మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Wednesday, 29 April 2015

ఆమె ఎవరు?

ఆమె ఎవరని మీరడుగుతుంటే నేనేం చెప్పాలి. 
ఆమెకోసం నేను ఎక్కడ వెదకాలి? 
అసలు వెదకాలా? తనెవ్వరో నాకు తెలియదూ...! 
రాసే నిజాలు వేరు. 
గుండెని తడిమే తడి వేరు. 

కొన్ని అబద్ధాలని అక్షరాలుగా లోకానికి పరిచయం చేస్తున్న నేను కొన్ని నిజాలని మది మంజూషంలో  పదిల పరచి కన్నీటి జల్లులతో నన్ను నేను స్వచ్ఛ పరచుకునే నిజమెప్పుడూ నాలోనే అత్యంత భద్రం.

ఆత్మ కథల్లోనే కాల్పానిక సాహిత్యం  గుప్పించేసే ఈ రోజుల్లో అంతరాంతరాలలో  అణువణువూ తనేనన్న నిజం నిర్భయంగా చెప్పగలుగుతున్న నేను  తనెవ్వరో ఏమిటో ఎప్పటికీ లోకానికి  తెలియని రహస్యంలో దాచేసుకుని  ఆ నిజాన్ని ఎప్పటికీ లోకానికి చూపించలేనే అన్న ఒకే ఒక్క బాధా వీచికని ఎప్పటికీ నాలోనే అదిమి పెడుతున్నా. 

నిజాలు రాయాల్సి వస్తే ప్రతి నిజమూ ఒక విషాద కావ్యమౌతుంది. 

ఇంతకూ 

ఆమె ఎవరంటే... నా ప్రతి క్షణానికి తానో అతిధి.  నా విషాదానికి తానొక ప్రమోదం.

అంతకు మించి ఆమె ఎవరన్న ప్రశ్న... ప్రశ్నగానే ఉండి పోయే నిజమే ఈ లోకానికి. 

ఆమె గురించిన ఆలోచనలే ఊపిరిగా సాగుతున్న నా  ఈ జీవితం నాది కాదు ఆమెదే...Saturday, 25 April 2015

మార్పు నీతోనే...

ఎగరేస్తున్న ఆశలకు తోడుగా కాస్త శ్రమని కట్టి చూడు 
కావాలనుకున్నదేదో కదిలివస్తుంది కాలం బాటన 

ఎగశ్వాస బతుకులకి కాస్త  ఊపిరి అద్దు 
నీ వెనకే కొన్ని నీడలు నిలబడిపోతాయ్ నమ్మకంగా

దగ్ధమైన దేహాన్ని పరికించి చూడు 
గాలిలో కనపడుతుంది రేణువులుగా విచ్చిన్నమైన తాపత్రయమొకటి 

కాసేపలా మట్టికి ప్రణమిల్లి చూడు 
కంపనలని మరచి మనసారా పంటగా నవ్వుతుంది 

తడి లేనిదని మొద్దుబార్చకలా 
మనసు వర్షిస్తే చెమరింపు అద్దుకునే ఆ గుండెని 

బాట చిధ్రమయిందనే చింత మానేసెయ్
కొత్తదారి మొలుస్తుంది చూడు నీ పట్టుదలతో

వంటి నిండా గడ్డిపువ్వుని ఆవాహన చేసుకో 
ఎందరు తొక్కేసినా  మరింత ఠీవీగా  నిలబడేందుకు

ప్రతి క్షణపు కొనకు ఓ నవ్వు కట్టేసెయ్
లోకం మొత్తం నీ చిత్తం అవుతుంది మధురంగా


Friday, 24 April 2015

హేమంత స్పర్శ - 13

రేయ్...

ఎప్పటికప్పుడు బాల్యం రోజులు వస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా... ఆ పసితనాన్ని అప్పుడు ఉన్నంత స్వచ్ఛంగా మనలో భాగంగానే వెంట పెట్టుకుని వస్తున్న సంగతి ఎప్పుడైనా గమనించావా? 

చిన్నప్పుడు మొత్తంగా అద్దుకున్న పసితనం  ఇప్పుడు మాత్రం కళ్ళకి మాత్రమే పరిమితమయ్యింది. మనసూ దేహమూ ఎన్నెన్ని భేషజాలు పోనీ... కళ్ళు మాత్రం ఎప్పుడూ నిజమే చెబుతూ ఉంటాయ్.  

అందుకేనోయ్… కంటి భాష నేర్చుకో… నీకు రాసే నా ప్రతి అక్షరం ఎంత నిజాన్ని చుట్టుకుని వస్తుందో నీకు నువ్వుగా అంచనా వేసుకోవటానికి. 

