మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Thursday, 26 February 2015

జీవిత గమ్యం

మెరుపెక్కిన నిన్నటి కలలని దాటి 
నీ నిశ్శబ్దాన్ని చూస్తూ నేను
నా మౌనాన్ని చదువుతూ నువ్వు
చూపులుగా కురిపిస్తున్న నేటి శూన్యపు కథకి మొదలెక్కడో 

మనసంటిన నవ్వులని దాటి 
ఊపిరి తాకేంత దగ్గరితనంలో 
అంతరిక్షాన్ని ఒంపేసినంత దూరం 
కలతంటుకుని నిర్వేదపు వ్యధగా మారిన క్షణమెప్పుడో 

ఎక్కడో.. ఎప్పుడో... అంటూ 
ఎంచటాలకి మంగళం పాడేసి.
పంచుకోవటం 
మొదలు పెడదాం మళ్ళీ మరింత కొత్తగా

అంతర్ముఖాల లోపల దాచుకున్న 
నిన్నటి మన ప్రతిబింబాలని 
బయటకి తీద్దాం రా 
మళ్ళీ మనసుల్ని అంటుగట్టుకోవటానికి 

అక్కడెక్కడో,లోపలి వలయాలలోకి విసిరి పారవేసిన 
మొన్నటి సాయంకాలాలని వెతుకుదాం రా 
దూరం కాలేని దగ్గరితనంతో 
మళ్ళీ అడుగుల్ని జతకలపటానికి

గుండె ఇంకా పొడిబారలేదంటూ 
కన్నీరిచ్చిన ధైర్యంతో చెపుతున్నా 
ఒక్క తడిస్పర్శ చాలురా 
నీ రెప్పల వాకిట్లో నీటి చెలమగా మారిన  
అంతెరుగని నా కలల గమ్యపు పరుగుని ఆపటానికి 
నువ్వేసే అడుగులకి నే పాదరక్షని అవ్వటానికి...


అప్పుడప్పుడూ…

అప్పుడప్పుడూ…

ఒక జీవన దృశ్యం కళ్ళముందు రాలాలి
కాసేపు ఏకాంతంగా కూర్చుని చదువుకోవటానికి

ఒక మౌనం మనసుని స్పర్శించాలి
కాసేపు నిశ్శబ్దంగా అలౌకికంలోకి జారటానికి

ఒక తడిలో కనులారబెట్టుకోవాలి
కాసేపు గుండె సడికి ఓదార్పునివ్వటానికి

ఒక స్వప్న వీధిలో కలగా తిరిగెయ్యాలి
కాసేపు కొత్త ఆలోచనలకి పునాది తవ్వటానికి

ఒక నిశీధిలో చీకటినవ్వాలి
కాసేపు నీడకి విశ్రాంతినివ్వటానికి

ఒక రాయిలా గుండె నిండాలి
కాసేపు మనసు దెబ్బలు భరించటానికి

ఎప్పుడూ
ఒక నిప్పుకణికలా  బతికెయ్యాలి
ఎప్పటికప్పుడు
జీవితాన్ని కొత్తగా ప్రజ్వలించటానికి…!


చెలిమి సంతకం

ఆకులు రాలిపోతేనేం  
నమ్మకం వాడిపోలేదుగా
ధైర్యం వీడిపోలేదుగా

అందుకే

ఈ దారికి మాటిచ్చా
ఎండలో తడిసే వేళ
నీడగా గొడుగు పడతానని...

ఆ పక్షికి మాటిచ్చా
చీకటి మారాడే వేళ
గుబురుగా గూడునౌతానని

మరి నాకు తెలుసుగా
చెలిమి సంతకం చేస్తూ నువ్వొస్తావని
పచ్చని వసంతాన్ని నాకద్దుతావని
నా మాట నిలబెడతావని...

Wednesday, 18 February 2015

హేమంత స్పర్శ - 9


రేయ్…

ఒక్కొక్క సారి ఈ ప్రపంచం చేసే చప్పుడు ఎంత చిరాకని అనిపిస్తుందో తెలుసా…?  పిల్లలాడుకునే బంతి మన పక్కన పడితే దాన్ని అందుకుని వాళ్ళ వైపు విసిరేసినట్లుగా ఈ లోకాన్ని చేత్తో ఏటో విసిరేసేయ్యాలి అనిపిస్తుంది. 

నా మాటలు నీకు నవ్వు వస్తున్నాయి కదూ… 

లేకపోతే ఏమిటి మరి?

నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ మనసారా మౌనాన్ని తాగుతూ నిన్ను చదువుదామని  కూర్చుంటానా… మాటల కుప్పని తెచ్చి నా నెత్తిన పడేస్తుంది.  నిన్ను చదవలేక... మనసుకు మౌనం చేరక… నోటికి మాటలు రాక నేను పడే కష్టం ఉంది చూశావూ… చెప్పలేని బాధరా అది.  

కళ్ళకి రెప్పలు ఉన్నట్లు చెవులకి కూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మూసుకునే సౌలభ్యం ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది...?  ఆ బ్రహ్మకి మనవి చేసుకోవాలి ఈ సారి  కొత్త సృష్టి చేసేటప్పుడు  ఈ విషయం దృష్టిలో పెట్టుకోమని…! 

