మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Friday, 26 May 2017

నీటి చిత్రం


తేమ గాలి ఒకటి
లోకాన్ని ఊడ్చుకుంటూ వెళుతుంది
బహుశా...
వాన వచ్చేలా ఉన్నట్లుంది

లోకమంతా పొడి నేలకై పరిగెడుతుంటే
ఇదిగో ఈ  కిటికీ మాత్రం
ఎప్పటిలా
నీటి చిత్రాలకి కాన్వాస్ గా
మారటానికి
అటూ ఇటూ తలని ఊపేస్తుంది

నాలా… తనూ పిచ్చిదే మరి
గాజు మెరపుల

నీటి చిత్రాలెప్పటికీ శాశ్వతమనుకుంటూ
తడి కోసం తపన పడుతూ

Wednesday, 10 May 2017

అలమారలో సర్దేస్తాం కానీ

నీటి చెలమలని నింపుకున్న…
చెమటని తెంపుకున్న…
రక్తమోడుతున్న...
వాదవివాదాలని చర్చిస్తున్న
ఆదర్శాలని నిద్రపోనివ్వని    
అక్షరాల మధ్యలో నుండి జారిపోతున్న
పాత్రలని అనునయిస్తూ
'మీరెంతగా కదిలించినా
ముగింపుని దాటేసాక
పొందికగా అలమారలో సర్దేస్తాం కానీ
మేమంటూ కదిలిపోయేటంత
మనసు నగ్నత్వం మాలో లేదంటూ
ఇది కథేలే
మీకు ఇదే శాశ్వతనివాసం '
అని చెప్పి వచ్చేద్దాం


రా మరి...
ఈ ఒక్క కథలోకీ వెళ్లివద్దాం!
Monday, 8 May 2017

మన రాతలకి మనమే...

మనమొక వార్తగా మారాలంటే ఈ రోజు ప్రధానవార్తని మన హస్తగతం చేసుకోవాలి. అభినందనో… విమర్శో అతి తీవ్రంగా ఉండాలి. అది వ్యక్తిత్వ సరిహద్దుల్ని దాటిపోవాలి.

ఇదే కదా నేటి సమాజ పోకడ.

ఈ సమాజంలో భాగస్వాములుగా ప్రతి విషయం మీద ఎంతో కొంత విషయ పరిజ్ఞానం ఉండాలి. మన అభిప్రాయాలని మనం వెలిబుచ్చే హక్కు మనకు ఉంది. అవును నిజమే. మనకి హక్కులున్నాయ్. ఉండాలి కూడా. మన రాతలకి మనమే సంపాదకులం . అలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే లేనిపోని అసమానతలకి దారి తీసిన వారిమే అవుతాం. ఉన్న సమస్యలకి తో కొత్త సమస్యలు సృష్టించిన వారిమే అవుతాం.

నేటి తాజా వార్త కోసం  లేని కోడిగుడ్డు మీద ఈకలు ఉన్నట్లుగా కొందరు… వాటిని పీకటానికి సిద్ధంగా మరికొందరు.  అందుకోసం ప్రపంచంలోని ప్రతి సమస్య మీద మనకు  సంపూర్ణ అవగాహన ఉన్నట్లుగానే నటించేస్తూ ఉండాలి. లేదంటే మన మేథావితనం పలచబడిపోతుంది.

నిజానికి ప్రతి  వార్తాసంస్థ నుండి వచ్చేది  ఏదో ఒక పక్షం తీసుకుని వండి వార్చే వార్తలే… వాళ్ళ దృక్కోణం నుండి వాళ్ళు చేసే వాఖ్యానాలే మనం రాసే చాలా రాతలకి ఇన్ పుట్స్. సౌర్స్ లోనే లేని నిజాయితీ,  వాటి మీద   మనమెంత నిజాయితీగా మన వ్యాఖ్యానం సిద్ధం చేసినా విలువ సంతరించుకుంటుందా?  