వత్సరాలుగా గుండెల్లో పేర్చుకున్న ప్రేమైక భావనని స్వచ్ఛతని ఏ మాత్రం కోల్పోని ఆ కళ్ళతో అనుభూతిస్తే...  చెప్పటం  ఎందుకు నువ్వే తెలుసుకో...

ఒక్కోసారి నాకేం అనిపిస్తుందో చెప్పనా… ప్రేమని పొందటం ఎవరికైనా  గొప్పగా అనిపిస్తుంది కానీ అనుక్షణం ప్రేమైక భావనలో తడిసి ముద్దవుతాం చూడూ... ఆ ప్రతీ క్షణంలో మనసాడే భావసంచలనాల క్రీడలో ఆనందాన్ని దోచుకోవటం తెలిసిన వారికి విశ్వ ప్రేమే పాదాక్రాంతమవ్వదా అని…!

ఏదో అనుకుంటాం కానీ అన్ని స్పందనలని స్వేచ్ఛగా బయటకి వదలలేం కదరా..  కొన్ని కొన్నిటిని మది మంజూషంలో దాచుకుని కావాలనుకున్నప్పుడల్లా ఏకాంతానికి తాపడం చేస్తుంటే సంతోషాన్ని అమరం చేసుకుంటున్న సడే ఎద నిండుగా…

పిల్లగాలి పలకరిస్తుంటే తన్మయంగా తలలూపే తరువుల సడినీ
గుడి గోపురం పై నుండి తటాలున మెరిసే మెరుపునీ
ఆకాశం మట్టిపై అక్షరాలుగా రాస్తున్న చినుకులనీ 
వసంతమద్దుకున్న కొమ్మనీ 
వెన్నెల కడుగుతున్న రేయినీ
ఆస్వాదించటానికి సమయం లేదంటే… బహుశా వారికి కాలంతో పరిచయం లేనట్లే… వాళ్ళ  బతుకులో వాళ్ళు లేనట్లే. 

మనం ఎప్పుడూ అలా కాదుగా…

తొలకరిగా రవళించిన చినుకులద్దుకున్న మట్టితునకల జావళి పాదాలకి ఎర్రెర్రని పారాణి పూస్తుంటే… భూమాతే ముస్తాబు చేసిందన్న ఆనందంలోకి నెమ్మదిగా ఒలికే వారికీ… ఛండాలపు బురద అంటిందని ముఖం గంటుపెట్టుకుని వడివడిగా పరుగెత్తే వారికీ తేడా లేదూ… ప్రతి అనుభవం వెనుకా ఉండే విభిన్న ఆలోచనా ధోరణే కదా  అది.   

ఒకేలా ఆలోచించే మనసులు జతగా మారి చేసే జీవిత ప్రయాణానికీ అసలు పొంతన కుదరని  అభిరుచులు ఉన్నవారు చేసే జీవిత ప్రయాణానికీ  అనుభూతుల పందెం పెడితే  ఎవరు గెలుస్తారంటావ్?  

సమాధానం దొరికింది కదూ… 

మరి నువ్వూ  నేనూ గెలుపు గుర్రాలమే కదా… కానీ ఎందుకోరా ప్రపంచంలో ఎక్కువ శాతం పొంతన లేని మనుషుల అలికిడే ఎక్కువ.  బహుశా అందుకేనేమో ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లో… ఏదో కావాలనుకుంటున్నట్లో గందరగోళంగా ఉంటుందీ ప్రపంచం అసలు మనఃశాంతి లేకుండా…

ఒకే  దృశ్యాన్ని  వివిధాలుగా చీల్చుకుంటున్న మనుషుల మనసులను బట్టే కదా ఆనందపు సాంద్రత నిర్ణయింపబడేది. మరి అనేకమైన ఆలోచనలనీ ఒకే తీరుగా మార్చుకుని జీవితం కొనసాగిస్తే ఊపిరి ఉన్నంత కాలం మనం విజేతలమేగా…

