మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Thursday, 30 July 2015

అన్వేషణ

నీడలుగా జారడానికి ఊపిరి బిగబట్టుకున్న 
రోజుల్లోకి నడుస్తున్నప్పుడు 
గత స్మృతుల గాలి ఒక భీబత్సమై నన్ను చుట్టేస్తుంటే 
కాందీశీకుడినై మనసు లోతుల్లో ఖాళీ అరలను వెదుక్కుంటున్నా 
శాశ్వతంగా నన్ను నాలో ఏమార్చడానికి

ఎవరెవరి ఆనంద గానాలలోనో నేనెందుకు ఒదగాలి 
అనుకుంటూ నేను కట్టుకున్న బాణీ
బహు చిత్రం చేసింది 
ఎక్కడెక్కడి దుఃఖాన్ని నా పాటలోకి తెచ్చేసుకుని 

నిశ్శబ్దం పారుతున్న సమయాలన్నీ 
తుఫానుగా మారి మదిని అల్లకల్లోలం చేస్తుంటే 
ఎప్పటెప్పటి ఊసులూ ఊపిర్లు పోసుకుంటూ 
గాయపడిన గవ్వలుగా 
అంతరంగ తీరాన్ని ఆక్రమించేస్తున్నాయ్ 

విశాలమైన చీకటి మైదానాల్లో 
కురిసే విషాదం మొత్తం 
నా తిమిర వనాలని ఆర్తిగా హత్తుకుంటుంటే 
నా నిజమైన నేస్తం ఎవరో తెలిసింది 

ఒక శిల పుడుతున్నట్లు ఉంది 
గుండె గదులలో పేరుకున్న 
తడి మొత్తాన్ని స్ఫటికీకరించుకుంటూ 
నన్ను కొత్తగా కొనసాగించుకుంటూ ఉంటే…

నన్ను నేను తవ్వుకుంటూ వెళుతుంటే 
ఈ చిరపరిచిత దేహంలో 
ఒక అపరిచిత ప్రపంచం
అనంతమైన అనిశ్చితిలో స్థంబించి కనిపిస్తూ 
అన్వేషణ ముగిసే సరికి మిగిలేదేమిటో 
నా కథ చేరే లోకమేమిటో


Wednesday, 29 July 2015

హేమంత స్పర్శ - 14

ఏయ్

రాత్రిళ్ళలో కూర్చుని చీకటిని శోధిస్తుంటే ఎన్ని కొత్త సంగతులు తెలిసాయో తెలుసా? మనల్ని పగలగొట్టే పగళ్ళ గాయాలకి విశ్రాంతి మంత్రమేస్తూ రెప్పలు చేసే సవ్వడి మాత్రమే వినే నాకు రేయిని అలా అలా తోడుకుంటూ ఉంటే తెలిసింది మనకు వెలుగవ్వటానికి తనెంత చీకటిని పులుముకుంటుందో అని. 

నమ్మవా ఏం? గాఢాంధకారం చుట్టుముట్టినప్పుడు ఒక్క వెలుగు రవ్వకి ఎంత విలువ వస్తుందో తెలిసిందే కదా మరి ఆ వెలుగుకి విలువ కట్టటంలో రేయిని మంచినది ఏముంది? శబ్దం నుండే విశ్వం పుట్టింది అంటారు. విశ్వమంతా నిండిన శబ్దాన్ని రేయికన్నా బాగా వినిపించగలిగేది ఎవరని? 

అదంతా కాదుగానీ వెచ్చగా మనల్ని మైకంలోకి మనకు అత్యంత ఇష్టమైన వెన్నెల వెన్నదనం రేయికి మాత్రమే హక్కుగా వచ్చిన సొత్తు కదూ మరి ఆ వెన్నెల ప్రేమని వెచ్చగా మన మీద కప్పుతుంది ఎవరు? రేయేగా

నీతివలువలు కప్పుకున్న జీవాలన్నిటి నిజమైన వ్యక్తిత్వం రేయి చీకటి పొరల్లోనే కదా నెమ్మదిగా విచ్చుకునేది అదంతా ధైర్యంగా బయట పెట్టినా నిలదీసే ధైర్యంలేనిది మనకే మనలాంటి వాళ్ళకే 

అంతెందుకోయ్... అసలు రోజుకి మొదలూ చివరా ఉన్నది ఎవరు? రేయే కదా చీకటి నుండి పుట్టి చీకట్లోకి సాగించే జీవన యాత్రకి ప్రతీకే కదా ఇది. 

దగ్గరగా ఉన్న వెలుగు తనకు మించిన ఏ ఒక్క వెలుగునీ మన దరికి చేరనీయదు. అది దాని సహజ లక్షణం. కానీ ఒక్క చీకటి ఒక్క రేయిగా... ఎన్ని నక్షత్రాలతో వెలుగుల తోరణం కడుతుందో మనకు తెలియని సంగతేం కాదుగా అందుకేనోయ్ చీకటిని ఖర్మం అనుకోక మరిన్ని వెలుగులని వెలుగులోకి తీసుకొచ్చే కాంతి దారిగా అనుకుంటే మనసెప్పుడూ నిరాశ వైపు మళ్లదు. 

పగలు రాత్రి కాసేపు విశ్రమిస్తేనే కదా రేపు మరింత శక్తితో వెలుగిచ్చేది. సుఖమొక సుఖమని తెలిసేది కష్టమంటే ఏమిటో తెలిసినప్పుడే కదా. 

