మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Showing posts with label జమీల్యా. Show all posts
Showing posts with label జమీల్యా. Show all posts

Saturday, 16 April 2022

జమీల్యా ... హృదయాన్ని స్వేచ్ఛించే విప్లవం!

 


ప్రపంచ సాహిత్యంలో కొన్ని నవలలు కేవలం కథలుగా నిలిచిపోవు. అవి ఒక కాలంలో మనుషుల ఆలోచనలను, వారి భావాలను, జీవన విధానాన్ని ప్రతిబింబించే గ్రంథాలుగా నిలుస్తాయి. చింగీజ్ ఐత్‌మాతొవ్ రాసిన జమీల్యా అలాంటి రచనల్లో ఒకటి. యుద్ధ నేపథ్యంలోని ఒక చిన్న కిర్గీజ్ గ్రామ జీవితం, ఆ గ్రామంలో ఎదిగిన ఒక బాలుడి కళ్ల ద్వారా మన ముందుకు వచ్చే కథ... అదే జమీల్యా. ఇది కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు. సంప్రదాయపు సంకెళ్లు, యుద్ధం తెచ్చిన బాధలు, అలాగే ప్రకృతిమనిషికళల మధ్య ఉన్న అనుబంధం గురించి ఒక తాత్విక చర్చ కూడా. 

ఇప్పుడు తెలుగులో జమీల్యా  అని మనం చదువుతున్న నవలని 1958 లో మెలోడీఅనే పేరుతో  రష్యన్ & కిర్గీజ్  భాషల్లో రాశారు చింగీజ్ ఐత్ మాతొవ్. 1959 లో లూయీ ఆరగాన్ ఫ్రెంచ్ భాషలోకి చేసిన అనువాదంతో ఇది బయటి ప్రపంచానికి పరిచయం అయ్యింది.  ఆరగాన్ దానిని "ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రేమకథ" అని అభివర్ణించాడు.  1982-1983 చింగీజ్ ఐత్ మాతొవ్  సంపూర్ణ రచనా సంకలనాన్ని కిర్గీజ్ భాషలో  ప్రచురించినప్పుడు జమీల్యా అనే పేరుని  ఉపయోగించారు. అప్పటి నుండి అదే పేరుతో స్థిరపడింది.    

ఈ కథ ఒకప్పుడు  రష్యాలో  అంతర్భాగమైన కిర్గిజ్ స్తాన్‌లోని కుర్కురోవ్ అనే గ్రామ నేపధ్యంలో సాగుతుంది.  

ఈ నవల కథకుడైన సయ్యద్ స్వగతం. తన ఆత్మీయ స్నేహితులైన జమీల్యా & దనియార్ ఇద్దరూ దూరమైన సందర్భం ఉన్న చిత్రాన్ని చూస్తూ గతంలోకి వెళ్లడంలో మొదలవుతుంది. వాళ్ళిద్దరూ తనకి దూరమైన నేపథ్యమే ఈ కథా గమనం. 

ఈ కథా కాలానికి సయ్యద్ పదిహేను...పదహారేళ్ళ కుర్రవాడు.  జమీల్యా అతని వదిన. సయ్యద్ మారుటి తల్లికి  కోడలు. సయ్యద్ కీ  జమీల్యాకీ వయసులో ఏమంత తేడా లేకపోయినా ఆనవాయితీ ప్రకారం వదినా, చిట్టి మరిదీ అని ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు.  

ఇంతకూ సయ్యద్ పూర్వీకులు సంచార జీవులు. సమిష్టి క్షేత్రం ఏర్పడ్డాక ఒకచోట స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండి పోయిన తెగవాళ్ళది. భర్త చనిపోతే కొడుకులు ఉన్న తల్లి ఆ తెగని వదిలి వెళ్ళకూడదన్నది ఆ తెగలోని ఒక నియమం. ఆ నియమానుసారమే  జమీల్యా అత్తగారు తన భర్త చనిపోయినప్పుడు ఆ తెగలో  తమకి  దగ్గరి బంధువైన సయ్యద్ తండ్రిని  పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి చేసుకున్నా ఇల్లూ వాకిలీ గొడ్డూ గోదా అన్ని ఎవరివి  వారివే. దగ్గరగా ఉన్న ప్రత్యేక సంసారాల్లా ఉంటుంది ఆ వ్యవహారమంతా.  