నీ

నేను 


Thursday, 23 April 2015

వెన్నెల కుసుమం - 30

ఏయ్ హనీ...
మనస్సు లేకుంటే మనిషి లేడు. ఇంత కాలం ఈ భూమిపై మానవజాతి నిలిచి ఉందంటే అంతర్గతంగా అదుపు చేస్తున్న మనస్సే కారణమేమో… లేదు… వేరే ఏదైనా ఉంది అంటావా? బహుశా అది కూడా మనసు చేసిన పదార్ధంతోనే చేయబడి ఉంటుంది.అసలు మనస్సుని మించిన వరం మనిషికి ఏదీలేదు అనేదే నా భావన.
మనస్సు… దాని గురించి ఎంత చెప్పినా తక్కువే కదూ…
వెన్నెల్లా వెలుగునిస్తుంది
అప్యాయతల్ని వర్షిస్తుంది 
అనుభవాలతో హర్షిస్తుంది 
అభిమానంతో పలకరిస్తుంది 
హృదయాల లోతుల్ని కొలుస్తుంది 
ఎదలో రగిలే జ్వాలలని శీతలమై ఆర్పుతుంది 
అవసరమైన చోట మంచులాంటి మౌనాన్ని ప్రజ్వలింపచేస్తుంది.
కథలు చెపుతుంది
కన్నీళ్ళని తుడుస్తుంది
ఆలోచనలని నియంత్రిస్తుంది 
ఆకలిని మరిపిస్తుంది 
ప్రేమకై తపిస్తుంది 
ప్రేమనే జపిస్తుంది 
మరో మనసు స్పర్శకై ఆరాట పడుతుంది 
ప్రేమతో మైకాన్ని ఇస్తుంది
హృదయాల్ని పంచుతుంది 
ఎద వీణల్ని మీటుతుంది 
ప్రాణాల్ని సైతం ఫణంగా పెడుతుంది 
జీవితాల్ని నిలబెడుతుంది

మనిషి ప్రవర్తన లోని 
హింసకూ అహింసకూ 
సత్యానికీ అసత్యానికీ 
నీతికీ అవినీతికీ 
ధర్మానికీ అధర్మానికీ 
మనిషిలోని వేదనకూ ఆనందానికీ
కష్ట సుఖాలకూ తప్పు ఒప్పులకూ 
అన్నిటికీ మూలాధారమైనది మనసే కదా

కటిక రాయిని వెన్నగా… వెన్నని పాషాణంలా చెయ్యగలిగే శక్తి ఉన్నది ఎవరికి? అది మనసుకి మాత్రమే సాధ్యం కదూ. . అభిమానాలూ ఆప్యాయతలూ అనుబంధాలూ, ఆత్మీయతలూ పెంచగలిగే మనసే నిజమైన మనసు. కుత్సితాలకి సుదూరంగా విలువల వలువలు కప్పుకున్న మనసే ఒక బృందావనం అంత ఆహ్లాదమివ్వదూ…
కక్షలూ కార్పణ్యాలు, కులమత భేదాలు, హింసనీ, అశాంతినీ పెంచేది మనసు కాదనీ… మనసనే అందమైన ముసుగు కప్పుకున్న ఓ మురికి గుంట అని నా భావన. అనుక్షణం క్రోధాగ్ని జ్వాలల్లో రగిలిపోతూ ఉంటే తగలబడేది మన ఆనందమే కానీ వేరొకటి కాదు.
మానవీయ విలువల తడిని అద్దుకోలేని మనసొకటి మనలో ఉండి ఏమి లాభం? ఉన్నదని చెప్పుకోవాటానికి సిగ్గు చేటు కదూ...అయినా మనకా ఇబ్బంది లేదులే.
ప్రియా… నా మనసు ఎలాంటిదో పూర్తిగా నాకు తెలియదు కానీ నీ మనసు మాత్రం నవనీతం
అది 
వెన్నెలా కరుగుతుంది 
ప్రేమని పంచుతుంది 
స్వార్ధం వలదంటుంది
హృదయాన్ని అర్పిస్తుంది

నిజంరా… ఇవన్నీ నీ మనసు లక్షణాలేరా…
అందమైన రూపమున్న ఎందరికో ఆ అందానికి శోభనిచ్చే మనస్సు లేదు. కానీ నీకు రూప సౌందర్యంతో పాటు మనఃసౌందర్యాన్ని కూడా ఆ భగవంతుండు ప్రసాదించాడు.
కలలని కల్లలు చేసే మనస్సుని కాదు ప్రియా నేను ప్రేమించింది. కలలని నిజం చేసే నిజమైన మనస్సునే నేను ప్రేమించాను.ఆ మనస్సు ఎక్కడుందో నీకు తెలుసు కదూ… నీలోనే… అవును నీలోనే… ఎందుకంటే అది నీ మనసే కదరా మరి.
నేనింకా నా మనస్సుని చదవలేదు… చదవాలనీ లేదు.. ఎందుకంటే నా మనస్సు మంచిదైనా చెడ్డదైనా అది నీ మనస్సు సాహ చర్యాన్ని కోరుకుంటున్నదంటే తనుకూడా నీ మనసులా అంతః సౌందర్యాన్ని పెంచుకుంటుందనే చిన్న స్వార్ధమే సుమా…
నీ
...రేష్


Friday, 17 April 2015

ఇట్లు, నా... నువ్వు

హాయ్ రా....