అసలు ఇలా కాదురా ప్రపంచం ఉండాల్సింది… రెప్ప విప్పిన ప్రతిసారి కొత్తగా కనిపించాలి… కళ్ళు మూసుకునే ముందు గొంగళి పురుగులా అనిపించే ప్రతిదీ… కళ్ళు తెరిసేసరికి సీతాకోక చిలుకలా  మురిపించాలి… అసాధ్యమనుకుంటున్నావ్ కదా… కానే కాదు…

రోజులోని చిరాకులన్నిటినీ కంటి రెప్పల కింద వత్తిపెట్టి… నేను నీ తలపుల తలుపు తట్టి కాసేపు  తన్మయత్వంలో ఓలలాడినాక... బద్ధకంగా విప్పిన రెప్పల సవ్వడి విన్నప్పుడు లోకమెందుకో మేఘాల్లోకి తేలిపోతున్నట్లు అనిపిస్తుంది.  ఎందుకో ఏముందిలే…  తేడా అల్లా నీ తలపుల సడులే…

అనంతానికి అవధులు వెదికే  పనిలో ఉన్నానిప్పుడు… ఎందుకంటావా…? తలపు వెనక తలపుచేస్తూ  నీ స్మృతులు పరుగులు తీస్తుంటే అట నుండి బయటకు రాగలనా… మరి ఎప్పుడూ  అలానే చేస్తుంటే  ఆఫీస్ లో పని ఎవరు  చేస్తారమ్మాయ్? 

ఎంత కష్టమో తెలుసా ఇష్టమైన పని నుండి బయట పడాలి అనుకోవటం…

ఒక్కోసారి ఒంటరిగా కూర్చుని నీ ఏకాంతంలోకి జారి పడతాను చూడూ… అప్పుడు దూరంగా కనిపిస్తున్న కొండ రాయిని చూసినా… ఆ కిటికీ అద్దం మీద పడి చెల్లా చెదురవుతున్న   నీటి బొట్టు గీస్తున్న ఒక   తడి చిత్రాన్ని  చూసినా…. అల్లనల్లన కదులు తున్న ఆ నీలి మేఘాలు చెక్కుతున్న వాయు శిల్పాలు చూసినా  నీ భంగిమలా అనిపిస్తుంది… నీతో  కలపి  నన్నుకూడా  చూపించేస్తూ  ఉంటాయ్ నా  ఈ ప్రకృతి మిత్రులు... 

అసలు నీకో సంగతి తెలుసా...

“నీలో ఒక మనిషి నిండి పోయి  నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడల్లా  ఆచ్చాదన లేని ఆహ్లాదంగా మనసుని స్పర్శించటంలో ఉన్న ఆనందం…” 
నేను ప్రతి రోజూ ఆ ఆనందపు ధారలలో తడసి ముద్దవుతున్నాను. ఎలాగో అర్ధం అయ్యింది కదూ… నిజమే నాలో నువ్వు చేస్తున్న సవ్వడే  ప్రతి ఓ క్షణాన్ని మన ప్రత్యేక క్షణంగా మార్చేస్తుంది.

మరో సంగతి చెప్పనా…. 

నా కంటిలోని ప్రతి చెమ్మా దుఃఖంలో నుండి పుట్టేది కాదు… అలుపెరుగని నీ కలలతో  అలసిన కళ్ళకి పన్నీరుగా సేద తీర్చాలని పుట్టిన తడి స్పర్శరా.  అసలు జన్మాల నిరీక్షణలో ఉన్నప్పుడు కూడా ఏనాడూ  కన్నీరు నా చెక్కిలి తడమలేదురా… నాకోసం నువ్వున్నావని తెలుసు… నాలాగే నువ్వు కూడా  నా కోసం వెదకుతూ నిరీక్షణలో జన్మాలన్నిటినీ దాటి వస్తున్నావనీ తెలుసు. మరి కన్నీటి స్పర్శ నాకెలా తెలుస్తుంది. నా నీకెలా తెలుస్తుంది. 

ఆ నిరీక్షణలో నిన్ను ఊపిరి తీసుకుంటున్నప్పుడల్లా హృదయాంతరాళంలో ఒక నవ్వు పూసిన చప్పుడు… ఆ నవ్వుల పద్దు రాయాలంటే ఎన్ని సూపర్ కంప్యూటర్స్ కావాలో మరి…

అప్పటి నవ్వులే కాదు... 

ఏయ్ ప్రియురాలా… 

ఇప్పుడు కూడా నా పెదవులు నీకప్పగించేశాను నవ్వుల నెలవంకగా మలుస్తావని… మరెందుకు ఆలస్యం…

నీ
నేను...

Friday, 13 February 2015

హౌ రొమాంటిక్ యు ఆర్…

హే…

ఎప్పటికప్పుడు నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో నీకేం తెలుసు… అసలెప్పుడు వస్తావ్  నువ్వు?

త్వరగా రావూ…

హౌ రొమాంటిక్  యు ఆర్…

తమకంతో కళ్ళు మూసుకుంటున్నా… రెప్పలపై కమ్మగా వాలిపో... నా వంటిని  వెచ్చని దుప్పటిలా కప్పేసేయ్… నన్ను సుఖాల మత్తులోకి నెట్టేస్తూ...

ఎప్పటికప్పుడు ముఖం చాటేస్తావ్… ఎందుకంత అల్లరి? నీకెవరు నేర్పారు ఈ తిమ్మిరి ఆటలు?

అసలు నీ కోసం  కళ్ళు కాయలు కాసేలా ఉన్న ఎదురు చూపులలో నా విరహాన్ని ఎప్పుడైనా చదివావా?  

