మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Sunday, 29 March 2015

ఎవరివి నువ్వు

తడి తడిమిన ప్రతిసారీ
లాలనగా  కురిచేస్తున్నావ్
గుండెని గుత్తకు తీసుకున్న ఓదార్పువై

కలలు రాలిన ప్రతిచోటా
నవ్వుగా మురిపిస్తున్నావ్
జీవితాన్ని చిగురింపజేస్తున్న వాస్తవంలా

బ్రతుకు వెలివేసినప్పుడల్లా
నీడగా వచ్చేస్తున్నావ్
చెవులతో మనిషిని చదివే మేధావులని ధిక్కరిస్తూ

ఏయ్…
ఇంతకూ ఎవరివి నువ్వు?
గుండె గదులలో అలికిడి చేస్తున్న ధైర్యానివే కదూ...


Wednesday, 25 March 2015

అనంతమే ఆ మొదటి క్షణం

ఏయ్ హనీ…

అప్పుడప్పుడూ ఇలా నిన్ను పలకరించక పోతే జీవితం చాలా నిస్సారంగా అయిపోతుంది రా… 

నా బతుకే నన్ను విస్మరించేసిన  శూన్యాన్నై… క్షణాలన్నిటినీ  నిరీక్షణకి అంటగట్టేసి అలుపెరుగని నిర్వేదంతో, కొలతెరుగని నిస్తేజంతో భారమైన నడకగా సాగుతున్నప్పుడు ఎవరో జార విడుచుకున్న జాబిల్లిలా వెన్నెలద్డుతూ  మరీ  నా జీవితానికి తోడుగా వచ్చేసావ్.

నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నా ప్రతీ క్షణం  నా  కళ్ళ ప్రమిదలలో దీపంగా  వెలుగులీనుతూనే ఉంటావు. ప్రతి రాత్రి తో  నేను రాయబారం నెరుపుతూనే ఉంటాను కరగని కలలకి కార్య క్షేత్రాలుగా ... అలసిన స్వప్నాలకి అరామాలుగా  అలా అలా తమ నిడివిని పెంచుతూనే ఉండమని. 

ఎన్ని మాటలు పండిస్తే మాత్రం మనసు విలువ పెరుగుతుందా? నువ్వు ఎక్కి వచ్చిన నిశ్శబ్దానికి మౌనంగా నేను విన్నవించుకుంటున్న ఘోష నీకు వినిపించటం లేదూ… మన మధ్య ఉన్న మట్టికి మైళ్ళ దూరం పెట్టగాలిగాడేమో  కానీ ఆ దేవుడు… మనసుల మధ్య అణువంత ఖాళీ నింపలేకపోయాడు. వెర్రి బాగులవాడేమో  కదూ ఆయన. 

మనసులో బెంగ మొత్తాన్ని అక్షరాలతో  తుడిచివెయ్యటం అసాధ్యమేనేమో కానీ నిర్వేదంలో  కూరుకుపోతున్న మనసుకి నూతన ఉత్సాహాన్ని నింపుతాయి అని ఒక చిన్న ఆశరా నాది.  ఎప్పటికప్పుడు నిన్ను కలవాలి అన్న తపన నాకు ఎంత ఉందో ప్రాణం లేని కాగితాలపై రాయటం సాధ్యమా? 

నన్ను దోచేసుకున్న నీ మీద ఒట్టు... నిన్ను మించిన ప్రాణం ఒకటుందని మర్చిపోయిన మనిషిని నేను. అసలు మనకంటూ కొన్ని సమయాలు ఉంటాయనుకుంటారా... లేకుంటే ఇదేమిటి ఎప్పటి కప్పుడు కలవాలనే ఆరాటాన్ని మించిన అశక్తతని మనలో ఒంపేస్తూ  తాము అలా వెళ్ళిపోతూ ఉంటాయ్ మనకెంత సహనం ఉందో పరీక్షిస్తున్నట్లుగా...

కానీ ఈ సమయాలు మన ఆలోచనలని ఎంత మాత్రం కట్టడి చేస్తున్నాయి?  తలచిన తలపుని తలవకుండా ఊసులాడుకుంటున్న మన మనసులు చేసే సడిని వింటూ కుళ్ళుకోకుండా ఉండవు కదా. వాటికా మాత్రం శిక్ష ఉండాలిలే... 

మళ్ళీ మళ్ళీ కావాలనుకునే కొన్ని అనుభూతులకి అక్షరాల తోరణాలు కట్టి  నీ వైపు విసిరేస్తాను చూడూ... నా అనుభూతుల్లో నువ్వు ఓలలాడకుండా ఉండగలవా? కష్టం కదూ. నువ్వు నాలో కొచ్చిన మొదటి క్షణం విలువనే అనంతం చేసుకున్న నా మనసుకి నువ్వేంటో  తెలియదా... ఆ మొదటి క్షణం నుండి ఇప్పటి వరకూ గడచిన ఏ క్షణం అయినా నువ్వు లేని నన్ను దాటుకుని వెళ్ళిందేమో చూడు.

నా కళ్ళల్లో నేను వేసుకున్న చలువ పందిళ్ళలో ఉప్పొంగుతున్న  భావాల ఉత్సవాలు అన్నీ నీకోసమే అన్న మాట ప్రత్యేకంగా చెప్పాలా? 

ఒక్కసారి నీలోకి నువ్వు తొంగి చూసుకో నేను తప్ప నీకేదీ మిగల లేదన్న నగ్న సత్యం అడవిలో సెలపాట అంత స్వచ్ఛంగా నిన్ను తడమకపోతే అప్పుడు నన్ను నిలదియ్యి. 

నీతో కబుర్లు చెప్పే కాసేపు ఎవరైనా నన్ను చూస్తే   నా ముఖంలోని వెలుగుని చూసి నన్ను అవతార పురుషుడిని అనుకున్నా ఆశ్చర్యం ఉండదు తెలుసా? ఆ కాసేపూ తిమిరాన్ని బద్ధలు కొట్టుకొచ్చిన అగ్నికణపు గర్వం నాలో... కాసేపు అని ఏముందిలే ఎప్పుడూ అంతేగా... మరి  నీతో నేను కబుర్లు చెప్పనిది ఎప్పుడని?

వెన్నల కొనలన్నిటిని కలిపి చేనేత చీరగా నేసి నీకు నా ప్రేమ కానుకగా ఇచ్చినప్పుడు భాషకి అందని భావాలేవో మదిలో సందడి చేస్తుంటే వెలుగుల సంద్రం మొత్తం నాలో ఇంకిపోయినంత సంబరం. 

