మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Sunday, 29 November 2015

మొదలౌదామా మళ్ళీ .. తడిగీతల్ని చెరిపేస్తూ

హాయ్ రా…

ఖాళీ దొరికినప్పుడల్లా నీతో మాట్లాడాలనిపిస్తుంది. నిజానికి అది అబద్ధం. ఖాళీ చేసుకుని మరీ నీతో మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ మాట్లాడటానికి  నువ్వు దొరకవు కదా.  అందుకే నిన్ను ఆలోచిస్తూ , నన్ను గమనించుకుంటూ ఒక కొత్త చదువు మొదలు పెట్టేశా...

చదువేమిటంటావా…?  

ఒకటి చెప్పు... మనసుతో నన్ను ఎప్పుడైనా చదివావా? పోనీ నిన్ను ఎప్పుడైనా చదువుకున్నావా? నిజానికి మనం మొదలు పెట్టని  సిలబస్ మనలోనే ఎంత ఉందో చూడు. మనల్ని మనం చదువుకోవటం అంటే ఏదో ఏకాంతపు  ఆలోచనలగా  కాదురా…ఎడతగని  అన్వేషణగా సాగాలి.   ఆలోచనల మధ్య అగాధాలు తడుముతూ ఉంటాయ్. ఆలోచనకూ ఆలోచనకూ మధ్య అనంతమైన ఆ అగాధాల్లోకి  జారిపోతుంటే,  అసలంటూ ఎన్నిసార్లు మళ్ళీ మొదలు పెట్టాలిరా జీవితాన్ని? మొదలు పెట్టినప్పుడల్లా పసి రెక్కలు కొన్ని కట్టుకుని... తడి గీతలు కొన్ని చెరుపుకుని… ఆ కాసేపూ మాత్రం ఎంత బాగుంటుందో...  

అనుమతి తీసుకోకుండా ఎన్నెన్నో ఆలోచనలు వాటికై అవి వచ్చేస్తూంటే  ఆనకట్ట కట్టటానికి సేకరించాల్సిందేమిటో కూడా నాకు తెలియరావటం లేదే. నడకని బట్టి, సమయాన్ని బట్టి కదలాడే నీడలు నిలువెల్లా పక్క మీద వాలిపోయాక ఏమైపోతాయిరా? అప్పుడే నాక్కొంచం నీడ కావాలని అనిపిస్తూ ఉంటుంది. నాదైన నీడ నీ రూపమేసుకుని నాలో కరిగిపోతున్న సవ్వడిని ప్రతి చీకటిలో నాలోకి అనువదించుకుంటూనే ఉంటాను. బహుశా నా శూన్యాన్ని చిధ్రం చేసే మౌన మంత్రదండం అదేనేమో.  

మనిషిగా నేను అబద్ధం అయిన చోట నేను నడిచే నడకలన్నీ ప్రకృతికి భారం అన్న నిజం నాకసలు తెలియనే తెలియదు. నిర్జీవం అంటే జీవం లేకపోవటమే అని ఇప్పటివరకూ  తెలిసిన నాకు పరిపూర్ణంగా శూన్యం ఆక్రమించుకోవటమూ నిర్జీవమే అని కొత్తగా తెలుస్తుంది.  

అసలెందుకురా మనసు భారమైనప్పుడే  అక్షరాలు అలవోకగా అసిధారావ్రతం చేస్తాయి? వాటి అసిధారావ్రతం ఏమో కానీ నాకెప్పుడూ  అర్ధం కాదు అవి సేద తీర్చుతున్నాయా… తడి పెంచుతున్నాయా? అనాధనేమో అనుకుందామనుకుంటే, కాదని రుజువు చేస్తూ నా నిండా పరచుకున్న నువ్వు. ఒక్కడినే ఉన్నప్పుడు కూడా మనసంతా కదలాడుతూ ఒకరుండటం ఎంత మాత్రమూ అనాధత్వం కాదు కదూ. ఇంటినిండా సందడి పరుచుకున్నపుడు కూడా ఒక ఊరట కోసం ఒకానొక  తపన మనల్ని నిలబడనీయకుండా నిలదీస్తుంది చూడూ… అప్పుడు ఆలోచించాలనుకుంటా అనాధత్వం గురించి. 