అలాంటి కుటుంబంలోకి సాదిక్ కి భార్యగా అడుగుపెడుతుంది జమీల్యా. ఒకనాడు జమీల్యాతో గుర్రపు పందెంలో  ఓడిపోయి, ఆ అవమానంతో   జమీల్యాని ఎత్తుకు పోయి పెళ్లిచేసుకున్నాడని కొందరూప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారని కొందరూ అనుకుంటూ ఉంటారు.  ప్రేమ వివాహమా లేదా రాక్షస వివాహమా అన్నది మనకి రహస్యమే. పెళ్లి అయిన నాలుగు నెలలకే సాదిక్ యుద్ధంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది.  

ఒక్క తన భర్తే కాదు వయసులో ఉన్న మగవాళ్లందరూ యుద్ధభూమిలోనే ఉన్న రోజులవి. ఆడవాళ్లు, కాస్త పనిచేయగలిగిన చిన్న పిల్లలూ, యుద్ధంలో గాయపడిన సైనికుల్లాంటి వాళ్ళు  సమిష్టి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తూ వచ్చిన పంటని పండే ప్రతి గింజ యుద్ధభూమికేఅంటూ రైలుమార్గాల ద్వారా యుద్ధభూమికి చేర్చుతూ ఉంటారు.  

జమీల్యాలో  ఒక మోస్తరు మగవాళ్ల లక్షణాలు, కాస్తంత దుడుకుతనంఇంకాస్త మొరటుతనం కనిపిస్తూ ఉన్నా అందగత్తె కిందే లెక్క. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. అనవసరంగా మాటపడదు. అవసరమైతే మాటకి మాట సమాధానం చెబుతుంది. ఆమె స్వభావం నిర్మొహమాటంనిష్కాపట్యం...నిజాయితీ. పైకి ఒకలా లోపల ఇంకోలా ఉండటం తనకి తెలియదు. వళ్ళు దాచుకోకుండా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ పనిచేసే స్వభావం ఆమెది. జమీల్యాకి పాట పాడటమంటే చాలా ఇష్టం. అసలు మొహమాటపడకుండా పాట పాడుతుంది. మొత్తంగా చూస్తే  తానెలా ఉంటే సంతోషంగా అనిపిస్తుందో  అలా ఉండటానికే ఇష్టపడుతుంది తప్ప లేనిపోని వినయాలు ఒలకబోసి అవతలి వాళ్ళ మెప్పుకోళ్ల కోసం చూడదు. ఎంతటి పనికైనా  వెరవని ధీర అయిన ఆమె నిజంగా బాధ పడే సందర్భం ఏదైనా ఉందంటే అది తన భర్త సాదిక్ నుండి ఉత్తరం వచ్చినప్పుడే.  

ఉత్తరాలు రాయడానికి కూడా కొన్ని నియమాలు ఉన్న ఆ తెగ ఆచారాన్ని సాదిక్ తూచా తప్పకుండా పాటిస్తూ  తండ్రి పేరు మీదే  ఉత్తరాన్ని రాస్తూ, కుటుంబ సభ్యులని, దగ్గరి వాళ్ళ యోగక్షేమాల గురించి పేరు పేరునా అడుగుతూ , యుద్ధం విశేషాలు చెప్పి ఉత్తరం ముగించేముందు ఒక్క వాక్యంలో జమీల్యాని కూడా అడిగినానని చెప్పమని రాసేవాడు. జమీల్యా ఆ ఉత్తరాన్ని చదవడం ముగించే సరికి ఎరువుతెచ్చుకున్న వస్తువేదో తనచేతుల్లో ఉందేమో అన్నట్లుగా ఉండేది తన స్థితి. 

పండిన ధాన్యాన్ని సమిష్టివ్యవసాయ క్షేత్రపు కళ్లెం నుండి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న రైల్ స్టేషన్ కి చేర్చాల్సిన బాధ్యత జమీల్యా, సయ్యద్ ల మీద పడుతుంది. వీళ్ళకి తోడుగా దనియార్ అనే మాజీ సైనికుడిని నియమిస్తాడు సమిష్టి క్షేత్ర దళనాయకుడు ఒరెజ్మాత్.  

