మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Sunday, 24 May 2015

యుగాంతంతో యుగళగీతం

ఏయ్ కాలమా…

ఎప్పుడు పుట్టావో తెలియదు. నిరాకారంగా... నిరంతరాయంగా… క్షణం వెనక క్షణాన్ని పరిగిస్తూ నువ్వు సాగించే అనంతపయనంలో ప్రతి లిప్తలో  ఎన్ని వింతలో… 

ఎన్ని రహస్యాలో నీ సౌధపు మంజూషాలలో… 

ఆనంతశూన్యంలోని మహావిస్ఫోటనం... తద్వారా పుట్టిన విశ్వం…వాతావరణం… జీవం… పరిణామ క్రమాలన్నిటికీ సాక్షీభూతం నువ్వు. 

నీ గొప్పతనాన్ని చెప్పేంత పాండిత్యం నాకెలాగూ లేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే… నువ్వు  ఏ అంతరాలు చూడని నిజమైన సామ్యవాదివని… ప్రతి జీవికీ సరిసమానంగా నీ సమయాన్ని పంచుతావని.  బుద్ధిజీవులుగా చెప్పుకునేవారు కూడా ఏ నాడూ ఆచరించని  సమన్యాయమిది. సృష్టిలోని ఏ ఇతర ధర్మమూ  ఇంత న్యాయంగా వ్యవహరిస్తున్న దాఖలాలు లేవు కూడా… 

కోట్ల వత్సరాలని అణువులుగా నింపుకున్ననీ తనువు  ఎప్పుడూ నవ యవ్వనంతో తొణికిసలాడుతూ ఉంటే విశ్వ సృష్టిని కనుసన్నల నుండి భావాతీతంగా చూసిన నీకు అమీబాగా మొదలైన జీవం అనంత విశ్వాన్ని ఆక్రమించేస్తున్నవైనం లిప్తపాటుగా అయినా బాధ కలిగిస్తూ ఉండి ఉంటుంది కదూ… 

ఘడియ ఘడియకూ కోటానుకోట్ల జననమరణాల్ని చూస్తూ మహనీయుల ఆత్మత్యాగంతో పునీతమైన క్షణాలని గుండెల్లో నింపుకుని పరిపూర్ణమైన అలౌకిక ఆనందంలో తేలియాడే నీకు ఆ పాత శూన్యమే సహచరిగా మారితే  గడపబోయే నిస్సారమైన భవిష్యత్తుని  తలచుకోవటానికీ ధైర్యం రావటం లేదు కదూ…

యుగాలుగా సాగిపోతున్న నీ అమరగమనంలో రగిలిన చితుల్నెన్నిటినో చూసి ఉంటావ్ కదూ… ఆ రగులుతున్న చితుల్లో కాలిపోతున్న దేహాలు అంతకుముందు  వెలిగించి వచ్చిన జీవదీప్తులని చూస్తూ నిన్ను నువ్వు సంభాళించుకుని ఉండి ఉంటావ్ ఇన్నాళ్ళ నీ పయనంలో... 

మానవుడు దానవుడై లిఖిస్తున్న రక్త కావ్యాలలో… వాడి నవనాగరికత వీరవిజృంభణలో శకలాలుగా రాలిపడుతున్న శిధిల  చరిత్రలని ఎంతో భద్రంగా  దాచే నీకు, ఆ చరిత్రని అందిపుచ్చుకోవటానికి ఎవరూ మిగలరేమో అన్న ఆందోళన కలచి వేస్తుంది కదూ…

మహాకవులు రాసిన పురాణాలో… 
చరిత్రకందని ఇతిహాసాలో… 
ప్రక్షిప్తాల ప్రహేళికలో… 

శిధిలమైన ప్రతి పుట నువ్వు చదువుతూ వచ్చిందే. అన్నీకథలూ నీకు తెలుసు. 

నీలోకి… లోలోపలికి ప్రవేశించే జ్ఞానమే అందితే మానవ జాతి వికాసమూ… జీవ జాతుల బాంధవ్యాల వైరుధ్యాలు చదివి మనిషి మారుతాడేమో… తను బతుకుతూ అందరినీ బతికించటమే నిజమైన నాగరికత అని ఒక్క క్షణమైనా ఒక  ఆలోచనని తన మదిలోకి ఆహ్వానిస్తాడేమో అని  ఒక చిన్న ఆశ. అలాంటి క్షణం నీలో ఉండి ఉంటే దాన్ని త్వరగా వర్తమానం చెయ్యవూ… 

నువ్వో అనంతం… అవ్యయం… నీలాగే జీవజాతి కూడా అవ్యయమై…. అనంతంగా సాగిపోయే రహస్యాలు నీలో ఉంటే వాటిని త్వరగా బయటకు తియ్యవూ… మనిషి బుద్ధిని సక్రమ మార్గంలో మళ్లే అజమాయిషీ చెయ్యగలిగే అతీత శక్తి నీకు ఎక్కడైనా తారసపడితే దాన్ని ఈ లోకానికి త్వరగా పరిచయం చెయ్యవూ… 

యుగాంతంతో యుగళగీతం పాడే ఆఖరి ప్రాణశక్తిని ఊహించుకోలేని భయంతో...


మనిషి

Friday, 22 May 2015

మనం

ఏయ్ హనీ…

ఎందుకో మనసంతా స్థబ్ధంగా ఉందిరా. ప్రకృతి అంతా ఎప్పుడూ ఆదరంగా నన్ను హత్తుకోవాలి అని నేను అనుకుంటుంటే ఏమైందో ఏమోగానీ పంచభూతావృతమైన ఈ ప్రకృతి ఒక్క సారిగా నాతో మౌనవించేసింది. ఈ మౌనానికి మాటలద్దటం ఎలానో తెలియని నిర్వేదంలో నా ప్రతినిమిషం స్నానించేస్తుంది. 