ఎలా ఉన్నావ్ రా…?  
ఏమి చేస్తున్నావురా…? 
ఈ ప్రశ్నలు అడగాలా నేను నిన్ను? 
ఈ ప్రశ్నలకు జవాబే నేను కదా… 

నేను  బాగుంటే నువ్వు బాగుండటం.... నేను చేసే పనిలో నీ సంతోషాన్ని వెదుక్కోవటం… ఏమంటార్రా దీనిని?  స్నేహమా? ప్రేమా?

‘మరదే... కొన్ని కొన్ని ప్రశ్నలకి జవాబులు ఊహారూపంలో వదిలేస్తేనే బాగుంటాయ్ కదా…’ అని అంటావని నాకు తెలుసులేవోయ్...

అసలేంట్రా... అందరూ స్నేహం అనగానే బాల్యంలోకి వెళ్ళిపోతారు. అది వాళ్ళ తప్పు కాదు కదూ... చాలా మందికి స్నేహపు పునాది అక్కడే పడుతుంది అన్నది అక్షర సత్యం.  నా చిన్న నాటి నేస్తాల ( అలా అనకూడదేమో  మరి…)  స్నేహితాన్ని చూసి ఏ ఒక్కరికి దగ్గరకాలేనీ నా అసహాయత మీద నాకు పుట్టిన రోత ఏమని చెప్పాలిరా?  అలవిమాలిన మొహమాటం స్నేహానికి ప్రధాన అడ్డంకి అని తెలిసినా దాన్ని వదుల్చుకోలేని తనం… అత్యంత ఇష్టమైన మనిషితోనూ మామూలుగా మాట్లాడలేని బెరుకు. ఇలాంటి వ్యక్తిత్వంతో అసలు ఏ  స్నేహం అయినా ఎలా కుదురుతుంది? చాలా కష్టం కదూ… మరి ఇన్ని సంవత్సరాలుగా నాది అదే బ్రతుకు...

వత్సరాలుగా అన్ని పరిచయాలు ఆ పరిచయ క్షణాలకే అంటుకట్టబడ్డ బంధాలుగా మిగిలి పోయాయి కానీ ఏ ఒక్క బంధమూ స్నేహంగా మారలేదే. మంచి వ్యక్తిత్వం ఉన్నంత మాత్రాన మంచి స్నేహం దొరుకుతుంది అని ఎవరైనా అనుకుంటే అది పిచ్చి భ్రమ అని నిస్సందేహంగా చెప్పెయ్యవచ్చు.  అసలైన మైత్రీ విలువల ముందు  భౌతికంగా పెంచుకున్న విలువలు ఏ మాత్రం సాటి రావు కదా రా… 

నేను రాసుకునే కొన్ని అక్షరాలు ఓ అపురూపమైన స్నేహాన్ని వెంటబెట్టుకుని వస్తాయని ముందుగా తెలిసి ఉంటే ఊహ తెలిసిన మొదటి క్షణమే నా పిచ్చి రాతలు మొదలెట్టే వాడిని కదా… అక్షరాల వెంట కళ్ళు  పరిగెట్టించటమే అలవాటు అయిన నాకు కొద్దో గొప్పో అక్షరాలని పరుగెత్తించటం అలవాటు చేసావ్… 

నేను రాసే ప్రతి అక్షరంలో నిన్ను వెదుక్కుంటూ ఉంటావని చెప్పావ్… అక్షరాల్లో ఎందుకోయ్… నా అంతరాంతాల ఆత్మీయతవే నువ్వయ్యాక? 

ఏ శబ్దమూ … మరే నిశ్శబ్దమూ కూడా కదిలించలేనంత శిలాసదృశ్యమైన మనసుతో జీవితాన్ని ఒక స్తబ్ధతలోకి నెట్టి వేసుకుంటున్న తరుణాన నీవో  స్నేహవీచికవై నాలో ఆవరించుకుని ఉన్న శూన్యాన్ని సమూలంగా ఆవిరి చేసేసాక నాకు అనిపించిందేమిటో తెలుసా…?