శూన్యం తడిమిన ప్రతి మారూ , మౌనం గుచ్చుకున్న ప్రతిసారీ  నొప్పి తెలియాలంటే మనసులో కాస్తంత సున్నితత్వం మిగిలుండాలేమో. కానీ అన్ని సున్నితత్వాలు నిశ్శబ్దంగా నిష్క్రమించేసాక తానొక  అనాధ అయ్యిందన్న  నిజం మనసుకి తట్టడానికీ అవకాశం లేదు కదూ. 

వంటికి పెరిగే  వసతుల్ని చూసి మురిసిపోతున్నాం కానీ, మనసు ఆరోగ్యం  కోసం మనమేం చెయ్యాలో వదిలేసి శతాబ్దాలు దాటిపోయింది.  నన్నడిగితే మనిషి మనిషిలో ఒక మాయలేడి జాడలు ఉంటే బాగుండనిపిస్తుంది. దానికోసం పరుగులెత్తే మైకంలో విలువైన దాన్ని ఒకటి కోల్పోతే… ఆ కోల్పోయిన దానికోసం మొదలు పెట్టే తీవ్రమైన అన్వేషణలో మనకి మనం దొరకటం, మనల్ని మనం వెలికి తెచ్చుకోవటం ఎంత మాత్రమూ అసాధ్యం కాదు. 

ఒక్క సారి నేనెవరన్న ప్రశ్న మొదలయ్యాక ఎవరోయ్ మనల్ని ఆపగలిగేది. మన మంచి చెడులు మన విచక్షణగా సాగటం  మొదలయ్యేది ఆ తరువాతే కదా. నీకో నిజం చెప్పనా నిన్ను అర్ధం చేసుకునే పరంపరలో నన్ను నేను తెలుసుకోగలుగుతున్నాను. అలా తెలుసుకోవటం మొదలు పెట్టాకేరా తెలిసింది ప్రకృతి లోపలా బయటా మనకోసం ఎన్నో పాఠాల్ని సిద్ధం చేసే ఉందని. ప్రాణం ఉన్న జీవి అవ్వనీ, ప్రాణం లేని పదార్ధమవ్వనీ కాదేదీ జీవన సూత్రమొక్కటి నేర్పడానికి అనర్హమని. 

ప్రపంచాన్ని చదువుతున్నంత సేపూ నేను తప్ప అందరూ బాగున్నారనే భావం నన్నెప్పుడూ నిలబడనీయలేదు. కంటి మీదకి రెప్పని వాల్చుకోవటానికీ విశ్వ ప్రయత్నమే చెయ్యాల్సి వచ్చేది. నిజంరా ఎక్కడికక్కడ కంచెలు కట్టుకున్న మనుషుల మధ్యలో, స్వార్ధం లెక్కల తకరారులో అన్నీ పరుగు పందాలే?  కాకపోతే  ఓడిన వాడికీ గెలిచినవాడికీ దక్కేది ఎప్పుడూ ఒక్కటే… మరో  పందెం… ఇంకో పందెం... అంతం లేనిది మాత్రం  పరుగుకే.

మొదలు పెట్టాక ఆపటం తెలియక పోతే జీవితం ఎప్పటికీ సంతృప్తి నివ్వదు కదూ… ఇప్పుడు నాకో సంతృప్తి కావాలి. అది నాదైన నా జీవితంలో దొరకాలి.  మరి నువ్వెప్పుడూ  నా సంతృప్తివే… ఇప్పుడు నీతో పాటు నాకు నేను కూడా సంతృప్తిగా మారిపోయాను. 

అయినా ఏమిటోరా ఈ మధ్య ఏది రాద్దాం అని మొదలు పెట్టినా  మనసుకేసే లాగేస్తుంది. ఎందుకంటావ్? ఏవైనా లౌకిక సూత్రాల మర్మం ఉందంటావా? కోల్పోయిన దాన్ని తిరిగిపొందాలన్న ఆకాంక్ష మొగ్గ తొడిగిందంటావా… నా పిచ్చి గానీ నీకు తెలిసినా నువ్వు చెప్తావా ఏం… ‘వాడి తిప్పలు వాడిని పడనివ్వు… కాస్త జీవితంలో నిలబడాలిగా’ అనేసుకుంటూ ఉంటావ్ కదూ… 

చివరగా ఒక్కటైతే చెప్పగలనురా… 

ఇకపై నన్ను తాకేది  కష్టమైనా సుఖమైనా, వేదనైనా వేడుకైనా …అది  ఎలాంటిదైనా సరే ఒకేలా  అనుభూతించ గలను ఎందుకంటే నా అంతరాలలో అనుభూతుల మధ్య ఉన్న కంచెలన్నిటినీ తొలగించుకున్న మనసుని నా  జీవితం లోకి అనువదించేసుకున్నాను కనుక. 

