మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Friday, 13 March 2026

మట్టి చాటు జీవితం

 

"ఏ నగరంలో అయినా మేడలు కట్టిన వాళ్ల పేర్లు ఎక్కడా ఉండవు. కానీ ఆ మేడలలో ఉండే వాళ్ల పేర్లతోనే కాలనీలు పెడతారు.” 

ఆ మాట అన్నప్పుడు మధు కిందికి చూస్తున్నాడు. అతని గొంతులో పదునుంది. హైదరాబాద్ శివార్లలో లేస్తున్న ఒక హై రైజ్ అపార్ట్‌మెంట్ బిల్డింగ్ పదిహేనో అంతస్తు స్లాబ్ మీద నిలబడి కిందకు చూస్తున్నాడు మధు. అక్కడి నుంచి కిందకి  చూస్తుంటే  రోడ్డుమీద కార్లు చిన్న చిన్న కీటకాల్లా కదులుతున్నాయి. ట్రాఫిక్ శబ్దం కూడా ఆ ఎత్తులోకి చేరేసరికి ఒక నిశ్శబ్దమైన ప్రవాహంలా మారిపోయింది. మధు ఒక సివిల్ ఇంజనీర్. కానీ అతని ఆలోచనలు మాత్రం సిమెంటు, ఇనుము మధ్య బందీ కాలేదు.

పక్కనే నిలబడ్డ సూపర్వైజర్ నవ్వాడు.

“ఏమండీ మధు గారు, మళ్లీ తత్వశాస్త్రమేనా?”

మధు చిన్నగా నవ్వాడు.

“ఇంత ఎత్తులో నిలబడితే మనుషులు చిన్నగా కనిపిస్తారు కదా... బహుశా అందుకే ఈ మేడల మీద కూర్చుని పాలించే వాళ్లకి కింద వాళ్ల కష్టాలు కూడా చిన్నగానే కనిపిస్తాయేమో.”

అతను మాట పూర్తిచేసేలోపు కాంక్రీట్ మిక్సర్ మెషీన్ గర్జన వినిపించింది. కూలీలు మెట్ల దారి వెంట  వరుసగా తట్టలు మోస్తూ పైకి వస్తున్నారు. సిమెంటు దుమ్ము వాళ్ల ముఖాల మీద పడి అందరూ ఒకే  రకంగా బూడిద రంగు ముసుగు వేసుకున్నట్టు కనిపిస్తున్నారు.

ఆ వరుసలో ఒక ముసలావిడ కూడా ఉంది.

లక్ష్మమ్మ.

వయసు అరవై దాటిపోయింది. అయినా ఇటుకుల తట్ట నెత్తిమీద పెట్టుకుని మెట్లు ఎక్కుతోంది. రెండోసారి ఎక్కేసరికి ఒక్కసారిగా ఆగిపోయింది. తట్టను కింద పెట్టి వగరుస్తూ గోడకు ఆనుకుంది.

మధు వెంటనే దగ్గరకు వెళ్లాడు.

“ఏమ్మా లక్ష్మమ్మ... వంట్లో  బాగోలేదా?”

ఆమె కొంగుతో ముఖం మీద చెమట తుడుచుకుంది.

“ఏమీ లేదు బాబూ... కొంచెం ఊపిరి ఆడలేదు అంతే.”

“అసలే ఎండ దంచేస్తుంది. బాగోకపోతే ఇంటికెళ్ళు”

ఆమె అలసటగా నవ్వుతూ “ఎండ మాకు కొత్తేమీ కాదు బాబూ.” అంది.

కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చుంది. తర్వాత నెమ్మదిగా అంది.

“కానీ ఈ ఎండ చూస్తుంటే మా ఊరు గుర్తొస్తుంది.”

“ఏ ఊరు?”

“సింగరాయకొండ దగ్గర చిన్న ఊరు. మా ఊర్లో ఒక పెద్ద చెరువు ఉండేది. మధ్యాహ్నం అయినా గాలి చల్లగా ఉండేది. ఇక్కడంతా ఒకటే సెగ బాబూ… నేల నుంచే మంట ఎగుస్తున్నట్టు ఉంటుంది” ఆమె చెప్పేటప్పుడు కాసేపు ఆగింది.

ఆ చెరువు నిజంగానే తన ముందు కనిపిస్తున్నట్టు ఆమె కళ్లలో ఒక క్షణం వెలుగు మెరిసింది.

లక్ష్మమ్మ మళ్లీ తట్ట ఎత్తుకుని మెట్ల వైపు నడిచింది.

ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డాడు మధు. 