ఇప్పుడీ రేయి గురించి అంతా నాకెందుకు అనుకుంటున్నావ్ కదూ నా పగటి శ్రమలోనే కాదు రేయి అత్మావలోకనంలోనూ నువ్వే సందడి చేస్తుంటే అర్ధం అయ్యింది నాలోని నీ నిండుతనమూ ఆ పైన తన గొప్పతనమూ 

నా నువ్వూ నీ నేనూ ఒకరిలో ఒకరం... ఒకరితో ఒకరం... మాట్లాడుకుంటున్నప్పుడల్లా మన శబ్దాలని అద్దుకుంటూ చిగురించిన పెదవులపై ఎక్కడెక్కడి పలుకులన్నీ తుమ్మెదలుగా వచ్చేసి ప్రపంచంలో చక్కర్లు కొడదాం అనుకోవటంలోనే తెలియటం లేదూ మనమెప్పుడూ మధురమేనని మాటలోనైనా మనసులోనైనా  

అసలు మన గొప్పకి మనం విలువ ఇచ్చుకోకపోతే మరెవరో ఏమిస్తారు మన గొప్పకి మనం విలువ ఇచ్చుకోవటం అంటే అహం అనుకుంటారేమో అనిపిస్తుంది కదూ అహం కాదురా అది ఒక మంచి లక్షణాన్ని మననుండి కోల్పోకుండా చూసుకోవటం. కాదంటావా? అనలేవు కదూ 

రోజూ ఎన్ని ముఖాలు చూస్తూ ఉంటావ్... 

కన్న వారినీ... ఉన్న ఊరినీ ప్రపంచాన్నీ తిట్టుకుంటూ దిగుళ్ళని వేలాడ దీసుకుని ఒకే మూసగా దుఃఖం ఒలికించే వాళ్ళని? బయట పడుతూ కొందరు బయట పడక కొందరు కానీ ఎక్కువ శాతం అలాంటి వారేగా. అలా బతకటం చాలా తేలికరా! కానీ ఆ బతుకు మనకి అవసరమా? 

మనకి వెలుగెంతో చీకటీ అంతే. సుఖమెంతో గాయమూ అంతే ప్రకృతిలోని ఏ అస్తిత్వమూ తక్కువ కాదు. 

ఎవరికి వారే దుఃఖమైన జీవితాల్లో మనమూ నడవటం ఎప్పటికీ చెయ్యవద్దురా మనం. 

నీ 

నేను 


Tuesday, 28 July 2015

తాకుతూ... తాగుతూ

అప్పుడప్పుడూ ఆకాశం జల్లే మెరుపాక్షతలని మనస్సులో మధురంగా దాచుకుంటూ ఉన్నప్పుడు... తమ పరిమళం బరువు మొయ్యలేక లోకం మీదకి విసిరేస్తున్న మల్లెల సౌరభాలు వెన్నెల చల్లదనాన్ని కలుపుకుని  రక్తాన్ని మరిగిస్తుంటే రాసక్రీడా రహస్సులన్నీ మన శ్వాసలకి అద్దుకున్న  మన తొలి చలనాల సవ్వడిని  మనఃమంజూషంలో శాశ్వతం చేసుకున్న మౌనం ఎంత చక్కని అనుభూతి. 

మన అస్తిత్వాల ఏకత్వాల పరస్పర మార్పిడి నిన్ను నిన్నుగా నన్ను నన్నుగా నిలబెడుతూ మనల్ని ఏకం చేసిన సమయాల శుభముహూర్తం... మన స్మృతుల ఖజానాలో మేలిమైన లాలిత్యపు స్పర్శ. 

పగటి వేడినంతా రాత్రిపూట  సంద్రంలో నిమజ్జనం చేస్తూ పొద్దున్నే సాగర గర్భం నుండి ప్రతి రోజూ  కొత్తగా పుట్టే సూర్యుడు రాల్చే ఉషస్సులా  ఎప్పటి కప్పుడు కొత్తగా మనలో మనం ఉద్భవిస్తూ ఉంటే జీవితమెంత ఆహ్లాదమో అనుకుంటూ  కాసేపలా కళ్ళల్లో ప్రకృతిని కలుపుకుంటూ కూర్చుంటే చెదిరిపోయిన స్మృతులన్నీ ఊపిరిపోసుకుని వస్తూ తెచ్చే ఆనందాన్ని ఒక్క చుక్క కూడా కింద పడకుండా తాగాలనిపిస్తుంది... 

అప్పుడప్పుడూ ప్రకృతిని తాకుతూ తాగుతూ ఉండాలి కదూ... మనవైనవి కొన్ని మనసారా ఆస్వాదించటానికి...! 


Sunday, 26 July 2015

దగ్గరగా…

ఎదుటి గుండె 
అఖాతాల లోతుల్ని 
చదవగలిగే కళ్ళు ఉంటే బాగుండు…
చిగురుటాకు స్పర్శలా 
తాకే మనసొకటి పుట్టుకొస్తుంది 

ఒక్క తృటికాలపు చిరునవ్వే
శాశ్వత స్మృతిగా తడుముతూ  ఉన్న
మస్తిష్కపు తాత్వికతకు
అనంతంగా ఆనందాన్ని అద్ది చూస్తే 
అంతరంగం మొత్తం నక్షత్రాల సాన్నిధ్యం 

నాస్తికుడివైతేనేం 
భక్తి గీతంలోని 
భక్తిని విశ్వానికి వదిలి
తాదాత్మ్యతని మనసుకిచ్చి చూడు
అనుభూతుల వరద నిన్ను కమ్మేస్తుంది 

ధృఢత్వమొందిన మంచు బిందువుకంటే
గొప్ప వజ్రమేముంది 
ఏకాంతం ఇచ్చిన దగ్గరితనం కన్నా 
ఆత్మావలోకనానికి దారేముంది 

మనకు తప్ప అందరికీ అర్ధమయ్యే ఆనందాన్ని
మనకు మనవి చేసుకుందాం 
మనకు మనం మేలిమి అవుతూ 
పరాయి తనాన్ని పరాయి చేశాక
మిగిలేదంతా ‘మన’ తనమే... ‘మంచి’ తనమే...

