మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Showing posts with label Thoughts. Show all posts
Showing posts with label Thoughts. Show all posts

Saturday, 11 June 2022

ఊపిరి కొలత

 



ఇదిగో…

నీ  హృదయం నుండి జారుతున్న ఈ చిన్ని ఉప్పు నీటి చినుకుని చూడు… ఈ అనంతానంత విశ్వపు రచనలో…  నీలో రేగిన కల్లోలాన్ని ఋజువు పరుస్తూ చెక్కిలి మీద తేమరాతని రాస్తూ సాగుతున్న ఈ నీటి అక్షరపు ఊపిరి యొక్క ఉనికి  ఎవరికని చేరుతుంది. ఎవరికో ఎందుకు… అసలు మళ్ళీ నీకు దొరుకుతుందా తన ఉనికి? 

ఎందుకు దొరకదు ? 

చెక్కిలి మీద ఆవిరైన ఆ తడి బిందువు ఎన్ని కోట్ల కోట్ల ఆర్ద్రతా కణాలుగా మారి ఈ లోకం మీద తన ఉనికిని పరచుకుంటూ వెళుతుందో  కదా!  ఏ చిన్ని హృదయం మీదకో  చేరిన ఒక అణువంత రేణువు చాలు… నిన్ను ఒక  రచనగా మలచటానికి.  నీ  ఉనికిని విశ్వమంతటికీ పరిచయించటానికి. 

నిజానికి,  ఆదీ అంతమూ తెలియని ఈ విశ్వంలో  నువ్వెంత ?  నీ ఉనికెంత ? 

నిజంగా తరచి చూస్తే ఈ ప్రపంచం… ఒక మాయా మోహనం. తన ఉనికినే… తన కొలతనే… తానెప్పుడూ గుప్పెట విప్పదు  మరి. ఇది నిజంగా నిజం… 

ఎలా అంటారా?  

ఈ ప్రపంచం చాలా పెద్దది. చాలా అంటే చాలా… ఒక్క సారి తప్పిపోతే మనకి మనం  దొరకనంత… ఈ ప్రపంచం చాలా చిన్నది… చాలా అంటే చాలా… కోట్లకోట్ల నక్షత్రాల ఆచూకీ మన కంటి చూపుకి  అందేంత… 

ఇంతకూ ప్రపంచం పెద్దదా…  చిన్నదా… ?  ఏమో ఎవరికి తెలుసు ? ఎప్పటి మనఃస్థితికి ఏమని అనిపిస్తుందో… నిజం చెప్పాలి అంటే ప్రపంచం చిన్న్దదో పెద్దదో కాదు… నువ్వు  ప్రపంచాన్ని చూసిన క్షణపు కొలత అది. 

ఆ క్షణం లో మిగిలిన అన్ని సమయాలూ… పరిమాణాలూ… గడ్డ కట్టుకు పోయి ఉంటాయి. అసలవి నీ  దగ్గరకు రావు కూడా ! 

ప్రపంచానికి నువ్వు పెద్దగా తెలియాలంటే… అసలు నువ్వెంత పెద్దనో నీకు తెలియాలి. నీకు నువ్వే చిక్కనప్పుడు ప్రపంచానికి నువ్వెక్కడ తగులుతావ్… అందుకే నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకుంటూ ఒక స్వఛ్చతా దీపంలా నువ్వు ప్రజ్వరిల్లాలి. దానికోసం నీకు నువ్వే ఇంధనంగా మారాలి. 

ఈ ప్రపంచపు పాంచ భౌతిక స్వరూపంలో ఒక రేణువంతనే నువ్వుండనీ… తన ఆత్మానుగత స్వరం నుండి నువ్వు వినిపిస్తే… ఇక నువ్వూ… ప్రపంచమూ…  ఏది ఎవరు?

