మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Showing posts with label పాట. Show all posts
Showing posts with label పాట. Show all posts

Friday, 23 August 2013

ప్రేమ గీతిక

ఓ ప్రియతమా నా ప్రాణమా
చిరుసిగ్గులా సింగారమా 
వరూధినీ వయ్యారమా 
మల్లెల మాలలోని మరువమా
ఎద ఆశల శృంగారమా
మది నవ్వుల మకరందమా

ఆలకింపుమా చెలీ నా ప్రేమ సందేశం
వినిపించనా సఖీ నా ప్రేమ సంగీతం
నీ కోసం తపించే నన్ను కాదనవని
నే రాసా మన కోసం ప్రేమ స్తోత్రం
అది కావాలి మన జీవితాల్లో సుప్రభాతము
కాబోయే ప్రేమికులకి కావాలి మన ప్రేమ ఆదర్శము
ఏనాడు రానివ్వను మన ప్రేమకు అపజయం
రాబోయే కాలంలో మన కధే ఓ ప్రేమ గ్రంధం
చరిత గా చెపుతారు మన ప్రేమకావ్యం
ఎడబాటు లేకుండా వేస్తున్నా నీకు ప్రేమ బంధం

ఎన్నెన్ని జన్మాలకైనా నీవు నా దానివే కావాలని
జన్మ జన్మాలలో నీవు నేను తోడూ నీడగా ఉండాలని
కలలెన్నో కంటున్నా ఇది కధ కాదని చెపుతున్నా
తారకలే దిగివచ్చినా మన జంట విడరాదని
అప్సర లే వరించినా నా హృది నిండిన రూపం నీదని
వేలమార్లు చెపుతున్నా... నా ఊపిరి నీవేనంటున్నా
మనసైనా నీ కోసం నా ప్రాణమైన అర్పిస్తా
సొగసైన నీ జతగా శాశ్వతంగా నేనుంటా
నిను తలుస్తూ నే రాస్తున్నా ఈ ప్రేమ గీతిక
అది కావాలి మన జీవితాల్లో ప్రణయ దీపిక 

Friday, 16 August 2013

సందె చుక్క వెలిగే వేళలో

చిట్టి బిందె చంకన పెట్టి
మూరెడు మల్లెలు తల్లో చుట్టి
కాలి అందెలు సవ్వడి చేయగా
వెన్నెల ఝామున వెండి బొమ్మలా ఏటి కెలుతుంటే
గుప్పెడు మనసున వలపులు రేగి
గుండెల్లో... నా గుండెల్లో మోగాయి కళ్యాణ రాగాలు
కాబోయే... కాబోయే మా పెళ్ళికవి సన్నాయి మేళాలు

పండువెన్నెల వెలుగుల్లో వెండి బొమ్మ తన రూపం
ప్రేమకాంతి చిగురించే ప్రణయ దీపమే తన నయనం
కోనసీమ గుండెల్లో గోదారి పరవళ్ళు తన కురులు
అరవిరసిన మల్లియలే తన నవ్వుల సిరులు
సందె చుక్క వెలిగే వేళలో దివ్యరాగం తానులే

ఉదయించే ప్రతికిరణం తనకోసమే వెదికేను
ఆ నీలాకాశం లో నిండుగ జాబిలి తానేలే
ఆ తళుకుల తారకలే తన చెలికత్తెలులే
దాచాడు ఆ బ్రహ్మ పసిడి నిక్షేపాలు తన చెక్కిళ్ళలోనే

తన కంటి నీరు నా గుండె కార్చు
తన చిరునవ్వుతోనే నా మనసున వెలుగు
నా కంటిపాపల్లోని తన రూపం
నాలోని ప్రేమకి రక్షణ కవచం
చీకటే దరి చేరదు నా తోడు తానుండగా
జాబిలికన్నా చల్లనిది తన వడి
మమతలు నిండిన చక్కని గుడి తన హృది
రెప్పపాటు క్షణమైనా తానులేక నాకు బతుకు లేదులే
చిన్ననాటి కలలో కూడా నా రాణి తానేలే
క్షణమైనా ఆగని నా హృదయానికి ఊపిరి నాలోని తన రూపమే 

Thursday, 15 August 2013

చెలి జ్ఞాపకం

ఏ మనసు నన్ను తలచిందో ఏమో
నా హృదయం పొలమారి పోతుంది
చెలి జ్ఞాపకం నా మదిని కమ్మిందో లేదో
నిదురన్నది నా దరి రాకున్నది
ఏమైందో ఏమో నా మదిలోన
తన తలపులతోనే తెల్లవారిపోతున్నది
మౌనమే తన భాషగా  ప్రేమయే తన  బాసగా
ముద్ర వేసింది నా హృదిలో

చిన్న నాటి ఆటల్లోన నా జంట తానని
మరపురాక ముందే మరులుగొంది నా మది
అపుడాడిన దాగుడు మూతలు మరువలేదో ఏమో
తన చిరునామా చెప్పక కలల్లోనే కవ్విస్తుంది
కనులు రెండూ నిదుర మరచి
వెదకుతున్నాయి తనకోసమే
నా చెలి జాడెక్కడో
ఇంతవరకూ ఈ జాగేమిటో

లేతవయసులో ఏటి వడ్డున కట్టిన
ఇసుకమేడలోన దాగిఉందా?
చిన్నప్పుడు చందమామలో  మేము చదివిన 
జానపదగాధల్లోని అదృశ్య రూపం తనకు ఉందా?
తొక్కుడు బిళ్ళ ఆడపిల్లల ఆట
నీకెందుకురా మాతో జత
అంటూ నన్ను ఆటపట్టించిన నేస్తాల
చిరునవ్వులలో తాను ఒదిగి పోయిందా?

