Saturday, 3 November 2018

ఎడారి పక్షి

నా పగటిని నేసినదెవరో కానీ
కాసిని వెలుగుపోగులని
కూర్చడం మరచిపోయినట్లున్నారు


నన్నే విడిదిగా మార్చుకున్న రాత్రేమో
నన్నే తన స్థాన బలిమి అనుకుందేమో
ఎడతెగకుండా చీకటిని నింపుకుంటూనే ఉంది


నిద్రలోనే కరిగిపోతున్న కలలన్నీ
పారదర్శక చీకటికి చిక్కదనాన్ని ఇస్తుంటే  
రెప్పల క్రిందనున్న
కన్నీళ్ల ఊబినుండి బయట పడటానికి
ఏ పాదరసపు అంశా తోడు రాక
అన్ని మెలకువల్లోనూ
పొలిమేర దాటని చీకటి ఒకటి
రాత్రికి ప్రతీకగా పగటికి నను తాపడం చేస్తూ ఉంటుంది


చీకటంటే
ఏ బిడారుల నుండో
నాలోకి శాశ్వతంగా  వలస వచ్చిన ఎడారి పక్షి
అయినందుకేనేమో
తనకో వాగ్దానంగా కుదురుకున్నాను
నేను తనకో వెలుగయ్యాననే రాజసంతో


1 comments:

విడిదిగా వచ్చిన చీకటికి
వేకువ బాట చూపొచ్చు
మనమే వెలుగని వచ్చిన నిశికి
బాస చేసి చీకటి పరదాల వెనుక కాంతిని చూపొచ్చు

Post a Comment