ఈ గోడలు కట్టేవాళ్లు... ఇక్కడ ఎప్పుడూ నివసించరు.  ఈ గోడల మీద రక్తం చిందించే వాళ్లకి ఇక్కడ ఒక గది కూడా సొంతం కాదు. మనం ఎవరి కోసం ఇవన్నీ కడుతున్నాం? ఎవరి ఆకలి తీర్చడానికి ఈ అభివృద్ధి?

ఆ ఆలోచన అతని మనసులో నిశ్శబ్దంగా నిలిచిపోయింది.

ఆ సాయంత్రం పని అయిపోయాక మధు బైక్ మీద ఇంటికి బయలుదేరాడు.

రోడ్డు మీద లైట్లు వెలిగిపోయాయి. అద్దాల భవనాలు మెరుస్తున్నాయి. ఐటీ కంపెనీల ముందు కార్ల వరుసలు.

అవి చూసినప్పుడల్లా అతనికి ఒక ప్రశ్న తట్టేది. 

“ఈ నగరం ఎవరి కోసం ఎదుగుతోంది?” 

మరుసటి రోజు ఉదయం ఆఫీసులో మేనేజర్ రాజీవ్ కూర్చున్నాడు. టేబుల్ మీద ల్యాప్‌టాప్, చేతిలో ఐఫోన్.

మధు కాస్త ఆగి మాట్లాడాడు. “సార్… ఒక విషయం చెప్పాలి.”

రాజీవ్ కళ్లెత్తి చూడకుండా అన్నాడు.

“చెప్పు.”

“మన సైట్ లో కూలీల ఆరోగ్యం చాలా బాగోలేదు. కనీసం ఒక చిన్న మెడికల్ క్యాంప్ పెడదామా?”

రాజీవ్ ఫోన్ నుంచి తలెత్తాడు.

“మధు… మనం ఇక్కడ బిల్డింగ్ కట్టడానికి వచ్చాం. హాస్పిటల్ పెట్టడానికి కాదు.”

“కానీ సార్—”

“బడ్జెట్ లేదు.”

అతను ల్యాప్‌టాప్ మూసేశాడు.

“డెడ్‌లైన్ దగ్గరలో ఉంది. ఆ స్లాబ్ పని ఫినిష్ అయిందో చూసుకో.”

ఆ మాటలు  అక్కడితో ముగిసాయి. 

మధు కి కోపం రాలేదు, కానీ ఒక రకమైన జాలి కలిగింది. మనుషులు అంకెలుగా మారిపోయిన లోకంలో మానవత్వానికి విలువ ఉండదు. అలా అని  మధు ఊరుకోలేక పోయాడు. తన స్నేహితుడు డాక్టర్ అనిల్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అనిల్ తన టీమ్ తో కలిసి ఆదివారం రోజు సైట్ కి వచ్చాడు. కంపెనీ అనుమతి లేకపోయినా, గేటు బయటే ఒక చిన్న చెట్టు నీడన క్యాంప్ మొదలుపెట్టారు.

కూలీలు ఒక్కొక్కరుగా రావడం మొదలుపెట్టారు. చాలా మందికి పోషకాహార లోపం, చర్మ వ్యాధులు ఉన్నాయి. లక్ష్మమ్మ వంతు వచ్చినప్పుడు అనిల్ ఆమెను పరీక్షించి మధు వైపు సీరియస్ గా చూశాడు.

"మధు, ఈవిడకు గుండె సమస్య ఉంది. ఈ ఎండలో ఇంత బరువులు మోస్తే ఎప్పుడైనా ప్రమాదం జరగొచ్చు," అన్నాడు అనిల్.

అనిల్ వెళ్లిపోయాక లక్ష్మమ్మ చెట్టు నీడలో కూర్చుంది. కూలీలు ఒక్కొక్కరుగా తమ పనికి వెళ్లిపోయారు. మధు లక్ష్మమ్మ  కూర్చున్న  చోటుకు వెళ్లాడు.

“లక్ష్మమ్మ… ఇంట్లో ఎవరెవరు ఉంటారు.?”

ఆమె కొద్దిసేపు ఆలోచించింది.

“ఎవరూ లేరు బాబూ.”

“పిల్లలు?”

“ఉన్నారు… కానీ వాళ్లూ వాళ్ల బతుకుల్లోనే ఇంకెక్కడో  ఉంటారు.”

కొద్దిసేపు నిశ్శబ్దం. మధు ఆమె చేతులకేసి చూసాడు. పొడిబారిన చేతులు, పగుళ్లు పడిన వేళ్లు, సిమెంటు దుమ్ము. చేతుల్లా కనిపించడం లేదవి… ఎండిపోయిన కట్టెల్లా ఉన్నాయి.  ఆ చేతులతో ఎన్నో గోడలు కట్టబడి ఉంటాయి. కానీ ఆ గోడలలో ఒక్కటి కూడా ఆమెది కాదు.