నీ

నేను 
నిరీక్షణ


హాయ్ రా…

ఎందుకు అనిపిస్తుందో తెలియదు కానీ నువ్వు కొంచెం కొంచెంగా నాకు దూరంగా జరుగుతున్న భావన. గంటలగంటలూ అలవోకగా దొర్లిన మాటల ప్రవాహం ఇప్పుడు క్షణానికీ ఆచూకి అందని నిజం. టచ్ స్క్రీన్ పై అక్కడి నీ వేళ్ళ కదలికలు నా మనసుని మధురంగా టచ్ చేసిన క్షణాలన్నీ ఆవిరై, కళ్ళని చకోర జతగా మార్చి వేసిన వైనం ఎంతటి హృదయ భారం.    

ఏడు జన్మల బంధం అంటూ అసలు  ఉన్నాయంటావారా? ఏడు నెలలకే మసకేస్తున్న అనుబంధాలని చూస్తుంటే నాలో కలుగుతున్న ఈ చిన్ని అనుమానం పెనుభూతమై నా సమయాన్ని మొత్తంగా తోడేసుకుంటుంది రా.

రోజూ నీ నుండి కొన్ని మాటలు వినాలనుకుంటా. ఇష్టమైన చోట మనలేని కొన్ని నిస్సహాయతల్లో పరిష్కారాల్ని కాలానికి వదిలేస్తున్న నేను కొత్తగా   ఏం చెయ్యగలను... మబ్బుల్లోని చినుకు కోసం ఎదురు చూసే చకోర పక్షికి నాకూ పెద్ద తేడా లేదని తెలుసుకోవటం తప్ప.

నను చేరని దృశ్యాలు కొత్తగా అగుపిస్తూ, నా ఆ కొన్ని దృశ్యాలూ ఒక్కొక్కటిగా  నెమ్మదిగా మసకబారిపోతుంటే పొడి బారిపోతున్న గుండెకి ఊపిరి ఉదటానికి నెమలీకల స్మృతులు కూడా మృగ్యమయ్యాయి.

ఇద్దరం పెనవేసుకున్న వర్చ్యువల్ ప్రపంచానికి ఒకే పాస్వార్డ్ గా  మారిపోయాం. అంతే... ఇక అక్కడితోనే మన సంతృప్తి సేద తీరిపోయినట్లు ఉంది. ఒక్కటిగా మారామనుకున్న జీవితాల్లోని   మనం అక్కడే పాజ్ అయిపోయాం. మనదిగా చేసుకోవటంలో చూపించే ఉత్సాహం, ఆసక్తి… మనదయ్యాక అనాసక్తిగా మారిపోవటంలో ఉన్న మార్మికతని ఛేదించాలని ఉంది.

నాలో నుండి నన్ను పూర్తిగా తోడేసి, నువ్వు మాత్రం  నింపాదిగా  నిద్రలోకి జారుకున్న సడి నన్ను ఒక నిరీక్షణకి పెనవేసి... నిజంగా  ఎంతటి గెలుపురా నీది! కొంచెం కొంచెంగా వెనక్కి వెళ్లి చూడరా… అప్పటి నా శ్వాసల ఊసులు  ఇప్పుడు నీ నయనాలని తడి సంద్రాలుగా మార్చకుండా ఉండగలిగితే చెప్పు.

గడ్డ కట్టిన దుఃఖం ఎప్పుడు బద్ధలవుతుందో తెలియనంత నిశ్శబ్దంగా ఉందిప్పుడు. దుఃఖాన్ని కరిగించుకోలేని మగ నిస్సహాయత. ఎవరైనా వచ్చి అన్నిటి కన్నా బరువైనది ఏమిటి అంటే ఇప్పటికిప్పుడు నా మనసులోకి వచ్చే సమాధానం మాత్రం గడ్డ కట్టిన దుఃఖం అనే.

