మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Tuesday, 31 May 2022

కడలి కోసం ఒక్క చినుకు





తీరాన్ని  తడిమేస్తున్న 

పాద ముద్రల కౌగిలి కోసం 

ఎగసి పడుతున్న అలల సవ్వడిని 

తన గుండెల్లో శీతలీకరించుకుంటూ 

వాన వాకిట్లో 

ఆర్తిగా తనని  తడుపుకుంటున్న

సముద్రాన్ని చూడు… 


తన ఉప్పదనాన్ని 

తియ్యగా మార్చి 

తన దాహం తీర్చే 

ఒక్క చినుకు కోసం 

యుగాలుగా ఎదురు చూస్తూ 

కడలి గానే కాదు… 

కన్నీటిగానూ మారి 

లోకమంతా విస్తరించినట్లు లేదూ…!

Thursday, 26 May 2022

సాయంతనాల వ్యాకరణం





తేనె చుక్కొకటి  గుండెల్లోకి జారి 

సున్నితత్వపు అస్తిత్వాన్నంతా 

మేనిపై మెరుపుగా మలచినట్లు

లాలిత్యపు మంజూషమొకటి 

తననే వ్యాపకంగా మార్చుకుందేమో

మృదుత్వమై అక్కడే ఘనీభవించింది


సాయంతనాల ఎరుపుని కలగలుపుకుని  

తామరాకైన తనువుపై 

ఇంద్రధనస్సులేవో వాలినట్లుగా

పొందికగా సర్దుకున్నట్లు ఉన్నాయి 

తన కనురెప్పల క్రింద కొన్నికలలు... 

కళ్ళలోని కల్మషాన్ని వెల్లవేస్తూ ! 


ఏటి నీలి పూలతో గీసిన నీలోపలాలై 

వెలుగునద్దుకున్న క్రొమ్మెరుగుల కంటిపాపలపై 

పాలపిట్ట రెక్కలపై వచ్చిన గాలి 

అద్దుకొచ్చిన స్నిగ్ధత్వం అంటుకుందేమో 

నవ్వుల పుక్కిలింతలతో 

త్రుళ్ళి త్రుళ్ళి పడుతున్నాయి  


దేహలతగా జీవ వర్ణాలని నింపుకుని 

అడవి పూల పరిమళమేస్తున్న 

చిరుచెమ్మటలే వేలికొనలని తడిచేస్తుంటే 

సురభిళ ఘటికలుగా చిట్లిన 

సమయాలన్నిటిలో కాలూనిన 

నిరతిశయ సొగసు కావ్యమేమో తాను 


కలల కల్లోలమెరుగని కనురెప్పల మీద ఒట్టేసి 

యుగాల తీరాలవతలనుండి పోగుచేసుకున్న  

హేమంతపు ఉషాకిరణాల మెరుపుల్ని అద్దుకుని  

నీలోచనాలతో నిర్మలత్వపు వ్యాకరణాన్ని వచిస్తూ 

తనువంతా జీవాత్మ పరచుకున్న ఉత్కృష్ట రూపమై 

ప్రకృతికి పరిపూర్ణతనిచ్చే కమనీయ కవిత్వం ‘తను’


Saturday, 7 May 2022

బహువచనం - 4

 



1.

 

నీలో మరింత నువ్వు ఉన్నావన్న నిజం 

నీకింకా పరిచయమవ్వలేదు 

 

నువ్వు కోరుకుంటున్న మెలకువ 

నువ్వు  కోరుకోవాల్సిన గొప్ప మజిలీ 

…. నువ్వు 

 

ఒక నిశ్శబ్దం నిన్ను ఆవరించినప్పుడు 

మొత్తంగా  నిన్ను చదివి చూడు 

 

లోపలంతా  ఒకే ఒక్క వాక్యం ప్రణవిస్తూ ఉంటుంది 

 

ఈ జీవితం 

నీకందించిన గొప్ప బహుమతి … 

'నువ్వు'

అంటూ! 

 

2.

 

ఊపిరిలోని రహస్యాన్ని దేన్నో 

వేణువు స్వర పరుస్తున్నట్లు 

అనిపిస్తుందనుకుంటా! 

రేయింబవళ్ళ లెక్కలన్నిటినీ 

నిశ్శబ్దం చేసుకుంటూ 

తనని తాను 

నిశ్శేషం చేసుకుందామన్నట్లు 

శ్వాసని ఉగ్గబెట్టుకుని వింటుంది కాలం 

 

3.

 

ఎప్పటికీ ముగియని యుద్ధంలో

క్షతగాత్రుల  దేహాల మాటున 

నన్ను నేను దాచుకోవటం 

మీరెన్నడూ  తెలుసుకోలేరు… 

 

4.

 

ప్రపంచాన్నేలే నా స్నేహితులారా , సోదరులారా !

జ్ఞాపకాలన్నీ మెత్తగా విప్పుకుందాం రండి

ఇన్నేళ్ళ గుండె చెమరింతల్ని

మన నవ్వులతో తుడిపేద్దాం రండి

పాతికేళ్ళ జీవిత పోరాటాల అలసటని

అంబరానికి విసిరేస్తూ సేదతీరుదాం రండి

మీరు వచ్చే యంత్రశకటాల చప్పుడు కంటే

మీకోసం ఎదురు చూసే నా గుండె సవ్వడే 

ఎక్కువ శబ్దం చేస్తుంది...