ప్రతి సామాన్యతలో ఒక అసామాన్యత ఒదిగి ఉంటుంది. నీకు నువ్వుగా  తనని  ఎప్పుడు తెలుసుకుంటావా అని వేచి చూస్తుంది తప్ప తనకి తానుకు అది బయట పడదు.  

మరి నీకు నువ్వు తెలియాలంటే…?

అంత సులభమా… నిన్ను నువ్వు చదవాలి… అహరహం అకుంఠిత దీక్షతో.  అంతా కొత్తగా ఉండవచ్చు… మరంతే కదా! నీకు నువ్వు పరిచయం అవ్వటం ఇప్పుడే కదా ! అలానే ఉంటుంది.  అయినా సరే… ఇక ఆగమన్నా ఆగవు.  

అదంతే మరి! 

వేవేల కావ్యాలు … వేదాలు… ఉపనిషత్తులు… ఇతిహాసాలు… పేరేదేతైనేం   వాటిన్నిటి సారం నువ్వే… అవన్నీ చెప్పేది నీ గురించే… నీలో నువ్వెంతగా వ్యాపితమయి ఉన్నావో తెలిసి వచ్చే కొద్దీ బహిరంగపు ఆసక్తులన్నీ అనాసక్తులై నీకు నువ్వే ఒక నిరంతర ఆసక్తిగా కొనసాగుతూనే ఉంటావు.

Sunday, 1 May 2022

కలస్వనం

 



గాంధర్వమంతా 

అజ్ఞాతంగా

వేణువులోనే ఉందనుకుని 

కలస్వనాల పౌనఃపున్యాలన్నిటినీ

ఒక్కమారుగా 

స్వంతం చేసుకుందామని 

వేణువుని చీల్చి చూస్తే 

దక్కేదేమిటో తెలుసా? 

రెండు వెదురు బద్దలు! 

Monday, 28 December 2015

ఏయ్... సహవాసీ




ఏయ్ ఏమిటలా చూస్తున్నావ్?’ 

నీ పుట్టుకని' 

ఏముందట అందులో' 

స్వచ్ఛత  

ఆహా నిజమా?’ 

విత్తుని దాటి.. పుడమిని తొలచి.. నువ్వు బయటకు వస్తున్న వైనం.. ఎప్పుడూ అద్భుతమే 

అద్భుతాలన్నీ స్వచ్ఛమేనా?’  

ఏమో అది నాకు తెలియదు కానీ కొన్ని అనుభూతులు ఎప్పుడూ స్వచ్ఛమైన  అద్భుతాలే అనిపిస్తాయ్' 

ఏమిటా అనుభూతులు?’

 మొదటి సారిగా ఆకుపచ్చని స్పర్శని అద్దుకుని.. నువ్వు విడిచిన తొలి ప్రాణవాయువు శ్వాసని ఒడిసిపట్టి నా ఊపిరిగా తాగే ఆనందం.. ఓ   చిక్కని అనుభూతి'

 ఆహా.. ఇంకా?’ 

 నువ్వు ఇంకాస్త పెరిగాక.. నీ  చిట్టిమొగ్గ ఒకటి ఒక్కొక్కరేకునూ అలా అలా విప్పుకుంటూ కుసుమిస్తున్న పరవశంలో నేను చిక్కుకున్న అనుభూతికి సాటి మరేం లేదు' 

 హేయ్.. ఎంత చక్కని అనుభూతులో.. ఇంతకూ అక్కడేదో కనిపిస్తుంది కదా అదేమిటి?’ 

 మొన్నప్పుడో నరికేసిన చెట్టు మోడు' 

 ఎవరు నరికేశారు' 

 నేనే' 

 ఎందుకట?’

 ఇంటికి అడ్డుగా ఉందని.. ఇంత చక్కగా కట్టుకున్న ఇంటి అందాన్ని అది కప్పేస్తుందని.. అందమైన  పొదరిల్లు కట్టుకున్న అనుభూతిని దూరం చేస్తుందని  

 అందమైన పొదరిల్లు నీ ఇల్లు ఎంత అందంగా ఉందో కదా! మరి ఆ చెట్టులో మాత్రం అందం లేదా?’