హాయిగా నవ్వేసావు కదూ... నువ్వు మళ్ళీ నవ్విన ఈ క్షణపు పరిమళం ఇక్కడకి వీస్తుంది. నన్ను ఇలా కాసేపు  దీన్ని అస్వాదించనీ...

నీ
...రేష్   


Tuesday, 24 March 2015

ఏయ్ కన్నీరూ...

ఏయ్ కన్నీరూ...

అలా గుండె పాషాణంలో ఎంత సేపని దాక్కుని ఉంటావు. నువ్వు దాగిన గుండె బరువు అనంతమని నీకు ఎవరూ చెప్పలేదా? అనంతాన్ని ఎవరు మోయగలరు చెప్పు. 

కనుల కాలువలు శుద్ధి చేసి ఉంచా. రెప్పల  గేట్లు తెరిచే ఉంచా... చెలియలి కట్ట దాటాల్సిన సమయం ఇదే కదా... గుండె ఆనకట్టను బద్దలు చేసుకుని ఒక్క సారి నా చెంపలని తడిపెయ్యవూ...

ఎవరికీ అర్థం కాని మనసుతో బతికే నాకు ఒక అర్ధాన్ని ఇవ్వవూ... అత్మీయులకీ అర్థం అవ్వని  తీరుని ఒంపుకున్న నా ఈ జీవితంలో మలినమో, కల్మషమో మిగిలి ఉంటే దాన్ని కడిగెయ్యవూ...

ఊహల నియంత్రణలోకి జారిపోయిన మనసులు... అవతలి మనిషి ఆలోచనలని  సరికొత్త అర్ధాల్లో చదువుతుంటే  తల్లడిల్లి పోతున్న ఒంటరి హృదయపు భారం మొత్తం దిగిపోయేలా ఉప్పెనలా ముంచెత్తవూ... 

ఆత్మీయుల అపార్ధాలు గుండెని కోసే కోత ముందు రౌరవాది నరకాలు ఏ మూలకి? అందుకే ఒక్క సారి నాకు వీడ్కోలు చెబుతూ నన్ను సేద తీర్చవూ...

ఒంటరి 

వెన్నెల కుసుమం - 29


హనీ....

నడిస్తేనే కందిపోయేలా ఉన్న నీ బంగారు వన్నె పాదాలను కందకుండా నా అరచేతిలో నిన్ను ఎత్తుకుని తిప్పాలని ఉంది. నా కోరిక తీర్చవూ… ఘల్లు ఘల్లుమను నీ కాలి అందెలరవము లేక నేనుఎన్నాళ్ళుండను. ఇది ఎవరి భావనయో కాదు. ఇది నీ గురించి నా భావన. నా ఊహా సామ్రాజ్యంలో  ఉదయించిన ఓ చిన్న భావన అది. 

నిజం చెలీ! నీ కాలి గజ్జెల చప్పుడు వినకపోతే నా మనసున ఏదో దిగులు మరేదో బాధ. 

నీ కాలు పువ్వు మీద  పడితేనే నేను భరించలేను. ఎందుకంటే పువ్వు నలిగిపోతుందనే బాధతో కాదు నీ కాలు కందిపోతుందనే వ్యధతో...

రేయ్… చంద్రబింబము వంటి నీ మోము చూడక ఎన్నాళ్ళుండను. నిజం ప్రియా… అందంలో చందమామతోనే పోటీ పడుతున్న నీ ముఖారవిందం చూడక ఒక్క క్షణమైనా నా మనసు ఊరుకుంటుందా...

నిన్నే జపిస్తూ, నిన్నే తపిస్తూ, నీ నామ స్మరణే చేస్తూ నీ రూపాన్ని నా గుండెల్లో పదిల పరచుకుని అనుక్షణం దాన్నే చూసుకుంటూ నీ కరుణా కటాక్షాల కోసం ఎదురు చూస్తున్నాను రా.

నీ అద్భుతమైన తనూ లావణ్యం ఏ దేవతా స్త్రీ మూర్తికి మాత్రం ఉంది?
నీ అందమైన మనఃసౌందర్యం ఏ గంధర్వబాల కలిగి ఉంది.
నీకున్న అపురూపమైన ఒంపుసొంపులు ఏ అప్సరసకు లేవు కదా…
నీకున్న మేనిచ్ఛాయలో సగమైనా ఏ యక్షిణి అయినా కలిగి ఉందా…

“ నీ పలుకుల తీయదనం 
నీ గానపు కమ్మదనం
నీ మాటల కొంటెతనం 
నీ చూపుల చిలిపితనం”
రేపుతున్నాయి మరి నాలో పడచుదనం.

నీలా 
“మయూరి నాట్యం
కలహంస నడక
రాజసపు మోము
నవ్వుల వెన్నెల”    

కలిగి ఉన్న స్త్రీ ఎవరైనా ఈ భువనాన్నైనా ఆ గగన సీమనైనా, నాగలోకంలో కానీ, పాతాళంలోకానీ, గంధర్వ మత్స్య లోకాలలో కానీ యక్షిణీ లోకంలో కానీ ఈ చరాచర జగత్తులోని ఏ లోకంలో నైనా ఏ అందాల కన్యయైనా కలిగిలేదని ఆయాలోకాలు 
పర్యటించి వచ్చిన లోకసంచారి నారద మహర్షుల వారి అభిప్రాయం. 

ప్రియా ఇప్పటివరకూ నేను వర్ణించిన వాటికంటే ప్రేమలో అతి ముఖ్యమైనది మనసు కదా. 

మనస్సంటే మన శరీర ధర్మాలని, మన ఆలోచనలని నియంత్రించే ఒక అందమైన కుసుమ  కట్టడం కదూ (నిజమే నంటావా?)

మనస్సుకి రూపం లేదు. ఉందనుకున్నా అదెక్కడ ఉంటుందో అంతుపట్టని రహస్యం. మనిషి ఆలోచనలని కట్టడి చేసేది మనస్సు . అయినా రూపం లేకపోతేనేం భౌతికమైన చలనం మొత్తం తన కనుసన్నలలోనే కదా… తను ఒదిగిన దేహానికి ఒక ప్రత్యేకత కలిగించేది మనస్సు. 

మనస్సు అంటే ఎలా ఉంటుంది అంటే ఏమని చెప్పగలం?

