మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Saturday, 29 April 2017

తేమ మిగిలిన చోట...నీ కోసం
నన్ను నేను తుంచుకుంటాను

ఇంతలో 
నువ్వు నడిచిన దారి
ఎక్కడికో తప్పిపోతుంది

కాలమంతా 
నిన్నే వెదుకుతూ
గాజు కలల గాలిలో 
కొట్టుకుపోతుంటాను

కంటి కింద కాస్త తడిని దాచుకున్న
ఎవరో ఒకరు
నన్ను నీ దగ్గరకు చేర్చుతారు
ప్రపంచం భుజం మీద
మనిషి అలికిడిని భరోసాగా తడుతూ

Friday, 28 April 2017

వాళ్ళు వచ్చారు

వాళ్ళు వచ్చారు
కాస్తంత చీకటి కొండంత వెలుగుతో

వెలుగు కోసం
ఎగబడ్డారంతా

వాళ్ళు చెబ్తూనే ఉన్నారు
వెలుగుని సూటిగా చూస్తే చీకటౌతుందని

ఆశ చేసిన ఇంద్రజాలంలో
ఏ మాటా చెవికెక్కలేదు

మరి ఇప్పుడేమో
అంతా చీకటే


Thursday, 27 April 2017

జీవనయానం - అచ్చమైన మట్టివాసన

ఆత్మ కథ అంటే ఒక విధమైన స్వోత్కర్ష అనే అభిప్రాయం ఉండటం సహజం. కానీ ఒక ఆత్మకథ ఒక జీవన ప్రవాహంగా సాగటం చూశాక మన అభిప్రాయం మార్చుకోక తప్పదు. మన ముందు తరాల్లో ఏమి జరిగిందో ఎలా జరిగిందో తెలియకుండానే కొన్ని అభిప్రాయలని స్థిరంగా ఏర్పరుచున్న మనల్ని ఒక ఆలోచనా స్రవంతిలోకి అలా తీసుకుని వెళ్ళడం అన్నది ఒక విజ్ఞానజ్యోతిని మన అంతరంగాల్లో వెలిగించడమే.

అలాంటి సమున్నతమైన రచనయే అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య గారి ఆత్మకథ ‘జీవన యానం'. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో  రెండు సంవత్సరాల పాటు ధారావాహికగా వెలువడ్డ మేటి రచన.

వేద కుటుంబంలో పుట్టి తండ్రి నిరాదరణతో… కుటుంబానికి చుక్కానిలా ఆదరువై, ఆయుధాన్ని చేపట్టి తెలంగాణా సాయుధపోరాటంలో పాల్గొని, అటుపై ఉపాధ్యాయునిగా… తరువాత సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఉద్యోగిగా… నాలుగు వేదాలనీ తెనుగించిన అక్షర వాచస్పతిగా సాగిన జీవన యానమే ఈ రచన. ఎక్కడా ఎలాంటి భేషజాలకీ పోకుండా ఒక ప్రవాహపు ఉర్వడిలా సాగిపోయిన రచన ఇది.  

నిజానికి ఇది ఆయన జీవిత యానం కాదు. ఒక జాతి యొక్క 70 -80 ఏళ్ల  ప్రయాణం. ఒక శతాబ్ది చరిత్రని వివరించే విజ్ఞాన సోపానం. ఆ తరపు తెలంగాణా ప్రజల కడగండ్లని మనం కళ్ళారా చూసినట్లనిపించేలా  రాయబడిన ఆత్మకథ ఇది. మనం చిన్నప్పుడు చదివిన మన క్లాసు పుస్తకాల్లోనో లేదా చరిత్ర మీద అభిరుచితో చదివిన పుస్తకాల్లోనో మనకి పరిచయమైన ఎందరో ప్రముఖులు ఇందులో పాత్రలుగా పరిచయం అవుతుంటే, ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాలని మనం చాలా దగ్గర నుండి చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

