Thursday, 27 April 2017

జీవనయానం - అచ్చమైన మట్టివాసన

ఆత్మ కథ అంటే ఒక విధమైన స్వోత్కర్ష అనే అభిప్రాయం ఉండటం సహజం. కానీ ఒక ఆత్మకథ ఒక జీవన ప్రవాహంగా సాగటం చూశాక మన అభిప్రాయం మార్చుకోక తప్పదు. మన ముందు తరాల్లో ఏమి జరిగిందో ఎలా జరిగిందో తెలియకుండానే కొన్ని అభిప్రాయలని స్థిరంగా ఏర్పరుచున్న మనల్ని ఒక ఆలోచనా స్రవంతిలోకి అలా తీసుకుని వెళ్ళడం అన్నది ఒక విజ్ఞానజ్యోతిని మన అంతరంగాల్లో వెలిగించడమే.

అలాంటి సమున్నతమైన రచనయే అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య గారి ఆత్మకథ ‘జీవన యానం'. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో  రెండు సంవత్సరాల పాటు ధారావాహికగా వెలువడ్డ మేటి రచన.

వేద కుటుంబంలో పుట్టి తండ్రి నిరాదరణతో… కుటుంబానికి చుక్కానిలా ఆదరువై, ఆయుధాన్ని చేపట్టి తెలంగాణా సాయుధపోరాటంలో పాల్గొని, అటుపై ఉపాధ్యాయునిగా… తరువాత సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఉద్యోగిగా… నాలుగు వేదాలనీ తెనుగించిన అక్షర వాచస్పతిగా సాగిన జీవన యానమే ఈ రచన. ఎక్కడా ఎలాంటి భేషజాలకీ పోకుండా ఒక ప్రవాహపు ఉర్వడిలా సాగిపోయిన రచన ఇది.  

నిజానికి ఇది ఆయన జీవిత యానం కాదు. ఒక జాతి యొక్క 70 -80 ఏళ్ల  ప్రయాణం. ఒక శతాబ్ది చరిత్రని వివరించే విజ్ఞాన సోపానం. ఆ తరపు తెలంగాణా ప్రజల కడగండ్లని మనం కళ్ళారా చూసినట్లనిపించేలా  రాయబడిన ఆత్మకథ ఇది. మనం చిన్నప్పుడు చదివిన మన క్లాసు పుస్తకాల్లోనో లేదా చరిత్ర మీద అభిరుచితో చదివిన పుస్తకాల్లోనో మనకి పరిచయమైన ఎందరో ప్రముఖులు ఇందులో పాత్రలుగా పరిచయం అవుతుంటే, ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాలని మనం చాలా దగ్గర నుండి చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

తెలంగాణా సాయుధ పోరాటంలో ఆయా రాజకీయ పార్టీలు చేసిన చారిత్రిక తప్పిదాలని చాలా సూటిగా చెప్పారు. తెలుగు భాషా బోర్డులని చూడటానికే నైజాం నుండి  బెజవాడ వెళ్ళాలి అనిపించేది అంటూ  ఆ సమయంలో  ఆ ప్రాంతంలో తెలుగు భాష దీనస్థితిని సోదాహరణంగా వివరించారు.  ఒకానొక సమయంలో గ్రంథాలయాలు పోరాట నిలయాలుగా నిలబడి యువతలో పోరాటస్ఫూర్తిని రగిలించిన విధానం పరిచయం చేసారు.  కలరా వ్యాధి ప్రబలంగా ఉన్న రోజుల్లో  మానవత ఎంతగా అడుగంటి పోయి ఉందో ఆయన చెల్లి లక్ష్మి మరణంలో మనకి తెలిసినప్పుడు   ఏ కాలంలో అయినా మానవతది ఒకింత వెనకడుగే అని అనిపించటంలో వింతేమీ ఉండదు.

బయటి ప్రపంచపు మకిలినే కాదు, తన కుటుంబ కలహాలని కూడా ఎక్కడా దాచలేదు. తన తండ్రి, అన్న, కొడుకులు… మరియు తనలో ఉన్న మంచి చెడూ రెండింటినీ  సాధ్యమైనంత నిజాయితీగా రాసారని అనిపిస్తుంది.  పొగడ్తలూ తెగడ్తలూ రెండూ ఉన్నాయి ఇందులో. ఆయా రోజుల్లో తన జీవితంలో జరిగిన సంఘటనల మీద తన అభిప్రాయంలానే అనిపిస్తాయి తప్ప అవేవీ సంచలనాల కోసం ఇరికించినట్లు ఉండవు.

ఇందులో ఒకచోట బ్రిటీష్ వాళ్ళు మనకి టీ ఎలా అలవాటు చేసారో ఏంతో వివరంగా రాశారు. ఏదైనా ఉత్పత్తికి మార్కెటింగ్ అన్నది ఎంత శక్తివంతమైనదో చెప్పకనే చెప్పారు.

వట్టికోట ఆళ్వార్ స్వామి మరియు నార్ల చిరంజీవిగార్లతో తనుకున్న ఆత్మీయతానుబందాన్ని తన రచనల్ని వాళ్ళు ప్రోత్సహించిన తీరునీ చక్కగా విశదీకరించారు. తాను రాసిన ప్రతి రచన యొక్క నేపథ్యాన్ని వివరించిన తీరు బాగుంది.

చదివే కొద్దీ ఆయన జీవితం ఒక జీవనది ప్రయాణంలా అనిపిస్తుంది. ఈ రచననిండా  మనిషి ఉలిక్కి పడేలా అనిపించే  ఉట్టిపడే మట్టివాసనే.  

ఒక ఉత్కృష్టమైన జీవితం తన కథనాన్ని తనే రాసుకుంటుంది. ఆ సంగతి ‘జీవనయానం' పుస్తకం మరోసారి ఋజువు చేస్తుంది.


3 comments:

బావుంది పరిచయం. వీలైతే తప్పక చదువుతాను.

మంచి సమీక్ష. దాశరథిగారు ఉన్నది ఉన్నట్టు వ్రాయటమే కాకుండా, శత్రువులని (ఆయనకి కష్టం, నష్టం చేకూర్చిన వారిని)సైతం గౌరవిస్తూ సంబోధించారు. భాషల మీద పట్టు కోసం ఆయన శ్రమ, చివరికి ఆయన వ్రాసిన సాహిత్యం అద్భుతం. ఒక మనిషి పూనుకొంటే ఏమి చేయగలడు అన్నది నిరూపించిన వ్యక్తి. అలాగే ఒడిదుడుకుల్లో కూడా జీవితాన్ని ఎలా ప్రేమించాలో తెలియచేసిన మనిషి. అందరు తెలుగు వాళ్ళు తప్పక చదవ వాల్సిన పుస్తకం.

నాకు ఇప్పటికి గుర్తు వార్త దిన పత్రికలో జీవనయానం అనే కాలమ్ వస్తుందే మీరు చెప్పినట్టు... నా చిన్నతనం కాబట్టి నాకు అంతా maturity లేదు ...ఈ మధ్యే అయన రచించిన చిల్లర దేవుళ్ళు పుస్తకం చదివాను. ఎంత అద్భుతం అయన రచన! ..... ఇప్పుడు మళ్ళి అయన జీవనయానం పుస్తకం పరిచయం చేసారు. చాలా ధన్యవాదాలు ! I will for sure read his autobiography. Thanks again for the review.

Post a Comment