దనియార్ ఒంటరి జీవి.  తను  కూడా ఆ గ్రామస్థుడే. కాకపోతే గ్రామానికి దూరంగా  ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో తిరిగి చివరకి సైన్యంలో చేరి యుద్ధంలో గాయపడి స్వగ్రామానికి చేరుకుంటాడు. స్వగ్రామం మీద మమకారంతో వచ్చిన అతన్ని గ్రామస్థులు చక్కగా ఆదరించారు. తాను ఉండేది ఊరి పొలిమేరల్లో కుర్కురేవ్ నది వడ్డున గడ్డి వాముల దగ్గర.  

ముగ్గురూ కలిసి సైప్ మైదానాల గుండా గుర్రపుబండ్ల మీద వెళుతున్నప్పడు, తమకున్న సహజమైన గడుసుతనంతో మితభాషి అయిన దనియార్ ని ఆటపట్టిస్తూ ఉంటారు వదినా మరుదులు. ఒకనాడు అది మరింత శృతిమించుతోంది. ఒక్క మనిషి మోయలేనంత బరువున్న  ధాన్యపు బస్తాని కావాలని దనియార్ బండిలో వేస్తారు. స్టేషన్ దగ్గర దాన్ని దించవలసి వచ్చినప్పుడు జమీల్యా నవ్వును చూసి అర్థం అవుతుంది అది కావాలని చేసిన పనే అని. దాంతో దనియార్ కోపంతో  మొండిగా అంతటి బస్తానీ ఒక్కడే మోసుకుని వెళ్లి అతికష్టంగా గమ్యస్థానాన్నిచేరుస్తాడు. వీళ్ళిద్దరూ అతని  అవస్థకి తామే కారకులమైనందుకు పశ్చాత్తాపపడతారు. అప్పటి వరకూ రోజూ సరదాగా సాగిపోయిన వారి రోజువారీ  ప్రయాణాలు ఆ తరువాత గంభీరంగా మారిపోతాయి. 

మౌనంగా సాగిపోతున్న ప్రయాణాలలోని యాంత్రికత్వం నచ్చని జమీల్యా ఓనాడు పాట పాడుతుంది. నెమ్మదిగా దనియార్ కూడా పాట పాడిస్తారు. తన పాట అక్కడి కొండకనుమ నదీలోయని నింపేసింది. శిలల్ని తాకి మారుమోగింది.  ప్రగాఢమైన మానవాత్మని బహిర్గతం చేసే పాట అది. తనపాటలో వెల్లడయ్యేది అఖండమైన ప్రేమజీవితం పట్లాఈ భూప్రపంచం పట్లా ఉన్న అఖండమైన ప్రేమ అది.  

ఆ రోజు నుండి రోజూ పాటలేఏ పాట జమీల్యా మనసుని ఎప్పుడు మార్చిందో గానీ జమీల్యా దనియార్ ప్రేమలో పడింది. దనియార్ కూడా ఆమె ప్రేమలో పడ్డాడు. మొదట్లో వీళ్ళ ఇద్దరి ప్రేమ మీద మనసులో తిరస్కారం ఏర్పడినా, వాళ్ళిద్దరి ప్రేమ లోని స్వఛ్చతని చూసి ముచ్చటపడతాడు సయ్యద్. సైప్  మైదానాల్లో  వీళ్లిద్దరి ప్రేమని చూస్తూ  ఉంటే  దనియార్ పాటల్లోని ఉద్రేకం సయ్యద్ ను ఆవహిస్తుంది. తనలో వెల్లువెత్తున్న సంవేదనాల సారాన్ని చిత్ర రూపంలో చిత్రీకరించాలనే కోరిక మనసంతా ఆవహించుపోతుంటే ఆ మైదానాల వడిలో ఉన్న వాళ్ళిద్దరి చిత్రాన్నీ  తన మొదటి చిత్రంగా చిత్రీకరిస్తాడు సయ్యద్. ఆ చిత్రం పెద్దకళాత్మకంగా లేకపోవచ్చుగానీ జీవాత్మకమై ఉంటుంది. ఆ చిత్రాన్ని చూసిన జమీల్యా  సయ్యద్ ని అడిగి తాను  తీసేసుకుంటుంది. 