ఏయ్ బంగారూ… నువ్వైనా రాయబారం నడపవూ…. 

ఆగిన తరువు చిగురుల సడి
కరి మబ్బులు దాచేసిన వెన్నెల ఊట 
చిరుగాలుల కవ్వింతల కదలిక
స్వచ్ఛమైన మట్టి తునక పలకరింపు

మళ్ళీ మళ్ళీ నన్ను కదిలించేలా… నిత్యం నాతో ఊసులాడేలా… 

ఏయ్… ఆ కళ్ళల్లో నీళ్ళెందుకు…? ప్రకృతి నీకు సవతి అనిపించింది కదూ...! అసలు నా ‘ప్రకృతి’ నువ్వేనన్న నిజం నీకు తెలియదా ఏం? అప్పుడప్పుడూ నాలో కురుస్తున్న నీ మౌనం  నన్నెంతగా చలన రహితం చేస్తుందో తెలియచెప్పటానికి కూడా ఆలోచనలు నిర్వీర్యం అయిపోయాయి. అర్థం చేసుకుంటావు కదూ… 

నిత్యం నీతో నేనాడే ఊసులతో  నా దిగులు జాడల నీడలన్నిటినీ ఊడ్చేస్తున్నా. ఎప్పటెప్పటి బడలికలూ నిన్ను తలవగానే బహు దూరతీరాలకి పారిపోతాయి నా ప్రమేయం లేకుండానే. 

ఏయ్ …

ఇప్పుడిక మన అస్తిత్వాల లెక్కలన్నీతీసి చూడు. ఇక ఇక్కడ రెండు మనసులేమీ లేవు. తెలుస్తుంది కదూ ఆ సంగతి. నేనుగా మనలేని నేను  ఓ ఆత్మీయ బంధంలో నా అలసటని సేద తీర్చుకోవాలనే గాఢమైన కోరికలోకి జారిపోయాను.  ఆ పర్యవసానమే నా చైతన్యం మొత్తం నిరాకారంగా... నీ ఆకారంగా… నీలో ఓ కొత్త ప్రాకారంగా మారిన సవ్వడి నీకే తెలియనంత  మౌనంగా నీవుగా కరిగి పోయిన నేను… నాలో నిష్క్రమించిన తరుణం…కురిసిన ఓ ఆనందం…. జన్మాంతరాలుగా పదే పదే  తపస్సు  చేసిన యోగులకీ అనుభవంలోకి వచ్చి ఉండదేమో…

నన్ను నేను అలౌకికం చేసేసుకున్నాక నీలో నుండి నేను చూసే లోకం మొత్తం నేనుగా కనపడుతుంటే అర్ధమయ్యిందిరా కరిగింది… అలౌకికం అయ్యింది నేను మాత్రమే  కాదనీ… నువ్వు కూడా  మొత్తంగా మారిపోయిన ఓ సరికొత్త అస్తిత్వానివని…ఏకరూపమై అల్లుకుపోయిన మనం తప్ప  ఈ అస్తిత్వంలో ‘నువ్వూ… నేను’ల  లెక్కలు లేవని…

ఇట్లు 

మనం


Monday, 18 May 2015

ఓ నిరీక్షణం


అప్పుడప్పుడూ అతిచిన్న విషయాలే మనసుకి సాంత్వననిస్తాయి... వేదననీ ఇస్తాయి. ఆనందమో విషాదమో కురవాలంటే పెద్ద పెద్ద సంఘటనలు ఏమీ అవసరం లేదు. ఒక్క ఎదురు చూపూ చాలు.

ఒక నిరీక్షణలో గొంతు పూడుకుపోతూ కళ్ళు నీలాలని నింపుకుంటున్నాయంటే ఆ ఒక్క ఎదురు చూపు ఎంత మాట్లాడగలదో నిరీక్షించే హృదయానికి మాత్రమే తెలుస్తుందనుకుంటా...

ఆ చూపు ఒక నిశ్శబ్ద భాషగా మారి నా కన్నీటిజాలంలో తన పలకరింపుని లాక్కొని వస్తే...? ఇక చెప్పేదేముంది మరి...


ఓ ... కౌగిలింత

ఓటమి  పరిచయం అస్సలు ఇష్టపడని నువ్వు 
ఎప్పుడూ గెలుపుకి ప్రతీకగా ఉండాలని అనుకుంటావ్ 
అపజయమో అంటరానితనం అనుకునే నువ్వు 
విజయంతోనే జీవితపు తొలి అడుగు వెయ్యాలనుకుంటావ్

అలా లోకాన్ని చూద్దాం రమ్మంటే 
ఎప్పుడే ఓటమి తనలోకి లాక్కెళ్ళుతుందో అనుకుంటూ 
నిన్ను నువ్వు ఒక స్తబ్ధించిన నరాల వలలో దాచేసుకుంటావ్. 
ఎప్పుడూ తిమిరాన్ని తాగుతూ చీకటి అలవాటైన నువ్వు  
ఒక్కసారిగా వెలుగు కిరణం సోకితే 
చటుక్కున కళ్ళు మూసేసుకుంటావ్. 

