శతాబ్దాలుగా
తమ ఆచూకీని
భద్రపరచుకున్నామనేమో...
ఈ నీడలున్నాయే
వీటికి చాలా గర్వంగా ఉండేది
మిట్టమధ్యాహ్నపు
తెల్ల చీకట్లో దాక్కుని
తాము దాచిన రహస్యాల చిట్టాని
ఎండమావుల జాలంగా
మన కళ్ళ మీదకి విసురుతూ
దాగుడుమూతల ఆటలు ఆడుతూ
అరికాలి క్రింద
నల్లటి ఉద్యానవనాలై
చల్లదనాన్ని పూస్తాయి
కాసిని నీడలకి ఊతమిచ్చిన చక్రవర్తిని
అజరామరం చేసిన చరితని
చదివి కూడా
మధ్యాహ్నాన్ని
అనంతం చేసుకుంటున్న
మనిషి ఎదుట...
తనని తాను
అవనతం చేసుకుంటున్న
ఆలాపన తీసేదెవరు