Friday, 9 August 2013

నా కళ్ళ లోగిళ్ళలో నిలిచింది నీ రూపు సంక్రాంతి ముగ్గులా...

         నా కళ్ళ లోగిళ్ళలో నిలిచింది నీ రూపు సంక్రాంతి ముగ్గులా
         నీ గుండె వాకిళ్ళలో పరచాను నా ప్రేమ పూల పాన్పులా
         నా ఎదలో నీ రూపం చేసింది తొలి సంతకం 
         ఇక ఏ జన్మకు చెరగని ప్రేమకు అది శ్రీకారం               

         నిన్నా లేదు మొన్నా లేదు నా గుండెలో ఈ అలజడి
         అంతకు ముందు ఎపుడూ లేదు నాలో ఈ ప్రేమ సవ్వడి
         కలనైనా ఎరుగనే ఇంతటి అందం ఇలనుందని
         ఏ క్షణాన చూశానో నిన్ను, క్షణమాగక నా మనసు నిన్ను చేరెనే
         తొలిచూపుతోనే వలచానో ఏమో, నీ తలపులతో నా మది నిండెలే
         నా కనులకు లేదే విశ్రాంతి నీ కలల తాకిడితో
         అలుపెరుగని నా మనసంతా నీ ఊహల ఉరవడియే
         ఏ వరములు పొందినానో నాకై నీవొచ్చినావు.
         ఏమి పుణ్యం చేసినానో నీ ప్రేమ నాకిచ్చినావు
         మండిపోయే నా హృదయంలో వెన్నెల పీఠం వేశావే
         కలలో ఇలలో ఎన్నడు చూడని సౌందర్యం 
        నా కన్నుల ముందర నింపావే                               

         కాళిదాసు ఊహల్లో, రవివర్మ కుంచెలో ఎనలేని అందం చూసి
         ఇంతటి సౌందర్యం ఇల లేదని ఇక రాదని అనుకున్నా
         కనులముందు నిన్ను చూసి కళ్ళు రెండు తేలవేసి
         నా అభిప్రాయం మార్చుకున్నా, ఈ అద్భుతం తిలకిస్తున్నా
         బ్రహ్మకే మరుపొచ్చిందేమో లేకుంటే భువిపైకి నిన్ను పంపుతాడా
         దేవేంద్రుడే చూసి వుంటే నీకోసం కుటిలయుక్తులు పన్నడా
         త్రేతాయుగమున నీవు పుట్టివుంటే శ్రీరాముడే నీ పతిదాసుడు అయ్యేనేమో
         ద్వాపరయుగమున నీవుండివుంటే శ్రీకృష్ణుడు రాధాకృష్ణుడయ్యేవాడా
         మన్మధుడే నిను చూసి ఉంటే రతి తలపులు తలచేవాడా
         ఏమి మాయ చేసినావో నా సర్వం నీవైనావు     

Thursday, 8 August 2013

హృదయ ఆలయం

నా హృదయాన నిర్మించానో ఆలయం
అందులో ప్రతిష్ఠించా నీ రూపం
ఇక నీవు నన్ను వీడి పోకుండా      

నా హృదయాన్ని చీల్చి చూస్తే తెలుస్తోంది నీకు నా మనసు
నీ నామ ధ్యానమే నా మనసంతా 
నా ఊహల్లో నే రాజు నీవు రాణివై గగనమంతా విహరించగా
మదినిడా నీ తలపులే తారాడగా
ఎద అంతా నీ రూపమే నిండి పోగా 
నా వలపుల రధసారధి నీవే 
నా తలపుల ప్రియనెచ్చెలి నీవే 
నా కంటి దీపం నీవైన వేళ 
చిగురంత మైకం కమ్మింది ఎదలో
నా చిన్ని హృదయం నీదైన వేళ 
ఓ మౌనరాగం పుట్టింది నాలో                          

గాలి నిన్ను తాకిందా నే కలవరపడతాను
నీవు నన్ను కాదంటే ఈ బ్రతుకే వద్దంటాను 
ఏడేడు జన్మల్లో నే నిన్నారాధిస్తాను 
కష్ట సుఖాలలో నీ తోడుగా నేనుంటా   
ఆకాశ హర్మ్యాన నీవుంటే 
భూమాత వడిలోన నేనుంటిని
కలువబాల చంద్రునికై ఎదురు చూస్తున్నట్లు 
నా జీవితంలో నీ రాకకై నేనెదురు చూస్తున్నాను  