సమర్ధింపో… విమర్శో విషయమేదైనా సరే ఆవు వ్యాసంలా..;  ఆ విషయంలోకి మనకి నచ్చిన వాడినో/ నచ్చని వాడినో తీసుకుని రావాల్సిందే. లేదంటే చెప్పాలనుకున్నది సరిగ్గా పండినట్లుగా అనిపించదు.

పనిగట్టుకుని చేసే పొగడ్త అయినా విమర్శ అయినా అది మనకి తెలియకుండానే యథార్థవాదానికి చాలా దూరంగా జరిగిపోతూ ఉంటుంది. మనుషుల్ని వ్యక్తిగత పొరపొచ్చాల వైపు నడపటం తప్ప వీటి వలన ఉపయోగం ఏమీ ఉండదు. నిజానికి ఏ విషయం పైన అయినా సమీక్ష జరగాలి. ఆ సమీక్ష లోనే ఆ విషయంలోని బలాలు, బలహీనతలు చెప్పబడాలి. అప్పుడే పొగడ్త… విమర్శ రెండూ ఒకే చోట ఇమిడి ఒక ఆరోగ్యవంతమైన చర్చకు దారితీస్తుంది. లేదంటే మనకి తెలియకుండానే (తెలిసి కూడాను) కొత్త వివాదాలకి దారి తీస్తుంది.

మనసులో నమ్మక పోయినా, మనకి ఇష్టం లేని వాడు చెప్పేవన్నీ పస లేని వని, మనకిష్టమైన వారు చెప్పేవన్నీ చాలా చక్కనివని ఒక ప్రచారంలోకి దిగిపోతున్నాం.  మనం నమ్మినదాన్ని నమ్మని వాడిని మనకి అయిష్టుడిగా, సమర్ధించిన వాడిని ఆప్తుడిగా మార్చుకుంటున్నాం.

బాధాకరమైన విషయం ఏమిటంటే…

ఇలాంటి వాటికే ఒక అనుచరగణం తయారవుతుంది. చాలా చోట్ల ఏ విషయంలోనూ లోతుపాతులు అసలు తెలియకుండానే ఏదో ఒక పక్షం లో చేరిపోయి అప్పుడప్పుడే రాజుకుంటున్న నిప్పును మరింత ఎగదోస్తూ ఉంటారు.  ఎవరి పక్షం ఎవరో తేల్చేది కులమో, మతమో, ప్రాంతమో, వర్గమో… మనం నమ్మే రాజకీయ పక్షమో తప్ప మనం నమ్మే సిద్ధాంత భావజాలం కాదు.

ఇన్నాళ్ళుగా నేర్చుకున్న విజ్ఞానమంతా పక్కకుపోయి, అప్రధానమైన  విషయాలకోసం ఒక రణరంగాన్నే సిద్ధం చేసుకుంటున్నాం. పిచ్చి పిచ్చి విషయాల మీద మనం చేసుకునే వాగ్యుద్ధంలో మనం కోల్పోయేది మాత్రం మనమంటూ మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేని విలువ కట్టలేని సమయమే.

సిద్ధాంత వైరుధ్యాల మీద చర్చ జరగాలి కానీ వ్యక్తిగత లోపాల మీద కాదు. ఎప్పుడైతే చర్చ వ్యక్తిగతమవుతుందో, రెండు సిద్ధాంత వైరుధ్యాల  గురించిన్ చర్చలో బయటకి వచ్చే ఎన్నో అమూల్యమైన వ్యక్తీకరణలు మృగ్యమవుతాయ్.


చివరకి చూసుకుంటే వ్యక్తిగత వైషమ్యాలు కొనసాగుతూ ఉంటాయ్. కొనసాగుతూనే ఉంటాయ్.