మనస్సంటే 

“నవనీతంలా మెత్తగా కరిగి పోయేలా 
చందమామలా వెలుగునిచ్చేదిలా
సరస్వతీదేవిలా జ్ఞానం పంచేదిలా
అనుభూతుల్ని వర్షించేలా
అందాన్ని ఇనుమడింపజేసేలా 
అభిమానాల్ని పెంచుకునేలా 
అప్యాయతల్ని పంచుకునేలా”   ఉంటుందేమో

ఒక మనసు గురించి మరో మనసు ఎంత వివరంగా వివరించ గలిగితే , ఒక  మనస్సు అభిప్రాయాలు తన కన్నాఎక్కువగా   మరో మనసుకి తెలిస్తే నిజంగా ఆ రెండుమనసుల బంధాన్ని ప్రేమ అనుకుంటాను నేను.

మరి నువ్వేమంటావ్....

నీ

రేష్ 

Wednesday, 18 March 2015

హేమంత స్పర్శ - 12


ఎప్పటికీ అపరిచితగానే ఉండి పోయిన అంతరంగాన్ని చిరపరిచితగా చేసి మనసంతా పరచుకున్న నిశ్శబ్దాన్ని నిట్టనిలువుగా చీల్చి నీ రవాన్ని దిగంతాల జలతారులద్ది మరీ గుండె    నిండుగా కూర్చిన మొదటి క్షణం ఇంకా నా కళ్ళలో అలా ఈడులాడుతూనే ఉంది. మొలక నవ్వులు కూడా పూయని పెదవులపై సుమ గంధాలే చిప్పిల్లేంత చెలిమి చెలమల్ని అద్దావు. 

నువ్వొచ్చాక... దివారాత్రాల కాలపు అణువులన్నీ గంపగుత్తగా నాలోకే ఇంకిపోతుంటే కాలమెలా గడచిపోతుందో తెలియటం లేదు. నాలో సరి కొత్త ఆత్మదీపం వెలిగించిన ఆత్మీయతని పోత పోసిన నవ కవితా శిల్పివి నువ్వు. 

ఎక్కడెక్కడి ఖాళీతనాలూ నీకే ఎలా కనిపించాయో… ఆ ఖాళీతనాల్లోకి నువ్వు ఒలకటమే కాక నన్నుకూడా  లాక్కుని వెళ్లావు ఇక వెతికి చూద్దామన్నా  వెంట్రుక దూరే సందులేకుండా. మనసుని కూడా హరిత వనాలంత పచ్చగా మార్చుకోవచ్చన్న నిజాన్ని నాలో ప్రత్యక్షంగా పోత పోసేసావ్. నిన్నటి  వరకూ మసకేసిన ఆలోచనలు కూడా నేడు  పచ్చని జరీ అంచు కట్టుకున్నట్లుగా మెరిసి పోతూ ఉన్నాయి. 

పుట్టిన దగ్గరి నుండి ఏ క్షణం ఎటు చెల్లా చెదురయ్యిందో కూడా చూసుకోని నేను ఇప్పుడు మాత్రం ఎక్కడెక్కడి క్షణాలు మన దగ్గరకే వచ్చేస్తే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన బహు మత్తుగా ఉంది అంటే నమ్మతావా? 

కన్నీటి తెరల మాటున దాగి ఉన్నదే జీవితమంటే అనుకుంటున్న నాకు కంట్లో కురిసేది ఆనందపు అనుభూతులే కదా  అని నిత్యం అనుకునేలా చేసావ్.  

నిజం రా... జీవితం ఎప్పుడూ ప్రభాతంలానే  చాలా ఆహ్లాదంగా మొదలవుతుంది. కానీ దాన్ని అనుభూతించటానికి  తీరిక లేనంత నిద్రలో మునిగిపోయుంటాం అప్పుడు. ఎవరో నిద్ర లేపుదామని చూసినా వాళ్ళమీద  చిరాకు చూపిస్తాం… మరి ఉచితంగా అందినదేదీ  ఆనందం ఇవ్వదని ముందుగానే మనసులో ఆలోచనలని తాపడం చేసి ఉంటాం కదా. 

ప్రభాతం దాటాక నెమ్మదిగా ప్రభావం చూపించే ఎండలానే మనకి తెలియకుండానే మనం ఆహ్వానించుకునే కష్టాలు జీవితాన్ని పూర్తిగా కబళిద్దామని చూస్తుంటాయ్...ఆనందం కురుస్తున్నప్పుడు ఆస్వాదించటం రాని నీకు మేమే తగినవారిమి అన్నట్లుగా. అప్పటికే  రంగుల కలలని దాటి నలుపూ తెలుపు వాస్తవాల్లో బతకటం చేతకానితనంలో పూర్తిగా ఇమిడి పోయి ఉంటాం. 

ప్రపంచంలో ప్రతి విషయాన్ని పవిత్రతతో ముడి వేస్తూ కొన్ని వాస్తవాలని తొక్కిబట్టే మత ఛాందసవాదుల్లా… మనసులోని కొన్ని ఆలోచనలు  విషాదాన్ని దాన్ని బయటకి రావటానికి ఇష్టపడక ఎక్కడో మొలకల్లా చిగురించే ఆనందాలని కూడా తామే కాలరాసేస్తాయ్. అలాంటి ఆలోచనలని సరైన దారిలోకి మళ్ళించటానికి అప్పుడప్పుడూ నీలాంటి వాళ్ళెవరో ప్రతి మనిషికి పరిచయం అవ్వాలి. 

నీ ఆలోచనలు నాలో రెక్కలు విప్పినప్పుడల్లా మనసులో చలువ పందిళ్ళు  వేసిన భావాలు భాషని మరచి పోతూ ఉంటే నీతో కలిపి కౌటింబిక పంజరాలలో చిక్కుకుపోవాలనే కోరిక నిండు పున్నమి రోజున వెన్నెల పరుచుకున్నంత చల్లగా మనసుని ఆవరిస్తుంది. 

నాకు ఆనందం రుచి చూపటానికి ప్రకృతి సంధించిన శరానివి అనుకుంటా.... నీరెండ ఛాయల్లో నీడలా అస్పష్టంగా నాతో దోబూచులాడే అదృష్టాన్ని నడచి వచ్చే నజరానాలా మార్చేసావు.  