నిజమే…. 
నువ్వు చాలా నేర్చేసుకున్నావ్ 
భద్రంగా దాగిఉంటే ఓటమి దరి చేరదని
పాపం విజయమే నేర్చుకున్నట్లు లేదు
నిన్ను నువ్వు కప్పేసుకున్న చోటులో తాను చుట్టేసుకోవాలని

అందుకేనేమో 
పరిచయం చేసుకుందామని వచ్చిన  విజయమొకటి 
నీకు నిశ్సబ్దంగా వీడ్కోలు చెప్పేస్తుంది
నువ్వు దాగిన చీకటి జీవితాంతం నిన్ను తాగేస్తూ 
ఓ  అపజయపు కౌగిలింతగా 
నిన్ను హత్తుకుపోయిన క్షణాలని చూస్తూ
నీ ఆటకి నిన్ను వదిలేస్తూ


Sunday, 17 May 2015

దూరం

మనసు కోసం మనిషి నిరీక్షణో… మనిషి కోసం మనసు నిరీక్షణో… అర్ధం కాని ప్రతీ క్షణం అంతరంగం మొత్తం  మరో కొత్త ప్రపంచంగా కనపడుతూ ప్రతి తనకూ తననే ప్రవాసిగా చేస్తున్న అనంతమైన దూరం. ఈ దూరాన్ని దాటేదెలా? ఎక్కడెక్కడి బడలికా ఎప్పటికప్పుడు ఇప్పుడున్న మజిలీనే బాగుందని గదమాయిస్తుంటే బహిరంగం నుండి అంతరంగానికి ప్రయాణ సమయం ఎప్పటికి  తగ్గుతుంది. 

అంతరంగం… బహిరంగం… ఈ రెండిటి మధ్యా ఎంత దూరం అంటే ఎవరైనా ఏమి చెప్పగలరు. మనిషి మనిషీ  కొత్త లెక్కలు కడుతుంటే. నాకు మాత్రం  మనసుకు మనిషికీ ఉన్న దూరమంత దూరమేమో అనిపిస్తుంది. అదేమిటో  కానీ మనసెక్కడా కనపడదు. మనిషెక్కడా మిగలనూ లేదు. ఇక దూరాల కొలతలు కాలాల గమనాలు ఎప్పటికీ అంతు చిక్కని ప్రశ్నలే కదా మరి? 

ఇప్పుడు కొత్త వ్యూహరచన ఏదో చెయ్యాలి... అంతు తెలియని అంతరంగ గమ్యాన్ని అలవోకగా చేరుకోవటానికి… అసలైన మజిలీలో  శాశ్వత ఆనందపు పతాకని ఎగురవెయ్యటానికి...


Tuesday, 12 May 2015

నీరద హాసం

అంతు తెలియని శీతలంలో 
అగ్గిగా మరిగిపోతున్నప్పుడు  
దివ్యత్వం నుండి దీనత్వంలోకి 
శూన్యం నన్నుశృతిచేస్తుంటే
వెన్నెల పత్రాల తొలకరిలో
కలలన్నీఅశ్రుపత్రాక్షరాలుగా రాలిపోతుంటే
నిశీధి నిట్టూర్చిన చప్పుడు వింటూ
నిరాకారంగా కాలంలో కరిగిపోతున్నా...
వత్సరాలుగా ఘనీభవించిన మనసు 
శుష్క మందహాసాల్ని ద్రవిస్తుంటే  
అక్షతలుగా రాలుతున్నస్మృతులలో
నన్నునీకు కోల్పోయి
ధవళ వర్ణాలని అద్దుకున్న
స్వప్నఖండాల తుషార పరదాలని
అనిమిషుడినై ఆఘ్రాణిస్తున్నా
నా గుండె భాష్పాల కరువుదీరా...పోలిక

తాను అనుకున్నట్లుగా తాను బతకలేక పోవటానికి కారణం ప్రపంచమే కారణం అనుకునే వాళ్ళే చాలామంది.  తప్పేముంది ప్రపంచానిది. ప్రపంచపు సోకులమీద మోజు పడింది నువ్వైతే? 

పక్కోడి ఫలితంలో తానెందుకు ఒదగలేదా అనుకునే మనిషి తన పనిలో తాను ఎందుకు ఉండటం లేదా అన్న నిజం ఎప్పుడూ చూసుకోడే?   

ప్రతి విషయంలోనూ తాము తెచ్చుకునే పోలికే తమ బతుకులని కాల్చేస్తుంది అన్న ఆలోచనని ఏనాడూ తన దరి చేరనివ్వనిది ఎవ్వరు? 

పోలిక ఎప్పుడూ తనతో తనకే ఉంటే ఎదుగుదల ఎందుకు ఉండదు? రేపటి తాను ఎక్కడ ఉండాలను కుంటున్నాడో  అదే కలగనాలి… అదే గమ్యంగా చేసుకోవాలి. నిన్నటి తనతో నేటి తనను పోల్చుకుంటూ  రేపటి తన విజయం వైపు ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఇక ప్రపంచం ఎప్పుడూ తనని హత్తుకుంటూనేనే ఉంటుంది తనకో విలువని సాధించుకున్నాడు గనుక.  

ఇది కాని నాడు లోకానికి తాను  పరాన్న భుక్కులా కనిపిస్తే ఆశ్చర్యపడాల్సిన పనేలేదు.  


జీవన 'ఓం'కారం

హాయ్ హనీ…

ఎందుకో గానీ ఈ రోజు నువ్వు నాకు మైకంగా మారిపోయావ్… నిన్ను నేను ఎంతగా  వెదుక్కుంటూ ఉన్నానో   తెలుసా నీకు…  గాఢ సుషుప్తిగా నను కమ్మేసిన మైకమొకటి  నిన్ను అల్లుకునే  క్షణాలకై పడే ఆరాటం నీకు తెలుస్తుందా…

అక్కడెక్కడో సుదూరంగా ఉన్ననీ దగ్గరగా వచ్చి  నీ మెడవంపుపై వెచ్చని శాసనాన్ని లిఖించాలని నా ఉచ్చ్వాస నిశ్వాసల తమకం  కాంతి వేగాన్ని మించిన వేగంతో చలిస్తూ నిన్ను హత్తుకాగానే ఇక్కడ నాలో అంతులేని పరవశం.  