Saturday, 25 July 2015

స్వార్ధం

ఆరారు ఋతువులు గ్రీష్మమై 
వేసవి వాలిన హృదయంపై 
మరువపు శీతలమద్దిన 
హేమంతమై స్పర్శిస్తుంటే 
తనని నా స్వార్ధం చేసుకున్న 
ఆ మొదటి క్షణంలోనే అనుకున్నా 
తన ఎదురుచూపుల నిండా 
నేనే ఉండాలని 
కానీ 
ఈ స్వార్ధమెంత మాయావో తెలుసా మీకు 
నా నిరీక్షణలకి తనని జీవంగా మార్చింది

తన ప్రతి క్షణానికీ కిరీటం తొడిగి 
నా సమయాల సింహాసనంపై 
తనని కూర్చోబెట్టాక
యుగాల లెక్కలూ తారుమారవుతున్న 
చిత్రాతి చిత్రపు మాయాజాలం ఐతేనేం 
అలసట తెలియని నిశ్శబ్ద తీరంలో 
తను వదులుతున్న శ్వాస 
నా ఊపిరిగా మారుతున్నప్పుడల్లా 
ఇష్టంగా మిమ్మల్ని చేరింది కదూ 
ఒకరికి ఒకరం స్వార్ధంగా మారుతూ 
మేముగా మాలో లీనం అయిన చప్పుడు!! Friday, 24 July 2015

చీకటి తెర

రేపో … 
ఇంకోనాడో 
ఒక చీకటి తెర  
శాశ్వతంగా 
నా రెప్పలని వరిస్తుందని 
ఈ నేలకి 
నన్ను మిథ్యని చేస్తుందని  తెలుసు 

అయితేనేం 
అప్పుడప్పుడూ 
మీ కళ్ళ తీరంలో చిరుఅలగా
చెక్కిళ్ళని తడుముతూ 
నే కదలాడుతే చాలు 
నా పుట్టుక ఒక సత్యమే
నా జీవితమొక ధన్యమే

Wednesday, 22 July 2015

కొత్త పుట్టుక

కన్నీళ్ళకి విలువకట్టబడే లోకంలో 
మగాడై పుట్టిన పాపానికి 
నా సునిశిత స్పందనలూ
తడిదేరిన ఆర్ద్రతలూ 
నమ్మలేని విషయాలౌతుంటే 
నా కళ్ళని ఎండమావులుగా చేసుకుంటున్నా 
ఉన్న కన్నీళ్ళని లేనట్లుగా చూపుకుంటూ

దారితప్పిన మృగాలు కొన్ని 
జనారణ్యంలో కీచకిస్తుంటే 
మృగాడిలా నేనూ నిందలు మోస్తున్నా 
పెదవులపై నవ్వుల మాయాజాలం చేస్తూ
మది గదుల్లో రోదిస్తున్నా

తమస్సు ఎప్పుడూ తపస్సు చేసే 
ఈ దేహారణ్యంలో 
కవాటాల నిండా గడ్డ కట్టిన దుఃఖం 
ఒక్క క్షణం గుండెనీ  గడ్డ కట్టిస్తే బాగుండు
నీడగానూ మిగలని నిద్రలోకి జారిపోతా 

కలలైనా కన్నీళ్ళైనా  
ఏ ఒక్కరి స్వంతమో కాదు 
అవి మనిషి మనిషి సొత్తే మరి

అందుకే 
ఆడదానికే కాదు 
మగాడికీ ఓ కొత్త పుట్టుక కావాలిప్పుడు
నిందలు చెల్లాచెదురయ్యే ఉప్పెనలా 
లింగాల లెక్కలవసరమే లేని మనిషితనంతో 


Tuesday, 21 July 2015

స్నేహ స్పర్శ

ఎన్ని గుండెల మధనంలో నుండి 
రాలిపడ్డ కన్నీళ్ళో అవి  
నేలపై మహాసంద్రాలని పరచాయి 

కంటికి నీరు కరువైన 
ఎడారి జీవితంలో 
చెలిమి గంధమొక్కటి చాలు
బీటలైన హృదయాన్ని 
చిగురింపజేయడానికి 

తెలుసుకోలేం కానీ 
జీవితంలో అమృతం కురుస్తూనే ఉంటుంది 
చెక్కిలి తుడిచే చేతి వేళ్ళ స్పర్శలో నుండి Monday, 20 July 2015

తాకట్టులో అస్తిత్వం

నేనింకా మిగిలున్నానో లేనో తెలియని అయోమయంలో
ఇంకా ప్రశ్నలే వెంటాడుతున్న జీవితంలో 
బతుకు సరిహద్దుపై నిలబడిచేసే యుద్ధంలో 
పాంచజన్యం పూరించటానికి సారధంటూ లేని రథయాత్రలో 
నా జీవితానికి నేను ప్రతిరోజూ సైనికుడినే 
నా ప్రతి క్షణమూ యుద్ధరంగమే 

కలల మోహాన్ని కలతల భారాన్ని అవతలకు నెట్టి 
పయనంలో ఆనందం కోసుకుంటూ 
కష్టమైనా గమ్యాన్ని ఇష్టం చేసుకుంటూ 
సాగిస్తున్న నా అనంతగమనంలో 
నేను  ఎవరినో తెలియకనే  
నా గురించి మీరు సిద్దం చేసుకున్న 
వాంగ్మూలాలకి అనుగుణంగా 
నా జీవితం ఎప్పుడూ సన్నద్ధం అవదు
పరాయి పలుకులు దృశ్యించే చిత్రాలని 
చెవులతో చూసే వారందరూ 
అద్భుతమైన ప్రేక్షకులో వీక్షకులో అవుతారు 
మనసన్నది మిథ్య అయిన మనుషులుగా 
తమ అస్తిత్వాన్ని ఇంద్రియాలకి కుదువపెట్టి

నన్ను నేను రచించుకుంటున్నప్పుడు 
కాగితమూ సిరానే కాదు 
ప్రతి అక్షరమూ నావై ఉండాలనుకునే రారాజుని నేను 
మరి మీరు రాసుకుంటున్న కథల్లో 
మీరూ రారాజులే కదూ…


Sunday, 19 July 2015

తరువేమయ్యింది?