 ‘అలా అని నేను అనడం లేదుగా... అది ఎంత అందమైనదైనా నాకు అడ్డుగా ఉంది కదా? అయినా అది ఇప్పుడు  కేవలం మోడు. దాని అవసరం తీరిపోయింది. దానికి బదులు నిన్ను తెచ్చి నాటాను కదా. చూడు, నీకు రోజూ నీరు పోస్తున్నాను. ‘

 ‘నన్ను నాటావా? అంటేఒక మరణానికి పరిహారం ఇంకో జననం అనుకుంటున్నావా? నాకు నువ్వు ఇచ్చిన పని, ఒక శిధిలాన్ని కప్పిపెట్టడమా? పోయిన చెట్టు తన ఆకుల్లో నిక్షిప్తం చేసిన గత జ్ఞాపకాలను, పక్షి గూళ్ళలోని మాతృ ప్రేమను నేను తిరిగివ్వగలనా?

 ‘పరిహారం కాదు, ప్రయత్నం. నేను ప్రకృతిని ప్రేమించే  మనిషిని. అందుకే పాతది తీసి కొత్తది పెడుతున్నాను.  నాకిప్పుడు కొత్త శ్వాస కావాలి’

 ‘అవును. పాత ఊపిరి తీసి, కొత్త ఊపిరికి నీరాజనం పలుకుతున్నావు. నీ  వెలుగు కోసం, నా తోబుట్టువుని చీకటిలోకి నెట్టేశావు.  నా ప్రాణ వాయువు నీకు కావాలి... కానీ నా పూర్వ రూపం నీకు వద్దు. నువ్వు మోడుని చూస్తున్నావు... నేను మాత్రం నన్ను నాటిన నీ చేతిని ఇంకా వీడని  ఆ గొడ్డలి వాసనని గమనిస్తున్నాను’

 ‘నువ్వు చెప్పింది నిజమేనని  ఒప్పుకుంటున్నాను. జీవితంలో కొన్ని రాజీలు తప్పవు  అయినా అదంతా గతం. నువ్వు వర్తమానం.’

 ‘వర్తమానమే... వర్తమానంలో కూడా, నన్ను నీ అవసరం మేరకే చూస్తున్నావు కదా.’

 ‘.....’

 ఒక జననం.. మరో మరణం.. రెండిట్లోనూ అనుభూతి చూడగల ఓ మనిషీ నీకు వీడ్కోలిక

 వీడ్కోలా అదేం?’

 వీడ్కోలు మాత్రమే కాదు మిత్రమా.. మృత్యురహస్యంలోకి స్వాగతం కూడా..'

 ఏమంటున్నావ్  నువ్వు?’

 అర్ధం కాలేదా సోగ్గాడా? జననం మరణం నీ కనుసన్నల్లో జరగాలనుకుంటూ ప్రకృతిని నువ్వు శాసిద్దామనుకుంటున్నావ్ కదా.. నీ మీద నిరసన నాతోనే మొదలెడదామనీ.. ప్రాణవాయువు ఊపిరాపి.. మా మృత్యు ప్రయాణంలో నిన్నూ సహవాసిని చేసుకుందామని

 '.....'

 


Monday, 14 September 2015

కొన్ని అక్షరాలు - 4

‘ఏడవగలిగినంత దుఃఖం...
నవ్వగలిగినంత సంతోషం’

అంతకు మించి మనిషి దేన్నీ తట్టుకోలేడు కదా...

మనిషి ఫీలింగ్స్ కీ ఒక సాచురేషన్ ఉంటుంది అన్నది అర్ధం అవుతుంది కదూ. ఏది ఎక్కువైనా   మనిషి సోలిపోవటం సహజాతి సహజం.  అదే లేకపోతే మనిషి జీవితమెప్పుడూ చిత్ర వధే. 