ఏది ఎక్కడ ఎప్పుడు దక్కాలో అప్పుడే దక్కుతుంది… ఎప్పుడు ఎవ్వరు జీవితంగా మారాలో  అప్పుడే వారి అడుగులు తోడుగా జతకలుస్తాయని అర్ధం అయ్యిందిరా. అందరిలా బాల్యంలోనో, కౌమారంలోనో నువ్వు నా నేస్తానివి అయి ఉంటే చిన్ననాటి విశేషాల పునశ్చరణల వరకే మన స్నేహం నడిచేదేమో. 

జీవితాన్ని అవగాహన చేసుకుంటున్న / చేసుకున్న దశలో మానసికంగా సమస్థాయిలో  ఉన్న ఒక్క స్నేహ స్పర్శ  జీవితానికి ఇచ్చే భరోసా ఏమిటి అన్నది నాకు అవగతమయ్యింది. అలాంటి  ఆ స్నేహ స్పర్శ కొందరికి చిన్నప్పుడే కలిగి ఉండవచ్చు. అలాంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు కదూ.

మామూలుగా రోజూ వారీగా కలిసే సన్నిహితుల్లో… లేదా అలా అని అనుకునే వాళ్ళలో ఎవరు నిజమైన స్నేహితులో  తెలియాలి అంటే ఒక్క సారైనా మనసుకో గాయమో లేదా మనిషికో కోలుకోలేని ఎదురుదెబ్బో  తగలాలేమోరా. లేకపోతే కాస్త కలుపుగోలుతనం ఉన్న ప్రతిమనిషీ తనకు పదుల సంఖ్యలో స్నేహితులు ఉన్నారనుకునే అవకాశం ఉంటుంది కదూ… అలా అనుకోవటం వల్ల తన అవసరంలో నిజమైన స్నేహితుడెవరో గుర్తించడం ఎంత ఆలస్యం అవుతుంది? 

సమస్యల ఊబిలో కూరుకుపోతూనో ఆశల పందిళ్ళ ఆకులు ఊడదీసుకుంటున్నప్పుడో… 
శిఖరాన నిలవలేక కిందకి జారిపడుతున్న దురదృష్ట క్షణంలో దేహం మీద విరక్తి కలిగినప్పుడో...  

రెండో స్థానం నుండి మొదటి స్థానానికి చేరుకొన్న క్షణంలో  పరాజితుల అసహాయ అసూయా వీక్షణలు  మనసుని చివుక్కుమనిపించినప్పుడో...    అలా ఎప్పుడో ఒక్కసారి దగ్గరగా ఉండి భుజం తడితేనో… అది కుదరనంత దూరంగా  ఉన్నప్పుడు అనునయంగా నువ్వు పంపే ధైర్యంతోనో మళ్ళీ నాలోకి నేను వచ్చేస్తాను. 

ఏదైనా వేదన నన్ను తడిపేస్తున్నప్పుడు దాన్ని నీతో పంచుకున్నాక నాలో కలిగే ఊరట చెపుతుంది స్నేహానికి అసలైన నిర్వచనం. నా చెలిమి తడి నీ చెక్కిలిని తడిపే ఆ క్షణాల చెమరింతలు    పాతరోజుల్లో కూడా ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు హితులనుకున్న వారి దగ్గర చెప్పుకున్న రోజులున్నాయి కానీ… ఇప్పుడు నేనన్నానే ఊరట అని… అదెప్పుడూ కలగలేదురా నా మనసుకి.  ముఖ పరిచయాలకీ… మనఃస్నేహాలకీ ఉన్న తేడా ఇదే కదా మరి. 

నేను ఆగే  ప్రతి మజిలీలో సేద తీర్చే ఆహ్లాదమై నువ్వు తడుముతుంటే చాలదూ మనసు ఆనందం ఏక మొత్తంగా  పెదాలని శాశ్వతంగా అద్దెకి తీసుకోవటానికి?  నీ స్నేహం లేని గతం మొత్తాన్ని గోనెసంచిలో భద్రంగా మూటకట్టేసి అనంతంలోకి జార విడి చేసా పొరపాటున ఏ తలపున కూడా పాత అభావాలు నన్ను పలకరించకూడదని. 