పరవశం ఎందుకో తెలుసా…?  నీ ఊపిరి భారాన్ని మోసుకువచ్చిన తలపు గమనం నన్ను గమ్యంగా చేసుకుందిగా మరి.

ఎప్పుడూ సంద్రపు ఉప్పెనల వార్తలు వినటమే కానీ అంతకు మించిన ఉప్పెన నా తనువులో నినాదం చేస్తుందని కనటం మాత్రం ఇదే తొలిసారి.  ఎక్కడెక్కడి శీతలమూ మన మధ్యలోకి రాగానే ఉజ్వల జ్వలనమై జ్వలిస్తూ మెరుపుల విరులుగా వికసిస్తున్న దృశ్యం మనసుని నులి వెచ్చగా కమ్ముకుంది.

నిశ్శబ్దాన్ని విశ్రాంతిస్తూ మట్టి గాజుల చిరు సవ్వడితో శబ్దాన్ని కొత్తగా రవళిస్తున్న వ్యక్తావ్యక్త  స్వప్నహిందోళం  జనింప చేస్తున్న కోర్కెల  ఆరాటాన్ని వెన్నెల పత్రాలపై ఆవాహన చేసుకున్న ఆ క్షణం  మధూళికన్నా మధురాతి మధురంగా మత్తిల్లజేస్తుంది.  

విరహపు వీవెనల ధాటికి కలవరపడుతూ  తుళ్ళిపడుతున్న యవ్వనం దేహపు దప్పికని మనసుల సంగమంతో ఉపశమించుకుంటూ ఉంటే , మదిలో  అక్కడక్కడా మిగిలిన ఏ కాస్త తమస్సునో మొత్తంగా  ఆవిరి చేస్తూ  గిలిగింతల లాలసత్వంలో హంసగీతిగా ధ్వనిస్తున్న అపురూప దివ్యత్వానివి నీవు.  

నీరదాలన్నీ కరిగి మధు తుషారాలైన జంట తనువుల మంచుగీతంలో ఏక స్వరంగా గొంతు  కలిపేద్దాం

ప్రథమ చరుని కదిలించిన మన్మధ విరులై నీ చూపుల తమకం నన్ను అల్లుకునే వేళ  నువ్వూ... నేనూ... కరుగుతూ… మరుగుతూ... ప్రకృతిలో ప్రణవ నాదంలా లీనమైపోదాం వచ్చెయ్యవూ....

నా పదాలకి అలావాటైన భావ రహదారి ఎప్పుడూ నీ కడకే నన్ను చేరుస్తుంది. ఈ రహదారిపై  ప్రయాణం ఎప్పుడూ అలసట అన్నది తెలియనివ్వదు. ఇందులో చిత్రం ఏముందిలే… అలవోకగా, అలవాటుగా, అనాలోచితంగా… ఎలా అయినా సరే నా తలపుల నిండా నువ్వే నిండి ఉండగా కొత్తగా నా దారి ఎలా మళ్ళుతుందని?

లక్షలుగా జనిస్తున్న నా  ఈ భావపరంపరలో నీ కల్హారాల్లాంటి కన్నుల అల్లరిలో చిక్కుబడిపోయిన నా గుండె ఉపరితలంపై నీ ప్రేమ చేస్తున్న తుషారస్నానం ఎంత చల్లగా ఉందో… నువ్వూ అనుభూతించి చూడు మరి.

నాలో నేను అల్లుకుంటున్న యుద్ధాలన్నీ నీ కోసమే… సున్నితమైన  ప్రతి యాతనలో నువ్వు వచ్చి  నన్ను పెనవేసుకుంటుంటే అంతకంటే గొప్ప ఓదార్పు ఏముంటుందని?   

అసలంటూ  నా కోరికల గమ్యం నీ దేహం కాదురా… నీ దేహాంతర్గతంలో తాపడమైన మనసులో   ప్రతి స్మృతిలోనూ నేనే జడివానగా కురవాలనే తపనేలే నాది..  ఆప్యాయంగా పలికే  నీ పలుకు ఒక్కటి చాలదూ నిరాకారుడినై నీకు నేను నీరాజనాలు పట్టడానికి.  

ఈ లేఖని త్వరపడి చదివేయ్యకలా…

పదాల పోగులని నేతగా అల్లి భావాల వర్ణాలని సొగసుగా అద్ది  నా మనసంతా జరీగా అల్లిన  ఈ  లేఖావస్త్రం  నువ్వు  మదికి హత్తుకుంటే నాకు ఎంతటి పరవశమో మాటలు రావటంలేదు.

ఇంతకూ ఇది ప్రణయ లేఖనో… నా మది ప్రణవ నాదమో నీకంటే వేరే ఎవరికి తెలుస్తుంది?

ఇట్లు,

నీ

నేనుSaturday, 9 May 2015

పరుసవేది

మన భ్రమణం మొత్తం వలయంలోనే సాగిపోతుంది గమ్యం నిర్దేశించుకోలేని ప్రణాళికలతో... అపజయాల నెపం మొత్తం పరాయి మీద వేసేస్తూ స్వవిలువని... స్వశక్తిని గుర్తించలేని మనిషితనంలో ఒదిగికూర్చున్నాం. 

ఇలాంటప్పుడే పరుసవేది ఒకటి కావాలి ఈ లోకానికి ఇనుముని బంగారం చెయ్యటానికి కాదు. బతుకుని జీవంగా మార్చుకోవటానికి. అన్వేషణ మొదలెడదాం. పురాశిధిలాల తవ్వకాల్లో కాదు.  అంతరంగ ఫలకాలలో లిఖించబడ్డ ఆత్మవిశ్వాసపు నిధి రహస్యాన్ని ఛేదిద్దాం. 