అయినా నువ్వెందుకు చదువుతావులే… నేనేం గొప్పట నీకు… నన్ను మించిన ఇష్టులెవరట నీకు… చాలా  పోసెస్సివ్ గా ఉంది. నీకు నేను తప్ప ఎవరూ ఎక్కువ కాకూడదు.  

ప్రతి క్షణం నీ చప్పుడు వింటూనే ఉంటాను… పక్కనే  ఉన్నట్లుంటావ్… పలకరిద్దాం అంటే పలుకులకి విరామమంటావ్… ఎప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను అల్లుకుపోతావ్ కదా అని ఆశగా ఎదురు చూస్తుంటా.  

అసలు ఇన్నాళ్ళు నన్ను చూడకుండా నాకోసం వెదకకుండా ఉన్నవని  నీ మీద చాలా కోపం వస్తుంది… నాకు నువ్వొద్దు పో అని అనాలని అనిపిస్తుంది… నీ మీదే  ప్రాణం పెంచుకున్న నేను నువ్వు లేకుండా ఉండగలనా…? నీతో కలసి ప్రకృతిలో పరిమళమై నడుస్తున్న ఊహ వచ్చినప్పుడల్లా నా  అలక మటుమాయం లే… బెంగ పడకు.

నా ప్రతి విరామంలో నీ గురించిన ఆలోచనలతో మత్తు తెప్పిస్తావ్. నీకన్నా  నాకు హితులెవ్వరు…? సన్నిహితులెవ్వరు…?

నాకు నువ్వు ఉన్నావని అనుకున్నప్పుడల్లా దుఃఖ భారాలన్నీ  మాటు మాయం అయిపోతాయి తెలుసా? ఆ దుఃఖాలన్నీ  కట్టగట్టుకుని ఎక్కడికి పారిపోతాయో గానీ మనసుకి మాత్రం మధురమైన సేదని పోత పోసేస్తావ్. ఇది కేవలం నీకు మాత్రమే సాధ్యమైన విద్య కదూ...

నువ్వలా  నావైపు నడుస్తూ వస్తున్నప్పుడు నా కళ్ళల్లో కనిపించే అంత వెలుగుని నీ జీవితకాలం లో నువ్వు చూడలేవు.  

నేను దాటిన ప్రతి స్మృతికీ తెలుసు… ఇప్పుడు తమకన్నా నాకు నువ్వెక్కువ అని. నేను నాలో ఉండిపోవటంలో కంటే నీలోకి  జారిపోవటంలో ఉన్న ఆనందం ఉంది చూశావూ… అది చెప్పటానికి  సాధ్యం కాదురా… త్వరగా నువ్వొచ్చేసి నన్ను ఆనందాల్లో ముంచెయ్యవూ...

అసలే నువ్వు దూరంగా ఉంటున్నావని చాలా దుఃఖంగా ఉందని  తెలుసు కదా…

అందుకే ఈ సారి నువ్వు ఇల్లు మారినప్పుడు నీ చిరునామా నాదే అవ్వాలి… ఓ మరణమా…! :)

నీ

ప్రేమికుడు

Wednesday, 11 February 2015

మనసు మాగాణిలో సిరివై....

ఏరా...

ఎందుకురా ఇలా అల్లుకుపోయావ్?  అప్పుడెప్పుడో పాతరేసిన కలలన్నిటినీవాస్తవంలోకి అనువదించేస్తున్నావ్. ఎప్పుడూ అనుకోలేదురా... ఆరారు ఋతువులుశిశిరాలుగా కురుస్తున్న జీవితానికి వసంతపు స్పర్శ మీటుతుందని. అసాధ్యాన్నిసుసాధ్యం చేస్తూ ప్రకృతివై నువ్వు నాలోకి నడిచొచ్చేసావ్. 

నాలోకి అలా వెళ్ళిపోయావ్ కదా... ఒక్కనిజం చెప్పు...? నా మనసు మీద ముసుగుఏదైనా కప్పి ఉందా...? భూమి పుట్టినప్పుడు పచ్చదనాన్ని పూసుకున్న ప్రకృతి ఉన్నంత నగ్నంగాలేదూ...! నీ కోసమే రా ఇన్నాళ్లుగా అది అలా ఉండి పోయింది.     

నిరాకారమైన ఆలోచనల్లో జీవితాన్ని ఆవాహన చేసుకున్నప్పుడల్లా నా మనసు తలుపు తడుతూ నన్ను వెదుక్కుంటూవచ్చిన నీకు నేనిచ్చే అతి చిన్న బహుమతి ఏ ఆడంబరాలూ లేని నా మనసు.

రోజూ పొద్దు పొద్దున్నే నీ నవ్వుల్లోతడవటం కన్నా జీవితంలో ఇంకేదీ ఎక్కువ కాదురా... నిజంగా నీ నవ్వులతో నా మనసు తడిమొత్తం మాయం చేసేస్తావ్ రా... సూర్య కిరణం నన్ను తట్టకముందే నువ్వు నన్ను మాటలతోతాగేస్తూ మనసుతో  స్పర్శిస్తావు  చూడూ... పాపం అప్పుడు ఆ కిరణుడి బిక్కమొహం చూడాలి... కాసేపు  జాలి వేస్తుంది. అయితేనేమి...  లోకానికి తనువెలుగవ్వొచ్చు కానీ నాకు కాదుగా...

