మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Showing posts with label కవిత్వం. Show all posts
Showing posts with label కవిత్వం. Show all posts

Monday, 2 January 2023

తడి ప్రేమలేఖ

 



కనుల నీలిమలో  కరిగిపోతున్న విశ్వరూపంలా 

కనుపాపని కాల్చి వేస్తున్న  నిప్పురవ్వలా 

కంటి సీమని ముంచి వేస్తున్న  తేమ పాతంలా 

కనుదోయి మాగాణిలో మొలకెత్తుతున్న నీటి విత్తులా 

కంటి ద్వారాల మాటున దాగిన శూన్యాన్ని పరిపాలిస్తున్న అశ్రు ధీరలా 

కను రేకల పత్రాలపై లిఖించిన తడి ప్రేమలేఖలా 

కాలమంతా  కనురెప్పల కావలిలో  

సంచరిస్తున్న స్వప్నాలని సంహరించే  వధ్యశిలలా 


ఇదిగో ఇలా…   


కంటిని అంటిపెట్టుకున్న యుగయుగాల బాసలా 

ఎప్పటికీ మరణం లేని ఒకే ఒక్క భాషలా  

కల పగిలినప్పుడల్లా  

ఒక కన్నీటి చుక్క!!! 



Sunday, 1 January 2023

బ్రహ్మత్వపు ఆచూకీ




సముద్రంలోని నీలమంతా ఘనీభవించి 

గుండెలోతుల్లోకి చేరిన ప్రతిపిలుపులా 

చిక్కని నీలి వెన్నెల కాంతి  పరచుకున్న 

మైదానం  నుండి మొదలై  

ఊపిరి మొదలవ్వక ముందే 

మనకోసం విశ్వాన్ని సిద్ధం చేసిన 

బ్రహ్మత్వపు ఆచూకీగా  

గడ్డిపూల రేకల మీద చలిని

వెచ్చగా మనసు లోకి లాక్కొని వచ్చే 

పాదమే  పథమై 

సూరీడి ఎండతునకలని చల్లగా కప్పుకునే

ఇలాంటి నవ్వులు  ఓ నాలుగు చాలవూ

మనల్ని మనం 

యథా తథంగా  అనువదించుకోవడానికీ


Monday, 26 December 2016

కాలసారి


నువ్వలా నడుస్తూనే ఉండు

దారి పొడుగూతా

ఒక్కొక్క విత్తూ జల్లుకుంటూ

నేల కన్నుల్లో నీ కలలని దాపెడుతూ


తన ప్రతి మలుపులోనూ

ఒక నీడని ఒడిసి పట్టి

చరిత పొడుగూతా

పథికుల పాదాలు

నిన్ను తలచుకునేలా

నీ వెనకే వస్తుంది కాలం

అవును...

లోకానికి నువ్విచ్చిందేదీ ఖర్చైపోదు

ఆసాంతం చైతన్యమై

విశ్వం నిండా నిన్ను వ్యాపింపజేస్తుంది!

అక్కడ కాంతిధూపంలా

నీకు కీర్తి ఛత్రం పడుతూ

నీ స్మృతి విరాజిల్లుతుంది,

కాలపు హృదయంలో

నీ స్థానం చెరగని రేఖగా నిలుస్తుంది.


ఎందుకంటే

నువ్వు

కాలం పొడుగూతా నడిచే

కాలసారివి!



Thursday, 5 December 2013

ఇదీ బాల్యమే




అమ్మ వడిలో వికసించిన మొగ్గలు మీరైతే 

కుప్ప తొట్టెలో కుసుమించిన పుష్పం నేను


మీ ముద్దుచేష్టలతో మీవారు మురిసిపోతే 

ఏ తోడూ లేక బేల చూపులతో నేనవసి పోయా


గోరుముద్దలు వద్దంటూ నువ్వు మారాం చేస్తున్నప్పుడు  

ఆకలిబాధ తాళలేక వీధి పంపు నీళ్ళు త్రాగాను నేను 


బడి దారిలో పుస్తకాల సంచీ మీరు మోస్తుంటే 

బతుకు బడిలో మట్టి తట్టలు మోసాను నేను 


బామ్మ చెప్పే పేదరాసి పెద్దమ్మ కధలు మీరు వింటున్నప్పుడు  

బరువులు మోసి బొబ్బలెక్కిన అరచేతులని ఊదుకున్నా


తిరునాళ్ళకెళ్ళి రంగుల రాట్నంలో మీరు తిరిగితే 

గానుగ చక్రం చుట్టూ తిరుగుతూ సున్నాన్ని తీశాను నేను 


పిల్ల కాలువలో సరదాగా మీరు ఈతకొడుతున్నప్పుడు

పంటకాలువలో ఏతమేసి నీరు తోడాను నేను 


కోతికొమ్మచ్చి... కోలాటాలు మీరాడుతున్నప్పుడు

కొడవలి పట్టి కోతకోయడానికి చేనుకెళ్లాను నేను 


మీ మధురస్మృతుల అందమైన బాల్యం మళ్ళీ మీక్కావాలి

జీవితంతో పోటీపడుతూ మీరు అలసిపోతున్నారు కాబట్టి


అందమైన గతంలేని నా బాల్యమంటే నాకిష్టం 

జీవితంతో పోరాడటం నాకు నేర్పింది కాబట్టి…!

Saturday, 30 November 2013

స్వస్తిత్వం



నాది కాని తత్వమేదో 

మీరంతా నాలో చూస్తుంటే

నేనో అద్దంలా మారిపోయానేమో అనిపిస్తుంది 

నన్ను చూడాల్సిన చోట 

మిమ్మల్ని మీరు చూసుకుంటూ 

అది నా రూపమనుకుంటుంటే 

నేనేమిటో తెలిసేదెలా? 

మీ మనసొక ప్రతిబింబమై 

నాలో ప్రతిఫలిస్తుందంటే 

నేనొక అద్దమనే కదా అర్థం!


నన్ను చూసినప్పుడల్లా 

మీకు కనిపించేదంతా 

మీ ద్వేషం 

మీ స్నేహం 

మీ దుఃఖం  

మీ సంతోషం 

నాలో మీకు కనిపిస్తున్న 

కష్టం, సుఖం, కోపం, శాంతం 

అన్నీ మీవే… 

అవును అన్నీ మీవే

నా ప్రతి చర్యా మీకు ప్రతి చర్యే 


మీ ఊహలు నావిలా మీకనిపిస్తుంటే 

నాక్కనిపించని అజ్ఞాతపు నీడేదైనా 

నాలో ఉందేమో అని తరచి తరచి చూసుకుంటూ 

నేను మీ నీడగా మారిపోయి 

నాలో నుండి మాయమవుతానేమో 

అన్న ఓ భ్రమ కదలాడుతుంది నాలో 


మీ పుస్తకంలో రాసేసిన పుటను కాను 

మీరు రాసుకున్నట్లు చదివెయ్యటానికి….   

మీ కళ్ళు రాస్తున్న నవీన వేదాక్షరాలనుండి 

మీ మనసు చిత్రిస్తున్న మాయా చిత్తరువులనుండి 

నన్ను నేను వెలివేసుకుని 

స్వంత అస్తిత్వాన్ని ఆవిష్కరించుకున్న 

నిలువెత్తు అహాన్ని 


నన్ను నన్ను గా తెలుసుకోవాలంటే 

మీ మనసో తెల్లకాగితం అవ్వాలి...