ఇది ఇలా సాగుతుండగా భర్త సాదిక్ నుండి ఉత్తరం తెస్తాడు సైనికుడు. ఆ ఉత్తరం వచ్చిన రోజుఅది వారి మనస్సుల్లో   కలగ చేసిన సంచలనం వల్ల, ఆ రాత్రి ఎవరికి వారు విడివిడిగా ఊరు చేరుకుంటారు. ధాన్యం చేరవెయ్యడం మొదలు  పెట్టాక అలా ఎవరికి వారు విడివిడిగా వెనక్కి రావడం అదే  మొదటి సారి.  

అదే రాత్రి దనియార్ దగ్గరకు వచ్చిన జమీల్యా తన మనసుని పూర్తిగా విప్పి చెప్పుతుంది. తను తెలియక  ముందే తనని  ప్రేమించి తన కోసమే కాచుకుని ఉన్నానని చెపుతుంది. కందకాల్లో ఉన్నప్పుడే తన గురించి కలగన్నానని దనియార్ బదులిచ్చాడు. ఒకరి కోసమే ఒకరు అన్నట్లుగా వస్తున్న వారి మాటలు గడ్డి  వాముకి  అవతలి వైపున ఉన్న సయ్యద్ వినడం  జరిగింది.  

ప్రేమంటే సున్నితమైనదనీ, అద్భుతమైనదనీఅన్నిటికీ మించి  ప్రేమ అన్నది మనిషి నియంత్రణలకి  లోబడి  ఉండేది కాదనీ తెలుసుకుంటాడు  సయ్యద్.   

ఆ తరువాత ఒక రోజు సాయంత్రం ఊరు విడిచి వెళ్ళిపోతారు జమీల్యా & దనియార్. 

యుద్ధం నుండి ఇంటికి వచ్చిన సాదిక్, అంతకు ముందు సయ్యద్ వేసిన చిత్రాన్ని  చూసి  సయ్యద్ ని నిలదీసి ఆ చిత్రాన్ని ముక్కలు ముక్కలుగా  చించేస్తాడు. 

ఆ తరువాత చిత్ర కళాశాలలో చదువుకై వెళ్ళిపోతాడు సయ్యద్. వాళ్ళిద్దరూ ఊరు విడిచివెళ్లిపోతున్న దృశ్యాన్ని చిత్రించి అకాడమీ ప్రవేశపరీక్షకి పంపుతాడు అతను. దనియార్ పాట జమీల్యాకి జీవగర్ర అనీ, కష్టపడి సంపాదించుకున్న తన ఆనందాన్నీ సౌభాగ్యాన్నీ జమీల్యా ఎప్పటికీ నిలబెట్టుకోవాలనే తపనతో తన స్వగతాన్ని ముగిస్తాడు సయ్యద్.  

సయ్యద్  ఒక చిత్రకారుడు. అతని చూపు లోకాన్ని వాస్తవికంగా చూడడమే కాదు, దాని వెనుక దాగిన భావోద్వేగాలను ఆవిష్కరించగలిగేలా అనిపిస్తుంది. జమీల్యాదనియార్ ప్రేమకథ మనకు నేరుగా వారి నోటితో వినిపించదు. అది సయ్యద్ కళ్ల ద్వారా మాత్రమే మన ముందుకొస్తుంది. దీనివల్ల ఒక రకమైన కళాత్మక బంధం ఏర్పడుతుంది. పాఠకుడు న్యాయనిర్ణేతగా కాకుండా, ఒక పరిశీలకుడిగా మారుతాడు. ఈ విధానం, ప్రేమని వ్యక్తిగత ఘటనగా కాక, సార్వజనీన అనుభవంగా మలుస్తుంది. 

జమీల్యా మౌలికంగా ప్రేమ కథలా కనిపించే సామాజిక & మానసిక ఇతివృత్తం. 