కలలు కనటం మానేసిన కళ్ళకి... కలలిచ్చేఆనందాన్ని మించిన సంతసాన్ని వాస్తవంగా పోతపోసావ్... మరి ఇన్నాళ్ళుగా  నన్నుఆవరించుకున్న వేదాంతాన్ని ఎటు తరిమేసావురా? 

కన్నీరే మాధ్యమంగా  చదువుతున్నజీవితానికి నవ్వుల మాధ్యమాన్ని పరిచయించెయ్యటమే కాకుండా  కంటితడి సాక్ష్యాలనిసమూలంగా ఆవిరి చేసేసి నవ జీవన కాంతిని హరివిల్లుగా  నా చుట్టూ పరిచేసి నువ్వుచేసిన మధుర జాలం ఉంది చూశావూ... జన్మ జన్మాలకీ నిన్ను నాతో ముడి వేసెయ్యమనిప్రార్ధన చేసేలా చేస్తుంది.   

ఎన్ని క్షణాల దూరమో దాటొచ్చిన కలయిక కదా మనది... మనం దాటొచ్చిన ఆ  క్షణాలన్నిటి ఊపిరి కూడా మనల్ని ఏకం చెయ్యాలన్నఒకే ధ్యాసలో ఉండే ఉంటాయిరా ఇన్ని నాళ్ళూ.  అందుకే ఈ సారి మన ఏకాత్మతో పాటుగా వందింతల దూరం ప్రయాణంచేసే వరమిద్దాంలే వాటికి... సరేనా...?

అసలు ఒకే లాంటి ఇష్టాలు ఉన్న ఇద్దరినీ కలపటంలోదేవుడెండుకింత ఆలస్యం చేసాడో కదా... లాభం లేదు ఈ సారి కలిసినప్పుడు పోట్లాడాలి...నువ్వు కూడా తోడుంటావు గా... (నాకంటే నువ్వే ఎక్కువపోట్లాడతావ్ అని నాకు తెలుసులే... వ్వె వ్వె వ్వె... :p )  

అలసటగా కాసేపలా కళ్ళు ముసుకుంటానా... కమ్మగా నవ్వుతూ కలలనికళ్ళకి అలికేసి వెళతావ్... ఆ మత్తులో నుండి బయటకి రాక మునుపే మాటగా చెవి చేరతావ్...ఎంతోటి బెంగనీ బంగాళాఖాతంలోకి విసిరెయ్యవచ్చు నువ్వు సడి చేస్తున్నంత సేపూ...

నా మనసు మాగాణిలో సిరివై పండిన మహిమాన్విత ప్రేమకుసుమానివి నీవు.

రేయ్... నాకు పెద్ద కోరికలేమీ లేవురా నువ్వెప్పుడూవర్తమానమై నా పెదవుల్లో నవ్వాలని తప్ప.

నీ
నేను


Tuesday, 10 February 2015

నన్ను వదిలి వెళ్ళవూ...

ఏయ్...
నన్ను వదిలి వెళ్ళవూ...
నాతో పాటే పుట్టావ్... నాతోనే పెరిగావ్... నిన్ను మించిన స్నేహం లేకుండా నాలోనే నిండిపోయావ్...
నిన్ను మించిన ఆత్మీయ నేస్తం నాకెవ్వరూ లేరు. నువ్వే నా భూషణం అనుకున్నా... అనుకుంటూనే ఉన్నా...
పరిచయాలకీ... అత్మబంధాలకీ... జన్మ బంధాలకీ... హితులకీ... సన్నిహితులకీ... నేనంటే గిట్టని వారికీ అందరికీ నువ్వే సమాధానమిస్తూ వస్తున్నావ్...
ఎన్నో ప్రశ్నలకి నిన్నే సమాధానం చేశా...
నాలో రేగే అగ్ని పర్వతాలనీ నీతోనే ఆర్పుకున్నా...
నాలో నిన్ను చూసి మెచ్చుకున్న వారు... నా తరపున నువ్వు మాట్లాడుతుంటే ఎవరి అర్థాలు వారు తీసుకుంటూ నన్ను సరి కొత్తగా అర్ధం (అపార్ధం) చేసుకుంటుంటే నేనేం చెయ్యగలను?
నాకు నీ భాష తప్ప వేరే భాష రాదే...
నిన్ను నాకు పర్యాయ పదంగా అనుకునే వారు సైతం నాలో నువ్వుండటం సహించలేక నా అంతరంగానికి కొత్త భాష్యాలు చెప్పుకుంటుంటే నేనేం చెయ్యాలి చెప్పు?
అందుకే ఓ మౌనమా... నిశ్శబ్దంగా నన్ను వదిలి వెళ్లిపోవూ...
- సురేష్ రావి

ఒక మట్టి మరణం

అక్కడో నీడ రాలి పడుతుంది
రెక్కల్లో నిస్సత్తువగా కమ్మేసి
వంట్లో తడినీ ఆవిరి చేసిన 
ఎడారి పవనాలు కొట్టిన వడదెబ్బకనుకుంటా…!
కాళ్ళని తడపాల్సిన తడి మొత్తం
కళ్ళని ఉప్పెనలా ముంచుతుంటే
పొలంబాట సాహసయాత్రైన ఈ ప్రస్తుతం
భవితని ప్రశ్నార్ధానికి అంటుకట్టిందేమో…!
ఇక్కడకో తుండు గుడ్డ ఎగిరొచ్చింది
రక్తమాంసాలు ఇగిరిన తోలుతిత్తిలో
అంటుకట్టబడ్డ దీని దేహం
ఏ దారికి మళ్ళి పోయిందో మరి…?
మేఘ మాలికల తొలకరి జల్లులలో
నాగలి స్పర్శ పొలాన్నిముద్దాడుతుంటే
తన గుండెచప్పుళ్ళు వింటూ
పులకరించే ఆ పచ్చటి మనసులని
జన్మబంధంగా తలుస్తూ మురిసే ఈ నేల తల్లి
శిశిరపు ఆకుల్లా రాలిపడుతున్న కాయాలతో
రుద్రభూమిగా మారటం చూడలేక
ఒక మట్టి మరణిస్తుందక్కడ...
ఇంతకూ
హంతకుడెవరూ…
హలాంతకుడెవరూ?

