మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Wednesday, 1 May 2013

వెన్నెల కుసుమం - 6


ప్రాణానికి ప్రాణమా... నీ ప్రేమ స్పర్శ నా హృదయమంతా ఉందనే జ్ఞానంతో నా మనసుని ఎల్లప్పుడూ నీ ధ్యానం లోనే ఉంచేస్తున్నాను.
నా మనసున ప్రేమనే దీపాన్ని వెలిగించిన రూపం నీదని తెలిసి నీ పీఠం నా హృదయం లోనే  అని ఎరిగి ప్రతి ఊహలోనూ నీ ఊసుల్లోనే తేలియాడుతున్నాను.
ఒక జంటలో ప్రేమ అనేది ఏ ఒక్క మది లోనే  కలిగిన అనుభవమై మరో మనసు కి అది స్నేహమనే భావన అయితే ప్రేమ నింపుకున్న మనసుకి ఎంత కష్టం. జీవితాన అంతకన్నా నరకం అనేది ఆ మది మరి చూస్తుందా?
ప్రేమ అనేది ఒక అధ్బుతమైన  కావ్యం. ఏ కావ్యం లో అయినా ప్రతి పాత్రా రాణిస్తేనే అది మనసుల్ని కట్టి పడేస్తుంది. ప్రేమ కావ్యం అయినా అంతే... ఈ కావ్యం లో ఉండే రెండు పాత్రలూ  కూడా ఒకదాని కోసం ఒకటి ఉంటేనే దానికి జవ జీవాలు.
కల్లలు కాకూడదనుకునే కలల్లోకి వచ్చి నువ్వు కవ్విస్తుంటే నాకు కళ్ళు తెరవాలని అనిపించటం లేదు. కళ్ళు తెరిస్తే కల చెడి పోతుందనే భయం కదా మరి!
ప్రియా...
నీవు నన్ను కాదన్నా.. నీకేమైనా జరిగినా తట్టుకోలేక పిచ్చివాడిని అయిపోతానేమో... నీ ప్రేమ కోసం ప్రేమ పిచ్చివాడిగా ఇప్పటికే మారాను. నువ్వు నన్ను కాదంటే నిజం గా పిచ్చివాడిని అయిపోతానేమో...
నీవు నన్ను కాదనే ఊహని కూడా నా ఊహల్లోకి రానివ్వను. ప్రియ సన్నిధిని కోరేవానికి ప్రేమని మించిన ప్రాణమున్నదా? ప్రేమే దైవమని విశ్వసించే వారికి సఖిని మించిన తోడూ ఉన్నదా?
చెలి మోమున చిరునవ్వే కదా చెలికాని ఆనందం...
చిరుప్రాయం సిగ్గుపడి మొగ్గ తొడిగినప్పుడు నిన్ను చూసాను. మలిప్రాయం మొగ్గవిచ్చి మందారం అయినప్పుడు నిన్ను వలచాను.
నీమీద నా ప్రేమను గురించి రాస్తే ఒక కావ్యం పుడుతుంది. నా ప్రేమను పాటగా మార్చి పాడితే ఒక యుగ కాలం కూడా చాలదేమో...
నీమీద నా ప్రేమని కావ్యం గా మలచినా కమనీయం గా పాడినా నీవు నన్ను వలచి నా వడిలో  ఒదిగిన రోజున పొందేదే కదా ఆనందం అంటే...
నీ ఊహలతో... నిన్ను గురించిన తలపులతో నా ప్రతీక్షణం గడుస్తూ ఉంది. ప్రేమ ప్రకోపిస్తే కవిత్వం పుడుతుందేమో అనిపిస్తూ ఉంది ప్రియా...
నిన్ను గురించిన ఊహలు వచ్చినప్పుడు నా కష్టాలూ కన్నీళ్ళూ ఏమవుతాయో...నేను మనశ్శాంతిగా ఉండాలంటే నిన్ను తలచుకుంటే చాలు ప్రియతమా...
అందరాని అందాన్ని అందుకోవాలని నేనెంత ఆశపడుతున్నానో ప్రియతమా... కానీ ఆ అందం కేవలం భౌతికమైన అందం కాదు. అంతసౌందర్యాన్ని  మించిన అందం ఏముంటుంది. నీలో ఉన్న ఆ అంతసౌందర్యాన్ని ఆరాధిస్తూ ఉన్నాను. కానీ ఆ  అందం నా కోసం ఆరాటపడే క్షణం వస్తే నా సంబరం ఆ అంబరాన్ని తాకదా?
నీ ఊహలతోనే నాలో కలుగుతుంది ప్రేమోదయం
నీ తలపులతోనే నా ఊపిరి నిలుస్తుంది.

పదే పదే నిన్ను చూసి పరవశించే నా పరువం
ప్రియా ప్రియా అని నీకోసం పలవరించే నా హృదయం
సఖీ సఖీ సదా నీవాడినే అని పలికే నా మనస్సు
చెలీ చెలీ నీ ఆనందం కోసం నేను చేస్తా ప్రేమ తపస్సు

అది ఏమి వింతయో నీ నవ్వు చూడగానే కాలపురుషుడే  ఒక్క క్షణం  స్తంభించెను. ఇది ఎంత చిత్రం కాకుంటే నీ అందం చూడగానే  తన అందం మీద సందేహం వచ్చి ఆ చందమామే  సిగ్గుపడి మబ్బుతెరల చాటుకి పారిపోయెను.