సామాజికంగా చూసినప్పుడు ఇది రూపాంతరం చెందుతున్న సాంప్రదాయ కిర్గిజ్ కుటుంబపు కథ. ఇంట్లో అన్నీ సక్రమంగా జరిగేలా చూసేది తల్లి అయినా కూడా ఆ ఘనతని కట్టబెట్టేది మాత్రం తండ్రికే.   వితంతువులు తమ తెగలోని  వాడినే పెళ్లి చేసుకోవడం, ఉత్తరాలు రాయడానికి కూడా నియమాలు పాటించడం వంటివి ప్రాచీన కిర్గిజ్ తరాన్ని చూపిస్తే, ఉత్తరం ఆఖర్లో ఒక మారు తనని ప్రస్తావిస్తూ, తనని ప్రేమించే మనిషిలా కాక తన స్వంతమైన ఆస్తిలా భావిస్తున్న భర్త నుండి దూరంగా తనని తనలా ప్రేమించే దనియార్ తో కలిసి వెళ్లిపోవడంలో అప్పుడప్పుడే సంప్రదాయ కట్టడి పట్ల కిర్గిజ్ సమాజంలో పొడచూపుతున్న భావాలని  చర్చించారు రచయిత.  

జమీల్యా తన భర్త సాదిక్ యుద్ధరంగం నుండి పంపే ఉత్తరాల్లో ఆమె గురించి ఒక్క మాట మాత్రమే...  అది కూడా కేవలం విధిగా రాయడంలో, భార్య అనేది కుటుంబానికి చెందిన ఆస్తి, ఆమె వ్యక్తిత్వం కుటుంబ పరిమితుల్లోనే ఉండాలి అనే సంప్రదాయ దృక్పథాన్ని రచయిత చక్కగా బహిర్గతం చేశారు. జమీల్యా ఈ బంధనాల నుండి బయటపడుతుంది. ఇది వ్యక్తిగతంగా తన ప్రేమ కోసం చేసిన తిరుగుబాటుగా మాత్రమే కాదు మనం దీన్ని అర్ధం చేసుకోవాల్సింది... ఇది స్త్రీ స్వాతంత్ర్యం పట్ల ఒక సంకేతంగా చూడాలి. తనను స్వంతమని భావించే భర్తకు బదులుగా, తనలోని మానవత్వాన్ని పరిగణించే మనిషిని ఆమె ఎన్నుకుంది. ఇది కేవలం ‘అవిధేయ భార్య కథ’ కాదు. ఇది ఒక సామాజిక విప్లవపు చిన్న రూపం.

 

అనాధ అయిన దనియార్ మీద ఉన్న నమ్మకం తన భర్త మీద  ఆమె పోగొట్టుకుందంటే  కారణం ఏమిటి. ఆమె మనసు మీద పడ్డ బంధనాలు. ఆ బంధనాలన్నిటినీ తెంపుకోవడానికి ఒక ఇంధనం అవసరం అయ్యింది. ఆ ఇంధనం దనియార్ పాట అయ్యింది. నిజానికి ఇక్కడ పాట కాదు  ఇంధనం, పాటరూపం లో వెల్లువెత్తుతున్న సార్వజనీన ప్రేమ భావన. అవును దనియార్ ది  సార్వజనీన ప్రేమ భావనే. తానెక్కడా  జమీల్యా మీద పాట కట్టలేదు.  దనియార్ దేన్ని ప్రేమిస్తున్నాడోతాను ప్రేమించేదీ దాన్నే తప్ప భౌతికంగా కనిపించే దనియార్ ని కాదు. అందుకే ఇందులో జమీల్యా దనియార్ నుండి ఎలాంటి భరోసా ఆశించలేదు. అతనిలో ఉన్న ప్రేమని పంచుకుంటే ఎలాంటి అనుభూతి అవగతమవుతుందో ఆమె గ్రహించింది.  

ఇక్కడ మనం దనియార్ పాత్రను లోతుగా పరిశీలిస్తే, అతనో అనాధ. తరచి చూస్తే అతోనో నిలువెత్తు గాయంగా కనిపిస్తున్న మనిషి... తన గతమంతా గాయాలూ...  అవమానాలే. కానీ అతని లోపల ఒక అఖండమైన శక్తి ఉంది... పాట. నిజానికి ఆ పాట జమీల్యాకి మాత్రమే కాదు, ప్రకృతికి, భూమికి, జీవనానికి అంకితం. దనియార్ లోని ఈ విశ్వప్రేమను మొదటగా గుర్తించింది జమీల్యా. విశ్వజనీనమైన ప్రేమకి రూపం ఇస్తున్నట్లుగానే దనియార్ పాత్రని భౌతికంగా మనకి పరిచయం చేశారు. ఆ ప్రేమని  ఎవరెలా స్వీకరిస్తారో వారి వారి మానసికస్థితులని బట్టి మారిపోతూ ఉంటుంది. నిజానికి  సయ్యద్  కూడా దనియార్ ప్రేమలో పడ్డాడు. అంటే దనియార్ పాటలో వెల్లువెత్తుతున్న ఉద్రేకపు కారకాల ప్రేమలో. వాటిని  వెల్లడించడానికి తను చిత్రకారుడయ్యాడు. అందువల్ల, దనియార్ ప్రేమ వ్యక్తిని మించినది, ఒక విశ్వాత్మిక అనుభవం. 