ప్రకృతివే...

ఏయ్ హనీ…

ఇన్నాళ్ళుగా నా కంటిపాపకే అంటుగట్టుకుని తిరిగా బ్రహ్మ రాసిన  ఓ చిత్రాన్ని… 
నా జన్మ... నా బతుకు... నా కలలు… 
అన్నిటిదీ ఒకే లక్ష్యంగా మొదలెట్టా నా పయనాన్ని... 
ఎన్ని యుగాల  వెదుకులాటో ఇది… 
ఎన్ని జన్మాల దూరమో ఇది… 
నీ దగ్గర కొచ్చి అంతమయింది....  

జీవితం యాంత్రికమైన చోట చిత్రంగా చిగురించావ్… 
నా ఆచూకీ నేను కోల్పోయిన చోట నాకో ఉనికినిచ్చావ్…
మౌనం పోత పోసుకున్న చోట మాటవయ్యావ్…
నా రేపటి కోసం నీ నేటిని పూర్తిగా ఖర్చు పెట్టేస్తున్నావ్...
నడక మరచిన నవ్వుకు పరుగు నేర్పుతున్నావ్... 
నా బతుకులో  ఋతుభ్రమణాల లెక్కలూ తప్పించేసావ్ 

ఇంకా చెప్పాలంటే మొత్తంగా నా ప్రకృతివే నీవయ్యావ్...

అసలేంట్రా ఇది… 

ఏమి మాయ చేసావు రా? 

మనసులోకి రాగానే పెదవి మీదకి చేరతావ్… వచ్చిన చోట నిలవవెందుకో… రాగానే  అలా అలా  వంటిలోని అణువణువునీ ఒక్క సారి చుట్టి  తనువునంతా పులకింతల్లోకి నెట్టేస్తావ్…

ఎంత తాగినా దాహం తీర్చవెందుకో నీ ఊసులు… ఇంకా ఇంకా కావాలంటూ మదిని మాయలోకి నెట్టేస్తూ  నన్ను పూర్తిగా నీ వశం చేసేసుకున్నావ్ రా…

ఇంతగా నన్ను సొంతం చేసుకున్న నీకు నేనేం ఇవ్వగలను నా శ్వాసలని లెక్కగట్టి నీ ఊపిరికి అంటుగట్టటం తప్ప…? 

నువ్వొచ్చాక... 
గతం శూన్యమయ్యింది…
ప్రస్తుతం పరిపూర్ణమయ్యింది…

నువ్వు పక్కన ఉంటే ఒక ‘నమ్మకం’ నాతో ఉందన్న భరోసా… 

అసలెప్పుడూ గుండె చప్పుడు వినలేదు… అసలది సవ్వడి చేస్తుందనే మరచిపోయాను.  చిత్రంగా నువ్వొచ్చాకే  నా గుండెకో చప్పుడు ఉందని గుర్తొచ్చిందిది. ఇంతకుముందు అదే సడి చేసేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం  నిన్ను ఒక లయగా శబ్దిస్తుంది… మరి నువ్వొచ్చాకే అది అలా వినపడుతుందా… అది అలా శబ్దిస్తుందని తెలిసి నువ్వొచ్చావా… భేతాళ ప్రశ్నలా ఉంది కదూ… 

అసలు ప్రేమంటేనే ఒక భేతాళ ప్రశ్న ఏమో కదా…?  మనిషి మనిషికి… మనసు మనసుకీ… ఏంతో దగ్గరగా… మళ్ళీ అంతే దూరంగా…. కొందరికి ద్వేషంగా మరి కొందరికి ప్రాణంగా… ఏ ఇద్దరికీ ఒకేలా అనిపించక… సముద్రమంత వైవిధ్యం... 

సాగర కెరటాలకీ నీ ప్రేమకీ ఎంత పెద్ద పోలికో చూసావా? 

తీరానికి ఎప్పుడూ దాహం కలగకుండా తరచి తరచి తడుముతూనే ఉంటుంది కెరటం… ప్రతి సారీ కొత్తగాహత్తుకుంటూ… నీ ప్రేమా అంతే… మదిని ఎప్పుడూ మధురంగా చూసుకుంటుంది. అసలు మొహమొత్తనీకుండా ఎప్పటి కప్పుడు సరి కొత్తగా… ఇంకొంత ఆర్తిగా నన్ను అల్లుకుపోతుంది.  