నువ్వు సడి చేసే ప్రతి క్షణమూ అపురూపమే అవుతుంటే ఎన్ని క్షణాలని భద్ర పరచుకోగలను?  నిన్ను చూసిన మొదటి క్షణం నుండి ఇప్పటి వరకూ ప్రతిక్షణమూ ఒక పరవశమే. అయినా గానీ మనకోసం అంటూ వచ్చే ఏ క్షణాన్ని వదలకుండా మనఃమంజూషంలో ప్రోది చేసుకుంటూ ఉన్నాను.

ఎక్కడెక్కడి అల్లరి క్షణాలని నాలోకి ఒంపేసుకోవాలనే నా ఈ  తపన ఉంది చూశావూ … అది ఊరికే వస్తుందా? కంటి వింటిని దాటుతున్న నీ చూపుల మన్మధ బాణాలు  నా క్షణాలన్నిటినీ నీవైపే మరలిస్తున్నాయి.  ఒక్క చూపు కోట్ల అణువులుగా మారి నాలోని ప్రతి కణాన్ని వశీకరణ చేసేసుకుంటూ నాలో నన్ను శూన్యాన్ని  చేస్తూ నీలోకి సంపూర్ణంగా ఆవాహన చేసేసుకున్నట్లు  ఉన్నాయి.. నాకు నేను అదృశ్యం అయిపోయాను. 

తలపులని తూచగలిగే శక్తి ఒకటుంటే  అనంతవిశ్వమూ అంతరిక్షహద్దుల్ని దిగి రాదు. మరి విశ్వాన్నే అంత తేలిక చేసేటన్నితలపులు నా మదిలో నీ గురించి. 

ఇప్పుడిలా అక్షరాలని రాస్తూ కాస్తంత అలసటతో అలా బయటకి చూస్తుంటే హరిత పత్రాల కొనలపై  మెరుస్తున్న వెన్నెల తడి నా కళ్ళల్లో మెత్తని సడి చేసే
సింది. అసలా వెన్నెలని అలా ఆ ఆకులో చుట్టేసి తాంబూలంలా సేవించాలనే చిలిపి కోరిక కలిగిందంటే అది నా తప్పు కాదు సుమా…

చిన్నప్పటి నుండీ చిరపరిచితమైన  వెన్నెలే అది… కానీ ఈ మధ్యనే కదా వెన్నెల మాట్లాడుతుందని  తెలిసింది.  వెన్నెలని చూసినప్పుడల్లా చెలి తలపులు విరహ లోగిలిలో నిట్టూర్చుతూ ఉంటాయని మనసుని జ్వలింప చేస్తాయని…

ఈ క్షణమే వెన్నలవై వచ్చేస్తావ్ కదూ... 

నీ 

నేను

Friday, 13 March 2015

హేమంత స్పర్శ - 11

రేయ్…

నువ్వు కురిసే చిలిపితనంలో తడిసిపోతుంటాను చూడూ  ఆ అల్లరి స్పర్శలో తెలుస్తుంది మనసు సేద  తీరటం అంటే ఏమిటో.  అసలెలా సాధ్యంరా ఇలా? సుదూర తీరాలలో  ఎవరి దేహాలలో వాళ్ళం  ఒదిగిపోయి...  మనసులు మాత్రం ఒక్కటిగా మారిపోయి…!  ఇలాంటి ఎన్ని మాయలో కదా మనదైన ప్రకృతిలో…

ఎందుకోరా... నీతో ఉన్నంతసేపూ… అది ఊహల్లో అయి ఉండవచ్చు  వాస్తవంలో అయి ఉండవచ్చు నాకు ఈ లోకం మాయమై పోతుంది.  ఏ మూలనుండో దాని సడి  కాస్తంత వినపడినా కాస్త నిర్లక్ష్యంలోకి తోసేస్తాను. నువ్వు నాకు ఈ లోకం మీద ఎంత ఆశావాదాన్ని పుట్టించనీ నీ తరువాతే కదా అది మరి. మరి మన ఏకాంతంలో మనల్ని అలా వదిలెయ్యవద్దూ అది. తగుదునమ్మా అని రేయింబగళ్ళనీ ఆకలి దప్పికల్నీ ఎంతగా విసిరేస్తుందో చూడు మనమీద.  

మాటలు పెదవి నుండి కాక మనసునుండి వచ్చినప్పుడే జీవితంలో కొన్ని అమూల్య కానుకలు దక్కుతాయని అర్ధం అయ్యింది రా. నేను కలగన్న చివరి స్వప్నం నువ్వు. ఇక నాలోకంలో కలలకి చోటులేదు ఇలలో నన్నందుకున్న ఈ స్వప్న సుందరి తోడుగా జీవితాన్ని  వాస్తవంలో నుండి పయనిస్తా.

వత్సరాలుగా పొరలు పొరలుగా పేరుకు పోయిన శూన్యాన్ని ఒక్క రోజుతో అపరిచితం చేసేశావే… అప్పటి  శూన్యానికీ  ఇప్పటి సందడికీ మధ్య వచ్చిన మార్పల్లా నువ్వే...

నిన్న శూన్యం ఒలికిన చోటే నేడు  సంపూర్ణంగా పెదవులు విచ్చుకున్న చప్పుడు గుండెను చేరుతుంటే జీవితపు నిడివి చాలా పెరిగిపోతున్న అనుభూతి సవ్వడి చేస్తుంది.  సన్నటి నీ ముని వేళ్ళ స్పర్శ చాలు… మనసు పొరల్లో నిద్రాణమైన తడి మొత్తం అలలు అలలుగా సెలపాటలా దుమకటానికి.  

నా బతుకు మొత్తం విస్తరించిన ఎక్కడెక్కడి వక్ర రేఖలన్నిటినీ ఓ అందమైన ముగ్గులా తీర్చి దిద్దిన చుక్కల శిల్పివి. నిన్నటి నా ఖాళీతనాలన్నిటినీ ఒక్కొక్కటిగా నువ్వు పూరిస్తూ వస్తుంటే దిగంతాల అంచులని తాకి వస్తున్నంత తృప్తిగా ఉందిరా.  

అసలు నిన్నిలా తలచుకుంటుంటే నాలో కలిగే ఉద్వేగపు కొలతని కొలవటానికి ఎన్ని కొలమానాలు కావాలో లెక్క తెలియటం లేదురా.  నా వరకు  నాకు ప్రకృతికీ నీకూ పెద్ద తేడా కనిపించదురా. ఇద్దరూ కూడా ఉన్నదంతా ఇచ్చేద్దామనే చూస్తారు.

