేరై చేతులు చాచిన మనసు కొనల చిరుతాకిడి నన్నొక ఆనంద ప్రవాహంగా కరిగించడం నీ ప్రేమ జాలమే కానీ ఇంకే ఇంద్రజాలమూ  కాదని తెలుస్తున్న ఈ సమయాలు ఉన్నాయి చూశావూ కాలానికి కొన్ని మెరుపులద్దుతూ సమ్మోహనమై మనఃమందసంలో నిక్షిప్తమై అహరహమూ వెలుగులీనుతూనే ఉంటాయిక.

నా గాయాల రహదారులద్దుకున్న అనంతపు గమ్యాలన్నీ నిన్ను తాకగానే అదృశ్యమైపోవటాన్ని నా అంతట నేనే  సర్వేంద్రియాలతోనూ వింటున్నా. క్రొంగ్రొత్త సందిగ్ధాల పలకరింపులో  ఒక అపరిమితమైన పులకింతల థిల్లానా కొనసాగుతుంటే నాకు  తెలిసిందొక్కటే… సందిగ్ధాలన్నీ సమస్యల సడేమీ కాదని.

కళ్ళలో దీపాలని వెలిగించటం మాత్రమే నీకు తెలుసన్న సంగతి నాకనుభవమైన ఈ నేడు… ఈ జీవితపు కొనసాగింపు వరకూ నా మనసుని చుట్టు ముట్టే ఉంటుంది. అంతర్లోకంలో వెల్లువలా వచ్చిన ఆహ్లాదకరమైన పరిమళం నీ చోటుని వదలటానికి ఇష్టపడటం లేదు. బహుశా నువ్వొక పరవశపు అయస్కాంతానివేమో

ఇన్నాళ్లుగా నిశ్శబ్దానికి ఎంత నిర్దయో నన్ను వదిలి వెళ్ళదు అనుకున్నా. ఇప్పుడది తనకు తానుగా ఆత్మహత్యించుకుంటూ శూన్యం నుండి జారి పడుతున్న ఓంకారాన్ని నా నినాదంగా మార్చినప్పుడు తెలిసింది… నిశ్శబ్దమంటే మరేమీ లేదు ఒక్క ఆది ప్రణవాన్ని ఆవరించుకుని కొన సాగుతున్న అనంత మౌననాదమని.

నాలోని నల్లని నీడలన్నిటినీ ఒలిచేసిన ప్రభాత చాయకి దారిని సుగమం చేసిన సమ్మోహనపు వంతెనవు  నీవన్న నిజం నీకు నువ్వుగా నాకు చెప్పక పోవచ్చుకానీ, వంతెన దాటేసినా పరిమళాన్ని కోల్పోని కిరణాల శ్వాస నిన్ను పట్టించేస్తుంది.

"ఎండమావుల వాకిట్లో, వెచ్చగా మునిగిన
తడి కలల నావలన్నిటినీ
వాస్తవ తీరం చేర్చడానికి
గాలికి ఎదురొడ్డి నిలబడే
చిరగని తెరచాప కుట్టగలిగే ధీశాలి
అడుగుల చప్పుడొక్కటి చాలు
లోకం కొత్త బాట పడుతుంది

నిజం…
కొన్ని అడుగులంతే !
ఎక్కడ నుండి మొదలైతేనేం
గడ్డకట్టిపోయిన కొన్ని నడకలకి ఊతమౌతూ
అచలనపు చరణాలకి  కొన్ని గమ్యాలని అంటుగడుతూ
మెత్తగా... సుతి మెత్తగా... తమ ముద్రల్లో
కొన్ని విజయాల్ని దాచి పెడుతూ
ఒక్క ధైర్యాన్ని దారంతా పరిచేస్తాయి

ఇప్పుడు ఆ ధీశాలి ఎవరంటే
చెప్పలేకపోవటానికి ఏముంది
నా నడకలకి కొత్త అడుగుల జతవై
ఒక జీవితపు దూరమంత తోడుగా
మారిన ‘నిన్ను’ చూస్తూ కూడా "

నిజంరా ! నీకు నువ్వుగా నా జీవితం వైపు వేసిన ఈ కొన్ని అడుగులే నన్నొక కొత్త వచనంగా రాయబోతున్న సవ్వడి అనుభవమవుతూ ఉంది.  నువ్వు నాలో ఎన్ని పేజీలు  చదివావో నాకు తెలియదు కానీ,  నా మౌనాన్ని చిదిమిన లేహ్యంతో  నీ మనసునొక లేపనం చేసి నాపై రాసిన నీ శబ్దం చెబుతుంది ఇక జీవితాంతం నేను చదవబోయే మధుర కావ్యం నువ్వని.

ముద్దుని చిదిమి మురిపాన్ని సుగంధంగా వీస్తున్న అన్వేషణలో ఒకరికొకరిగా తారసబడ్డ తాళ పత్రాలమైన అలజడిలో అధరాలే ఘటాలై తనువంతా  మధురాలే రాయబడుతున్న క్షణాల అల్లరిలో తెలిసింది నువ్వు ఇన్నాళ్లుగా నే భ్రమ పడుతున్నట్లుగా  కథవు కావని… మనంగా మారిన నా నీ కొనసాగింపని !

ఇంతకూ నీ అడుగులు ‘సప్తపది' కై  నా అడుగులనే జతగా ఎందుకు  కోరుకున్నాయో చెప్పవూ… ఒక్క సారి వినాలని ఉంది..

నీ…

నేను


1 comments:

ఎంతందంగా రాసారండి
ఇహెప్పటికీ మరిచిపోనివ్వకుండా...
ఎప్పుడు చదివినా నిజమేననిపించేలా...!లవ్ ఇట్!

దీనిని మించిన మీ మరో ప్రేమలేఖ కోసం ఎదురుచూస్తూ ఉంటాను... దయచేసి రాయండి.

Post a Comment