“ఏంది బాబూ అలా చూస్తున్నారు. ఇదంతా మాకు మామూలే. ఇక్కడ పని అయిపోతే ఇంకో సైట్ కి వెళ్తాం. అక్కడ అయిపోతే ఇంకో ఊరు.”

“ఎప్పుడూ అలా ఊరూరు తిరుగుతూనే ఉంటారా లక్ష్మమ్మా?”

ఆమె నవ్వింది. ఎప్పుడో జీవం వదిలిపోయిన నవ్వు. 

“మా జీవితం కూడా ఇటుకల్లానే బాబూ… ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెడతారు.”

మధు ఏమీ మాట్లాడలేకపోయాడు. కొంచెం  సేపు మౌనంగా ఉండి “వంట్లో ఇలా ఉన్నప్పుడు, పని చెయ్యడం మంచిది కాదు లక్ష్మమ్మా” అన్నాడు. 

ఆమె మళ్ళీ నవ్వింది… అదే జీవం లేని నవ్వు… "పని మానేస్తే కడుపు ఎలా నిండుతుంది బాబూ?" అంది.

“ఆరోగ్యం ముఖ్యం.”

“నువ్వు చెప్పేది నిజమేనయ్యా … కానీ మా లాంటి వాళ్లకి చావు కంటే ఆకలి ఎక్కువే భయం.”

ఆ మాట మధు కి ఒక చెంపదెబ్బలా తగిలింది. ఆ మాట విన్నాక మధు కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. సైట్ మీద తిరుగుతున్న మెషీన్ శబ్దం ఒక్కసారిగా ఎక్కువగా వినిపించినట్టు అనిపించింది.

మధు కొద్దిసేపు ఆమెను చూస్తూ నిలబడ్డాడు. తర్వాత సూపర్వైజర్ వైపు తిరిగాడు.

“ఈమెకి కాస్త  తేలిక పనులు పెట్టండి,” అన్నాడు.

సూపర్వైజర్ ఆశ్చర్యంగా చూసాడు.

“సార్… ఇక్కడ ఎవరికీ తేలిక పని ఉండదు.”

మధు కాస్త కఠినంగా అన్నాడు.

“ఇప్పటినుంచి ఉంటుంది.” అంటూ అలానే చూస్తూ నిలబడ్డాడు మధు. 

* * *

కానీ కంపెనీ యజమాని ఒకరోజు సర్ప్రైజ్ విజిట్ కి వచ్చాడు. లక్ష్మమ్మ నెమ్మదిగా పని చేయడం చూసి ఆయన మండిపడ్డాడు.

“ఎవరీ ముసలావిడ?”

ఎవరూ సమాధానం చెప్పలేదు.

“ఈ ఏజ్ లో పని చేయించేది ఎవరు?”

మధు ముందుకు వచ్చాడు. “సార్… ఆమెకు ఒంట్లో బాగోలేదు—”

“అయితే ఎందుకు ఇక్కడ ఉంది?”

“ఇన్నాళ్ళూ బాగా పనిచేసింది సర్… ఇప్పుడు వంట్లో బాగోకే ఇలా… ” అని ఇంకేదో చెప్తున్నాడు.. 

యజమాని కళ్లల్లో చిరాకు కనిపించింది.   “మధు… నీ పనేంటో నువ్వు చూసుకో…” అతను ఒక్కసారి లక్ష్మమ్మ వైపు చూసాడు. “ఎక్కువ మాట్లాడితే నువ్వూ పని వెతుక్కోవాల్సి వస్తుంది.” అని మధు ని హెచ్చరిస్తూ అతను సూపర్వైజర్ వైపు తిరిగి “ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈవిడకి సెటిల్ చేసి పంపెయ్యండి.” అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు. 

మధు ఏమీ మాట్లాడలేదు. మౌనంగా నిలబడ్డాడు. కానీ అతని ముఖంలో అసహాయం స్పష్టంగా కనిపించింది.

మరుసటి రోజు… మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంది. కూలీలు పని చేస్తున్నారు. ఒక్కసారిగా ఎవరో అరిచారు.

“అయ్యో… లక్ష్మమ్మ పడిపోయింది!”

మధు పరుగెత్తి వెళ్లాడు. ఆమె నేల మీద పడి ఉంది. చేతిలోని తట్ట పక్కకు జారిపోయింది. ఇటుకలు కొన్ని ఆమె మీద… కొన్ని పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆమె కళ్లూ నోరూ కొద్దిగా తెరచుకుని ఉన్నాయి. మాటా పలుకూ లేదు. 