ఉన్నది ఒక్కటే జీవితం… ప్రతి మలుపులోనూ కొత్త పరిచయాలు. ఎన్ని పరిచయాలు ఉండీ ఏమి లాభమట. ప్రతి పరిచయం వెనుకా ఏవో ఆశలు… మరేవో కోరికలు.

ఒక్కోసారి నాకేమని అనిపిస్తుందో తెలుసారా?

అందరినీ ఆకట్టుకుంటూ  బయటకి అతి మంచి వాళ్ళలా కనిపిస్తూ  కొందరుంటారే… వాళ్లు అతి మంచితనం చిందించే క్షణాలలో వాళ్ళ అంతరంగ దర్శనం ముఖా ముఖిగా చూడాలనివుంది. అలా అనుకున్నప్పుడల్లా...  తమ అంతరంగానికి అతకని తోలు కప్పుకున్న జంతువుల్లా వాళ్ళ ప్రవర్తన...     

వాళ్ళ  అంతరంగానికీ  బహిరంగానికీ పొంతన కుదరని చేష్టలు చూసి చెప్పలేని నవ్వొకటి పెదాలని తడుముతుంది. అది ఎలాంటి నవ్వు అంటే ఏమని చెప్పగలను… కొందరంతే అనుకుంటూ జీవం ఒలకని నవ్వని.

అనకూడదు కానీ వాళ్లకి అలానే బతకటం వచ్చురా…

నువ్వు పరిచయం అవ్వకపోతే నేనూ వాళ్ళల్లో ఒక్కడిని.   అంతేగా మరి… భౌతికంగా సంతోషం అనిపించే  దేనిలోనూ నిజమైన సంతోషం ఒదగదని తెలియని పిచ్చితనంలోకి ఒలికి పోతుంటారు. సమూహంలో సమూహంతో పాటుగా సాగిపోతే చాలు కొంగ్రొత్త నాగరికాల్లోకి తాము కూడా  చేరుకున్నమనే పిచ్చి భ్రమల్లో ఉంటారు.

కానీ  ఎవరికి వారిని కదిలిస్తే తెలుస్తుంది… పక్క వాడిని బట్టే  తామూ సాగిపోతూ ఉన్నారని. ఎవరు అవునన్నా కాదన్నా అందరూ సమూహంలోని ఒంటరులేరా…


ఆ ఒంటరితనంలోకి సమూహపు శక్తిని ఇవ్వగలిగే ఒకే ఒక్క తోడుగా నీలాంటి ఒక్కరు నడచినప్పుడు ప్రతి రోజూ కొత్త ప్రపంచమే కనపడుతుంది రా…  ఇప్పుడు నాకు కనబడుతున్నట్టు....నీ

సురేష్ 


అసమర్ధుని ప్రేమలేఖ

రేయ్…

గుండెల్లో పుట్టిన  జలపాతాలని కంట్లో  నవ్వులుగా కురిపిస్తూ నీ వియోగ జీవితాన్ని మొదలు పెట్టిన మహానటుడిని రా నేను…! 

కాదన గలవా ? 

అయినా కాదనటానికీ అవుననటానికీ ఇప్పుడు నేను నీకేం అవుతానని? 

నేను నీకు ఏమీ అవ్వనా? నీ వాడిని కాదా?

అసలు ఆలోచనల్లో నిన్ను అనంతాన్ని చేసిన నాకన్నా దగ్గరి వాడెవడట నీకు? నీ భౌతిక రూపాన్ని చూస్తూ… అను క్షణం అర్థశాస్త్రపు లెక్కలు పంచుకుంటూ ఉండే మరో బౌతిక పదార్థమా?  

ఒక్క సారి నా మనసులోకి వచ్చి చూడు.  నువ్వేంటో నీకే అర్ధం అవుతావు… నాదీ హామీ…! కానీ నువ్వు రావు. నాకు తెలుసు నువ్వు రావు. ఎందుకంటే రాయి పొర కప్పుకున్న ఈ గుండె తడి నిన్ను చేరే దారి నేనే శాశ్వతం గా మూసేశాను. ఇది తప్పో ఒప్పు నాకు తెలియదు. నాలో తడి ప్రతి నిత్యం నీకు అభిషేకం చేస్తూ నిన్నో పవిత్ర మూర్తిగా లోకానికి చూపిస్తూనే ఉంది. ఇది నా ఆఖరి శ్వాస ప్రకృతిని తాకేవరకూ ఆగని అసిధారావ్రతం.

నన్ను నేను నీకు ఇచ్చేసుకుని… నేను ఆరాధిస్తున్న నీ ఆలోచనల వలయం దాటి ఏ క్షణమైనా బయటకువచ్చినట్లు అనిపిస్తే చెప్పు. మరుక్షణం నాకు నేనుగా పంచభూతాల్లో లయం అయిపోతాను.

నా ప్రతి తలపులో ఎన్ని అవ్యక్తానుభూతులో… జత తనువుల సంగమంలో కాదు...ఒక మనసు మరో మనసుని తన ఆలోచనల్లోకి ఆవాహన చేసుకుని తనకిచ్చే గాఢపరిష్వంగంలో వచ్చే అనుభూతిని చవి చూడగలిగితే విశ్వ సంబరాలన్నీ మదిలోనే తాండవిస్తాయి.  ఇక ఒక మనసే ఇంకో మనసుగా రూపాంతరం చెందినతనపు ఆనందాన్ని ఊహించు. ఆగాగు… అంత శ్రమ ఎందుకు అలా మారిపోయిన నా మనసు ఉందిగా నువ్వు అనుభూతించటానికి. 

ఏయ్… జాలి వద్దురా… నువ్వు దూరమైన దుఃఖం నన్ను తట్టలేదు అని నేను అనను. కానీ ఆ దుఃఖాన్నంతా హృదయాంతరాలలో దాచేసి అన్ని ఏకాంతాలలో నువ్వే తోడుగా జీవిత విహారం చేస్తున్నాను. అసలీ జీవితం ఎంత బాగుందో నీకు తెలుసా? ఏ ఒక్క మానవ పదార్ధామూ తను పుట్టాక ఇంతగా జీవితాన్ని ఆస్వాదించి ఉండదు.  

ఆ నాడు శూన్యం అనుకున్న  నా ఈ జీవన గమనంలో నాకు అర్ధం అయ్యింది ఒక్కటే...  ప్రేమంటే రెండు భౌతికాల మోహాల ఆరాటం కాదు. మనసొక ప్రకృతిగా మారి మరో మనసుకి  అలౌకిక స్పర్శానుభూతిని అందిచటం. ఇప్పుడు నా మనసొక ప్రకృతి.  నా నీ అలోచాల్లో ప్రతి క్షణం వసంతం ఒంపగలిగినంత శక్తివంతమైనది.