ఒక్కటి మాత్రం నిజంరా… స్నేహం కోసం ఎదురు చూడటం కాదు చెయ్యాల్సింది… నాకు నేను స్నేహితుడిగా మారటం మొదలు పెట్టాలి అని తెలిపింది నీ స్నేహం.  ఈ రోజు నుండి మనమిద్దరం స్నేహితులం రా అని ఎవరైనా స్నేహం మొదలు పెట్టారు అనుకో… అందులో ఉన్న స్నేహ గాఢత ఎంత?  ఉదయం నుండి మధ్యాహ్నం లోకి నడిచే ఛాయా మాత్రమే కదూ. మధ్యాహ్నం నుండి సాయంత్రానికి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగే నీడ పయనాన్ని చూడు. నిజమైన స్నేహం కూడా అంతేరా... మనకి తెలియకుండానే ఒకరిని ఒకరం అర్ధం చేసుకుంటూ మనలోని  మంచినీ చెడునీ సమానంగా చూస్తూ అల్లుకునే మానసిక బంధం అది.  

నువ్వూ నేను ప్రాణ స్నేహితులం అంటూ కాగితాల మీద లేఖలు రాసేస్తే నిజంగా ప్రాణ స్నేహితులం అయిపోతామా?  ఆ మునివేళ్ళకేం ఆ క్షణంలో ఒకరినొకరు మభ్య పెట్టుకోవటానికి ఎన్నో అక్షరాలని అలవోకగా రాసేస్తూ ఉంటాయ్… ఇలా అన్నంత మాత్రాన అవన్నీ అసత్యపు రాతలు అని కాదు సుమా… రాతల కన్నా ముఖ్యమైనది ఒక అనుబంధం.  మనుషులు ఎంత దూరాన ఉన్నా ధృఢమైన బంధం ఒక్కటి చాలు  ప్రతి ఆలోచనల చివరా జీవమై తళుక్కున మెరవటానికి… అవతలి వాళ్ళని మురిపించటానికీ…  

జీవితపు ఆటుపోట్లని  చిరునవ్వుతో దాటెయ్యటానికి మనిషికీ మనిషికీ మధ్య మనసుల్ని కలుపుతూ ఒక్క స్నేహ వారధి చాలదూ...  అచ్చు మన మధ్య వెల్లివిరిసిన స్నేహ సుగంధంలా…!

అవునూ చివరిగా ఓ చిన్ని సందేహం రా… స్నేహం ఒక్కటే మనం ఎంపిక చేసుకోగల బంధం కదా…  ఏరి కోరి మౌనమునిగా పేరుబడ్డ ఈ నిశ్శబ్ద శిలని ఏమి చూసి నీ స్నేహితుడిగా ఎంచుకున్నావ్ రా….?  

సమాధానం చెప్పవూ... వినాలని ఆశగా ఉంది….!

ఇట్లు,

నా...
నువ్వు Thursday, 9 April 2015

మళ్ళీ కొత్తగా...

స్తబ్ధమయిపోయిన మనసుని  
కరిగించే అశృశ్లోకమై నువ్వు వినబడుతుంటే 
అనుబంధం విలోమమైన చప్పుడు గుండె గదిలో గంటగా మోగింది  
దూరమైన దగ్గరితనం ఉలిక్కిపడేలా... 

తలపుల నిండా తప్పులు చదువుకుంటూ 
మనసు చుట్టూ పరదాలు  చుట్టేస్తూ 
తగాదాల సిగపట్లతో మలినమైన జీవన మాధుర్యానికి  
‘మనం’గా  చేరువవుదాం

పొడి పొడి మాటల పలకరింపులకి 
హృదయంలో చెలమల చెమరింపులని 
ఆర్ద్రంగా పరిచయింప చేద్దాం  
శబ్దం సెలయేరయ్యేలా…. 

కళ్ళకర్ధం కాని చోట నిశ్శబ్దాలమౌతూ 
నిఘంటువుల్లా మనసు అర్థాలను చేరవేసుకుంటూ…
ఎంచటాలకి మంగళం పాడేసి... 
పంచుకోవటం మొదలు పెడదాం మళ్ళీ మరింత కొత్తగా...

నన్ను దాచేసుకున్న నువ్వుగా
నిన్నునింపుకున్న నేనుగా 
మళ్ళీ ప్రయాణం మొదలెడదాం రా 'మనం'గా 
వర్తమానానికి కొత్తబాటని చూపిస్తూ...


Monday, 6 April 2015

ప్రతి రేణువూ నేత్రమై...

ఏయ్…

నీ తలపొక వేదమంత్రంగా మనసుని మౌనంగా పఠిస్తున్నప్పుడల్లా నువ్వు పంచభూతాలసారమై నన్ను ఆవరించుకున్న అలికిడి. కోట్ల క్షణాలుగా రాలిపోయిన గతంలో నేను వేరు చేసి దాచుకున్న ఒకే ఒక్క క్షణం నీ పరిచయక్షణం.  అటుపై ఏ ఒక్క క్షణానికీ గతమంటలేదు సరి కొత్త పరిచయంగా నిన్ను చదువుకోవటం తప్ప. 