నాగరికాన్ని శిల్పిస్తున్నప్పుడల్లా 
అడ్డం పడుతున్నదని 
శిరసుని పరశురామప్రీతి చేసేశాక  
ఒక పేద గుడిసెలో చితిపేర్చుకుందా చెట్టు 
కొంచెం గంజిని వేడి చేస్తూ...
ఇంకొంచెం కళ్ళని వెలుగిస్తూ...
ఎంతైనా 
ఇవ్వడమే నేర్చుకుంది కదా మరి...

కలెందుకు ఆగిపోయింది?

పొద్దున్న చూసిన వాస్తవం
నిద్రలేమిగా మారిన సత్యం  ఒకటి
రాత్రి మొత్తానికీ గొళ్ళెం వేసిందట...
కలలకిక చోటులేదు మరి 

Saturday, 18 July 2015

నువ్వొక అద్భుతం

ప్రాణమా…
మన హృదయాల్ని వెలిగించు
ఎద రాపిడులని చెకుముకి రాళ్లగా మార్చి…
ఆ వెలుగులో 
విశ్వమంతా వొలికిన కాంతిని 
దానికే కానుకగా ఇద్దాంలే 
పాపం 
అది మాత్రం తిమిరాన్ని ఎంత సేపని మోస్తుంది మరి

నువ్వొక అద్భుతమోయ్…
ఎందుకంటావా?
నీడలకింద నిద్రపోతున్న 
మట్టితునకకి అంటిన భరోసా చెప్పింది 
నువ్వెంత నమ్మకమిస్తావో 

తీరం ఒడిలో బద్ధకంగా నృత్యమాడుతున్న 
అల ఒకటి చెప్పింది
కడలి తన కడుపులో అంబరాన్ని దాచుకుందని 
నాకెందుకో నువ్వు గుర్తొచ్చావ్
నీ గుండెలో ప్రేమకొలతకి 
ప్రతీక దొరికిందనే తలపేమో మరి...Friday, 17 July 2015

అస్తిత్వం

నేను మిగిలి ఉన్నానో  లేనో 
తెలియని చోట 
పాత నీడల ఆనవాళ్ళలో
నా జాడల కోసం వెదుకుతూ 
ఎక్కడెక్కడి భ్రమలన్నీ 
ఖాళీ చేసుకున్నాక 
నేనుండాల్సిన చోట 
ఎవరిచేతో 
తయారు చెయ్యబడ్డ ఇంకో నేను...
బహు నాగరికంగా నడయాడుతూ
ఎంత అనాగారికమీ నాగరికం?

ఖాళీ చేసుకున్న తావులన్నీ
భర్తీకోసం ఎదురు చూస్తుంటే 
అస్తిత్వానికి ఎప్పుడూ చిక్కు ప్రశ్నే
నా నేనా… 
నీ నేనా 
అంటూ…

Thursday, 16 July 2015

అడవి దారిలో…

లోకమంతా అడవి నీడ ఒక్కటి 
పరచుకున్న తొలిపొద్దుని
నీ జతగా తాకాలని ఉంది 

నీ నగ్న పాదాల చుట్టూ అల్లుకున్న
ఆకుపచ్చని అల్లికల్లో 
నా హృదయాన్ని మరువంగా చేర్చాలని ఉంది 

లేచివుళ్ళ వాకిళ్ళనే 
ఆకాశమంత రెక్కలుగా మార్చుకున్న 
ప్రకృతి విహంగాన్ని అధిరోహించి 
మనసుని తాకుతున్న ఓ సుప్రభాతం
నీ సమక్షాన్ని అనంతం చేసిన ప్రభాతశ్లోకం

కళ్ళు చెమ్మగిల్లిన వేగంకన్నా
చెక్కిలిని చేరే నీ చేతి వేగం అనేకమైనప్పుడు 
నా గుండెకు నువ్విచ్చే భరోసా విలువ 
ఎప్పుడూ కప్పుకోని నగ్నత్వమంత స్వచ్ఛమైన జీవితం 

Wednesday, 15 July 2015

ఇలాగే నడవాలి

నువ్వెక్కడ మొదలయ్యావో కానీ 
నాకో గమ్య మయ్యావు
శిశిరాలుగా రాలిపోతున్న నా ఊపిర్లకి 
కొత్త వసంతం అద్దిన 
ఆకుపచ్చని అమృత శ్వాసగా నాలో కొచ్చావు 

కన్నీటి శోకాలన్నీ కరిగిపోయి 
నీ చిరునవ్వుల మెత్తని ప్రవాహంలో
నన్ను దాటుతూ నేనే వెళ్ళిపోతుంటే 
పాషాణాలు నవనీతాలై పోతున్న
సరికొత్త వైచిత్రిని పరిచయించావు

నీ నిశ్శబ్దమూ ఒక తేజమై 
నా మనసు పత్రంపై అచ్చు వేస్తున్న 
మౌన లిపి ఎంత మధురమో 
అణువణువునా ఆనవాలుగా నింపుకుని 
తనువారా తన్మయిస్తున్న తలపులకి తెలుసు 