క్షణానికి ఒక్కటిగా వస్తున్న నీ తలపు ఒక్కటి చాలు ఆ క్షణం పునీతమవుతూ ప్రకృతిలో అనంతమైన ఆనందశక్తిని  ప్రోది చెయ్యటానికి. 

అనంతమైన మానసిక శక్తిని నాకందించిన నా జీవన వరమా… 

పొంగి పొర్లే ఓ నిశ్శబ్దంలో ఒక్క సారి మనసారా నన్ను చదువు…  

బహుశా అప్పుడో… మరెప్పుడో ఒక్కసారి… గుండె కన్నీరుగా కారిపోతుంది నీ కళ్ళనుండి  చెలమగా  బయటకి రావటానికి.  ఆ ఒకే ఒక్క క్షణం చాలురా నా ఈ జీవితం పునీతం అవ్వటానికి… ఈ అసమర్థుని ప్రేమ శక్తి లోకానికి  తెలియటానికి.

అసమర్ధ ప్రేమికుడు 
సురేష్ రావి

Thursday, 5 March 2015

హేమంత స్పర్శ - 10

రేయ్…

అవ్యక్తం కాని ఈ  అనుభూతుల్ని అక్షరీకరించాలని అక్షరాలు ఎంత తపన పడినా మనసు ఇంకా ఆ  అనుభూతుల్లోనే తారాడుతూ  కాగితం మీద ఒదగనంటుంది. మనసు అనుభూతించే ఆనందంలో అణుమాత్రమైనా అక్షరాలకి అద్దగలిగితే వాటి తపనా తీరుతుందేమో కదూ…

నీ రాకతో పారిపోతూ తిమిరం చూసిన చూపు చెప్పిందిరా… నా జీవితంలోకి నువ్వేసిన అడుగులు ఎంత వెలుగుని నింపుకుని వచ్చాయో అని. ఇంతకీ దాని చూపుకి అర్ధం తెలుసా? ఇన్నాళ్ళ  మన స్నేహన్ని శాశ్వతంగా  హత్య చేస్తున్నావు కదా అని. ఒక్కొక్క బాధనీ తరిమేస్తూ వచ్చి నా మది వాకిట్లో విరబూసిన  వెన్నెల కుసుమానివి నీవు.

దీప్త నీలాలైన నీ కళ్ళల్లో నుండి వస్తున్న కాంతి సుగంధాలలో తనివితీరా ఓలలాడాలని ఆరాటపడుతున్న నా మనసులోకి ఒక్క సారి చూడరా…  వత్సరాలుగా కప్పుకున్న పరదాలని పక్కకి నెట్టి మరీ గంతులేస్తుంది. నాకు నువ్వు దొరికినట్లుగా అందరకీ సరైన  తోడు  దొరికితే వాళ్ళతో నవ్వుతూ నరకానికి రహదారి వేసుకుంటూ వెళ్లిపోవచ్చు కదూ…  

నీ సమక్షపు స్వర్గం ఉన్నంత సేపూ ఎన్నెన్ని నరకాలూ నన్నేం చెయ్య గలవు చెప్పు?

వెన్నెల రాపిడిలో నన్ను నీకు కోల్పోవటం చూసి చందమామకి కన్ను కుట్టేలోపు ఆ  వెన్నెల మొత్తాన్నీ మన మనసులోకి జుర్రేసుకుందాం రా…  నీ చెక్కిలి పై నా ముద్దుల చెలమ చూసిన ఆకసపు మోము చూడు ఎంత ఎర్రబడి పోయిందో?

అసలు నువ్వేంటిరా… ఏమవుతావురా నాకు?  ఎంత తరచి  తరచి  తలచినా అర్ధం కావటం లేదు. ఎక్కడ లేని ఆకతాయితనమూ నీ దగ్గరే  వస్తుంది… ఎందుకంటావూ…? నువ్వొట్టి ప్రేమవి మాత్రమే కాదు రా … నన్ను ఆత్మీయంగా  అల్లేసుకున్న ప్రాణ బంధానివి
నిన్నటి వరకూ  వరమనిపించిన నా ఒంటరితనాన్ని సమాధి చేసి... నీ అల్లరి పలుకుల చినుకులతో నా మనసుకు సాంత్వన నేర్పి నన్ను సరికొత్తగా లోకానికి పరిచయం చేసావ్… కాదు కాదు లోకాన్ని  సరి కొత్తగా నాకు పరిచయం చేసావ్.

నిన్నటి కలలన్నిటిలో  కంటకాలుగా నన్ను గుచ్చుతున్న లోకమే కనిపించేదిరా. కానీ నువ్వొచ్చి చెప్పే వరకూ లోకమంటే నేను కూడా అనే ఆలోచనలోకి ఎప్పుడూ ప్రయాణం చెయ్యలేదురా. లోకం కంటకం అనుకుంటే  నేనూ కంటకాన్నే కదా అన్న ఒక్క  ఆలోచన  మొత్తంగా నా ఆలోచనా దృక్పధాన్నే మార్చేసిందిరా. అలా మారాకే తెలిసింది నేను నవ్వితే లోకం ఎంత చక్కగా నవ్వుతుందో…

నిశీధి నీడగా కరిగిపోతున్న నన్ను మెరుపు తారగా మార్చేసావ్. నిన్నటి నా మౌనాలన్నిటికీ మాటలద్దుతూ కొత్త కొత్త భాష్యాలు నువ్వు చెప్తుంటే నా మౌనం వెనక ఇంత అంతరార్ధం ఉందా అని నేనే ఆశ్చర్యచకితుడిని అయ్యాను తెలుసా?

అనుభూతించాల్సింది తొలకరి చినుకులనీ… మట్టి వాసననే కాదు ఆ  మట్టి వాసన వేసే బతుకుల తడిని కూడా  అని జీవితాన్ని మరో కోణంలో నువ్వు పరిచయించిన తరువాతే జీవితం మళ్ళీ మొదలయ్యింది అనిపించింది.  ఆ తరువాతే తెలిసింది జీవితమొక జలపాతమని అది అలా అలా సాగుతూ ఎన్నో చెలమలని తనలో పొదుపుకుంటుందని అయినా ముందుకే సాగిపోతుందని.