తెలంగాణా సాయుధ పోరాటంలో ఆయా రాజకీయ పార్టీలు చేసిన చారిత్రిక తప్పిదాలని చాలా సూటిగా చెప్పారు. తెలుగు భాషా బోర్డులని చూడటానికే నైజాం నుండి  బెజవాడ వెళ్ళాలి అనిపించేది అంటూ  ఆ సమయంలో  ఆ ప్రాంతంలో తెలుగు భాష దీనస్థితిని సోదాహరణంగా వివరించారు.  ఒకానొక సమయంలో గ్రంథాలయాలు పోరాట నిలయాలుగా నిలబడి యువతలో పోరాటస్ఫూర్తిని రగిలించిన విధానం పరిచయం చేసారు.  కలరా వ్యాధి ప్రబలంగా ఉన్న రోజుల్లో  మానవత ఎంతగా అడుగంటి పోయి ఉందో ఆయన చెల్లి లక్ష్మి మరణంలో మనకి తెలిసినప్పుడు   ఏ కాలంలో అయినా మానవతది ఒకింత వెనకడుగే అని అనిపించటంలో వింతేమీ ఉండదు.

బయటి ప్రపంచపు మకిలినే కాదు, తన కుటుంబ కలహాలని కూడా ఎక్కడా దాచలేదు. తన తండ్రి, అన్న, కొడుకులు… మరియు తనలో ఉన్న మంచి చెడూ రెండింటినీ  సాధ్యమైనంత నిజాయితీగా రాసారని అనిపిస్తుంది.  పొగడ్తలూ తెగడ్తలూ రెండూ ఉన్నాయి ఇందులో. ఆయా రోజుల్లో తన జీవితంలో జరిగిన సంఘటనల మీద తన అభిప్రాయంలానే అనిపిస్తాయి తప్ప అవేవీ సంచలనాల కోసం ఇరికించినట్లు ఉండవు.

ఇందులో ఒకచోట బ్రిటీష్ వాళ్ళు మనకి టీ ఎలా అలవాటు చేసారో ఏంతో వివరంగా రాశారు. ఏదైనా ఉత్పత్తికి మార్కెటింగ్ అన్నది ఎంత శక్తివంతమైనదో చెప్పకనే చెప్పారు.

వట్టికోట ఆళ్వార్ స్వామి మరియు నార్ల చిరంజీవిగార్లతో తనుకున్న ఆత్మీయతానుబందాన్ని తన రచనల్ని వాళ్ళు ప్రోత్సహించిన తీరునీ చక్కగా విశదీకరించారు. తాను రాసిన ప్రతి రచన యొక్క నేపథ్యాన్ని వివరించిన తీరు బాగుంది.

చదివే కొద్దీ ఆయన జీవితం ఒక జీవనది ప్రయాణంలా అనిపిస్తుంది. ఈ రచననిండా  మనిషి ఉలిక్కి పడేలా అనిపించే  ఉట్టిపడే మట్టివాసనే.  

ఒక ఉత్కృష్టమైన జీవితం తన కథనాన్ని తనే రాసుకుంటుంది. ఆ సంగతి ‘జీవనయానం' పుస్తకం మరోసారి ఋజువు చేస్తుంది.


తాళం చెవి

నా తాళం చెవి
తన ఇల్లుని పారేసుకుంది


ఇల్లుల్లూ తిరిగాను
దేనికీ సరిపోలేదు


వెదుకుతూనే ఉన్నాను
ఇళ్ళన్నీ ముగిసే వరకూ


బహుశా
నా ఇంటికి ఎవరో కొత్త తాళం వేసినట్లున్నారు

నా కాలం ముగిసింది
వెదుకులాట ఆగింది


తాళంచెవి కొనసాగుతుంది
నా వారసుడి చేతిలో మరింత ఆశగాSunday, 23 April 2017

బుగ్గ కార్లకే కాదు…

గుడికెళ్ళినా బడికెళ్ళినా వేడుకైనా వేదికైనా ప్రముఖులంటూ మెహార్బానీ  చేస్తూ… సామాన్యుడి సమయాలకి ఎదురుచూపుల కళ్ళెమేసే రాచ బానిసల కార్యశీలతలో మాన్యుడు సామాన్యుడిలో కలిసేదెక్కడ?