“లక్ష్మమ్మా…. లక్ష్మమ్మా !” అందరూ గట్టిగా భుజం పట్టి కుదుపుతూ పిలుస్తున్నారు.  

ఆమెలో ఎలాంటి స్పందనా లేదు. . మధు వెంటనే కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ ఆమె నాడి పట్టుకుని చూసాడు.  

“మీరు తీసుకుని వచ్చేటప్పటికే…” 

మాట పూర్తికాకముందే మధు అర్థం చేసుకున్నాడు.

* * *

లక్ష్మమ్మ చనిపోయిన వార్త సైట్ లో అందరికీ తెలిసింది. 

కానీ పని మాత్రం ఆగలేదు. 

కాంక్రీట్ మెషీన్ తిరుగుతూనే ఉంది. 

తట్టలు మోసే వరుస కూడా అలాగే కొనసాగింది.

నగరం మాత్రం ఏమీ జరగనట్టే తన పనిలోనే ఉంది.

* * *

సాయంత్రం లక్ష్మమ్మ అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలు ముగిశాక అందరూ ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. సూర్యుడు అస్తమించిపోతున్నాడు. ఆకాశం ఎర్రగా మారింది.

మధు ఒంటరిగా కొద్దిసేపు అక్కడే నిలబడ్డాడు. కొంత దూరంలో నిర్మాణంలో ఉన్న ఆ బిల్డింగ్ కనిపిస్తోంది. అక్కడ నుంచి మళ్లీ కాంక్రీట్ మిక్సర్ శబ్దం వినిపిస్తోంది. అతనికి ఒక్కసారిగా ఉదయం సైట్ లో చూసిన దృశ్యం గుర్తొచ్చిం..  మెట్లపై తట్ట మోస్తూ నెమ్మదిగా ఎక్కుతున్న లక్ష్మమ్మ.

అతను నేల మీద ఉన్న మట్టిని చూస్తూ నెమ్మదిగా అనుకున్నాడు.

“ఎంతమంది జీవితాల మీద ఈ మట్టి  కప్పబడి ఉందో…  ఎవరికైనా తెలుసా?”

అక్కడ సమాధానం చెప్పే వాళ్లు ఎవరూ లేరు. గాలి మాత్రం నిశ్శబ్దంగా కదిలింది.

* * *

మరునాడు మధు సైట్ కి తిరిగి వచ్చాడు.

ఆ బిల్డింగ్ వైపు చూశాడు. అది ఇప్పుడు అతనికి ఒక అందమైన కట్టడంలా అనిపించలేదు, ఒక రాక్షసిలా కనిపించింది. అతను గోడ దగ్గరకు వెళ్లాడు. ఇంకా పచ్చిగా ఉన్న సిమెంటు మీద తన వేళ్లతో తాకాడు. కొద్దిసేపు ఆగి పక్కనే ఉన్న చిన్న కంకర రాయి తీసుకున్నాడు. 

సిమెంటు మీద నెమ్మదిగా రాసాడు. 

లక్ష్మమ్మ.

అక్షరాలుచిన్నవే.  కొంచెం వంకరగా వచ్చాయి. బహుశా ఎవరికీ కనిపించకపోవచ్చు కూడా.  ఎవరూ గమనించలేదు.

కానీ ఆ గోడలకు తెలుసు… ఆ పేరు వెనుక ఉన్న కథ.

* * *

కొన్ని రోజులకు మధు నగరం వదిలి వెళ్లిపోతూ  రైలులో కిటికీ దగ్గర కూర్చున్నాడు. కిటికీలో నుండి దూరంగా భారీ  నిర్మాణం ఏదో  కనిపిస్తుంది. అక్కడ కూడా కూలీలు తట్టలు మోస్తున్నారు. వాళ్లలో ఎక్కడో ఇంకో లక్ష్మమ్మ ఉండొచ్చు. మధు నిశ్శబ్దంగా తన డైరీ తెరిచాడు. ఒక వాక్యం రాశాడు.

“మనం కట్టేది మేడలు కాదు… మనుషుల జీవితాల మీద నిలబడే గోడలు.”

రైలు వేగం పెరిగింది. మధు కిటికీ బయట చూస్తూనే ఉన్నాడు. ఆ నగరం నెమ్మదిగా దూరమవుతోంది. ఆ నగరంలో లేస్తున్న ఆ మేడలకు ఎన్నో పేర్లు ఉంటాయి. కానీ ఆ మేడలు కట్టిన వాళ్ల పేర్లు ఎక్కడా ఉండవు.

కానీ గోడ మీద అతను రాసిన ఆ చిన్న పేరు మాత్రం…  అక్కడే మిగిలిపోయింది.

*