Wednesday, 13 September 2017

దారి మలుపుకి ఆవల...

ఇన్నాళ్లూ నేను చూసిన అన్నిటినీ
చరిత్ర నడకలతో నలిగిన దారిపైనే  చూసాను
ఇకమీదటంతా నాకే ప్రాధాన్యతలూ లేవు
పరిచయమయ్యే ప్రతి నిజాన్నీ
ఆప్యాయంగా ఆదరించటం తప్ప

దారి మలుపుకి ఆవల
ఏమున్నదో అనుకుంటూ నడుస్తుంటే
బాట పక్కనున్న అందాలని చూడలేమంటూ
మనసు గొంతు సవరించుకున్నప్పుడు
ఒక ఆనందం ఎంత ప్రశాంతంగా
పరిచయమవుతుందో అనుభవమయ్యింది.
ఇప్పటి వరకూ చూసినదంతా
మరోలా పరిచయమయ్యింది

ఇదిగో
ఈ క్షణం నేను చూసినది
ఇంతకు ముందు పరిచయం లేనిది

నన్ను ఆవరించుకున్న ఈ గాలీ
నన్ను నింపుకున్న ఈ నిమిషమూ
ఇప్పుడే ఇక్కడే కొత్తగా పరిచయమయ్యాయి
ఇన్నాళ్ల తెలివిడికీ తెరదించుతూ

అవును… నిజంగా !
గాలంటే  కోట్ల జీవుల ఊపిరి నజరానా అని
నిమిషమంటే పంచభూతాలనూ శాసించే శాసనమని
ఉన్నది ఉన్నట్లుగా పరిచయమవ్వటం ఇప్పుడే మరి

ఒక అనుభూతిలోకి కొత్తగా నడవడం కన్నా  
అద్భుతమంటూ ఏముంటుందనీ


2 comments:

చాలా బావుంది. గాలంటే కోట్ల జీవుల ఊపిరి నజరాన అని నిమిషమంటే పంచభూతాలను శాసించే శాసనమని అనడం బాగనిపించింది. కీప్ రైటింగ్ అండి.

పరిచయమయ్యే ప్రతినిమిషాన్ని,ప్రతి నిజాన్ని ఆనందంగా అంగీకరిచగలిగితే మనకు మనమే రోజుకో కొత్త ఉత్సాహం

Post a Comment