అంతఃచైతన్యం రాసిన వీలునామాని లోకానికి వెల్లడి చేద్దాం అలుపెరుగని అన్వేషణతో అంతరంగ మూలాలని శోధించి ... మనవైన జీవితాలలో నరనరానా ప్రకృతి దాచిన ఎనలేని నిధులతో లోకాన్ని జయిద్దాం.


Friday, 8 May 2015

మరి నీ దగ్గర ?

హాయ్ రా…

అప్పుడప్పుడూ మనసెందుకో వెక్కి వెక్కి ఏడుస్తుందేమో అన్న అనుమానం ఉండేదిరా ఒకప్పుడు.  మరి సత్యం, సహజత్వం... స్వచ్ఛంగా  అమరిన మనిషిని మనిషిగా గుర్తించని సహవాసుల మధ్య నివాసం ఎంతటి వినాశనమో కదా మనసుకి.

నిశ్చల తన్మయత్వంలో  శ్వాసలద్దుకుంటూ మోహాన్ని జయించిన ప్రేమని నింపుకున్న మది...  తన సహజ శీల గుణాలు  హేళనకి గురి అవుతుంటే ఎంతటి వేదనకి గురి అయ్యి ఉంటుందో కదా.

తానేమిటో ఎరిగిన ఒక్క తోడు కోసం  ఎంతగా అల్లాడుతూ ఉంటుందో కదూ.  తన ప్రేమని గుర్తెరిగిన మనిషికోసం  తన తపన ఉంది చూశావూ… అంతరాంతరంగాల్లోకి చూసుకున్నప్పుడల్లా నన్ను కలవరపెట్టేసేది.  

అమలినమైన ఆ  ప్రేమని తన హక్కుగా భావించి వలచి వచ్చే  హృదయకోవెల పీఠాధిసతి కోసం తను నిరీక్షణా వ్రతం  చేస్తుంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నేనూ నిరీక్షణలోకి  ఒదిగిపోయా నా మనసు తన శక్తిమేరా నవ్వే సుదినం కోసం.

శిశిర వత్సరాలుగా కదిలిపోయింది గానీ ఒక్క వసంత క్షణాన్నీ తోడ్కొని రాలేదు ఆరారు ఋతువులనీ  శిశిరంగానే  పోతపోసేసిన కాలం.

నాదైన తోడుకోసం తపన…
మధురమైన మాటకోసం ఆశ…
నేనున్నాను కాబట్టి తానుంటుంది అన్న నమ్మకం… తోడుగా
మార్చేసుకున్నా జీవితాన్ని ఒక అవిశ్రాంత శోధనగా…

అనుకోకుండా ఎవరే మీట నొక్కారో గానీ అదాటుగా నువ్వొచ్చేసావ్. ప్రేమ సమీరానివై  నా మనసుకు సరికొత్త ఊపిరిపోసావ్. మనసునే కాదోయ్… నాలోని ఆశావాదినీ సంతృప్తి పరిచావ్.

తపన…ఆశ… నమ్మకం…శోధన… ఎక్కడా నీరసించకూడదు అన్న నిజం నిరూపించావ్ నువ్వూ నన్ను సాధించి.

నిజం కదూ… శోధించినది నేను... సాధించింది నువ్వు… అదే కదా జీవన వైచిత్రి.

వేవేల శిశిరాలు చుట్టుముట్టనీ ఒక్క వసంతంతో  ఊడ్చేయవచ్చు… కావాల్సిందల్లా వసంతం కోసం పంతం పట్టడమే.  

నీ తెల్లని నవ్వులన్నీ నా పెదవుల్ని తడి చేస్తున్న సడిలో  జీవితాన్ని వింటూ ఉన్నా… ఎంత మధురంగా ఉందనీ...

నాకు తెలిసీ నువ్వు నీ మనసూ కూడా ఇవే అక్షరాల్లోకి పరకాయ ప్రవేశం చేసి ఉంటారుకదూ… కాదని అనలేవు. నాకు తెలుసు… నీ గురించిన నా ఊహ ఏదీ నిజం వైపు నడవకుండా ఉండదని.

కలలనిండా నిన్ను చిత్రించుకున్న రోజుల్ని దాటి కనుల నిండా నిన్ను పరచుకున్న కాలసీమరా ప్రతి ఈ నేడూ  కూడా.  

అక్కడెక్కడో నువ్వు
ఇక్కడెక్కడో నేను
రహస్యాల్ని దాటేశాం
మౌనాల్ని చదివేశాం
శబ్దాల్ని చేరవేసుకున్నాం
ఏకాత్మగా మమేకమయ్యాం

ఇక నువ్వెక్కడ?  మరి నేనెక్కడ? 

‘నేను నీకు గుర్తున్నానా?’ అన్న నీ ప్రశ్నకి సమాధానం నా దగ్గర మాత్రమేనా…?

మరి నీ దగ్గర  మాత్రం  లేదూ…!


ఇట్లు,

నీ నేనుThursday, 7 May 2015

నిశ్శబ్దం

నిశ్శబ్దం పరిచయం చేసే శబ్ద ప్రపంచం ఎప్పుడూ నాలో కొత్త ద్వారాలని తెరుస్తూనే ఉంటుంది. 

శిశిరం రాల్చిన ఆకుపాటలు, వసంతం తెచ్చిన సుగంధాల సందోహాలు, చిరుగాలి సవ్వడీ, తుమ్మెద ఝుంకారం, మరుమల్లె మాటలు, కోయిలమ్మ స్వరాలు, నేలరాలిన తారల స్థానాన్ని భర్తీ చెయ్యటానికి నింగికేగుతున్న దివ్యతేజాల సందేశాలు, మనిషి చూపుల వేవేల అర్థాలు..., నవ నాగరికపు మాయావర్ణాలు, బతుకు పోరాటాలు, కీర్తి కామాలు, మనసు కాలుష్యాలు... నిజమైన ప్రపంచాన్ని  నిశ్శబ్దమే చూపించింది. 