Wednesday, 7 August 2013

గెలుపు

ఆహ్వానించు ఆహ్వానించు గెలుపైనా ఓటమైనా
పరిశ్రమించు పరాక్రమించి చావైనా బ్రతుకైనా
క్షణపు ఓటమే మరు క్షణపు గెలుపేమో
నిమిషపు గెలుపే జీవితాన మలుపేమో

ఓటమి గెలుపులతో అదృష్టం దోబూచులాట
తరువాత ఏమిటని మనసు ఊగిసలాట 
ఓటమైతే క్రుంగిపోకు తుది వరకు పోరాడు
గెలుపైతే పొంగిపోకు మరో గెలుపుకి అడుగులిడు
ఎందుకురా ప్రతి క్షణం ఓటమి భయం
అనుక్షణం భయమైతే బ్రతుకే భారం
నీకుంటే స్థైర్యం నీదేలే ప్రతి విజయం
లేదంటే ధైర్యం గెలుపన్నది దూరం

జననం కన్నా గొప్ప వరమా గెలుపు
మరణం కన్నా భయంకరమా ఓటమి
ఓటమి అయితే అన్న భయమే ఇక వృధా
గెలుపైనా ఓటమైనా ఎందుకు నీకు వ్యధ

గెలుపే పరమైతే ప్రతిక్షణం దరహాసం
ఓటమే లేకుంటే తెలిసేనా గెలుపు సుఖం
ఓటమికి ఓటమి తప్పదులే నీవెంటే ఇక విజయం
ఉన్నదా మరి ఆఖరి గెలుపు కన్నా సంబరం

Friday, 22 February 2013

మరుభూమి



సోదరా ఓ భారతసోదరా
చూడరా భారతమాత వేదన ఆవేదన
మరుభూమిగా మారుతున్నది మన మాతృభూమి
బీటలు వారెను భవితవ్యం భరతభూమిలో
యువత అంతా నిర్వీర్యం హిందూసీమలో                     

భవితే లేదా హిందూస్తాన్లో భారతయువతకు
సవతిగ మారెను పాకిస్తాన్ మన హిందూమాతకు
బందులు కూడా పండుగలే భరత భూమిలో
హత్యలు కూడా వేడుకలే హిందూసీమలో
మానభంగాలంటే మక్కువ ఎక్కువ మన మాతృభూమిలో
అల్లర్లంటే ఆరో ప్రాణం అస్సాం మొదలు ఆంధ్రా వరకు       

లోహవిహంగాలై ఆకాశ యానం చేసే ధరలు
ఆరని మంటల జ్వాలల్లోన కాలే కడుపుల ఆకలికేకలు
వరకట్నపు చితిమంట్ల్లోన ఆడపడచుల సజీవదహనాలు
మామూలేగా మన మాతృసీమలో
కుర్చీ కోసం కుస్తీపడుతూ కుమ్ములాటలు
పదవికోసం ప్రాణాల్తోనే పైరవీలు
దేశభక్తులు ఎందరుపోయినా తెలుస్తుందా ఒక్కరికైనా
దుర్మార్గుల్లో ఒక్కడు చచ్చినా దేశమంతా హత్యాకాండలు 

అందుకే లేవరా! ఓ సోదరా
తీర్చరా! మన మాతృభూమి కష్టాలు కడతేర్చరా






Monday, 15 March 2010

నూతన వధువు

పెళ్లి పందిరిలో నూతన వధువులా చిరు నవ్వులు చిందిస్తూ
శోభన గదిలో కన్నె పిల్లలా సిగ్గులమొగ్గలు పూయిస్తూ..
వస్తున్న సరికొత్త సంవత్సరమా..
కొత్త కోరికలా కళ్యాణమండపం లో
అంతులేని ఆశల పీటలు
నీ కోసం కొలువు తీరి ఉన్నాయిలే..

వడివడిగా పరుగులిడే నిత్య యవ్వనుడు
ఆ కాలపురుషుడే నీ వరుడమ్మా...
ఎన్నడు ఆగక అలుపే ఎరగక గిర్రున తిరిగే
కాలచక్రమే పూజారి
గతవత్సరపు వెలుగు నీడలే
జలతారు పరదాలు
ఎన్నో కోరికలే సన్నాయి మేళాలు
ఎనలేని ఆశలెన్నో ఈ పెళ్ళికి బాజాలు
గతకాలపు తీపిగురుతులే మామిడి తోరణాలు.

నిముషాలన్నీ కలసి నుదుటిన బాసికమై
ప్రతి క్షణమూ నీ పెళ్లి సందడియై
ప్రజలందరి ఆనందం అక్షింతల జల్లై
ప్రతి ఒక్కరి శుభాకాంక్షలూ పెళ్లి కానుకలై
ఆరు రుతువులూ ఆహుతులై
చేదుఘటనలే అగ్ని హోత్రమై
తీపివార్తలే పెళ్లి విందుగా
కొంగుముడి పడుతుందీ కాలపురుషుని ధర్మపత్నిగా