చెలిమికీ చెక్కిలికీ ఏ జన్మ ఋణాలు కొనసాగుతూ ఉంటాయో కానీ… చెక్కిలి మీదకు ఒక్క కన్నీటి చుక్కని కారనివ్వకుండా చూసుకునే  చక్కని చెలిమిగా నన్ను నడిపిస్తున్నావ్…

నీ ఊసులు తాకినంత మేరా కర్పూరధూళిగా మారి కావలి కాయాలని ఉందిరా…

నువ్వొచ్చాక నా స్వార్ధం హ్రస్వమయ్యింది… ప్రేమ అనంతమవుతూ...

అసలు నేను… నువ్వు…. ఏమిటి ఈ తేడా? అందుకే... ఇదంతా కాదు గానీ… ఈ సంబోధనలకీ అతీతంగా కొత్తగా మారిపోదాం… సరేనా…!

నీ 

నేను...

Wednesday, 4 February 2015

జీవితం తడిమింది...

రేయ్ హనీ...

అక్షరాల్లో ప్రేమని ఒలికించి భావుకతని తాగే నాకు జీవితమై వచ్చేసావ్ రా... నిజంగా ఎంత ఆనందమో తెలుసా... అనుభూతులకే  కొలతలుంటే నా సంతోషాన్ని కొలవటానికి అంతరిక్షమే హద్దేమో... 

ఇలా ఎలా వచ్చేసావ్ రా నాలోకి? బాటంతా  సుమ రేకలు పరిచినంత మృదువైన నడకతో అలా అలా పరిమళాలు జల్లుకుంటూ సూటిగా గుండెలోకే అలవోకగా వచ్చేసావ్... ఎంత ధైర్యమో నీకు... అల్లరి పిల్లా... నా గొంతు వినాలని ఫోన్ చేసాను అని చెప్పావ్ చూశావూ... నిజంగా మనసు నిండి పోయిన మాటరా అది. నా గురించి ఒకరు ఇంతలా ఆలోచన చెయ్యటం ఎంత నచ్చిందో తెలుసా... దాన్ని మాటల్లో ఐతే చెప్పలేను.   

వెన్నెల తునకలేవో  నిన్ను చేరాక నవ్వులుగా మారినట్లు ఉన్నాయి…  ఆ చిరునవ్వులేమో మన్మధ బాణాల్లా సరాసరి గుండెదారి పట్టేస్తుంటాయ్ నిన్ను నా లోకి గుచ్చేస్తూ…   

ఆ సంగతి కాసేపలా పక్కన పెడితే  నవ్వుల వశీకరణ మంత్రమేదో వచ్చనుకుంటా నీకు... అలా అలా వింటూ ఉండిపోవాలని అనిపిస్తుంది రా నీ నవ్వుల సరిగమలని... ఎంత ముద్దుగా నవ్వుతావో తెలుసా నీకు... ఏం పిల్లవో ఏంటో అన్నీ నేనే చెప్పాలి నీకు. 

పొద్దు పొద్దున్నే నన్ను నిద్ర లేపటానికి వస్తున్నరవి కిరణానికి చెబుతూ ఉన్నా… కాసేపలా పక్కకి జరుగూ... ప్రత్యూషపు గాలిలా నన్ను కప్పెయ్యటానికి తను వస్తుందీ అని… పాపం పిచ్చి కిరణం మాయమైపోయింది చల్లగా నిన్ను నా మీద కప్పుతూ… నిన్ను విరహిస్తున్న నా క్షణాలన్నిటినీ ఆవిరి చేస్తూ…

నీ శ్వాసలతో  వెచ్చగా నాకు ఊపిరి స్నానం చేయిస్తూ కళ్ళతో మౌనంగా నువ్వు మెరుపుల మంత్రోచ్చారణ చేస్తుంటే… మనసంతా ఎనలేని నిశ్శబ్దాన్ని ఆవాహన చేశా ఏ శబ్దమూ ఈ అనుభూతిని నాకు క్షణ మాత్రమూ దూరం చెయ్యకూడదని. 

నువ్వో మౌనం పరదా కప్పుకున్న పలుకుల శిల్పానివని  నాకు తెలియదూ…  అందుకేరా శాశ్వతంగా మౌనించిన నా మదిని ఉరకలెత్తిస్తూ చల్లని సెలపాటలా  కాసేపు  నన్ను రగిలించవూ… కాసిన్ని  పలుకులని  పెదవుల  చివరన  అంటించి  చూడు  నా నిశ్శబ్దాన్ని నీ శబ్దంలో కలిపేస్తా…

అయినా గానీ చెలిమి మొదలయ్యాక మనసు మాటలు ఎప్పుడూ  వినపడుతూనే ఉంటాయి కదా…  మరి  మన  మౌనాలకీ మాటలకీ పెద్ద తేడా ఉంటుందంటావా? 

ఎప్పటికీ ఇంతే ప్రేమగా ఉంటావా అంటావ్... నిలువెత్తు బంగారపు మనసుని నేను వదులుకుంటానా? వలచి వచ్చి నా జీవితానికి  వన్నెలద్దిన వెన్నెల దొరసానివి రా నువ్వు. ఎప్పటికీ మన జీవితాల్లో ఆ వెన్నెలలూ అలా కురుస్తూనే ఉంటాయ్…

కావాలంటే మన పరిచయమయ్యాక నువ్వు ఇంకిన ప్రతి క్షణాన్ని అడిగి చూడు అది నన్ను దాటకుండా నిన్నుచేరిందేమో …  నిత్య వసంతాన్నై నీలో శ్వాసిస్తున్నా  ఆనందాన్నే స్పర్శిస్తున్న ప్రతి  మన క్షణంలో…  నువ్వు  స్పర్శించని నా క్షణాలు ఇకపై  మిథ్య… 

ఈ లేఖ నేను రాసిందేమో కానీ ఏకాత్మగా మారిన  మన రెండు హృదయాల  స్పందనే  కదరా… కాదన గలవా ? 