నన్ను నేను  చదువుకుంటూ జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాక గానీ అర్ధం  కాలేదు పుస్తకాల్లో చదివిన చదువులన్నీ బతకటానికే పనికి వస్తాయి గానీ మనసుని చదువుకోవటం అంటే  ఆనందాన్ని  కోసుకోవటమే అని.

అసలు నా జీవితం నా మీద ఉసిగొల్పిన తిరుగుబాటువి రా నువ్వు.  నీ రాక ముందు /  నీ రాక తరువాత... అసలు పొంతన లేని జీవనం. బతుకు వేరు జీవితం వేరు అని తెలిసి వచ్చిన పరిచయం నువ్వు . నలుపు తెలుపుగా ఒదిగిపోయిన బతుకున నువ్వు నాకిచ్చిన రంగు రంగుల పలకరింపు ఈ జీవితం. నీ గురించి నా మనసంతా  వ్యక్తీకరించేసినా అణువంత కూడా  చెప్పినట్లు ఉండదు.

దేనికదే ఆఖరి వాక్యంగా ముగిద్దామని అనుకుంటున్నా అక్షరాల అక్షయకలం  వదలటం లేదురా…

రాసినదంతా అనంతమే… అంతా నీ సొంతమే…

నాతో సహా

నీ


నేను

వెన్నెల కుసుమం - 28

హనీ...


తళుక్కుమంటూ వెండి మెరుపుల చినుకుల తాకిడి... ఎక్కడి నుండా అని వెతుకుతుంటే కనిపించిందొక అందమైన పలువరుస  మంచు ముత్యాలని మించిన స్వచ్ఛతని అద్దుకుని దానిమ్మ గింజలని చంద్రవంకకి తాపడం చేసినట్లుగా… వెన్నెలని ముక్కలుగా  నోట్లో ఒంపుకున్నట్లుగా . వృత్తలేఖినితో అర్థవృత్తం గీసినట్లుగా అంత గుండ్రంగా ఎంత చక్కగా ఉందో... 


గోదావరీ తీరాన దొరికిన సుందరమైన ఆల్చిప్పల్లా ఉన్నాయి నీ చెవులు. మనోహరమైన ఆ చెవులకున్న జూకాలు సూర్య చంద్రుల మెరుపుల్ని సొంతం చేసుకున్నట్లు… పసిడిని మించిన లోహంతో చేసినట్లుగా ఎంతగా వెలిగిపోతున్నాయో తెలుసా... మీకీ మెరుపేమిటి అని అడిగే లోపే వాటి గుసగుసలు నా చెవిని చేరాయి. అవి ఏమనుకుంటున్నాయో చెప్పనా? నీ చెవులకి తప్ప ఇంకే అందమైన అమ్మాయి చెవులకి తామున్నా తమకీ మెరుపుండదనీ... ఈ మెరుపు తమ సువర్ణ శరీరాల ధగ ధగలు కాదనీ... నీ మేని మెరుపుల ప్రతిస్పందనలే అనీ… ఎల్లవేళలా నీ చెవులకి తామే ఉండిపోవాలనే స్వార్ధం వాటికి పెరిగిపోతున్నదట. ఒక్కసారి నిన్ను వదిలితే తమ మెరుపులు మసిబారిపోతాయేమోనని వాటికి భయంరా…


కొనదేలిన నీ గడ్డాన్ని దేనితో పోల్చను. సూదంటు రాయి తోనా మరిi ఇంకేమైనా అందమైన పద ప్రయోగం ఉందా? నీ చుబుకపు వంపు నా గుండెల్లో చేస్తుంది మరో వలపునృత్యం. 


ఇలా అయితే ఎలా ప్రియా! నీ అందాన్ని ఎంత వర్ణించుదామన్నానాకు పదాలే దొరకటం లేదు. కొత్త పదాలెన్ని సృష్టించినా నా మనసుకి తృప్తి కలగటం లేదు. ఇంకా ఇంకా ఏదో లోటుగా అనిపిస్తుంది. ఎందుకు ప్రియా ఇంత అందంగా పుట్టావ్?వర్ణననలకూ  అందనంత అందంగా పుట్టి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. 


నీను ఇలా చెప్తుంటే నీకు నవ్వుగా ఉంది కదూ…


అల్లరిగా నువ్వు నవ్వుతున్నా నీ పెదవుల దరహాసం వాన వెలసిన తరువాత వచ్చే సప్త వర్ణాల ఇంద్ర ధనస్సులా ఉంది.నీ మందస్మిత మధుర హాసం నా మనసున పూయిస్తుంది వసివాడని ఓ  ప్రేమకుసుమాన్ని. తియ్యగా నువ్వు నవ్వుతుంటే పున్నమి వెన్నెలలో జాబిల్లి ఇచ్చేటంత ప్రశాంతత నాలో మొదలవుతుంది. దేవలోకపు అమృతభాండం ఒలికి నీ పెదవులపై అమృతాన్ని చిప్పిల్లుతుందేమో అన్న భ్రాంతి నాలో కలుగుతుంది. నిజంగా ఎంత అద్భుతమైన నవ్వురా నీది?


మహాభారత కురుక్షేత్ర సంగ్రామాన శ్రీ కృష్ణ భగవానుడు పూరించిన పాంచజన్యానికి ఓ కొత్త రూపునిచ్చి  దానికి ఓ మేని ముసుగు తొడిగి నీ కంఠంగా మార్చినట్లున్నాడు ఆ బ్రహ్మ. అందుకనే అది అంత అందంగా మనోహరంగా సాగరగర్భంలోని అత్యంత సుందరమైన శంఖంలా ఉంది. నీ మెడలోని పసిడి హారాలు నీ కంఠంనుండి కొత్తసొబగులని అరువు తెచ్చుకుని అత్యంత గర్వపూరితమై ఆనందిస్తున్నాయ్. అక్కడే ఉన్న ముత్యాల హారాలు నీ కంఠభాగాన్ని తాకటమే తమ జన్మ జన్మల అదృష్టఫలమేమో అన్నట్లుగా సంతసాన్ని నింపుకున్నాయి. 


శ్రీకృష్ణుని వేణువులోన పలికిన మధుర గానం శతాబ్దాల తరువాత నీ కంఠధ్వనిగా ప్రతిఫలిస్తూ ఉంది. నిజంరా… ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గాత్రాన్ని మీరాబాయి స్తోత్రాన్ని కలబోసుకుని అమరగానాన్ని ఆలపిస్తుంది నీ కంఠస్వరం. నీ గాన మాధుర్యాన్ని విని జగతిలోని కోయిలలన్నీ నీ వద్ద గానాన్ని నేర్చుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాయ్. 


