నీటిలో రగులుతూ కెంజాయ అద్దుకున్న
నీలం జాబిళ్ళకి
ఇదిగో… ఇక్కడే ఇలాంటి నిప్పుటాకు క్రింద
కాసేపు చలి కాపించాలి.
నిప్పుల కుంపటిలాంటి వేసవైతేనేం...
రగులుతున్న మంట ఉన్నప్పుడే
పసి హృదయమై కంటి ముద్రికల్లోకి
కాస్తంత చలిని తెచ్చుకోవాలి…!
సగం తెరవబడ్డ మనిషి దొరికినప్పుదు
తన ఛాతీ క్రింద చీకటిని పచ్చబొడిచిన
క్షణాలన్నిటి ఆయువునీ తోడివేసే
కళికలని ప్రతి సమయానికి అంటుగట్టాలి
మనసు పగుళ్ళ మాటున
గుండె దాచుకున్న తడి సవ్వడిని
కన్ను ఆలకించక ముందే
స్తంభించిన గాలికి మోకరిల్లైనా ఆరబెట్టెయ్యాలి
ఇష్టంగా రాసుకున్న నిశ్శబ్దం క్రింద
సేద తీరతున్న అలజడి యొక్క అలికిడిని
రెప్పల మీద నవ్వుగా
రూపాంతరం చేయించాలి 