Sunday, 7 May 2017

ఆకు


చిరు కొమ్మ చివరన చిగురేసుకుని వచ్చినప్పుడు
కొంగ్రొత్త చిలకపచ్చదనపు మెరుపులో వళ్ళు విరిచింది

యవ్వనం యక్ష గానం చేస్తున్నప్పుడు
గాలి చేస్తున్న గాంధర్వానికి మైమరపుతో తాళం వేసింది

ఎండ బారిన మనిషి  మేనిపై
నీడల దడితో శుశ్రూష చేసింది

చెట్టుకి తాను మోయలేని బరువనుకున్నప్పుడు
మౌనాన్ని శబ్దిస్తూ రెప్పపాటులో  రాలిపోయింది

ప్రకృతికి  సారవంతమైన నేలని కానుకిస్తూ
కుళ్ళిన తనువుతో  
తపమొనర్చుతూ మట్టిలోకి మాయమయ్యింది

ఆత్మార్పణ వేళ ఎప్పుడో
జీవితాన్ని వెలిగించుకోవటమంటే ఏమిటో
పంచ భూతాలూ పచ్చగా నవ్వినప్పుడే తెలిసిందిSaturday, 6 May 2017

శబ్దం

నేనేం చదివానో
నేనేం చెప్పానో చూసి
నన్ను వెల్లడి చెయ్యడం
సులువనుకోవటంలో
నీ తప్పేమీలేదు...
నీ దాకా వస్తే నేనైనా అంతేమరి

మనవైన అవగాహనలన్నీ
మనకున్న అభావనలన్నీ
మన ఆంతరంగిక మిత్రులు కదా
మరి...మన మాటలోనే సాగుతాయిలే

నేను నేర్చుకున్నదేదో
యే రూపుగా యే వేళలో
తాను బయల్పడటం మొదలవుతుందో  
ఇంకా నాకు ఎరుకపరచలేదు

యే పచ్చి మట్టి వాసనలో
మరే పచ్చడి అన్నం ముద్దలోనో
ఒక శబ్దాన్ని కూరిన పరావర్తనమై  
లోకాన్ని నిస్సిగ్గుగా పలకరించే
ఆ ఒక్క సమయం కోసం
కాసిని ఎదురు చూపులు రాసే ఉంచా


Friday, 5 May 2017

ఈ ‘నేను'లోలోపల నిర్మితమవుతూ వస్తున్న
ఆకాంక్షలన్నీ చిరస్మరణీయాలై
అలలు అలలుగా దేహపు అంచులను
అలా అలా తడుముతున్నంతసేపూ
దేహమే నా విలువకి గుణింతమని
విర్రవీగిన అహానికి  సింహాసనమేసుకుంటూ
నాలోనే నేనింకా మిగిలి ఉన్నాననుకుంటున్న
ఒక అందమైన అబద్ధపు కథనే ఈ నేను'

దేహమంటే మాంసఖండాల అమరిక అని
వర్ణాన్ని నిర్దేశించే చర్మమంటే
దానిపై కప్పిన తోలు అట్ట అని
ఆత్మ వసించినంతసేపు దేహం ఆత్మాలయం
తాను వదిలేశాక
ఈ గేహం ఒక శిథిలాలయం  అన్న యథార్థవాదాన్ని
యథేచ్చగా దునుమాడిందీ ఈ నేనే'

నేనుని దేహానికి పరిమితం చేసుకున్న
అహంకారపు బాటలో నా యదార్థ అస్తిత్వాన్ని
అబద్ధంగా చదువుకున్న అంతేవాసిత్వాన్ని దాటేసాక
దేహాల దారుల్లో తప్పిపోయిన జీవితానికి
దప్పిక తీర్చే చలివేంద్రమేదో తెలిసే సరికే  
మట్టి పుస్తకంలో శిథిలపుటగా  
కర్బన రూపాన్నద్దుకునే  భవిష్యత్తరపు
ఇంధనపు అస్తిత్వమే నేనని తెలుసుకున్న
యధార్థయానంలో రాసుకున్నాను
దేహం ఈ నేనుకి అశాశ్వత కేంద్రకమని