భుజాల మీద చేతువేసి తట్టగానే జీవితమే ధన్యమయ్యిందనుకునే అమాయక జీవాలకి,  

ఉరుకుల పరుగుల జీవన యానంలో మనిషి మనిషియొక్క ప్రతి క్షణానికీ విలువ ఉందని తెలిసీ , ప్రముఖుల కోసమంటూ  రహదారులని దిగ్బంధం చేసే అధికారం రోడ్డంతా పరిగెడుతూనే ఉంది. అడుగు పెట్టిన ప్రతి చోటా VIPలంటూ ప్రత్యేక హోదా ఇచ్చేస్తుంటే మా సమయాలకి విలువెక్కడ?

కార్ల మీద బుగ్గలు తీసెయ్యగానే సామాన్యులు మాన్యులైపోతారా ఏం. మాకు మీరనే VIPహోదా వద్దులే ఆర్యా! మనిషన్న హోదా మిగిల్చితే చాలు.

ప్రజాస్వామ్య దేశంలో బుగ్గ కార్లకే కాదు… ‘బుగ్గ’ మనస్తత్వాలకీ మంగళం పాడి చూపించండి  

Wednesday, 19 April 2017

అవ్యక్తపు కొలత

లోపలెవరో కదులుతున్న సవ్వడి
స్తంభించిన పుప్పొడిలా ఏదో ధ్యానం

ఒక తడచిన చీకటి గుండా
వెలుగు రథాన్ని తోలుకొస్తున్నట్లు చిన్న నవ్వు

గాలికింత మత్తును రాసి పంపినట్లు
వెదురు వేణువుని స్పృశిస్తూ ఓ మైకం !

మౌనం నిండా ఎన్ని అవ్యక్తపు కొలతలో
ప్రకృతి రాసే పద చిత్రాలని
అనుభూతుల త్రాసులో తూకమేస్తూ  

నిజమే
ఈ మౌనమింతే
తనని తెరచినప్పుడల్లా
దృశ్యాదృశ్యాల మార్మిక స్పర్శ

ఒక సుదీర్ఘ మౌనం...
మనసుని విపులీకరించే భావ నిఘంటువు
పదానికో కొత్త అర్థాన్ని లిఖిస్తూ

Wednesday, 5 April 2017

పుట్టుక

ఎందుకే పుట్టుకా? వద్దన్నా ఉరుకిరికి వస్తావ్.
ఆశల మొగ్గలు విచ్చుకునేలోగా... బతుకొక పోరు నేర్చుకొనేలోగా
మరణం నేను విడువలేని నేస్తమంటూ చావుని కౌగలించుకుంటావ్

ఊహగా నీ ఉనికెంత మధురమో ఊపిరిగా ఈ  బ్రతుకంత నరకం
అందుకే వద్దమ్మా... మా ఇంటి గడప నువ్వు తొక్క వద్దమ్మా
గడప గడపకీ బొట్టెట్టి చెపుతా... అసలు పుట్టుకనే రానివ్వద్దని

చిట్టి మొలకగా నువ్వు వచ్చి మానుగా నిలదొక్కుకుంటున్నప్పుడు.
ఒక్క పెనుగాలిగా వీచే రాక్షసత్వానికి కూలిపోతున్న నిన్ను చూసి
కన్నీరింకిపోతున్న గుండె బరువుని తట్టుకునే ఓపిక లేదమ్మా...

నువ్వొచ్చి తట్టిన మనసు పొరల వెనుక తడిని
ప్రాణధారవై నువ్వు తాకిన మైదానాల శబ్దాన్ని
వెన్నెల యేరువై అలలు అలలుగా నువ్వు సాగిన జీవన ప్రవాహాన్ని 
ఒక్క మాటుగా చెరిపేసే కర్కశత్వానికి నిన్ను బలిచేసే బతుకుకన్నా
నువ్వంటూ లేని గొడ్డుమోతుదనంలో  
మోడులా వెల్లమారిపోవటంలో జీవితాన్ని దాటేస్తూ
లోకానికిక మనిషి ఊపిరిని పలుచన చేసేస్తాం