మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Sunday, 15 September 2013

వెన్నెల కుసుమం - 9

పున్నమి వెన్నెల రోజున ... పర్వత సానువుల నుండి మలయ మారుత పవనాలు మనని తాకుతుండగా పచ్చటి అడవి సీమలలో సెలయేటి గలగలల మధ్య నీవు నేను లతల్లా అల్లుకు పోతుండగా చూసినే చందమామ సిగ్గుపడి మబ్బుచాటుకి తప్పుకుని మిణుకు మిణుకు మంటున్న నక్షత్రాల చెంతన చేరి సరాగాలడుతుంటే ఆ నక్షత్రాలు కృతజ్ఞతా భావంతో మనమీద అమృత కిరణాలని ప్రసరిస్తుంటే ఆ సమయం లో ఆ సెలయేటి సవ్వడుల మధ్య నేవు నేను ఒక్కటిగా కలసిపోదాం.
వెన్నెలల కాంతులీనే నీ చెక్కిలి మీద చిరుముద్దు ఇవ్వాలని ఉంది. నీ కళ్ళల్లో కళ్ళుంచి కళ్ళతోనే మాటలు చెప్పాలని ఉంది. నీ ఆధర సుధలని నా ఆధరాలతో గ్రోలాలని ఉంది. ఏమిటో నా మనసున దాగిన భావనకు రూపం వచ్చీ రాక మునుపే నీ ముందుకి రావాలనిపిస్తుంది.
ప్రియా నీవులేని నా జీవితం వెన్నెల లేని పున్నమి. నీవు లేని తలపులు నన్ను బంధించిన గది తలుపులు. నీవు వలదన్న నా వలపు వల్లకాడే...
నా తలపుల్లో ఊహల్లో అనునిత్యం నీవే ఉండాలి. నీవు లేని  నా బ్రతుకు సారధి లేని రధం. నా జీవితాన నీ పాదం మోపి నిండు పున్నమి రేయిలా...  వెన్నెల విరబూసిన జాబిల్లిలా... స్వేచ్చా వీచికలని ఎగరవేసే కపోతం లా... ఒక స్వర్గం లా మార్చుతావని నా ఆశ.
విరబూసిన గులాబీ లాంటి నీ సోయగం నా కలల్లోన కవ్విస్తుంది. నాలోని చిలిపి ఊహలని కవ్విస్తే నీ పరువానికే ప్రమాదం ప్రియా...
నీ అందం సుకుమారం
నీ చూపు సుమనోహరం
నీ మోము నవరసభరితం
నీ స్వరం సంగీతమయం
నీ చెక్కిలి అమృతకలశం
నీ నడకే నాట్య భరితం
నీ క్రీగంటి చూపుల జలతారులోన నా మనసున విరిసే ప్రేమబంధం. నా ఎదురుగా నీవుంటే తెలియదు నాకు కాలం
నా తీయటి కోరిక నీవు
నా మనసున పలికే సరాగం నీవు
నా హృదయ కోవెల పీఠం నీవు
నా కలం జాలువారుస్తున్న ప్రతిఅక్షరం నీవే

నా హృదయ పీఠిక నలంకరించిన పతాకాన్ని రెపరెపలాడించే ప్రేమగాలి తిమ్మెరవు నీవు.

Thursday, 5 September 2013

నేతి నైవేద్యాలు

దేవుడున్నాడనేది నిజం అని ఆస్తికుల నమ్మకం
దేవుడులేడనేది నిజం అనేది నాస్తికుల నమ్మకం 
ఉన్నాడన్న నమ్మకమే భూషణమై 
గుళ్ళో భోషాణాలు నింపేవారు ఆస్తికులు
లేడన్న నమ్మకమే పునాదిగా 
రుజువు చూపితే కోట్లు ఇస్తామనేది నాస్తికులు

రాతి బొమ్మలకి రంగురాళ్ళ ఉంగరాలు 
నిశ్చల విగ్రహాలకి నేతి నైవేద్యాలు 
భావజాలపు నమ్మకాలకి జేజేలట
రుజువు చూపితే చాలట నోట్లకట్టలేనట

మనిషి ఉన్నాడనేది జగమెరిగిన సత్యం
మరి మనిషికి మనిషి ఉన్నాడన్నది నిజమా?
జగంలో ఓ వంతు జనం ఎండిన డొక్కలతో
మరో వంతు జనం అర్ధాకలితో ఉంటున్నారనేది
అందరికీ తెలిసిన ఎవరూ కాదన లేని నిజం

రంగురాళ్ళ ఉంగరాల అవసరం లేదు
తిన్నా అరగని ఆ నేతి నైవేద్యాలు వారికొద్దు
మనఃశాంతి పోగొట్టే నోట్ల కట్టలసలే వద్దు
నోట్లో కి నాలుగు వేళ్ళు వెళ్ళే సాయమే ముద్దు