ఇప్పటివరకూ నేనొక సగమే పూర్తి అయిన జీవాన్ని 
సశేషమంతా నువ్వు బకాయి ఉన్నావు మరి 
ఇక నువ్విలాగే నడవాలి 
వేళ్ళ చివర భరోసాని మోసుకొస్తూ
నా గుండెలో జీవ దీపాన్ని  వెలిగిస్తూ 


Tuesday, 14 July 2015

చీకటైతేనేం

వేదన గిరులని దాటలేని నా గుండెలో 
కన్నీరు దాచిన ఊసులన్నిటినీ  
ఆవిరిచేసేసిందో స్పర్శ  
నీ జ్ఞాపకంగా తాకుతూ... 
ఏ రూపంగా వస్తేనేం 
నువ్వెప్పుడూ నాకో ఓదార్పువే 

క్షణమొక మర్మంగా
యుగాల నిరీక్షణలన్నీ 
ఒక్క  శూన్యమై  రాలి పడుతుంటే
నువ్వు మరీచికవై స్పృశించినా చాలు 
చీకటి లోతులన్నిటినీ భర్తీ చేసుకుంటూ
కాలయంత్రపు మీటలన్నీ నా స్వాధీనమనుకుంటా

నా ఏకాంతం అంతా నువ్వే అయిన సాయంత్రంలో 
గట్టు తెగిన దుఃఖాలకి ఓదార్పుగా 
స్మృతుల మంజూషపు తలుపు తెరచి 
తెగి పడ్డ నిన్నటి వసంతాలని ఆఘ్రాణిస్తూ 
నిన్ను మనసుకద్దుకుంటుంటే 
జీవితం అక్కడే శాశ్వతమవ్వాలనిపిస్తుంది 

తిమిరం ముంచేసిందని 
ముందే ఓటమికి సాగిలపడితే ఎలా 
కొన్ని మెరుపులు చూడాలంటే 
కాస్త చీకటిని తాగాలి 
రాత్రి చేసే నిశ్శబ్దానికే తెలుసు మరి
నక్షత్రాల నవ్వులెంత బాగుంటాయో


Sunday, 12 July 2015

రహస్య కాసారం

ఏయ్ మనసూ…

కాసేపేవన్నా ముచ్చట్లు చెప్పవోయ్. అరక్షణంలో అన్ని లోకాలు చుట్టి వచ్చేస్తావ్ గానీ నీ సాటి మనసు లిపి చదవటమే రాని నిరక్షరాస్యత కదా నీది.  

అంతెందుకోయ్ లోపల ఉండి కోతల రాయుడులా కోతలెన్నో కోస్తుంటావ్ గానీ బహిరంగాన్ని మాత్రం లోకం బాటలోనే నడిపించేస్తూ ఉంటావ్… ఎంత మాయలాడివో నువ్వు…

అవునూ… క్షణంలో అనంతాన్ని అద్దేసుకుని మోతమోసుకుంటూ తిరుగుతూ ఉంటావ్ కదా… ఏనాడూ బడలిక రాదా నీకు? ఎప్పటికప్పుడు కొంగ్రొత్త భావరహదారుల్లో పరుగిడుతూ ఏ జాడల కోసం వెదుకుతూ  ఉంటావ్? 

ఏమిటేమిటో మాయలు చెయ్యాలని చూస్తుంటావ్… నీకు మాత్రమే  మాయలు వస్తే సరి పోతుందా… నువ్వు వసించే దేహానికీ వచ్చి ఉండాలి కదా… మీ ఇద్దరి మధ్యా సమన్వయం కుదరకుంటే తన్నులన్నీ తనువుకి నువ్వు మాత్రం ఎక్కడ ఉంటావో తెలియని చోట బహు భద్రం. భలే కిలాడీలే నువ్వు.   నువ్వు  మొరాయించినప్పుడల్లా మనిషి అస్తిత్వం మారి పిచ్చోడుగా గుర్తింపు వచ్చేలా చేసేస్తావ్… ఇంతటి కర్కోటకత్వం దాగుందా నీలో అనిపించేలా…

అసలెక్కడోయ్ నీ తావు. నిన్ను ఆవరించుకున్న దేహానికీ తెలియని రహస్యమే కదోయ్ నువ్వు... అసలెప్పుడైనా విశ్రాంతి తీసుకుంటావా నువ్వు… అలసిన దేహం నిద్ర పోతున్న వేళ నువ్వు మాత్రం స్వప్న సంచారివవుతావ్. నువ్వు తిరిగొచ్చే లోకాలని కొద్ది కొద్దిగా కలలుగా  కళ్ళకి పరిచయిస్తావ్ చూడూ అప్పుడు మాత్రం నువ్వంటే భలే ఇష్టం పుట్టుకొస్తుంది తెలుసా ?

భౌతికమైన పంజరాలకి… బంధాలకీ  అతీతమై తనువులొక పరిలో ఉంటే నువ్వింకో పరమై ఉంటావ్. ఏ లక్ష్మణ గీతల సరిహద్దు లెక్కలూ నీకడ్డురావు కదూ...

గుండెకో గొంతుక నువ్వు మంద్రంగా స్వరిస్తూ
కంటికో ఆర్ద్రత నువ్వు  తడి తడిగా కదలాడుతూ 
నడకకో ఇంధనం నువ్వు గమ్యాన్ని నిర్దేశిస్తూ
మనిషికో  వేదం నువ్వు  మాయగా తనని కమ్మేస్తూ

జీవితపు ప్రతి మలుపులో మనిషితో ఎన్నెన్ని మజిలీలు చేయిస్తూ ఉంటావో... ఎన్ని రణతంత్రాలు రచిస్తూ ఉంటావో అన్ని ఆహ్లాదాలనీ అద్దుతూ ఉంటావ్. ఎంత వైవిధ్యమీ గమనం. ఎన్నెన్ని తలపులని ప్రవహిస్తూ ఉంటావో ఎప్పటికప్పుడు కొత్తగా నన్ను సేద తీర్చాలని తపన పడుతూ… 

నువ్వో రహస్య కాసారం... 