మధురంగా మొదలైన క్షణాలకి మందహాసాల బరువెక్కువ అనిపిస్తుందో ఏమిటో ఖర్మ…ముందుగా మాటలని ఖాళీ చేస్తూ… ఆపై… మనసుని? మనసుని ఖాళీ చేద్దామని చూస్తే… తట్టుకోవటం నా తరమా?  

ఒక్కటి మాత్రం నిజం రా ఎప్పుడో వలస వెళ్లి పోయానురా నాలో నుండి నేను. మళ్ళీ మరలి రాగలగడం అసాధ్యం నువ్వు జతగా నడిస్తే తప్ప.

నీకు తెలిసే ఉంటుంది, అప్పుడప్పుడూ ఒక్కో వాక్యం అలా నిద్రపోతూ ఉంటుంది. ఒక్క సారి నిద్ర లేచిందా ఇక ప్రపంచాన్ని నిద్రపోనివ్వదు. నాకు తెలిసి నీ ప్రేమా అంతే.

ఇప్పుడు నేను నిరీక్షించేది నీ ప్రేమపై పేరుకుపోయిన నివురు రాలిపోయే క్షణం కోసం.

నీ
Soulmate


Tuesday, 17 November 2015

ఓ సాయంత్రం

పొద్దు పొడిచిన సాయంత్రానికి
ఒక విశ్రాంతి కావాలట
మన మెత్తని నడకలతో
తన పచ్చికను మసాజ్ చేద్దాం
పగటి ఘోషకి ఘోషా కప్పేసి
కలల భాషకి రాత్రినుంచేసి
వెలుగూ చీకట్ల సరిహద్దు రేఖపై
మన చూపులని నాటేద్దాం
మళ్ళీ మళ్ళీ మనసుల్ని
పతంగులుగా ఎగరేసుకుంటూ…!


Wednesday, 4 November 2015

రెప్పల సరిహద్దులో...

హాయ్ రా...

ఇప్పుడు నీ మీద ఎంత కోపంగా ఉన్నానో నీకు తెలుసు కదా? 

ఎప్పటిలానే నీ గుడ్ మార్నింగ్ తోనే ఉదయించే నా కన్నులు రోజంతా పడే పడిగాపులు నీకు తెలుసు… ఏ పని చేస్తున్నా డెస్క్ టాప్ స్క్రీన్ మీద నోటిఫికేషన్ … మొబైల్ లో బ్లింకింగ్… ఎప్పుడొస్తుందా  అని ఎదురు చూపులు చూసేవి కన్నులు మాత్రమే కాదురా… కొంచెం కొంచెంగా తడిబారుతున్న నా హృదయం కూడా…

ఏయ్… ఊరుకో బంగారూ… నీ కంటికడ్డం పడుతున్న నీటి తెరలు నాకు తెలుస్తున్నాయ్… ఆ తడి నేను తట్టుకోలేనంతగా నన్ను కాల్చేస్తుంది. అయినా ఏదో అంటాను గానీ నీ సంగతి   నాకు తెలియదా ఏమిటి?  నాకన్నా ఎక్కువగా మన కాలాల్ని అంటి పెట్టుకుని ఉండేది నువ్వేగా… 

ఏరా… అసలు ఎన్ని జన్మల బంధమై వచ్చావురా నాలోకి ఇలా?  

అయినా గానీ ఉదయాన్నే నీ పలకరింపు  నా రోజు మొత్తాన్నీ  ఎంత ఉత్తేజితం చేస్తుందో… నువ్వొలికే  ఒక హాసం నా చుట్టూ ఉన్న పరిసరాలని ఎంత పరిమళ భరితం చేస్తుందో  నా ప్రతి క్షణానికీ తెలుసు. 