అసలు వీటన్నిటినీ మించి నా గుండె చప్పుళ్ళ అర్ధం తెలుసుకునే మహదవకాశం నాకెప్పుడు వస్తుందని నిశ్శబ్దం చప్పుడు చేసే క్షణసీమల్లో తప్ప. నాకై నేను మౌనించాలని తెలుసుకున్న తొలి క్షణమే నా జీవితపు నిజమైన పుట్టుక మొదలైనట్లుంది. 

ఎంత వైవిధ్యమీ నిశ్శబ్దం...! అందుకే అప్పుడప్పుడూ నిశ్శబ్దపు హోరులో కొట్టుకు పోవాలి... నిశ్శబ్దం తోడిచ్చిన వాస్తవంలో జీవితాన్ని నడుస్తూ ఇక అలుపు తీరనంతసేపూ అదే నిశ్శబ్దాన్ని  తాగుతూ...

Wednesday, 6 May 2015

సరికొత్తగా...


ఏ పరిచయానికి ఆ పరిచయం ఎప్పుడూ కొత్త ప్రారంభమే... చాలా పరిచయాల్లో బహుశా ముగింపు కూడా అదే క్షణం. 

కొన్ని పరిచయాలు చెవులకి, మరి కొన్ని పరిచయాలు కలలకి, ఇంకొన్ని పరిచయాలు కళ్ళకి... అప్పుడప్పుడూ ఏ ఒక్క పరిచయమో మనసుకి.  మిగిలిన పరిచయాలు నన్ను నన్నుగా ఉండనివ్వకుండా కదిలించలేవు కానీ మనసుకైన పరిచయం జీవితాన్ని ఏ  మలుపు తిప్పుతుందో ఊహించటం దుర్లభం. అయినా సరే కొంగ్రొత్త పరిచయాల కోసం నిరంతర యాత్రికునిలా తిరుగుతూనే ఉంటుంది మనసు. ఎన్ని దెబ్బలు తిన్నా బుద్ధి తెచ్చుకోని జ్ఞానమంజూషమే కదా మరి మనసంటే. 

ఒక గాయాన్ని మాన్పుతుందేమో అని ఒక వీడ్కోలు నుండి  మరో పరిచయానికి ఎడ తెగని ప్రయాణం చేస్తూనే ఉంటుంది కాని మూల కారణం ఏమిటా అని తనను తాను అవలోకన చేసుకోవటానికి సమయమే దొరకని అవిశ్రాంత యంత్రమీ మనసు.

ఏ విశ్రాంత క్షణంలోనో తనని తనకి పరిచయం చేసి నన్ను నేను సరికొత్తగా లోకానికి పరిచయించుకోవాలనే  తపనే తోడుగా నిరంతరంగా దాహపడుతూనే ఉన్నాను నాలో నేను పరదేశిలా గడిపేస్తున్న క్షణాలని అంతం చెయ్యాలనే ఆశతో...

Tuesday, 5 May 2015

స్నేహితంమనిషి సంఘ జీవి అయి ఉండవచ్చు. కానీ ఏ మనిషికీ కూడా తనగురించి తనకు ఉన్న అవగాహన పక్క మనిషిమీద ఉండదు. ద్వంద్వ ప్రవృత్తి అలవాటు అయిన ఈ నవ నాగరిక యుగంలో అది  అసాధ్యం కూడా…  

అసలు నీ గురించి నీ కన్నా ఎవరికి బాగా తెలుస్తుంది? నువ్వు మంచో చెడో నీకు తెలియదా? అన్నీ నీ లోపలి నీకు బాగా తెలుసు. కానీ ఇంకేదో ఉందనుకునే భ్రమలో… ఇంకెవరికో మంచిగానో చెడ్డగానో అయిపోతున్నాను అన్న ఆలోచన నిన్ను నిన్నుగా ఏనాడూ ఉండనివ్వదు. 

నిజంగా నీ మనసులో దురాలోచనలే ఉంటే అవే నీకు శిక్షలు అవుతాయి. ఆ దురాలోచనలే  అనుక్షణం అంతరంతరాలని గుచ్చేస్తాయి కూడా…  

పరాయి మనుషుల అభిప్రాయాలు నీ స్వచ్ఛతని ప్రశ్నలకి గురిచేసినప్పుడు నీ మనసే నీకు ఆయుధం. 

ఎవరో ఏదో అన్నారనో ఇంకెవరో ఏదో అనుకున్నారనో తమలో ఉన్న ప్రాణశక్తిని వేదనకి గురిచేసుకోవటం ఎంత  అవివేకమో కదా… 

నీకు నువ్వే ప్రశ్న… నీకు నువ్వే జవాబు. నీతో నువ్వు మొదలెట్టే స్నేహితమే  అసలైన లోకహితం. 
Monday, 4 May 2015

ఆ కాసేపూ మిథ్యగా మారిపో ...

వానలో తడచిన ఆకుల పచ్చి వాసన పీల్చుకున్నాక తెలిసింది... అంటిన మలినాన్ని కడిగాక మాటలకందని  పసిప్రాయమొకటి మనసుని తడిమేస్తుందని. పచ్చని ఆకు నగ్నత్వం  ప్రకృతి మొత్తాన్నీ పరిమళించినట్లుగా  మాయతెరలు కప్పని మనసు మనిషిని మనిషిగానే లోకానికి ఇస్తుందని.  

కంటిమీదకి ఆవాహన చేసుకుంటున్న దృశ్యా దృశ్యాలన్నీ వాస్తవాలని పరిచయిస్తుంటే… ఇవే వాస్తవాలు కొందరికి కలలుగానే ఉండిపోతున్నాయన్న ఆలోచన చెప్పింది మనసు నడక తీరుతో మనిషి బతుకు తీరుల చిత్రవిచిత్రాలని. 