అంతులేని ఆలోచనలనీ, అనుభూతులనీ  ఏ లోతుల్లో దాచి ఉంచుతావోగానీ అనుకున్నప్పుడల్లా వాటిని తీరానికి విసిరేస్తూ ఉంటావ్. నీ అంత వేగంగా స్పందించే శక్తి  దేహానికీ ఉండి ఉంటే మనిషికీ తనకీ  తేడా ఉండదనుకున్నాడేమో దేవుడు… నిన్నొకలా... దేహాన్ని మరోలా…  ఎంత కోరుకున్నా  ఎప్పుడోగానీ  సమన్వయం సాధించలేనంత చిత్రంగా భలే  మలిచాడులే... 

ఏకాంతం నీకెంతటి నేస్తమో నాకు తెలుసోయ్… ఏకాంతం అంటే నీదైన విశ్వం కదూ… ఎన్ని ఊహా ప్రపంచాలు నీ ముందు సాగిల పడిఉంటాయో ఆ కొద్ది క్షణాలలో... తలచుకుంటుంటే నాకెంతటి అసూయో. శూన్యమొకటి ఆవరించిన క్షణాన నువ్వు గ్రహణం పట్టినట్లుగా మాయమై పోతావు. ఏ కృష్ణ బిలంలోకి జారి పడిపోతావో ఆ సమయాలలో...  

ఏయ్… ఒక్క సారి నీ రూపు చూడాలని ఉందోయ్… ఆగాగు…భయపడకు... రూపం  లేని నిన్ను నువ్వెలా చూపించుకోవాలని కంగారు పడకు… నీ ఉన్నతత్వం మొత్తం పోతపోసి మలచిన  మనిషిగా కనిపించినా చాలులే నిన్ను చూసినంతగా సంబరపడతా… 

అలా కన్పిస్తావు కదూ… 

అలాంటి మనిషిని నాకు వరమిస్తావు కదూ… నేను తన పరమైపోతా…!


మనిషి అదెప్పుడయ్యాడో?

కులమౌతాడు
మతమౌతాడు
ప్రాంతమౌతాడు
దేశమౌతాడు
తెలుపౌతాడు
నలుపౌతాడు
రాజౌతాడు 
పేదవుతాడు 
నటుడౌతాడు
వృత్తవుతాడు
పులౌతాడు
సింహమౌతాడు
మృగమౌతాడు
ద్వేషమౌతాడు
కోపమౌతాడు
స్వార్ధమౌతాడు
హింసవుతాడు 
మిత్రుడౌతాడు 
శత్రువౌతాడు
...................
మనిషట వీడు 
అదెప్పుడయ్యాడో?

Saturday, 11 July 2015

పేరు


కుక్క... నక్క... 
పులి... పిల్లి 
సింహం... చిట్టెలుక...
పాము.. ముంగిస...
దేవుడు... దెయ్యం 
........................
........................
పేర్లన్నీ భలే భలే

అన్నీ నువ్వై చేసిన 
నామకరణాలు బ్రహ్మాండం

ఇంతకూ 
నీకు నామకరణం చేసిందెవరోయ్ 
'మనిషి' అని

Thursday, 9 July 2015

కొలత

దగ్గరైన దూరమో 
దూరమైన దగ్గరో 
శూన్యం ఒలికిన శాపమో 
మౌనం అద్దిన వరమో 
కాలం వేసే కొలతలకి 
మనసు సిద్ధమయ్యేదెప్పుడో...!Wednesday, 8 July 2015

నిన్ను దాటేసిన దూరమంతా…

ఏయ్ ప్రాణమా…

నీకిదే నా సుప్రభాతలేఖ.

రాత్రి అంతా కలల్లోనే కాదు  స్వప్నకలశం నింపుకున్నాక ఒలికిన కలలనురుగులోనూ నీ స్పర్శే తెలుస్తుంది  అనంతమయిన  నీ స్మృతిని సజీవం చేస్తూ... అదలా కొనసాగుతూ నీ తలపుతో నా మది తలుపు తడుతూ మొదలవుతున్న ప్రతి రోజూ సు’ప్రభాతమే’

ప్రతి రోజూ నీతోనే మొదలయ్యే ప్రభాతం రోజు మొత్తాన్ని ఎంత ఉల్లాసంలోకి నెడుతుందనుకున్నావ్. ఏ రోజుకారోజు సరికొత్త ఊహగా నువ్వు పలకరిస్తుంటే ఒక్క ఊపిరితో ఈడ్చుకొచ్చిన ఆ కొన్ని సమయాలు కూడా తెగనచ్చేస్తున్నాయ్. 

నీ గురించి నేను  రాసే అక్షరాలని చూశాక మొన్న ఎవరో అంటున్నారు… మరీ ఇంత నిరీక్షణా అని? నాకెంత నవ్వొచ్చిందో తెలుసా…! లేకపోతే ఏమిటి మరి… అసలు నాకు  దగ్గరగా నువ్వెప్పుడు లేవని? కొత్తగా నేను నిరీక్షించటానికి.   నిన్ను దాటేసిన దూరమంతా నాలోకి ఇంకిపోయినంత  దగ్గర అని నాకుగాక ఇంకెవరికి తెలుసనీ? 