ప్రతి క్షణమొక సుప్రభాతమై నిన్ను మరింత కొత్తగా పరిచయిస్తుంటే నిశ్శబ్దానికి నిరీక్షణా పాఠం చెప్పి అదే పనిగా ఊసుల సడి చేస్తున్నాను. ఎక్కడ తప్పిపోయాయో అర్ధం కాని నా కలలన్నీ నీ కంటి మెరుపులనంటి పరిమళ ధూపాలనద్దుకుని నాకో సరి కొత్త శ్వాసగా మారుతున్నాయి.

ఇంతకూ మన మధ్య దూరాన్ని ఏ దగ్గరితనంతో కొలవాలి? భౌతికానికీ మానసికానికీ తేడా తెలియని అలౌకికతనంలో మనమున్నప్పుడు ఏ కొలతలకి అందుతాం మనం? అసలు నీకంటూ నిన్ను మిగలనివ్వనంత స్వార్ధం నాలో నిండి పోయాక ఆ స్వార్ధాన్ని నిజం చేసే నా యత్నాలకి ఇంధనమవ్వాల్సింది నువ్వే కదా…  

నాలో మొలకెత్తిన చిన్ని తలపొకటి నీలో మహావృక్షంగా మారటం కంటే దగ్గరితనం వేరే ఏముంటుంది. 

ఈ తలపులు మరి ఏ ఇతర కొలతల్లో ఇముడుతాయో ఎవరైనా చెప్పగలరా? ఉహూ… చెప్పలేరు… ఎందుకంటే అసలు దగ్గరితనం అంటే ఏమిటో కూడా తెలియని మానసిక నిరక్ష్యరాసులే కదా లోకం నిండా కుప్పలు కుప్పలుగా…  

నన్ను ఒంటరితనంలోకి వెలివేసి వెళ్ళిపోయిన ప్రతిక్షణం మన జంటతనాన్ని తాకి వెళుతున్న క్షణాలకేసి అసూయగా చూస్తుంటే నాకు భలే ఆనందంగా ఉంది తెలుసా? వెలిసి పోయిన జీవితానికి సప్తవర్ణాలద్దుతున్న నీ సాన్నిహిత్యపు పరిమళం ఏ ప్రకృతి సుమాలకీ లేనట్లుగా ఉంది. ఎడారికీ  పచ్చదనం  అద్దవచ్చని నిరూపించేసావ్ లేరా నువ్వు. నిజంరా…

ఎడారితనానికి వసంతమద్దిన మన తొలిక్షణాలు గుర్తు వచ్చినప్పుడల్లా  కళ్ళు ఎందుకో సాగరాలౌతున్నాయి. మరి కళ్ళకన్నా  జీవిత సంవేదనల వాహకాలు ఏమున్నాయని? 

నువ్వు మాట్లాడినప్పుడల్లా నాకో అద్భుతం పలుకులకూ ఒంపుసొంపులుంటాయని తెలిసే సమయమదేగా మరి. 

ఇంకోసంగతి చెప్పనా…

చిన్నప్పుడు భూమి ఎప్పుడూ సూర్యుని చుట్టూ ఒక స్థిర కక్ష్యలో తిరుగుతుంది అంటే అర్థంకాలేదు. అప్పటి సాంఘిక శాస్త్రపు పాఠం ఇప్పుడు అర్ధం అయ్యింది. ఎలాగంటావా? నువ్వే కేంద్రకంగా అలసటలేకుండా స్థిర కక్ష్యలో తిరుగుతున్న నా ఆలోచనలని చూసాక అర్ధం అయ్యింది. ఆ కక్ష్య దాటితే భూమికైనా ఇక్కడ నాకైనా ప్రళయమేనని. 

ఏయ్… నవ్వొస్తుంది కదూ నీకు… ఏమిటి వీడి పిచ్చి రాతలూ వీడూనూ అని… నవ్వుకో నవ్వుకో… నీ నవ్వుల ఏరువాకతో ‘మన’లోకమంతా ఆనందమే పండుతుందిలే…

ఏదో అనుకుంటాం కానీ కాలం చాలా మంచిదిరా… ఎప్పుడు ఏది ఇవ్వాలో దానికి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. జీవితపు చిక్కుముళ్ళలో గజిబిజిగా ఉన్నప్పుడు ఎవరం ఏ దారిలో ఉన్నామో తెలియనివ్వలేదు. ఒక్కొక్క ముడినీ విప్పుకుని తేలిక పడ్డాక  జీవితపు సారాన్ని మనసు దాహానికి దప్పిక తీర్చేలా ఎక్కడో ఉన్న  రెండు బాటలనీ ఒక్క దారిగా మార్చింది చూడూ… అంతకన్నా ఇంకేం కావలి మన జీవితానికి? 

