మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Thursday, 29 May 2014

'మృతంజీవుడివే' తారక రామా

తారక రామా...
విశ్వ విఖ్యాత నట సార్వభౌమా...
నట రత్నా...
తెలుగు కళా వల్లభా...
అభినవ ఆంధ్రభోజా....
అన్నా...

ఎక్కడున్నావయ్యా నువ్వు...? అసలు ఎలా పిలవాలి నిన్ను? ఒక్కో గుండె ఒక్కోలా నిన్ను పలకరిస్తుందే. ఒక్కో నయనం ఒక్కోలా నిన్ను చూస్తుందే. మరెందుకయ్యా మా పిలుపులని వినకుండా చూపులకి అందకుండా అంత త్వరగా వెళ్లిపోయావ్.

చలన చిత్రాల్లో కథానాయకుడివి... జన క్షేత్రం లో ప్రజా నాయకుడివి...

తెలుగు జాతికి తారక మంత్రం వేసేసి నీ పాటికి నువ్వు దిగంతాలకి సాగిపోతే సదా నిన్నే స్మరించే సామాన్యుల సంగతి ఏమిటి? మీ ఇంట్లో వాళ్ళ సంగతి ఏమో గానీ మామూలు మనుషులు ‘ఎన్టీవోడు’ అంటూ ఎంత స్వంతం చేసేసుకున్నారు నిన్ను?

దిగంత లోకాలలోనూ తెలుగు ఖ్యాతిని ఇనుమడింప చేద్దామని వెళ్ళిపోయావ్ కదూ అంత త్వరగా...

తెలుగు వారి రాముడుగా, కృష్ణుడుగా, సినిమా దేవుడుగా ఎన్ని వేషాలు? ఎన్నెన్ని పాత్రలు... పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే వాడివి కదా... చలన చిత్రాల్లో నువ్వు వేసిన పురాణ పాత్రలు చూసి నిజంగా దేవుడే దిగివచ్చినా తనలో నీ పోలికలు కనిపించక పోతే తనని దేవుడిగా అంగీకరించలేని జాతిగా మార్చేసావ్ కదా తెలుగు వాళ్ళని.

లోకం విడిచి 17 ఏళ్ళు గడిచినాక కూడా తెలుగు దేశమే కాదు మొత్తం భారతదేశం లోనే మహానటుడిగా పట్టం కట్టిన ప్రజలున్న దేశం లో ప్రభుత్వాల రాజకీయాలకి వట్టి పద్మశ్రీ గా మిగిలిపోయావ్...!

నువ్వు అలా సినిమాల్లోనే ఉండి పోయి ఉంటే మహా అయితే నీకు పద్మభూషణ్ లు... దాదా సాహెబ్ ఫాల్కేలు వచ్చేవేమో.

మరి మాకు ఏమి వచ్చేది మదరాసీలుగా ఉత్తర భారతం లో ఉన్న గుర్తింపుకి కొనసాగింపు తప్ప. నువ్వొచ్చావ్ కాబట్టే భారతదేశ చరిత్ర కొత్త పుంతలు తొక్కింది... అప్రతిహంగా సాగిపోతున్న కాంగ్రెస్స్ ని రాజకీయాల్లో నెలల బాలుడిగానే తెలుగు నాట మట్టి కరిపించటమే కాకుండా దేశం లో ఉన్న ప్రతిపక్షాలన్నిటినీ ఒక తాటి మీదకు తెచ్చి కాంగ్రెస్ చెక్ చెప్పావ్...

కుత్సిత రాజకీయులు నిన్నో కుల నాయకుడిగా తీర్మానించేస్తున్న సందర్భాలు చూస్తుంటే సమాజంలో స్వార్ధాలెంతగా అల్లుకుపోయాయో తెలుస్తుంది.

ఎవ్వరేమనుకోనీ... నువ్వు నాయకుడివి...

ఇన్నేళ్ళ తరువాత కూడా నీ దగ్గర పని చేసిన అయ్యేయస్ లు నీ క్రమ శిక్షణ గురించి... ప్రజలకి మంచి చెయ్యాలనే తపన గురించి అవినీతి అంటే నీకు గిట్టని పొడగురించి చెప్తుంటే... నువ్వంటే ఉన్న ఇష్టం అంతకంతకూ పెరిగి పోయింది.

మద్రాసీలుగా మగ్గిపోతున్న తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన పౌరుషాగ్ని జ్వాలవి నువ్వు.

నీకు తన పర భేదమే లేదు కదూ... ప్రత్యర్ధి పార్టీ అయినా తెలుగువాడు ప్రధాని అయ్యాడు అని తనే మీద పోటీ పెట్టకుండా సహకరించిన వైనం ఇంకా మరువలేదు. విశ్వాసం పొందాలని అదే వ్యక్తి నీ పార్టీ నాయకులని టోకుగా కొన్న సంగతీ మా మదిలో అలానే నిలిచి పోయింది.

నీ నిష్క్రమణానికి ముందు నువ్వు పడ్డ క్షోభ ఇంకా మా మనస్సుల్లో కదలాడుతూనే ఉంది. గెలుస్తూ బతికినా నువ్వు ఓడిపోలేక మరణించావ్ కదూ... నీ మాహాభినిష్క్రమణం చూసిన రోజు ఎన్ని గుండెలు ఆగాయో...

తరతరాల తెలుగు సినీ జగత్తులో గొప్ప గొప్ప నటులు ఎందరు వచ్చినా ’మహానటుడి’ స్థానం మాత్రం ఆచంద్రతారార్కం నీదే...

తరతరాల తెలుగు రాజకీయ రంగంలో ఒకే ఒక్క నాయకుడివి నువ్వే...

తెలుగుజాతిపై నువ్వేసిన సమ్మోహనమంత్రం... తారక రామ మంత్రం

తారక రామా...అజరామరం నీ కీర్తి... దిగంతాల్లోనూ నీతోనే తెలుగుకు ఖ్యాతి...!

రాజకీయమంత్రంగా మారిపోయిన ' భారతరత్న' నీకు రావచ్చు గాక. లేకపోవచ్చుగాక... నువ్వెప్పటికీ జాతి రత్నానివే.

తెలుగు జాతి గుండెల్లో నీ రూపం శాశ్వతం...

ఓ యుగ పురుషా... తెలుగు జాతి ఉన్నంత వరకూ నువ్వు ‘మృతంజీవుడివే’

మళ్ళీ నీ ఊపిరి చప్పుడు కావాలట తెలుగు జాతికి... తారక రామ తేజమై రా!

ఇట్లు


తెలుగోడు