బంగారు పట్టీల పాదాలకి
హత్తుకోలిస్తున్న
పూల తివాచీ ముంగిట ఆగిన
పట్టుదిళ్ల పల్లకీ
ఎంత అందంగా ఉంటేనేం
చూపుల ఊపిరంతా
పరదా మాపునే కదా
కాలమిచ్చిన స్వేఛ్చ నీడలో
పడమటి పసిడి కిటికీ నుండి కనిపించే
నారింజ రంగు ఆకాశం కోసం
పొద్దుటినుండీ అక్కడే సహవాసం చేస్తున్న
రెండుకళ్ల యజమానికి
దాస్యం చేయవచ్చిందట
వెన్నెలంటి నవ్వు పులుముకున్న
ఓ నల్ల కలువ పువ్వు
కాంతి గుప్పిట్లో ఖైదు కాబడ్డ రాత్రిలా
తమ అస్థిత్వాన్ని కోల్పోయినట్లూ ఎరుకకి రాని
అంతఃపుర రాణివాసమంతా
స్వేచ్చా వీచికలైతే
రేయి చెంగుకి
నక్షత్రాలని అల్లేసుకుని
వెన్నెల చాపమీద
అంబలిని అమృతంచేసి పిల్లలకి తాగించే
ఈ నల్ల కలువ పువ్వుని ఏమని పిలుద్దాం