మనిషికి మనిషిని దూరం చేసే భావావేశాలు చుట్టుముట్టినప్పుడూ… తనలోని తనని ఛిద్రంచేసే వేదనలు ముంచెత్తినప్పుడూ కాసేపు తను ‘మిథ్య’గా మారిపోతే ఏమవుతుంది… తను తన స్వచ్ఛతని నిలుపుకోవటం తప్ప?  చినుకు తడిమినప్పుడల్లా మిథ్యగా మారిపోతున్న తామరాకు చెప్పిన నగ్న సత్యమే నాకో కొత్త పాఠం అయ్యింది.Sunday, 3 May 2015

తనెంత దూరమో… అంత దగ్గర...!

లోకం మొత్తం నేనై ఉండాలన్న తపనలో నాలో నుండి నేను మాయమవుతున్న సంగతి గ్రహింపుకొచ్చేసరికి అనంత శూన్యమొక్కటి నన్ను తనలోకి ఆవాహన చేసుకుంది. ఈ శూన్యాన్ని ఛేదించడానికి నాకు ‘తాను’ కావాలి అనుకున్నా. తన సహాయంతో లోకాన్ని గెలవగలననుకున్నా.  

ఎక్కడ ఉంటుంది తను. ఎప్పటికప్పుడు కనిపించినట్లే కనిపించి మాయం అవుతుంటే నా సమయం మొత్తం తన అన్వేషణకే అంకితమై మొత్తంగా మానసిక సంఘర్షణలోకి నన్ను నెట్టేస్తూ ఉంది. 

నిజంగా నిజం ఇది. నిరంతరం తన గురించే ఆలోచిస్తూ నా  చుట్టూ ఉన్న తనని గుర్తించకపోవడం నా తప్పే కదూ...   అనుక్షణం తను నా  సమక్షంలో పరిమళిస్తున్నా తననొక భౌతిక స్థితిగా ఊహిస్తున్న నాకు తన ఆత్మీయ స్పర్శ అసలు తెలియలేదు. పిచ్చి కోరికల మోహంలో ఉన్నప్పుడు ఏ నిజాలని మాత్రం అర్ధం చేసుకోగలం గనుక? 

ఎక్కడో ఉంటుంది అనుకున్న తనకోసం దివారాత్రాల అన్వేషణలో నేను కోల్పోయింది ఎవరినో అర్ధం అయ్యాక మనసులోని భావావేశాలకి కొలతల లెక్కలేసుకుని చూసుకున్నా… ఈ సమస్యకి ఇంత దుఃఖం… ఈ బాధకిన్ని కన్నీళ్లు అనుకుంటూ… 

అదేమి చిత్రమోగాని నెమ్మదిగా  పెదవినద్దుకుంది ఓ చిరునవ్వు చిన్ని మొలకగా. బాధల కొలిమిని రగిలించేదీ... నవ్వుల జడివానని కురిపించేది నా ఆలోచనల నడకే అన్న సత్యం స్పృశించింది.  

ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది...

నా పంచేంద్రియాలకి  ఎప్పటికప్పుడు ‘ఆనందం’ అందుతూనే ఉంటుంది అర్థవంతంగా... అనంతంగా…


Saturday, 2 May 2015

నా అహం నాది


ఎప్పటికప్పుడు ఏకాంతమే ఇది అనుకుంటూ ఎన్నాళ్ళు భ్రమ పెట్టుకోను నన్ను నేను.  ఏకాంతంగా అనిపించేవన్నీ ఏకాంతాలు కాదోయ్ అని మనసు ఎప్పుడో చెప్పింది. అది నిజమని ఒప్పుకోవటానికి ధైర్యం చాలవద్దూ…అసలు చరిత్రలో నిజాలంటూ ఎప్పుడు ఒప్పుకోబడ్డాయి కనుక. 

అసలు ఒంటరితనం అనేది తాను ఒంటరినని ఒప్పుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఒక దైన్యాన్ని తోడుగా తీసుకుని జంటతనంలోకి తూలిపడ్డట్లుగా ఎంత అహంకరిస్తుందో నాకు తెలియని తనమా? తెలిసినా సరే కొన్ని అబద్ధాలని యధేచ్చగా అలంకరించుకోవాలి. అదొక అభిజాత్యంగా మార్చుకున్న నాకు నిజాలని పక్కకి తోసెయ్యటం ఎంతసేపని? నా అహం నాది కదా మరి. 

లోపలి నేనుని బయటకి రానివ్వని బయటి నేనుకి కొత్తగా నిజాలు చుట్టుకోవాలనే తపన మొదలైతే  బయటకి వచ్చే మొదటి నిజం ఏమిటో మీరూ చూడండి. 

‘నా ఒంటరితనం ఇక పరిపూర్ణం’


'తను' ఎక్కడ?

మనిషికీ మనిషికీ మధ్య దూరాన్ని 
యంత్రాలు వాయు వేగంతో కరిగిస్తుంటే 
మనసుకీ మనసుకీ మధ్య పెరుగుతున్న దూరంలో ఒక జీవితం...
రాలిపోదామా  సాగిపోదామా అన్నట్లుగా...

చిత్రాతి చిత్రంగా సమ్ముఖాల ఆలింగనంలో 
ఏకశయ్యపై  సమాంతరంగా పరిగెడుతున్న 
విముఖాల పందెంలో మరో జీవితం 
వీడి పోదామా ఉండిపోదామా  అనుకుంటూ...