అది వింటూ వచ్చేయండి మరి..... 

 

5.

 

నీ ఇంటి గోడ పక్కగా ఉన్న చెట్టు ఒకటి 

తన కొమ్మలని 

పక్కింటిలోకి వాల్చుతుంది 

ప్రకృతికి 

తనదీ పరాయిదీ  అంటూ 

భేధభావం లేదన్న పాఠాన్ని నేర్పుతూ

 


Friday, 6 May 2022

బహువచనం - 3





1.

 

ఇంకా ఎవరిచే తెరవబడని నిశ్శబ్దాన్ని 

తొలిచే ఒక సమయంలోకి 

కొన్ని సమయాలు తమని తాము 

నిలువు దోపిడీ చేసుకుంటున్నాయి 

 

తవ్వుకున్నంత మేరా  

నిశ్శబ్దం చేస్తున్న శబ్దాన్ని తాగుతున్న 

ముద్రికలేవో 

మత్తుగా సోలిపోతున్నాయి 

లలితమైన కంపనేదో 

తీపి నేరంలోకి తోసినట్లుగా 

 

2.

 

ఈ నేల  

నీ మీదుగా మూసుకుని పోతున్నప్పుడు

నీ కన్నీటి  బొట్టు ఒకటి ఘనీభవించి

చరిత పుటల్లో వెల్లడైతే

అది చెప్పే

ఒక్క కథే

రేపటి ప్రపంచపు జీవ రహస్యం  

నిన్ను మళ్ళీ నేలపై మొలకెత్తించే

బ్రహ్మత్వం


Thursday, 5 May 2022

బహువచనం - 2



1.


లోకమంత ప్రకృతి కానుకై ఉండగా

గోరంత పసిడి కోసం 

కాస్తంత నేల కోసం 

ధ్వంస రచన చెయ్యడం 

చేయి తిరిగిన రచయిత లక్షణమనుకున్న

మనిషి కథలో 

అకస్మాత్తుగా కొన్ని కుదుపులు 

ఊహించని మలుపులు 


కట్ చేస్తే…


ఇప్పుడేమో  

ఎడారికీ పచ్చరంగెయ్యకపోతే 

తన కథ ముగింపువైపుకే


2.


మన నెత్తురు 

యుద్ధానికి  

ఇంధనమయ్యింది 


ఇంధనం 

కొరత బడింది 

యుద్ధం అంతమయ్యింది



3.


ఎక్కడ మొదలైన వరదో ఇది 

ఇక్కడికొచ్చి ఆగింది 

చెట్టూ చేమని 

గొడ్డూ గోదాని 

మనుషులతో కలిపి 

నిర్జీవంగా ముద్రించిన 

భీభత్స సంకలనంలా 


***


మరంతే…  

పగబడితే 

ప్రకృతి సంపాదకత్వమంతే 



4. 


సాగరతీరపు  చెమ్మ మీద 

అడుగులు వేసే అదృష్టం 

అందరికీ లేదనేమో 

కంటి తీరాలన్నిటిలో 

తడి మైదానాలని 

ప్రకృతించుకుంది మనిషి నైజం 


బ్రహ్మ ఎంత మాయావో…

మనిషినిలా పుట్టించి 

తడిని అందరికీ పంచి!


5.


అప్పుడెప్పుడో

నువ్వు వాగ్దానం చేశావే

ఒక నీడని...

 

ఆ నీడన

నిద్రపోవటంకన్నా

ఆనందానికి  వేరే నిర్వచనం

ఇంకా నను చేరలేదు

 


Wednesday, 4 May 2022

బహువచనం - 1

 


1.

మోడు వారిన చెట్టుమీద 

పిచ్చిక గూళ్ళ కోసం వెతుకులాడతావేం 

పరకాయించి చూడరాదూ 

కువకువలేమీ లేవంటే 

పక్షులు నిద్రిస్తున్నాయని కాదు 

నిర్జీవమై పోయాయని 


2.

ఆకలికి విలోమాలై

రాలి పడుతున్నాయి కొన్ని పండ్లు…

నువ్వు నడచిన

బంజరు కాలిబాట పక్కన

 

నువ్వు దాటి వచ్చిన

అన్ని క్షణాలకూ  

అమరత్వం అక్షయమైంది


3.

యుగాలుగా

యుద్ధాన్ని చంపేందుకు

ఎవరూ పుట్టినట్లు లేదు

 

బహుశా

చంపడమెప్పుడూ

మనిషితనం కాదనేమో


4.

ఎలాంటి అబద్ధం

నిజమైతే బావుండనిపిస్తుందో

ఎప్పటికీ

దాన్ని నిజం చేసుకోలేం

ఎందుకంటే

నిజం దారి ఎప్పుడూ

అబద్ధాన్ని తాకదు

తన రంగెప్పుడూ ఒక్కలానే ఉంటుంది




Sunday, 1 May 2022

కలస్వనం

 



గాంధర్వమంతా 

అజ్ఞాతంగా

వేణువులోనే ఉందనుకుని 

కలస్వనాల పౌనఃపున్యాలన్నిటినీ

ఒక్కమారుగా 

స్వంతం చేసుకుందామని 

వేణువుని చీల్చి చూస్తే 

దక్కేదేమిటో తెలుసా? 

రెండు వెదురు బద్దలు!