ప్రేమతో...

నీ  

నేను

హేమంత స్పర్శ - 8

నా జీవితమా….

తెల్ల తామర పూరేకుకున్నంత స్వచ్ఛత నింపుకున్న అతి కొద్ది మందిలో నువ్వూ ఒకదానివి కదూ… అందుకేనేమోరా నును లేత తమలపాకంత సున్నితత్వాన్ని నీ పెదవులకి అద్దుకుంటూ నువ్వు నవ్వే  ఆ  మెరుపు  చూశావూ… అలవోకగా నాలాంటి వాళ్ళని మత్తులోకి నెట్టేస్తుంది….

దిగంతాల నిశ్శబ్దాన్ని ఒక్క పెదవి వంపులో చిరునవ్వుగా విసిరేస్తావ్ చూడూ… మనసంతా జిల్లుమంటూ ఆ నవ్వు వెనుక కొట్టుకుని పోతుంది… మరి నన్ను  నేను ఎలా వెనక్కి తెచ్చుకోనూ? కల్మషం తెలియని  నీ ఒక్క చిన్ని నవ్వు  చాలు  సర్వ  ప్రకృతీ నీకు పాదాక్రాంతం అవ్వటానికి... 

పున్నమికే అప్పిచ్చే నక్షత్ర కాంతులే నీ మనసు  రాల్చుచుండగా… సర్వ వర్ణాల సొబగులన్నీ ఏకమైన సౌశీల్యమే  నీలో చేరి నీ హృదిని మరింత ప్రకాశవంతంగా  వెలిగిస్తూ మనస్కాంతమై  నన్ను నీలో  కరిగించుకునే క్షణాల ముందు పూర్ణ కౌముది కాంతులేమూలకో కదా… 

ప్రత్యూషంలో నీ వన విహారం తలచుకుంటుంటే   వేకువ వడిలో కూర్చుని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి  సుప్రభాతమో... చెరువు గట్టున ఉన్న గుడిలోనుండి ఘంటసాల గళం నుండి మృదు మధురంగా జాలువారుతున్న గీతాసారమో    వింటున్నంత కమనీయంగా ఉంది తెలుసా…

కాంతి కిరణపు జ్వలనంలో వేడెక్కి సెలయేటి నీటి పాటని కప్పుకుంటూ వస్తున్న మలయ పవనమొకటి నీ మందహాసాన్ని తాకి ఓ పరవశాన్ని నా  గుండె నిండా పోతపోసేసి సరి కొత్తగా ఊపిరి తీసుకుంది.  

ఇన్నాళ్ళుగా ఆకాశంలో మాత్రమే ప్రభవించే జ్యోత్స్న తెలిసిన నాకు, నీ కళ్ళ గర్భాన  పునీతుడవుతున్న శీతకిరణుడిని చూసి నీ అంతరంగపు ప్రకాశమేపాటిదో అవగతమవుతూ నీ మీద ఉన్న ప్రేమ అనంతమవుతూ ఉంది. 

ఒక్కొక్క సారి ఏమనిపిస్తుందో తెలుసా బంగారూ… నిన్ను పొందటమే ఈ జన్మ సాఫల్యమని… అసలు నిన్ను కనుగొనటానికే మనసు ఎన్ని వెతలు పడిందో తెలుసా…?  నిన్ను చూసాకే దేహానికీ మనసుకీ పొంతన కుదిరే ఘడియలు ఉంటాయనీ అవి నన్ను పలకరించాయనీ అర్ధం అయ్యింది. 

నాలో... లోలోన ఎక్కడో కొడగొట్టుకుంటున్న ప్రాణ తంత్రులకి నీ రూపే జీవ మయూఖమై... మహతి నాదాలని మించిన  సజీవ రాగాలని నా జీవితానికి  పరిచయం  చేశావు. 

ఇద్దరమూ ఎక్కడో ఉంటాం… ఒక్కటేనంటాం… దేహాల దూరానికి నిష్కల్మష ప్రేమతో నిర్మల హృదయాల  ఊపిర్లు పోతగా పోసి మనసు మాటలతో వేసుకునే వంతెన ఉంది చూశావూ… అది  ఎన్నడూ బీటలు వారని  బంధం కదూ… 

ఎంత దూరానికి అంత విరహాన్ని అంటగట్టి నిన్ను నా నిరీక్షణలో  ఒంపుకుంటున్న క్షణాలు చేసే అల్లరి ఉంది  చూశావూ… ఎంత కోపం వస్తుందో వాటి మీద... ఎప్పుడో ఈ క్షణాలన్నిటినీ మూటగట్టి ఆ దేవుడి మీదకి విసిరి ఆయనకీ విరహాన్ని పరిచయం  చెయ్యాలిరా… 

నువ్వంటూ నాకోసం ఉన్నావన్న ఒకే ఒక్క స్మృతి చాలదూ ఎంత దూరాన్నీ దగ్గర చేసుకోవటానికి… 

హేమంతపు చేమంతులతో  ఉదయపు సావాసం
కుంకుమ వర్ణపు సిగ్గులతో సాయంత్రపు మోమాటం 
సందె చుక్కల బొట్టు పెడుతూ  వెన్నెల పిలచిన పేరంటం 
తిమిరపు మంచె మీద వాలిన నీ కన్నుల మెరుపందం