నీ గాన మాధుర్యానికి ప్రకృతి మాత సైతం మైమరచిపోయి ఎంతో పులకరిస్తూ తన వంతు సంగీతాన్ని లోకానికి కానుకగా ఇస్తుంది.సెలయేటి గలగలలూ పక్షుల కిల కిలలూ మహా వృక్షాల పత్రాల పదనిసలూ ఇంకా ఎన్నో కలసి ప్రకృతి సంగీతంగా మారాయి మరి.


నీ అద్భుత గాన మాధుర్యానికి ముగ్ధుడైన వసంతుడు ఒక ఋతువు ముందుగానే వచ్చి ఇక అన్ని ఋతువులూ తానే  ఉంటానని మంకు పట్టు పట్టాడట. అందుకేనేమో నువ్వు ఉన్నచోట తరువులు కొత్త చివుళ్ళు వేస్తున్నాయి. తొలకరి చిరు జల్లులు కురిపిస్తుంది. కోయిలలు కొత్త రాగాలని లయం చేసుకుంటున్నాయి. ప్రకృతీ కన్య తన సౌందర్యాన్ని శృతి చేసుకుంటున్నది.   


ఎక్కడి నుండి మొదలెడతావో కానీ 

ఆగకుండా వినవచ్చే నీ నవ్వుల ప్రవాహంలో

పరుగులు తీసే ప్రకృతినవ్వాలని ఉంది 


ఏ గుండె సడిని నింపుకొస్తావో కానీ

మత్తెక్కించే నీ మాటల పరిమళంలో 

నీ మేనిని కప్పుకోవాలని ఉంది 


ఏ వెన్నెల విరగబడి నవ్విందో కానీ 

ప్రతిరోజూ నిండుపున్నమి వెలుగులు విరజిమ్మే

నీ వదనంలోకి ఒదిగి పోవాలని ఉంది.  


మాటి మాటికీ మౌనవించే నా మనసుమీద ఒట్టు..

 

కొన్ని చూపుల్ని దాటుకుని వెళ్ళటం ఎంత కష్టమో 

కొన్ని నిశ్శబ్దాలని ఆరగించటం అంతే కష్టం...


మనసు  నిశ్శబ్దించిన చోట మేనితో మాట్లాడటం నీకే చెల్లు….


కాదనగలవా  చెప్పు?


నీ


...రేష్

జీవితమే... కొత్తగా


ఉరుకుల పరుగుల జీవితాలు
సుఖ దుఃఖాల లెక్కలు
రంగు రంగుల కలలు
మధ్యలో ఒకే ఒక్క మృదువైన స్పర్శ
చూస్తే
వెన్నెల వర్ణమంత స్వచ్ఛత నింపుకున్న మనసుతో నువ్వు…
జీవితం నచ్చేసింది
***
రేయి ప్రమిదలో వెన్నెల దీపపు కాంతి స్పర్శ
గంధమద్దుకొస్తున్న గాలి పరిమళాల సడి
వెండిముత్యాల్లా నీటి బిందువులని పరిగెత్తిస్తూ ఏరు
రహస్య అరలన్నిటిలో చొరబడే ప్రేమవాదివై నువ్వు
ప్రకృతిలో ఎన్ని సారూప్యాలో
జీవితం నవ్వేసింది
***
ఉనికి కోల్పోయిన ఊపిరి
కొత్తగా శ్వాసని తీసుకుంటున్న చప్పుడు
నా ఆచూకీ మళ్ళీ దొరికేసింది
కానీ... మరలి రానంటుంది
నీ అంతరాంతపు స్పర్శలో మమేకమౌతూ
జీవితం ఇచ్చేసింది
***
కాసేపలా ఆనందం కురుస్తుంది
నిశ్శబ్దం నవ్వుకుంటుంది
ఎందుకంటే ఏమని చెప్పను
బహుశా
నీ పరిచయ క్షణం గుర్తొచ్చిందేమో
మరప్పుడే కదా... నా
జీవితం వచ్చేసింది
***

Tuesday, 3 March 2015

ఎక్కడో నచ్చేస్తుంది జీవితం

కలలనుండి తప్పించుకుని వాస్తవాలుగా కురుస్తున్న దిగుళ్ళనీ 
అన్ని నాగరికాలని స్పృశిస్తూ మోడుగా మారిపోతున్న ప్రకృతినీ   
అప్పుడప్పుడూ పలకరించాలి 
ఓ చిరునవ్వో... మరో చిగురు మొలకో తడిమేవరకైనా 

తడుముతున్న ఏకాంతాలన్నీ ఒంటరి తనాలు కావనీ 
తవ్వుకుంటున్న  జ్ఞాపకం తమకే స్వంతం కాదని
మళ్ళీ మళ్ళీ  విప్పి చెప్పాలి 
జీవితం నిలబెట్టుకోవటానికి మరో పునాది తీసేవరకైనా 

ఎక్కడెక్కడి దాహాలు తమ బతుకులో దప్పికవుతుంటే 
ఎప్పటెప్పటి విరహాలు ఇప్పుడీ దేహాన్ని కాల్చేస్తుంటే 
కొన్ని అనుభూతుల్ని  పరిచయించాలి 
భౌతికాల్ని మించిన స్పర్శ ఏదో మనసుని తాకేవరకైనా 

ఖాళీ తనం అంటే కోల్పోయిన తనం మాత్రమే కాదనీ 
లేని తనం అంటే ఇంకెప్పటికీ రాని తనం కాదనీ 
మరో మారు ఊరడించాలి 
శూన్యంనుండే విశ్వం పుట్టిందన్న నిజం నమ్మే వరకైనా 

స్పృశించలేనివన్నీ  అస్పృశ్యాలుగా మిగిలిపోయేవి కావనీ 
కాలప్రవాహమంటే నిన్నటి క్షణాల తడిమాత్రమే కాదనీ 
ఇంకోసారి జవాబవ్వాలి 
అనుకోని ఆనందమొకటి అదాటున అల్లుకునేవరకైనా 

మంచి మాట దగ్గరో... ఓ ఆత్మీయ స్పర్శ దగ్గరో...
జీవితం ఎక్కడో నచ్చేస్తుంది మరి
అంతవరకూ
శీతల ఛాయల్లా తోడవుతూ సాగుదాం 
నవ్వుల్ని పంచుకుంటూ పువ్వుల్ని ఏరుకుంటూ...