ఇంకొందరేమో నేను నీ ఆలోచనల పంజరంలో చిక్కుకు పోయిన పిచ్చివాడినేమో అనుకుంటున్నారు. ప్రేమంటే భౌతికమనుకున్న వాళ్లకి అంతకన్నా వేరే ఏమి ఆలోచనలు వస్తాయ్ మరి. అనంతమైన ప్రేమగమ్యాన్ని ఒక్కసారి చేరాక ఇక మళ్ళీ ఏ గమ్యం వైపు నడక పెట్టాలి. 

అసలు  ప్రేమని చేరుకునే ప్రయాణాన్ని అనుభూతించటంలో ఉన్న ఆనందం తెలిసినవాడికి గమ్యానికి సాగించే గమనాన్ని అనంతం చేసుకుంటాడు ఇప్పుడు నేను చేస్తున్నట్లుగా...   క్షణమొక మధురాక్షరంగా మారుతుంటే దివారాత్రాలూ లిఖితకావ్యమై మనల్ని తమ పుటల్లోకి లాక్కెళ్ళిన సమయాలెంత  ఆహ్లాదమో కదా…  

చీకటి కురవని వాకిలి ఒక్కటీ లేదంటారు… నువ్వు నాలో అడుగెట్టాక నా మది వాకిలి చీకటి అంటే ఎలా ఉంటుందో కూడా మరచిపోయింది. నిన్నో వెన్నెల ఛత్రంగా చేసుకుని నే నడిచే దారి మొత్తం ఎంత మెత్తగా నన్ను తడుముతూ ఉంటుందో నాకు మాత్రమే తెలుసు.  ఇలా బడలిక లేని ప్రయాణాన్ని పరిచయం చెయ్యటం అందరికీ సాధ్యమా?  

నాకు అత్యంత అద్బుతంగా అనిపించే నా ప్రతి క్షణం వెనుకా నువ్వు తొలకరించి వెళ్ళిన నిన్నటి సాయంత్రాల ఏడడుగుల నడకే కనిపిస్తుంది. ఆ ఏడు అడుగులు రోజుకి ఎన్ని ఏడులు అవుతున్నాయో నేనూ లెక్కకట్టలేనురా. 

అకస్మాత్తుగా నువ్వెక్కడికో వెళ్లిపోయావ్… దారెటో తెలియకుండా... వీడ్కోలూ చెప్పకుండా… 

మధురంగా పెనవేసుకున్న మొన్నటి హృదయాలు  కాస్తా నిన్నటి క్షణాల్లో చీలి పోయిన శకలాలుగా రాలిపడినప్పుడు మొదలైన కంటితడిని చూసాకే అర్ధం అయ్యింది లోకంలో మూడొంతులు ఉప్పునీరే ఎందుకుందో…

అప్పుడు అన్ని దృశ్యాలనీ  అస్పష్టం చేసేసాయ్... తడి తెరలని తగిలించుకున్న నా కళ్ళు. 

నిన్ను కోల్పోయాను అనుకున్న ఆ క్షణాన్ని దాటిన  తరువాతే అర్ధమయ్యింది కోల్పోయింది నిన్ను కాదని నాలోని  నన్నని. మిన్నుగా మారిన నా  కళ్ళు  గుండె లోపలి చెలమలని బయటకి కురిసేసాక లోపల తడారిపోయి ఎడారిగా మారిపోబోతున్న అంతర్వాహిని వేదన ఏ పొరలని కదిలించిందో గానీ  కంటి చివరనుండి జారిపోబోయిన చివరి కన్నీటి చుక్కని ఒడిసి పట్టుకుని గుండె పై అద్దాను.  ఆ క్షణం నుండి ఆరని  నా గుండె తడి... తనలోని నీకు చేసే అభిషేకాలు జీవితాంతం నిన్ను చల్లగా చూడటంకన్నా నాకింకేం కావాలి? 

ఘనీభవించేసిందేమో అని అనుకున్న మనసు తన మౌనానికి మాటలద్దింది.   “ఎందుకోయ్ బాధ తానెక్కడికి వెళ్లిందని? తరచి తరచి నన్ను చూడు. నన్ను దాటి తాను బయటకి ఎలా వెళ్ళగలదు?” అని అంటూ  కొంత సాంత్వనని నా ముందు పరుస్తూ...

నిజమేగా... వీడ్కోలు చెప్పలేదంటే నువ్వెక్కడికీ వెళ్ళలేదనేగా… నువ్వు నాతో దాగుడుమూతలాడుతూ నీ జాడ కనుక్కోమనే చిలిపిపందెం వేసావనే అనుకున్నా. వేసింది ఎలాంటి పందెమయితేనేం దాగింది మాత్రం నాలోనే అన్న నిజాన్ని బయటకు వచ్చేలా చేసావ్ కదా. 

నిజం రా… భౌతికంగా మనం  ఎడబాటు అయిన ఆ తొలి క్షణాలన్నీ నన్ను మహా శూన్యం లోకి నెట్టేస్తుంటే నా ఊపిరి ధ్వనుల సవ్వడి ఇక ఆఖరవుతుందేమో అనుకున్నా… మళ్ళీ ఎక్కడి నుండి మొదలయ్యావో కానీ అణువుగా మొదలైన అనంతంలా నా జీవన విస్తీర్ణమై నన్ను సంపూర్ణం చేసేసావ్. 