జమీల్యా దనియార్ తో అన్న నిన్ను తెలియకముందే నిన్ను ప్రేమించానుఅంటే ఏమిటి? ఆ నిన్ను అనేది ఒక వ్యక్తి కాదు. ఆ వ్యక్తి లో ప్రస్ఫుటమవుతున్న మార్మికత్వం. తాను దాహపడుతున్న మార్మికత్వందానికి మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు ప్రేమ అనోఇంకోటనో!  

ఇందులో దనియార్, జమీల్యాల పాటనీ, సయ్యద్ చిత్రలేఖనాన్నీ ప్రముఖంగా ప్రస్తావించడం ద్వారా సంగీతం, చిత్రలేఖనంలాంటి కళలు మానవ జీవితాల్లో ప్రధాన పాత్రలని చెప్పకనే చెప్పినట్లుగా ఉంటుంది. స్త్రీ పురుషులని, ప్రకృతిని ఏకం చేయడానికి కళలు అనేది ఒక మార్గమని వాటి మీద ప్రేమ అనే భావన ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తుందని అనిపిస్తుంది. 

దనియార్ జమీల్యాల ప్రేమ అన్నది కిర్గీజ్ సమాజపు ఉజ్వలభవిష్యత్తుకు ప్రతీక అనుకోవచ్చు. సంప్రదాయపు సంకెళ్లని దాటి బయటకి వచ్చి జాతిపునర్నిర్మాణానికి పునాది వేసిన అడుగు అని కూడా అనుకోవచ్చు.  

ఒక ప్రేమకథలో ఇంతగా సమాజాన్ని ఇమడ్చగలగడం అన్నది నిజంగా రచయిత అద్వితీయ ప్రతిభకు తార్కాణం. అంతే కాదు అతి తక్కువ పదాల్లో యుద్ధ తీవ్రత ఎలా ఉంటుందో చెప్పడం ఇంకొకరికి సాధ్యమేనా అనిపిస్తుంది.   

యుద్ధభూమిలో నుండి వచ్చిన ఉత్తరాలని రక్షరేకుల్లా భద్రపరచు కుంటారు అన్నది చాలదూ ఆ తల్లుల భార్యల మానసిక క్షోభ ఎలా ఉంటుందో తెలియడానికి!  యుద్ధభూమి నుండి పిల్లలూభర్తలూ వెనక్కి వస్తారో లేదో తెలియదు మరి. రాకపోతే ఈ ఉత్తరాలే కదా వారి వారి జ్ఞాపకాలు.   

ఇదే పుస్తకంలో మరోచోట యుద్ధాన్ని గురించే చెబుతూ యుద్ధమంటే రాత్రిపూట చెప్పుకునే నాయనమ్మ కథ కాదు అని, యుద్ధం మానవహృదయం లోలోతున  ఉన్న  రక్తాన్ని విరిచేసి కరుడు కట్టించేస్తుందని అంటాడు.  

ఈ మాట అర్థం అయినప్పుడు యుద్ధం అన్నమాటకి అర్ధం నిఘంటువుల్లోనే మిగిలిపోతుంది కదూ! 

మొత్తంగా చూస్తే... జమీల్యా దనియార్ కథ మనసు లోని నిశ్శబ్ద భావాలనీ, స్వేచ్ఛను, ప్రేమని, జీవితానికి దారితీసే నిజమైన శక్తిని మెల్లగా వెలికితీస్తుంది.

మనిషి కోరుకునే  స్వేచ్ఛా సంకల్పానికి ప్రతీకగా నిలిచిపోయే నవల... ఈ జమీల్యా!