అందుకే అనిపిస్తుంది... ఈ సృష్టి ఎప్పుడూ ఒక అద్భుత రహస్యమే అని...

***

రాత్రి...
ఎన్నిచీకట్ల భాండాగారమో... 
అంతకన్నా ఎక్కువ ఆశల సమాహారం...

ఎన్నిచీకట్లు తాగిన రాత్రి అయినా ఒక వేకువతో  వీడ్కోలు చెప్పటం ఎంత సహజమో... రేపొచ్చే పగలుని చూపిస్తూ ఒక ఆశావాదంలోకి నడిపించటం  అంతే సహజంగా చేసేస్తుంది  ధైర్యం. 

రాత్రి కురిసేది విశ్రాంతి కోసమే... నేటి బతుకు విశ్లేషణతో ముగించిన రాత్రి... రేపటి వెచ్చటి వెన్నెల్లో  నిన్ను విజేతగా నిలబెట్టదూ...

Monday, 31 August 2015

కొన్ని అక్షరాలు - 3

నిజమే...
ప్రపంచమంతా ఎన్నో అందాలు... అవి తెచ్చే ఆనందాలే...
ఐతేనేం 
ఒక్క సూర్యోదయం లేకుంటే లోకమంతా అంధకారమే...
దూరపు కొండలు నునుపో కాదో తరువాత 
కళ్ళ ముందరకొచ్చిన తన వెలుగుని కట్టేసుకో...

*** 

అంతులేనంత కాంతి ఉంది బయట...
ఇంకా నువ్వు రెప్ప తెరవలేదంతే...!

***

శూన్యానికి వ్యాకరణం నేర్పుతున్నా...
ముగియని నా నిరీక్షణల సాక్షిగా...!

***

జాతి వర్ణాలతోనే వేరు విస్తరట 
నెత్తుటి రంగుని మార్చెయ్యగలరా మరి...?

*** 

కొంచెం పసితనాన్ని తాగవూ....
బాల్యమిక ఇంకిపోనంత స్వచ్ఛంగా ...!

*** 

Wednesday, 26 August 2015

కొన్ని అక్షరాలు - 2


ఎండని వెన్నెలించడానికి చంద్రుడున్నాడు...
నా గుండెని శీతలీకరించడానికి నువ్వు రావూ...!

***

లే పచ్చిక బయళ్ళలో నీ పాదాలకు 
హేమంతపు హారతి పడుతున్న సుప్రభాతమే 
నా మౌనం మొదలెట్టిన సారంగీ నాదం...

***

కంటికి కనబడేది మూడొంతుల సముద్రమే 
అసలంటూ... మొత్తం మట్టి కుదుళ్ళేగా...
సంద్రం నేను
మట్టి నువ్వు

కొన్ని అక్షరాలు - 1


అభిప్రాయం మారటానికి పెద్ద కారణం ఏమీ అవసరం లేదు...
తన సమస్య నీకొస్తే చాలు...!

***

ప్రసాదాలు నైవేద్యాలూ దేవుడేదో తినేస్తాడని కాదు… 
ఆత్మాభిమానంతో ఆకలిని చంపుకునేవారు కొందరుంటారని...!

***

ఏమీ పర్లేదు… స్వార్ధపరుడిగానే ఉండు…
కాకుంటే స్వార్ధాన్ని విస్తృతం చేసేయ్…
‘నా’ నుండి ‘మన’ వరకూ

***

తరతరాలుగా అబద్ధానిదే అగ్రాసనం...
నాలుగు రంగుల ఝండా మువ్వన్నెలుగా చలామణి అవుతూ...!

***

ఆకలైతే చాలు అదృష్టమే అనుకునే వాడొకడు
కలలోకీ మెతుకు చేరని మాయేమిటో తెలియని వాడింకొకడు...
ఎంత చిత్రమీ ప్రపంచం 
బహు విచిత్రమీ మాయాజాలం

****