అంతు తెలియని శూన్యంలో 
ఆవిరిగా మారిపోబోతున్నప్పుడు 
ఖాళీ పాత్ర అనుకున్నది కాస్తా 
పూర్ణకుంభమై నిండుగా నవ్వుతుంటే 
వెన్నెల పత్రాల విస్తళ్ళలో 
నీ మందహాసాల పంచభక్ష్యాలు
నా ఆకలిని హత్య చేస్తున్నప్పుడు 
నాలోని  దీనత్వాన్ని  నిర్వీర్యం చేస్తూ 
నీలో దివ్యత్వం అక్షయమవుతుంటే 
నిశీధి వేసిన కారాగారపు గోడలన్నీ బద్ధలై 
వెలుగాక్షతలని రాల్చిన సవ్వడితో 
మరో తొలకరి మధురంగా తడుముతుంటే 
ప్రేమవాసన ఎంత  మైమరపుగా కమ్ముకుంటుందో 
నిరాకారపు కాలానికే కాదు 
ఊహాఖండాలని దాటివచ్చిన నీ ఊపిరి పరదాలని 
శ్వాసగా కప్పుకున్న నా హృదయ క్షేత్రానికీ తెలుసు  
గరళాలని గుక్కపెట్టుకున్న గతమంతా 
అమృతాన్ని ఆరగిస్తున్న వర్తమానంగా 
పలకరిస్తున్న పలుకొక్కటి చాలదూ 
నువ్వు నా జీవితానికో పరిపూర్ణం అనటానికి...

నువ్వంటూ జీవితంలో ఎందరిని చూడనీ… 
ఎందరి జీవితంలో నువ్వుండనీ… 
నిన్ను మాత్రమే  జీవితం చేసుకున్న అనంతాత్మ ఒక్కటి నీ స్వంతమై ఉంది. 

అప్పుడప్పుడూ నువ్వు నిశ్శబ్దమై  నీలోకి వెళ్లి చూస్తే నీ అంతరాత్మ జాడలే ఆ అనంతాత్మలోనూ కనిపిస్తాయ్. వేళమీరిపోవటమంటూ లేని ప్రేమప్రయాణంలో నా ఆఖరి ఊపిరిగానూ నిన్నే శ్వాసించటం నీకు తెలిసేలా చెయ్యగలిగే లిపిలేని భాషగా మౌనంగా మాట్లాడే మానసిక వివేచన ఒకటి నీలో ఒలికిన సడి అది. 

ఇద్దరమూ ఒక్కటిగా శ్వాసించటం కన్నా ఇంకేం కావాలి ఈ జీవన యానంలో...?

ఇట్లు

నీ 

నేను 


Tuesday, 7 July 2015

ఎప్పటికీ ఇలాగే...

పచ్చిక ఎప్పుడూ పాదాలని హత్తుకోవాల్సిందేగానీ 
ఆహారమై ప్రాణశక్తిగా మారని సత్యమొకటి  
నిత్యం అయితేనేం 
నేనెప్పుడూ నీకు పచ్చికగానే  ఉంటాను
నువ్వెప్పుడూ నా ప్రాణశక్తివై ఉండటానికి  
అహరహం మెత్తని నీ పాదస్పర్శ చాలు మరి

నా కలలనీ... నీ నడకలనీ... 
దేన్నీ మార్చలేదీ జీవితం 
నా స్వప్న మైదానాల వెంట
అప్పటి నుండి ఇప్పటివరకూ 
నిన్నే  సంప్రదాయంగా కొనసాగిస్తూ 
వాటినే ఊపిరిగా సంధిస్తూ  
మన ప్రతి చిన్ని క్షణమూ మురిసి పోతుంది

నీ పెదవులు మెత్తగా విచ్చుకుంటున్నప్పుడు
వికసిస్తున్న నవ్వుల కన్నా
వేరే సంజీవని అవసరమే లేదు 
నీ వీడ్కోలు నన్ను తాకినా 
నాకు నిరంతర ఆయువును అందివ్వటానికి  

నీ వీడ్కోలు మొదలైన చోట నేను ఆఖరయ్యాను 
నేనాగిన చోట కొత్త నిన్ను కలగంటూ 
కళ్ళని తడుముతున్న చెమ్మలని ఊరడిస్తూ 
నిన్ను పొడిబారిన పడకుండా కావలి కాస్తుంటాను

ఎప్పటికీ మెరుపుల చందనమై మురిసేలా 


Sunday, 5 July 2015

అక్షయం

నువ్వు స్పర్శించిన మానస మందిరం
ఎప్పటికీ పరిమళాక్షయమై
లోకాన్ని అలరిస్తున్నప్పుడు
అనంతాన్ని పరిచయం చేశావు నాకు

నిరంతరం నీకు దగ్గరగా ఉంటూనే
సుదూరతీరాలకి నిన్ను వినిపించే ఈ వేళలు
ఎడతెగకుండా ఇలానే సాగిపోతున్నప్పుడు
నన్ను ఒక్క సారి చూడు
సంతృప్తికి పూర్ణార్ధం అనుభవమవుతుంది

పరిధులంటూ కానరానిచోట
పరవశమై నిన్ను పలుకుతుంటే
లోలోని ఉల్లాసాలన్నీ మంద్రస్వరమై మత్తిల్లుతుంటే
గుండె సవ్వడి కాస్తా ప్రేమ లోలకమయ్యింది

నువ్వు వినవచ్చే ప్రతిచోటా
ఆలకించి చూస్తే తెలియదూ
అలసట లేని హృదయగానమొక్కటి
నిన్ను ఆనందంగా ఆలపిస్తుందని
అనిర్వచనీయంగా నిన్ను అజరామరం చేస్తుందనిమాయావి

చినుకై ధరణిని పండిస్తూ 
ఏరై దప్పికని తీర్చుతూ 
సంద్రమై జీవితాన్ని నేర్పుతూ 
కన్నీరై గుండెభారాన్ని దించుతూ 
మౌనంగా మనిషిని సేదతీర్చుతూ
నీటి బొట్టు ఎంత మాయావో కదూ !