ఇప్పుడిక వేరు చెయ్యగలదా ఏ కాలమైనా మన జీవాత్మని? 

నేను  నడిచే  దారిలో ప్రతి రేణువూ నేత్రమై నీ పాద ముద్రలను గుర్తించుకున్నాక ఏ దారైనా నన్ను నీ దరికే చేర్చదూ.

అయినా మనసుకీ మనసుకీ మధ్య దారిలో ప్రయాణానికి చూపుల సహాయం కావాలా? ఎక్కడెక్కడి ద్వారబంధాలన్నిటినీ విప్పి ఉంచాలా?  ఒక్క ఊపిరిగా పెనవేసుకున్న మనోబంధమొక్కటి చాలదూ…! 

ఒంటరితనపు నా హృదయవాకిలిలో పారిజాతమై సుమించి అమరావతీ వనవిలాసినివై నువ్వు పలుకరించిన ఆ మొదటి క్షణం ఇక ఎన్నటికీ సజీవ శబ్దమే... 

ఏమిటోరా ప్రతిసారీ ఏదో రాద్దాం అని మొదలు పెడతా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు ఈ అక్షరాలకి కుదురు కాస్త తక్కువలా ఉంది. మనసులో వచ్చేవాటన్నిటినీ నువ్వు రాయమన్నట్లు రాయాలా ఏమిటి… మా వ్యాకరణం మాకుంది... నీ ఆలోచనల్లో నువ్వుండు… మేమెలా ఒదగాలో అలా ఒదిగిపోతాం  అన్నట్లుగా నావైపు గుడ్లు మిటకరించి చూస్తున్నాయ్… 

పాపం వాటి బాధ వాటిది మునివేళ్ళ నుండి కాగితానికి అద్దుకునే లోగానే మనసు మరిన్ని భావాల్ని ఒంపేస్తుంటే ముందు  ఏ భావంగా భౌతికానికి జాలువారాలో తెలియని తికమకలో పడిపోతున్న ఉక్రోషం.   

నా సునితత్వం నన్ను పలుకరించినప్పుడల్లా ఈ అక్షరాలు నిన్ను పలకరిస్తాయి… 

అందాకా ఓ చిన్ని విరామం…

నీ 

నేను...

April 06, 2015


Friday, 3 April 2015

కంటి ముత్యం

కనురెప్పల మాటున కను కొలనుల్లో పుట్టిన కన్నీటి ముత్యమా...!
చడీ చప్పుడు లేకుండా కళ్ళని తడిపేస్తూ... కడలి అంచును తాకిన కెరటంలా రెప్పల తీరాన్ని తాకుతూ నువ్వెందుకు వస్తున్నావో తెలుసుకోలేనంత అమాయాకురాలు కాదు కదా నా మనసు.
తనను చూపే స్వప్నం ఆలస్యం అయ్యిందనే కదా..! ఆ మాత్రం అర్ధం కాదా నాకు. నా మనసు కూడా అదే వ్యధలో ఉంది. విరహ వేదన పడుతుంది. విరహ గీతాలు పాడుతానంటుంది.
చెలి రూపం కళ్ళల్లో కలగా చేరాలంటే మరి ఆ కళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండాలి?
ఓ అందాల భాష్పమా... నీ లాంటి కన్నీటి ముత్యాలే కదా తల్లి (కన్ను) ఋణం తీర్చుకుంటూ తనని స్వచ్ఛ పరుస్తూ వీడ్కోలు చెప్పేది.
ఇక నా సఖి స్వప్నం లోకి వచ్చే సమయం ఆసన్నమయ్యింది. నీ త్యాగం పునీతమవుతూ ఉన్న క్షణాన నా మనసు ఉద్విగ్నంగా తన కోసం ఎదురు చూస్తూ ఉంది. తన ప్రతిరూపమయిన మరో మనసుని ధరించిన మనిషిని గురించిన ఆలోచనలతో తీయని తలపులతో తాను తేలియాడుతూ నన్ను మైమరిపిస్తూ ఉంది.
మరి ఆ కలని నా కళ్ళకి అద్దుకునే సమయమయ్యింది గా… మరి అందుకో నా ఈ వీడ్కోలు...
నీ త్యాగానికి నివాళులర్పిస్తూ
స్నేహితుడు