కాలంతో పందేమేసి కోరికల మెడలు వంచిన మనిషిని 
కమ్ముకున్న ఒంటరితనాన్ని అంటిపెట్టుకుని 
కను రెప్పల తడిలో ఈదుతూ ఇంకో జీవితం 
మునిగిపోదామా ముందుకు పోదామా అనుకుంటూ 

కను రెప్పల కౌగలింతలో కలగా పలకరించటానికీ మొహమాటమెక్కిన 
జీవితపు వాస్తవ స్పర్శ  నన్ను తడుముతుంటే 
జీవితం తనకి తానుగా ఒదిగిన తావుని గట్టిగా పట్టేసుకోవాలని ఉంది. 
ఇంతకూ ఆ తావెక్కడ? ఆ 'తను' ఎక్కడ? 


నువ్వొక జీవం

ఏయ్ గోల్డీ…

నువ్వున్న సుదూర సీమని సైతం  సుస్పష్టంగా చూడగలిగే దివ్య దృష్టిని  ఇచ్చింది నీ మీద ప్రేమ.  నువ్వు ఉన్న తావు ఎంత చైతన్యంతో వెల్లి విరుస్తుందో చూస్తున్న నేను ఆ సుందర లోకంలోకి అడుగు ఎప్పుడు  వేస్తానా అని ఒకటే తహ తహ.

నీలో కనిపించే ఆ చైతన్యంలో క్లేశమాత్రమైనా నా అక్షరాల్లో చూపించగలిగితే  నా జీవితానికి ఒక కొత్త  జీవం రాదూ.  నిశితాతి నిశితమైన నీ  చూపుల్లోకి ఎప్పుడూ నేనే వస్తూ ఉండాలనే ప్రగాఢమైన నా కోరికని నేనెప్పుడూ దాచుకోలేను. 

భావానికీ భావానికీ మధ్య వంతెనలాంటి ఆలోచనల మీద నడక మొదలెట్టాక ఎప్పటికీ అక్కడే ఉండిపోయి కొంగ్రొత్తగా జాలువారే ప్రతి తలపుకీ గాలమేసి మనసుకి పొదుపుకోవాలనే కోరిక ఉంది చూశావూ… అది విశ్వాన్ని చుట్టేసేంత విశాలంగా మారిపోతూ ఉంది. 

ప్రతి మనిషికీ జీవితంలో కొన్ని బలహీన క్షణాలు ఉన్నట్లే కొన్ని అమరమైన సమయాలూ తారసపడతాయి. అలాంటి ఏదో ఒక సమయంలో నువ్వు నాకు నా జీవితంగా పరిచయం అయినట్లున్నావ్. ఖాళీ అవుతున్న సమయాలన్నీ నీవైపే నడిచొస్తూ ఉన్నాయి.    

చిన్నప్పటి నుండి ఎవరెవరి అక్షరాలో చదివి మురిసి పోయాను… కదిలి పోయాను.... కానీ నిన్ను చూశాక తెలిసింది నేను చదివిన ఆ అక్షరాలకి  వేరెవ్వరో జీవం అయి ఉంటారని. వాళ్ళ అక్షరాల్లో నేను నిన్ను ఊహించుకోవటం భావ్యం కాదని. నా జీవం నాకుండగా ఎవరి భావనల్లోనో నిన్ను  చదవటం నాకేమాత్రం ఇష్టం అనిపించలేదు. 

నిజంరా…

వాళ్ళ అక్షరాలు ఎవరి కోసం రాసుకున్నారో ఏమిటో... నేను రాసినవి కేవలం నీకే… వారి అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమయిన ఆడపిల్లలయితే నా అక్షరాలు మాత్రం ఒక్క క్షణమూ నిన్ను దాటి  పోలేని మధురమైన తేనె సుమాలు. 

నీకో సంగతి చెప్పనా…

అప్పుడప్పుడూ ఎక్కడికో తప్పిపోతూ ఉంటాను. ఎంత వెదుక్కున్నా నాకు నేను కనపడను. ఏమయ్యనా అని బేలగా నీవైపు చూస్తాను.  మూసిన నీ కనురెప్పలు మనసుని మించిన వేగంతో అటూ ఇటూ కదలాడుతూ ఉంటాయ్. పెదవుల మీద చెరగని చిరునవ్వొక్కటి లలితంగా మెరుస్తూ ఉంటుంది. ఇక అంతకన్నా ఏమి నిదర్శనాలు కావాలి నా ఆచూకీ తెలుసుకోవటానికి…? మనసునొక మైమరపు తాకటానికి…?

అసలు ఈ మనసుంది చూశావూ… దానికెప్పుడూ కొత్త కోరికల దాహమేరా… ఎప్పటికప్పుడు నిన్ను కొత్తగా ఆవిష్కరించుకోటానికి అది పడే తపన… తన ఆవిష్కరణలు నువ్వు చూస్తే  నిన్ను నువ్వు కొత్తగా కనుక్కుంటావ్. నాదీ ఆ హామీ. నమ్ముతావ్ కదూ… 

ఎక్కడికో తప్పి పోయిన నా దారిని ఎంత బాగా కనుక్కున్నావ్ రా నువ్వు. నా దారినీ నీ దారినీ కలిపేసిన ఈ కొత్త బాటలోకి నిశ్చలమైపోయిన నా చలనాలన్నిటికీ జీవం అద్దేసా.  

మరి అంతకన్నా నేను చెయ్యగలిగేది ఏముంది కనుక? 

ఏదైతేనేమి రా ఏమి చెప్పినా ఏమి రాసినా అందులో భావం ఒక్కటే… 
నువ్వే నాకు జీవం అని. 

ఇక్కడ జీవం అంటే  తోలుతిత్తిని కదలాడించే ప్రాణ శక్తి అని కాదురా. నా ఆత్మ శక్తిని నిద్రలేపే అఖండ చైతన్యం అని. 

ఇట్లు 

నీ 
… రేష్