కాయానికి మోక్ష జాలమేసిన
ఆత్మవచనమే  నేనని చెప్పడానికి
కాలం కథలో ఈ 'నేను'కి
చివరి అంకం రాయడానికి
లిపికారుడై మరో నేనుమొదలవ్వాల్సిందే  
Thursday, 4 May 2017

ఒక నల్లని వెలుతురుఒక నల్లని వెలుతురు
అవును
నలుపే వెలుగుని గాఢంగా రాయగలదు
ఆకాశం నిండా
కాసిని మెరుపులని
ఓ గుప్పెడు తారలని
వెళ్లాడదీసుకుంటూ
తనే ఒక వెలుతురుని అవిశ్రాంతంగా మోయగలదు

నమ్మవా ఏం?

సరే మరి...
నువ్వు చూపించు
ఏ పగలైనా
నీకోసమంటూ
కాసిన్ని నక్షత్రాలని  చల్లగా పూసిందేమో!

***

రా మరి !
వెలుగుపై కప్పిన చీకటినీ
సీతాకోకచిలుక రెక్కలంత
ఇష్టంగా హత్తుకుందాంWednesday, 3 May 2017

తేమ గ్రంథంఒక రాత్రిని
నెమ్మదిగా అల్లుకున్న మల్లె పందిరి క్రింద
చల్లగా సేద తీరుతున్న వేసంగికి
గాలే పంజరమైన గాథలో
కలువ రేకుపై మెరుస్తూ
ఎవరో వస్తున్నట్లున్నారు

పూలకి ఈతనేర్పే గాలి వాకిట్లో
కాసేపలా గడ్డకట్టుకు పోతూ
ఇదిగో
ఇక్కడే ఆగి చూసా

మట్టి తునకని ఆఘ్రాణిస్తున్న
ఒక విశ్రాంతి వాన చినుకులా
చాలా చిన్నగా మొదలయ్యావు

ఇప్పుడేమో
ఈ కాగితంపై కవిత్వమై పిలుస్తున్నావు
మనసుకంటిన మోక్ష గంథంలా
కళ్ళు రాసిన తేమ గ్రంథంలా !!!


Tuesday, 2 May 2017

నల్లని ఖాళీతనానికి...బ్రతుకు నడిచే మార్గంలో
గురువులుగా మార్గమిచ్చినవన్నీ
అల్పప్రాణులే నన్న నిజం
ఏనాడూ ఒప్పుకోబడకుంటేనేం
బతకడం
చావడమంత భయంలోకి నడచినప్పుడు
జంతువులని చూస్తే అసూయపుట్టడం వింతేమీ కాదు
అశాంతిని ఆప్తంగా కొనితెచ్చుకోవడం వాటికి రాదని

ఏ తెలివైన జాతికి  కొత్త బాట పరుస్తాయోనని
నక్షత్రాల చుట్టూ చీకటి తెరలు కప్పేసి
వెలుగు కారకాలన్నిటినీ మట్టు పెట్టేసి
ఎవరి చంద్రుణ్ణి వారే కాల్చుకుంటున్న చోట
వెన్నల పండ్ల కోసం ఆరాటపడటంలో
ఆవిరయ్యిందంతా గుండె కొట్టుకునే సవ్వడే

అంతా అర్థమయ్యింది
గడిచినదేదీ అర్థం కాలేదని
ఇక గడపటానికంటూ
ఏ ఋతువులు మిగలలేదని

మరి ఋతువులున్నంత మెలుకువగా
మనిషి లేడని తనకు చెప్పే ధైర్యం ఎవరికీ లేకుంటేనేం
విశ్వం తనకు తానుగా రాయగలిగే కొన్ని వాక్యాలుంటాయ్
అవును… అది తన నిర్ణయాలు తనే తీసుకుంటుంది
ఎప్పటికప్పుడు తనని పునఃసమీక్షించుకుంటూ
ఒక నల్లని ఖాళీతనానికి మనిషినంటు కడుతూ