ఎక్కడెక్కడి మజిలీలనూ దాటి వచ్చిన నీ ఊపిరి నన్ను శ్వాసించటం నాకు బాగా తెలుస్తూ ఉంది…  

ఏయ్… మజిలీ అనగానే నా మజిలీ అడుగుతావే… పెంకి పిల్లా… 

అసలు జీవితంలో ఎన్ని మజిలీలు ఉంటాయో తెలిస్తే కదా నాకు. . అలాంటిది ప్రస్తుతం నేనున్న మజిలీ ఏదంటే ఏమని చెప్పగలను? 

ఆత్మానుగాతంగా చెప్పమంటే మాత్రం నా శాశ్వత మజిలీ నిన్ను గురించిన ఆలోచనల్లోనే…  నిన్ను దాటి వెళ్ళలేని పయనమొక వరమనుకుంటూ నా ముగింపులోని  ప్రతి నివేదనలోనూ నిన్నే స్మరించుకుంటూ కాలాన్ని  దాటిపోవటంకన్నా ఆనందం అంటే ఇంకేముంటుంది. 

నా అంతరంగంలోని అంతర్యాలన్నీ నువ్వు అలవోకగా అర్ధం చేసుకుంటున్నపుడుగానీ అర్ధంకాలేదీ మట్టి బుర్రకి ఉన్నదొక్కటే  అంతరంగమనీ… అది  ఏకాత్మగా మారిన రెండు హృదయాల పవిత్ర సంగమమని.  

నిజంరా…  మొన్నెప్పుడో మనం దాటి వచ్చిన సాయంత్రాలకి హత్తుకున్న నీడలెంత పొడవుగా ఉన్నాయో అప్పటి ఆ క్షణాలు  ఇప్పటి ఈ క్షణాలకి  కథలు కథలుగా  చేరవేస్తూనే  ఉన్నాయి. 

జీవితాన్ని  పాజ్ చేసుకుందాం అనుకున్నప్పుడల్లా తలపుకొచ్చేసి మరీ దాన్ని పరిగెత్తిస్తావ్. నిజం చెప్పాలంటే నువ్వు నాకొక నిత్య పారాయణ గ్రంధంగా మారిపోయావ్ రా… 

అవునూ అక్కడ బాగా వాన పడుతుంది అన్నావ్ కదా…  నీ పక్కనున్న కిటికీ అద్దాన్ని చూడు.  అది చేరవేసే సందేశం అర్ధం అయ్యింది కదూ… అయ్యే ఉంటుందిలే… ఎందుకంటే నేనెలా అలోచిస్తానో నువ్వూ అదేలా ఆలోచిస్తావ్ కాబట్టి. 

జడి వాన  ఒకటి ముగిసిపోయాక కూడా కిటికీ అద్దాన్ని ఆర్తిగా అంటిపెట్టుకుని రక రకాల తడి చిత్రాలని చిత్రించే ఆ కొన్ని చినుకుల్లాంటివాడినేరా నేను కూడా… నిజం రా… అందరిలా అర్ధాంతరంగా పక్కకి తప్పుకునే స్వార్ధ పరుణ్ణి కాదు.  నాలో జీవం ఆవిరయ్యేవరకూ నిన్ను అంటి పెట్టుకుని ఉండే ఏకైక  నిస్వార్ధాన్ని… ‘ నీ ‘ స్వార్ధాన్ని. 

ఎప్పుడు నిన్ను చదువుకున్నా నాకు అర్ధం అయ్యేదొక్కటే నువ్వు … ప్రభాతాన్ని మేలుకొలిపి వెలుగుల్ని పట్టితెచ్చే  విశ్వరూపానివని... 

“ అంతరంగపు  అంచుని అందుకున్న నిశ్శబ్దం ఒక్కటి 
మౌనంగా మనసు మొత్తాన్ని ఆక్రమించుకున్న సడిలో 
నీ ఊపిరుల థిల్లానా
నా శ్వాసలకి నజరానాయై 
నిశ్శబ్దాన్ని నిర్దయగా పక్కకి నెట్టేస్తున్న కదలికలో 
కనురెప్పల సరిహద్దు లోపలే
సరికొత్త ప్రపంచమొక్కటి సాక్షాత్కారిస్తుంటే 
తెలిసింది నువ్వొక సరికొత్త ప్రకృతివని… పంచభూత వేదికవని… 
నన్నుఅలరించవచ్చిన ఎడతెగని ఆహ్లాదానివని… నా ఆనందానివని…”

నీ,

ఆనందం