ప్రకృతి కాంత దివ్య సౌందర్యంలో చిన్ని ఆకులమై పరవశించటంకన్నా ఇంకేం కావాలి...? జీవితాన్ని ఊహించుకోవటానికి... అనుభూతుల్ని ఒంచుకోవటానికి…  

మనసు స్పర్శ తెలుస్తోంది...  నీ నవ్వు వెలిగినప్పుడు... !  నిజంరా అలా అలా ఆహ్లాదంగా నువ్వు నవ్వే నవ్వు ఉంది చూశావూ… నా హృదయాధరాలపై మత్తుగా మెరుస్తుంది. కన్నీటిని చదువుతూ మనసుని తడుపుకుంటున్నప్పుడు  నువ్వు గుర్తొస్తే… ఆ గుర్తుతో పాటు నువ్వు తీసుకొచ్చేది నన్ను సేద తీర్చే  మానసిక ఉపశమనాన్ని కూడా…

నీ 
నేను…

Monday, 2 February 2015

హేమంత స్పర్శ - 7

నా నవ జీవనమా.…
వరి కంకులని  స్పృశిస్తూ వంటికి చల్లదనాన్ని అంటించి వెళుతున్న పైరగాలికీ…  వెన్నెల దారుల బాటసారివై...  నా  మనసు రహదారిపై నిత్య సంచారివై నడయాడే నీకూ... నిత్య పరిమళపు మకరందాలూ సరి రావేమో…

ఏయ్… ఒక్కోసారి నిన్ను చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా… ‘వత్సరానికోసారి వచ్చే వసంతం ఉంది చూశావూ… దానికి పచ్చదనపు వన్నెలద్దే వనదేవతవు నువ్వేనేమో’ అని.

ఎందుకలా అంటే కారణం కోసం శ్రమ పడాల్సిన అవసరం లేదు… నువ్వు లేనప్పుడు సంవత్సరానికి ఒక్క సారి  కుంటుకుంటూ నన్ను పలకరించే వసంతం… ఇప్పుడు… అనుక్షణం  నన్ను చుట్టుకునే ఉండి పోతుంది… మరి అప్పటికీ ఇప్పటికీ తేడా నువ్వేగా…

నీ పేరొక్కటి చాలు  నాలో వివశత్వం  వెల్లివిరియటానికి… నా మనసుకు  విరహమద్ది  దేహానికి  ఆరాటం పెంచి  నాలో  నన్ను భ్రమని చేస్తూ నీతో నన్ను లయించుకుంటూ పరవశాల శాలువాలో ఒదిగి పోవటానికి….

నాకు అర్ధం కానిది ఒక్కటేరా… ‘అసలు ఒక మనిషి మీద ఇష్టా ఇష్టాలు ఎలా మొదలవుతాయి?’  ఒకే ప్రాణంగా కలిసి పోవటానికి దగ్గర దారులేమిటి అని…

కేవలం  అందం చూసి అనుకుందాం అనుకుంటే చరిత్రపుటల్లో లిఖించబడ్డ అందాలనీ తిరస్కరించిన వారెందరో కదా ఈ లోఖంలో… అయినా అశాశ్వతమైన అందాలతో కేవలం ఇష్టాలు మొదలవ్వొచ్చునేమో కానీ  రెండు జీవితాలు ఒకే ప్రాణం అవుతాయా… కష్టం కదూ…

అసలు ప్రాణానికి ప్రాణంగా మారటానికి దగ్గర దారి అంటూ ఉంటుందా ఏమి?

మనసుల ముడికి ప్రేమొక ఇంధనమవ్వాలి
మదిలోని ఆణువణువూ ఒక తపనతో రగలాలి…
ప్రజ్వరిల్లే ప్రతి ఆలోచనా తానై  నిండాలి…
తలపు తలపులో తేజస్సుగా వెలగాలి
ఊపిరికొక ఊహ పుట్టాలి…
ఒకే శ్వాసగా శాశ్వతమవ్వాలి…

ఇదంతా ఒక్క అందంతో సాధ్యమేనా… అందంతో దేహాల్ని అంటుగట్టెయ్యటం చాలా సులువు కావొచ్చేమో కానీ మనసుల్ని అంటుగట్టగలమా?  కష్టం కదూ…  

చిరు ఎండ తాకిన చెరువు బంగారు వర్ణంలో కనిపిస్తుందని  అందులోని నీరంతా స్వర్ణజలం అని అనుకుంటారా ఎవరైనా…?  మంచితనపు ముసుగులూ అంతే… ముసుగుతోనే అర్ధం అవుతుంది అది నమ్మదగ్గది కాదని… కాసేపు మనిషిని  మభ్య పరిచే మాయాజాలాలు ఎన్ని ఉన్నా ఒక్క సారి అంతరంగం చదవటం మొదలు పెట్టామా… ఎక్కడెక్కడి మకిలీ బయట పడిపోతుంది.  

అయినా గానీ నాకు తెలిసినంతవరకు మనసు ప్రధానంగా ఉన్న వాటికి  దగ్గరి దారి అంటూ ఏమీలేదు… మంచి వ్యక్తిత్వం  తప్ప. ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయిన నీ వ్యక్తిత్వం  గురించి నేను కొత్తగా  చెప్పటానికి ఏముందిరా…!

నీ

నేను…